crumbling
-
'కల్తీ' కలవరం
సాక్షి, మెదక్: మెతుకుసీమను ‘కల్తీ గాళ్ల దందా’ కలవరపెడుతోంది. కాసుల కక్కుర్తితో పలువురు అక్రమార్కులు ఉదయం అల్పాహారం నుంచి మొదలు రాత్రి భోజనం వరకు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. పేరున్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీల నిర్వాహకులు అధికారులకు లంచాల ఎర చూపి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నూనెలు, పప్పులు.. ఇలా అన్ని సరుకులను కల్తీమయం చేస్తూ నాసిరకం వంటకాలతో అందినకాడికి దండుకుంటున్నారు. అయినా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా జిల్లాకు చెందిన పలువురు వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు కల్తీ నిత్యావసర సరుకులను వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులతో కుమ్మక్కై కల్తీ దందాను మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు కొనసాగిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. నాసిరకం, కుళ్లిన పదార్థాలతో.. జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు ఇతరత్రా తినుబండారాల దుకాణాలు 103 ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఇవి కాకుండా లైసెన్స్ లేని హోటళ్లు కోకొల్లలు. అయితే.. కాసుల కక్కుర్తితో నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో నాసిరకం వస్తువులను వినియోగిస్తున్నారు. కుళ్లిన మాంసంతో సైతం ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకుల జేబులు డబ్బులతో నిండుతుంటే.. ప్రజలు రోగాలతో సతమతమవుతున్నారు. మహారాష్ట్ర నుంచి కల్తీ పప్పులు.. జిల్లాకు మహారాష్ట్ర నుంచి కల్తీ పప్పులు దిగుమతి అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మహారాష్ట్రలో పప్పుల దిగుబడి ఎక్కువ. ఈ క్రమంలో అక్కడి వ్యాపారులు కల్తీకి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాకు చెందిన కొంతమంది అక్కడి వారితో సంబంధాలు కొనసాగిస్తూ.. తక్కువ రేటుతో వచ్చే కల్తీ పప్పులను దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. కామారెడ్డి నుంచి నకిలీ నూనె.. జిల్లాకు ఆనుకుని ఉన్న కామారెడ్డి నుంచి కల్తీ నూనె దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉండడం.. రవాణా మార్గాలు పుష్కలంగా ఉండడంతో అక్కడే పలువురు వ్యాపారులు మంచి నూనెను కల్తీ చేసి ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచే జిల్లాకు చెందిన పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీల నిర్వాహకులు తక్కువ రేటుతో కల్తీ నూనెను దిగుమతి చేసుకుని వంటకాల తయారీలో వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. జిల్లాకు చెందిన కొందరు ఆయిల్ మిల్లర్లు సైతం మహారాష్ట్ర నుంచి కల్తీ నూనెను జిల్లాకు తీసుకొచ్చి పేరున్న బ్రాండ్ల లేబుళ్లు వేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ.. అధికారులు చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపిపంచడంలేదు. నెలవారీగా మామూళ్లు అందుతుండడంతో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్, ఇతర అధికారులు, ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు విఫలం.. జిల్లాలో కల్తీ వ్యాపారాలను అరికట్టడంతో అధికారులు విఫలమవుతున్నారు. గతంలో దుకాణాలు, గోదాంలు, నూనె షాపులు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, చికెన్, మటన్ సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపారు. ఆ తర్వాత కొందరిపై తూతూమంత్రపు జరిమానాలతో సరిపుచ్చారు. ప్రతి ఏడాది మొదట్లో ఈ ప్రక్రియ నామమాత్రంగా సాగుతోంది. ఎవరిపైనా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో పలువురు అక్రమ వ్యాపారులు కల్తీ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఒకే ఒక్క ఫుడ్ ఇన్స్పెక్టర్ జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర తినుబండారాలు, బేకరీల్లో, షాపులతోపాటు మాంసం దుకాణాల్లో ఎప్పటికప్పుడూ నాణ్యతను పరిశీలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఫుడ్ సేఫ్టీ అధికారులది. అయితే.. ఈ అధికారులత కొరత రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు రవీందర్రావు ఒక్కరే ఉండడంతో తనిఖీలు సాగడం లేదని తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారికి సంబంధించిన కార్యాలయం ఉండగా.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మినహా సిబ్బంది ఎవరినీ నియమించలేదు. దీంతో హోటళ్లలో నాణ్యతను పట్టించుకునే వారే కరువయ్యారు. సిబ్బంది లేకపోవడంతో.. ఐదు జిల్లాలకు నెనొక్కడినే ఉన్నా. జిల్లాకు ఒకరు చొప్పున సిబ్బందిని నియమిస్తే బాగుండు. అదనపు భారమైనప్పటికీ అన్ని జిల్లాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నా. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 62 శాంపిళ్లు సేకరించగా ఆహార పదార్థాల నాణ్యతకు సంబంధించి ఐదు, లైసెన్స్ లేని 51 హోటళ్లను గుర్తించి కేసులు నమోదు చేశాం. – జి.రవీందర్రావు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కొరవడిన అధికారుల పర్యవేక్షణ మెదక్ ప్రాంతంలోని హోటళ్ళు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల పై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వ్యాపారులు స్వలాభం కోసం తక్కువ ధరకు లభించే కల్తీ నూనె, సరుకులతో తయారుచేసిన ఆహార పదార్థాలను ప్రజలకు విక్రయిస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లలో ఎక్కువగా కల్తీ నూనెలను ఉపయోగిస్తుండటం వల్ల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – వినోద్‌కుమార్, ఫరీద్పూర్, మెదక్ -
పోలవరం ప్రాజెక్టు వద్ద మరోసారి కుంగిన భూమి
సాక్షి, పశ్చిమ గోదావరి: పోలవరం ప్రాజెక్టు వద్ద మరోమారు భూమి కుంగిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రాజెక్టు వద్ద 902 ఏరియాలో భూమి బీటలు వారుతుంది. గతంలో కూడా ఇదే ప్రాంతానికి సమీపంలో భూమి 20 అడుగులు పైకి ఎగదన్ని నెర్రెలు బారి.. ముక్కలు ముక్కలుగా కుంగిపోయిన విషయం తెలిసిందే. ఆ తరువాత కొద్ది రోజులకే స్పిల్‌వే రెస్టారెంట్ వద్ద భూమి కంపించి పగుళ్లు సంభవించాయి. పోలవరం ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న రెస్టారెంట్ లోపల సైతం భయంకరంగా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో రెస్టారెంట్ సిబ్బంది భయకంపితులై బయటకు పరుగులు తీశారు. నాలుగు నెలల వ్యవధిలో ప్రాజెక్టు పరిసరాల్లో మూడు సార్లు భూమి కుంగినప్పటికీ.. దీనికి గల కారణాలను అధికారులు పరిశోధించలేదు. జాతీయ ప్రాజెక్టు వద్ద ఈ విధంగా జరుగుతున్నప్పటికీ.. అధికారుల నిర్లక్ష్య ధోరణి కనబరచడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుస ఘటనలతో ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. పోలవరం కాంట్రాక్టు సంస్థలు ఏమీ లేదంటూ బాధ్యతా రహిత్యంగా ప్రకటన జారీ చేశాయి. -
పుచ్చిపోయిన పప్పు.. బూజు పట్టిన బెల్లం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: ఈమె పేరు జయమ్మ (రేషన్ కార్డు నంబర్122700100427). అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో రేషన్ దుకాణంలో ప్రభుత్వం ఇచ్చిన చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులు తీసుకొని ఇంటికొచ్చింది. ప్యాకింగ్‌లో ఉన్న కందిపప్పు, గోధుమపిండి తీసి చూడగా అందులో పురుగులు కన్పించాయి. బెల్లం బూజు పట్టింది. రేషన్ డీలర్ వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరించింది. పురుగులున్న విషయాన్ని గుర్తించి అధికారులు ఆమెకు వేరే సరుకులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గోనేపల్లివారిపాలెం గ్రామానికి చెందిన కోనేటి వెంకటసుబ్బయ్య సంక్రాంతి పండుగకు ప్రభుత్వం ఇచ్చిన చంద్రన్న సరుకులు తీసుకున్నాడు. ప్లాస్టిక్ డబ్బాలో బూజు పట్టిన బెల్లం కన్పించింది. ఆ గ్రామంలో మరో 100 మందికి ఇలాగే బూజు పట్టిన బెల్లం వచ్చింది. దాన్ని వెనక్కి తీసుకుని, నాణ్యమైన బెల్లం ఇవ్వాలని కోరితే తనకు సంబంధం లేదంటూ రేషన్ డీలర్ చేతులెత్తేశాడు. పండుగల సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న చంద్రన్న కానుకలో నాణ్యత మచ్చుకైనా కనిపించడం లేదు. పుచ్చిపోయిన కందిపప్పు, పురుగులు పట్టిన శనగపప్పు, బూజు పట్టి పాకంలా మారిన బెల్లం, కాలం చెల్లిన నెయ్యితో పండుగపూట పిండివంటలు ఎలా చేసుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సరుకుల పంపిణీ టెండర్లను ప్రతిఏటా అధికార పార్టీ నాయకులే దక్కించుకుంటున్నారు. వారు పనికిరాని సరుకులు పంపిణీ చేస్తున్నా అధికారులు గట్టిగా నిలదీయలేకపోతున్నారు. చంద్రన్న కానుక పథకం అమలుకు ప్రతిఏటా దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నాసిరకం సరుకులు ఇస్తున్నారంటూ లబ్ధిదారులు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఫిర్యాదులు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. నాణ్యత లేని కానుక సరఫరా చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. పనికిరాని సరుకులు తీసుకుని ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తే... ఉచితంగా ఇస్తున్నాం, నోరు మూసుకొని తీసుకెళ్లండి అంటూ అధికార పార్టీ నేతలు, డీలర్లు దబాయిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. నాణ్యత లేని, కాలం తీరిన సరుకులను సేకరించి, చంద్రన్న కానుక పేరిట పేదలకు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలిముద్ర పడితేనే సరుకులు ఈ–పాస్ యంత్రంలో వేలిముద్రలు పడితేనే లబ్ధిదారులకు సంక్రాంతి కానుక సరుకులు అందజేస్తున్నారు. వివిధ కారణాలతో వేలిముద్రలు సరిగా పడని 18 నుండి 20 శాతం మందికి సరుకులు ఇప్పటికీ అందలేదు. రాష్ట్రంలో 1.44 కోట్ల తెల్లరేషన్‌కార్డులున్న కుటుంబాలు ఉండగా, ఇప్పటిదాకా 1.17 కోట్ల కుటుంబాలకు మాత్రమే చంద్రన్న కానుక సరుకులు అందాయి. దాదాపు 27 లక్షల కుటుంబాలకు సరుకులు అందలేదు. తూకాల్లోనూ మోసాలే.. చంద్రన్న కానుక పేరిట ఇస్తున్న సరుకుల్లో నాణ్యత లేకపోవడంతోపాటు తూకాల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. నెయ్యి 100 గ్రాములు ఇవ్వాల్సి ఉండగా ప్యాకెట్లలో 90 గ్రాములు మాత్రమే ఉంటోంది. అరకిలో నూనెకు బదులు 450 గ్రాములే ఇస్తున్నారు. గోధుమపిండి, కందిపప్పు, శనగపప్పు 10 నుంచి 30 గ్రాముల తక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు అంటున్నారు. ఒక్కో కానుకకు రాష్ట్ర ప్రభుత్వం రూ.207.94 వెచ్చిస్తోంది. ఇందులో అరకిలో బెల్లం ధర రూ.24.70, అరకిలో గోధుమ పిండి రూ.29.78, అరకిలో శనగపప్పు రూ.29.58, అరకిలో కందిపప్పు రూ.36.50, అర లీటర్ పామాయిల్ రూ.39.83, 100 గ్రాముల నెయ్యి ధర రూ.30.55, సంచికి రూ.17 చొప్పున కేటాయిస్తోంది. బయట మార్కెట్లో ఇవే ధరలకు నాణ్యమైన సరుకులు వస్తాయని లబ్ధిదారులు చెబుతున్నారు. చంద్రన్న కానుక పథకం కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూర్చేలా ఉందని పేర్కొంటున్నారు. మిగిలిపోయిన పాత పప్పు అంటగట్టారు ‘‘సంక్రాంతి సందర్భంగా ఇచ్చిన చంద్రన్న కానుక పూర్తిగా నాసిరకంగా ఉంది. నల్లగా మారిన బెల్లం ఇచ్చారు. తింటే ఏమౌతుందోనని భయమేస్తోంది. శనగపప్పు, కందిపప్పులో పురుగులు కనిపించాయి. మిగిలిపోయిన పాత పప్పును అంటగట్టారని అనుమానంగా ఉంది’’ – మల్లెల భవానీ, ఆటోనగర్, విజయవాడ -
ప్రభుత్వ మందుల్లో 10 శాతం నాసిరకమే
న్యూఢిల్లీ: ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఔషధాల్లో 10 శాతానికి పైగా నాసిరకమైనవని ఆరోగ్య శాఖ సర్వేలో తేలింది. రిటైల్ దుకాణాల్లోని నాసిరకం మందులతో పోల్చితే ఇవి మూడు రెట్లని తెలిసింది. ఔషధాల నాణ్యతను గుర్తించేందుకు చేపట్టిన అతిపెద్ద సర్వే ఇదేనని ప్రభుత్వం తెలిపింది. సర్వే కోసం సేకరించిన రిటైల్ దుకాణాల నమూనాల్లో 3శాతం నాసిరకమైనవని, 0.023 శాతం కల్తీవని కనుగొన్నారు. ఔషధాల సేకరణ కోసం ఎంపిక చేసే తయారీదారుల అర్హత ప్రమాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వ ఏజెన్సీలు పునఃసమీక్షించుకోవాలని సర్వే జరిపిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ సూచించింది. సర్వేలో సుమారు 47,954 నమూనాలను 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 654 జిల్లాల నుంచి సేకరించారు. -
ముట్టుకుంటే చిరిగిపోతుంది
తిరువనంతపురం: పెద్ద నోట్ల రద్దు అనంతరం సామాన్యుల చేతికి నోటు చిక్కడమే కష్టంగా మారింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలలో నిలుచున్నా డబ్బు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఎలాగోలా బ్యాంకు నుంచి 5 రెండు వేల కరెన్సీ నోట్లను పొందిన కేరళలోని ఓ మహిళకు మరో రకమైన అనుభవం ఎదురైంది. అందులో ఓ నోటు డ్రా చేసిన కొద్ది సమయానికే ముట్టుకుంటే చిరిగిపోవడం ప్రారంభించింది. తాళిపరంబ టౌన్‌లోని ఫెడరల్ బ్యాంకు బ్రాంచ్ నుంచి పీసీ షరీఫా అనే మహిళ ఇటీవల 10 వేలు పొందింది. అందులో సీరియల్ నంబర్ 456828 ఉన్న రెండు వేల నోటు ముట్టుకుంటేనే చివర్లలో చిరిగిపోవడం ప్రారంభించింది. దీనిపై షరీఫా కుమారుడు షిమీల్ మాట్లాడుతూ.. మిగిలిన నాలుగు నోట్లు కూడా చిరిగిపోతుండటం గమనించానని, అయితే ఎలాగోలా వాటిని ఖర్చులకు వాడేశానని మీడియాతో వెల్లడించాడు. అయితే బాగా చిరిగిన నోటును ఎవరూ తీసుకోవడం లేదని, తిరిగి తీసుకోవాలని బ్యాంకు వారిని కోరగా.. వారు ఒప్పుకోలేదని తెలిపాడు. గంటల కొద్ది క్యూలో నిల్చున్న తరువాత గానీ ఈ నోట్లు దొరికాయని షరీఫా వెల్లడించింది. దీనిపై బ్యాంకు అధికారులు ఇంత వరకు స్పందించలేదు. -
నిధులు నీళ్లపాలు
నాసిరకంగా కాలువ పనులు కాకతీయ’కు గండితో వెల్లడైన వైనం పటిష్టతపై వెల్లువెత్తుతున్న అనుమానాలు వరంగల్ : జిల్లాకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని అందించే కాకతీయ ప్రధాన కాల్వల పటిష్టతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాల్వల్లోకి నీరు రాగానే గండి పడడంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్ఎండీలో పూర్తి స్థాయి నీటిమట్టం ఉన్నా ఎస్సారెస్పీ స్టేజ్–1తో పాటు స్టేజ్–2కు నీరు అందించాలంటే కాల్వల్లో పూర్తి సామర్థ్యం మేరకు 5 వేల క్యూసెక్కుల నీరు సరఫరా చేయాలి. గత పదేళ్లుగా జిల్లాలోని ప్రధాన కాల్వలు, మైనర్లు, సబ్మైనర్లు నిర్మించినప్పటికీ కాలువలు బలహీనంగా ఉండడంతో 3వేల క్యూసెక్కులకు మించి నీరు విడుదల చేయలేదు. ఎల్ఎండీ నుంచి మన జిల్లా వరకు ఉన్న స్టేజ్–1లోని ప్రధాన కాలువ 294 కిలోమీటర్లు పటిష్టం చేస్తేనే స్టేజ్ –2కు నీరందించే అవకాశం ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ క్రమంలో జిల్లాలోని 201–875 నుంచి 234 కి.మీ. వరకు మట్టికట్టలు, లైనింగ్ కోసం రూ.60 కోట్లు మంజూరయ్యాయి. అయితే కాలువల పనులు నాసిరకంగా చేపట్టడంతో అదనంగా నీరు విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. కోట్లు వ్యయం చేసినా ప్రభుత్వ లక్ష్యం నేరవేరక పోగా నిధులన్నీ నీళ్లులో పోసినట్టయింది. గత వారం రోజులుగా కరీంనగర్‌లోని లోయర్ మానేర్ డ్యాం నుంచి విడుదల చేస్తున్న నీటి సరఫరాను అధికారులు తగ్గించారు. గత నెల 27న వరంగల్ జిల్లా పరిధిలోని కాకతీయ ప్రధాన కాలువకు పెద్దమ్మగడ్డ సమీపంలో గండి పడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధ, గురువారాల్లో కాలువకు బయట పక్క గండి పడిన ప్రాంతంలో మట్టితో పూడ్చారు. 4వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తేనే ఈ పరిస్థితి నెలకొనడంతో ఎస్సారెస్పీ అధికారులు నీటి సరఫరాను తగ్గించారు. ప్రస్తుతం 3500 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో స్టేజ్–2 ఆయకట్టుకు నీరు అందించడం ప్రశ్నార్థకంగా మారింది. పరిశీలించిన ఈఎన్సీ... అరెపల్లి బ్రిడ్జి సమీపంలోని కాకతీయ ప్రధాన కాల్వకు గండి పడిన ప్రాంతాన్ని నీటి పారుద ల శాఖ ఈఎన్సీ విజయప్రకాశ్ గత శుక్రవారం పరిశీలించారు. కాలువ బెడ్ లెవల్లో నీటి ఊట ఎక్కువైనందున భారీగా నీరు విడుదల కావడంతో స్థానికులు అందోళనకు గురైనట్లు ఎస్ఈ సుధాకర్‌రెడ్డి ఆయనకు వివరించారు. దీంతో కాలువ లీకేజీ ప్రాంతంలో అదనంగా మట్టి పోయడంతో పాటు నీరు ప్రవహిస్తున్న చోట ఇసుకబస్తాలతో బండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలువ పనుల సమయంలో పర్యవేక్షణ సరిగా లేనందునే ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అధికారులను మందలించినట్లు సమాచారం. ఇప్పటికైనా బయటకు వస్తున్న నీటిని మళ్లించి పర్యవేక్షించాలని ఎస్ఈని ఆదేశించినట్లు సమాచారం. మంత్రి హరీశ్ ఆరా..! కాకతీయ ప్రధాన కాల్వకు గండి పడిన విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ఆరా తీసినట్లు తెలిసింది. గండిని పరిశీలించిన ఈఎన్సీ విజయప్రకాశ్ నుంచి మంత్రి పూర్తి వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం. గండి స్థానంలో కొత్త కట్ట నిర్మాణం కాకతీయ ప్రధాన కాల్వకు గండి పడి వృథాగా నీరు లీక్ కావడంతో అధికారులు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. లీకేజీని అపేందుకు నాలుగు రోజులుగా శ్రమిస్తున్నారు. అయినా ప్రవాహం అగక పోవడంతో ఆ ప్రాంతంలోని మట్టి మొత్తం తీసి కొత్తగా కట్ట నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా అదివారం నీరు లీకేజీ అయిన ప్రాంతంలోని కట్టను పూర్తిగా తొలగించి నాణ్యమైన మట్టితో కొత్తగా నిర్మిస్తున్నారు. కాకతీయ కాలువలో నీటి సరఫరా పూర్తిగా నిలిపివేస్తూ పనులు చేపట్టారు. దీంతో మరో వారం రోజుల పాటు నీటి సరఫరా జరగదని సమాచారం. -
వాటా గోల.. నిర్మాణం డొల్ల
కర్నూలు–దేవనకొండ రోడ్డుపై విజి‘లెన్స్’ – తారు రోడ్డు, కంకర నమూనాల సేకరణ – పరీక్షకు పంపినæ విజిలెన్స్ అధికారులు – నాసిరకం పనులపై ఫిర్యాదు చేసిన ఎంపీ బుట్టా – ఆగుతూ సాగుతున్న రోడ్డు పనులు – అధికార పార్టీ నేతల తీరే కారణం సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు–దేవనకొండ రోడ్డు నిర్మాణం సా..గుతోంది. అధికార పార్టీ నేతల వసూళ్ల నేపథ్యంలో నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. నాసిరకం పనులపై స్వయంగా కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే విజిలెన్స్ అధికారులు కొద్ది రోజుల క్రితం రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించినట్లు సమాచారం. వాస్తవంగా రోడ్డు వేయాల్సిన వెడల్పు? తవ్వాల్సిన లోతు? కంకర వినియోగం? నిబంధనలను ఎలా పాటిస్తున్నారు? అనే అంశాలను విజిలెన్స్ అధికారులు పరిశోధించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు అనుగుణంగా రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రాంతాలను పరిశీలించి కంకరతో పాటు తారు నమూనాలను పరీక్ష కోసం పంపినట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ చేపట్టేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం మీద మరోసారి కర్నూలు–దేవనకొండ రోడ్డు నిర్మాణ వ్యవహారం విజిలెన్స్ తనిఖీలతో తెరమీదకు వచ్చింది. ఇదీ రోడ్డు కథ కర్నూలు నుంచి దేవనకొండ వరకు 4/4 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వరకు రోడ్డును వెడల్పు చేయడంతో పాటు కొత్త రోడ్డు నిర్మాణం కోసం జూలై 2009లో రూ.102.01 కోట్లకు పరిపాలన అనుమతినిస్తూ రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ ధర కంటే 27 శాతం తక్కువ ధరను కోట్ చేసి రోడ్డు పనులను జీవీఎస్ఆర్ సంస్థ దక్కించుకుంది. అయితే, వివిధ కారణాలతో పనులను నిలిపేసింది. తాము చెల్లించిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్(ఈఎండీ)ని కూడా తీసేసుకున్నా ఫరవాలేదనే రీతిలో కంపెనీ వ్యవహరించింది. అయితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ వ్యయాన్ని రూ.132 కోట్లకు పెంచి 1వ తేదీ నవంబర్ 2016 నాటికి పనులను పూర్తిచేయాలని 2014 నవంబర్‌లో ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఆ సమయానికి కూడా పనులు పూర్తయ్యేలా లేవు. ఆది నుంచీ వాటాల గోలనే.. కర్నూలు–దేవనకొండ రోడ్డు వ్యవహారంలో ఆది నుంచీ వాటాల గోల జరుగుతోంది. అధికార పార్టీ నేతలతో పాటు ఈ రోడ్డు వెంటనున్న పలువురు ప్రజా ప్రతినిధులు వాటా అడుగుతున్నారంటూ సదరు సంస్థ పనులు చేయకుండా వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణ వ్యయాన్ని పెంచి అదే సంస్థ పనులు చేపట్టేలా అధికార తెలుగుదేశం ప్రభుత్వం నవంబర్ 12, 2014లో నిర్మాణ వ్యయాన్ని రూ.132 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు అనుగుణంగా సదరు సంస్థ పనులను ప్రారంభించిన తర్వాత కూడా అధికార పార్టీ నేత, మాజీ మంత్రి కాస్తా రోడ్డు నిర్మాణ వ్యయంలో వాటా అడగడంతో పాటు తాము చెప్పిన ప్లాంటు నుంచే కంకర తీసుకెళ్లాలని షరతు విధించారు. అప్పట్లో కూడా కొద్ది రోజుల పాటు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగినా.. కోడుమూరుకు చెందిన అధికార పార్టీ నేత తమ నుంచే ఇసుక తీసుకెళ్లాలంటూ పనులు నిలిపివేయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు రోడ్డు పనులకు అధికార పార్టీ నేతలు అడ్డుపడుతూనే ఉన్నారు. ఈ వాటాల గోల నేపథ్యంలో రోడ్డు పనులు కాస్తా నాసిరకంగా జరుగుతున్నాయనే ఆరోపణలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో పనుల నాణ్యతపై కర్నూలు ఎంపీ బుట్టా రేణుక విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. -
రైతు నెత్తిన రాయితీ!
నాసిరకంగా సబ్సిడీ వేరుశనగ విత్తనాలు సచ్చులు, పుచ్చులు, రాళ్లే ఎక్కువ బయటి మార్కెట్లోనూ అదే ధర మొలకెత్తుతాయో లేదోననే ఆందోళన రైతులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలు మరీ నాసిరకంగా ఉంటున్నాయి. ఇందులో సచ్చులు.. పుచ్చులు.. రాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని చూసి రైతులు, నేతలు విస్తుపోతున్నారు. రాయితీ విత్తనాలతో రైతుకు నష్టం తప్పదని అధికార పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. మేలు రకం విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులకు సూచిస్తున్నారు. చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా సోమవారం రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు మార్కెట్లో అందుబాటులో ఉన్న ధరతో నాసిరకం కాయలు పంపిణీ చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 1.36 హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో వర్షాధార వాణిజ్యపంటగా వేరుశనగను సాగుచేస్తారు. ప్రతి ఖరీఫ్‌కు 2లక్షల క్వింటాళ్ల విత్తనకాయలు అవసరమవుతాయి. ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఎక్కువ సాగుచేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీపై జిల్లాకు 90 వేల క్వింటాళ్ల విత్తనకాయలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి జిల్లాలోని వేరుశనగ సాగయ్యే 51 మండలాల్లో 45 వేల క్వింటాళ్ల కాయలను వ్యవసాయ అధికారులు పంపిణీ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం దిగుబడి బాగా రావాలంటే మంచి విత్తనం ఎంపిక ఉండాలని వ్యవసాయశాఖ అధికారులే చెబుతున్నారు. ఈ దిశగా రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే అధికారులు రైతులకు మంచి విత్తనాన్ని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏపీ సీడ్స్ నుంచి కాయలు వస్తూనే గోడౌన్లలో భద్రపరిచే ముందు వాటిని నిశితంగా పరిశీలించాలి. కాయలు బాగా లేకుంటే వెనక్కి పంపాలి. కానీ అధికారులు ఇవేవీ చేయకపోవడంతో నాసిరకం కాయలు సరఫరా అవుతున్నాయి. బస్తా కాయలకు సగం విత్తనాలే సాధారణంగా నాణ్యమైన కాయలు వొలిస్తే 30 కిలోల బస్తాకు ఎంత లేదన్నా 22 కిలోల విత్తనం లభిస్తుంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న కాయలు వొలిస్తే 15 కేజీల విత్తనాలే లభిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో మరోసారి కొనాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కాయలను సరఫరా చేస్తోందని కాబట్టి మార్కెట్లో ధరలు నియంత్రణలో ఉన్నాయి. ప్రభుత్వం సరఫరా నిలిపేస్తే పరిస్థితి మారిపోతుందని ఆందోళన చెందుతున్నారు. 50 శాతం కాయలే బాగున్నాయి రాయితీపై పంపిణీ చేస్తున్న వేరుశనగ కాయలు 50 శాతమే బాగున్నాయని చిత్తూరు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే సత్యప్రభ విమర్శించారు. ఆమె చిత్తూరు మండలంలోని వీఎన్ పేటలో సోమవారం వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా రైతులకు మేలు రకం కాయలు పంపిణీ చేయాలని సూచించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న కాయలు 50 శాతం మాత్రమే బాగున్నాయన్నారు. వీటిని పంపిణీ చేయడం వల్ల రైతులు చాలా నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేశారు. మంచి విత్తన కాయలు కాదు సబ్సిడీ ధరతో ఇస్తున్న వేరుశెనగ కాయలు పంట సాగుకు ఎందుకూ పనికిరావు. 30 కిలోల బస్తాలో సగానికి పైగా నాసిరకం విత్తనకాయలు ఉన్నాయి. ఇటువంటి విత్తనకాయలను పొలంలో వేస్తే ఖర్చు తప్ప ఎటువంటి లాభం ఉండదు.-రామక్రిష్ణమ్మ, మిట్టపల్లె, సీటీయం నాసిరకం విత్తనాలు అవసరమా? ప్రభుత్వం సబ్సిడీ పేరుతో నాసిరకం విత్తనాలు ఇచ్చి మాలాంటి మధ్య తరగతి రైతులకు ఇచ్చి మోసం చేయడం దారుణం. మంచి విత్తనాలని రూ.1,500లతో కొన్నాం. అందులో 10కిలోలు కూడా విత్తేందుకు పనికిరావు. -డి.గోపాల్, రాయునిచెరువు వడ్డిపల్లె -
నాసిరకం కానుక
విశాఖపట్నం: బెల్లం దిమ్మ పాకంలా కారిపోతోంది. భరించలేని కంపుకొడుతోంది. కంది పప్పు ప్యాకెట్లలో కేసరిదాల్ (నిషేధించిన కందిపప్పు) కలిసిపోయింది. సగానికి పైగా పుచ్చిపట్టిన, అత్యంత నాసిరకమైన పప్పు. శనగపప్పు కూడా నాసిరకమే. ప్యాకెట్ నిండా పొల్లపప్పు, పుచ్చులు, పుల్ల ముక్కలు కలిసిపోయి ఉన్నాయి. గోధుమ పిండి రంపపు పొట్టు, తవుడు మయం. చంద్రన్న కానుక సరుకుల్లో నాణ్యత నేతిబీరకాయ చందంగా ఉండగా.. తూకాల్లో వంద నుంచి 150 గ్రాముల తరుగు కన్పిస్తోంది. జిల్లాలో 10,84,404 బీపీఎల్ కార్డులున్నాయి. జన్మభూమి మావూరులో 1,43, 914 కార్డులు మంజూరుచేశారు. కానీ ఇప్పటి వరకు 2,175 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి కందిపప్పు, పామాయిల్, గోధుమ పిండి, నెయ్యి 93 శాతంచొప్పున, శెనగపప్పు 92,బెల్లం 91 శాతం చొప్పున డీలర్లకు చేరాయి. 12,26,321 సంచులు కావాల్సి ఉండగా 7.60లక్షల సంచులు జిల్లాకు చేరాయి..వాటిలో 5.27లక్షలు మాత్రమే డీలర్లకు చేరడంతో సంచుల సమస్య ప్రధానంగా మారింది. గతనెల 23 నుంచి ప్రారంభించిన క్రిస్మస్ కానుక పంపిణీ డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగించారు. మొత్తం కార్డుల్లో 15 శాతం క్రిస్మస్ కానుక కింద పంపిణీ జరుగుతుందని భావిస్తే 25 శాతానికిపైగా పంపిణీ జరిగింది. ఇప్పటి వరకు 3,50,070 కార్డులకు పంపిణీ చేశారు. తూకాల్లోనే కాంట్రాక్టర్ల చేతి వాటం బయటపడింది. ప్రతీ ప్యాకెట్‌లోనూ 100 నుంచి 150 గ్రాముల వరకు తరుగు కన్పించడం ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్ధమవుతుంది. శనగపప్పు అరకిలోకి 410 గ్రా., గోధుమ పిండి కిలోకి 880గ్రా., నెయ్యి 100 గ్రాములకు 80 గ్రా.లు, పామాయిల్ కేజీకి 880 గ్రా., కందిపప్పు అరకిలోకి 420గ్రా. బెల్లం అరకిలోకు 400 గ్రా.చొప్పున మాత్రమే తూగుతున్నాయి. దాదాపు 80 శాతం డిపోల్లో ఇదే పరిస్థితి కన్పిస్తోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్యాకెట్లలో సరుకులొచ్చాయి.. మేమేమైనా తినేశామా.. అంటూ డీలర్లు కార్డుదారులపై మండిపడుతుండడంతో చేసేది లేక ఉచితంగాఇస్తున్న సరుకులు కదా..దక్కినకాడకి..దక్కినంత అన్నట్టుగా మారు మాట్లాడకుండా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కార్డుదారులది. ఇక ఇంటికెళ్లి చూసుకుంటే బెల్లం కారిపోయి దుర్వాసన కొడుతుండగా. పప్పులు పుచ్చుపట్టి నాసిరకంగా ఉంది. గోధుమ పిండి చాలా ప్యాకెట్లలో రంపపుపొట్టు.. తవుడు కలిసిపోయి కంపుకొడుతోంది. ఏం చేయాలో..ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే అధికారికంగా మాకు ఎవరూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు..ఏం చేస్తాం.. అంటూ కాంట్రాక్టర్లను కాపుకాసే ప్రయత్నాలు చేస్తున్నారు. -
అక్రమ దారులు
నాసిరకంగా రోడ్ల నిర్మాణం పర్యవేక్షణ తుస్..నాణ్యత నిల్ జీవీఎంసీ ఖజానా కాంట్రాక్టర్లకు ధారాదత్తం రామాటాకీస్ నుంచి సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ రూ. 3.98 కోట్లతో హాట్‌మిక్స్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులన్నీ అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ చేపట్టాల్సిన ఈ పనిని సబ్ కాంట్రాక్టర్‌కు ఇవ్వడంతో పనుల్లో నాణ్యత వదిలేశారని అంటున్నారు. అందుకే ఈ రోడ్డు బాగోతం ముందుగానే గ్రహించిన ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేసేందుకు ముఖం చాటేశారని అంటున్నారు. విశాఖపట్నం సిటీ: వచ్చే ఏడాది జరిగే నేవీ ఫ్లీట్ రివ్యూ కోసం నగర వ్యాప్తంగా తారు రోడ్ల నిర్మాణాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. రూ. 50 కోట్లకు పైనే ఈ రోడ్ల కోసం జీవీఎంసీ వె చ్చిస్తోంది. డిసెంబర్ వరకు నిరంతరం సాగే ఈ రోడ్ల నిర్మాణం కోసం రానున్న రోజుల్లో మరో రూ. 50 కోట్ల వరకు వెచ్చించేందుకు జీవీఎంసీ సిద్ధంగా ఉంది. అయితే పనుల్లో ఎక్కడా నాణ్యత అనే మాట ఊసెత్తకుండా పనులు జరిగిపోతున్నాయి. కమిషనర్ చూసినా, క్వాలిటీ కంట్రోల్ అధికారులు చూసినా నాణ్యతను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రోడ్ల నాణ్యతపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిపి జీవీఎంసీ ఖజానాను కొల్లగొడుతున్నారని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఎలా రోడ్లేయాలి రహదారులు వేసే ముందుగా ప్యాచ్ పనులను పూర్తి చేయాలి. రోడ్ల మధ్యలో ఉన్న గోతులను శుభ్రం చేసి ఎమల్షూన్ స్ప్రే చేయాలి. ఆ తర్వాత కాస్త పెద్ద సైజ్‌లో ఉండే మెటల్ వేయాలి. సాధారణంగా 50 ఎంఎం మందం (థిక్నెస్) కోసం బిటుమిన్ మెకడం కాంక్రీట్ ఫస్ట్ సర్ఫేస్ వేయాలి. ఆ తర్వాత వైప్రో రోలర్‌తో తొక్కించాలి. ఈ రోలింగ్ వల్ల భారీ వైబ్రేషన్‌తో రోడ్డుపై వేసిన బిటుమిన్ బాగా బిగుసుకుపోతుంది. దీంతో బిటుమిన్కు బిటుమిన్ అంటుకుపోయి రోడ్డు నునుపుగా వచ్చేస్తుంది. అప్పుడు స్టాటిక్ రోలర్‌తో మళ్లీ తొక్కిస్తారు.దానిపై మళ్లీ ఎమల్షూన్ స్ప్రే చేయాలి. ఆ తర్వాత సెమీ డెన్సిటీ బిటుమిన్ కాంక్రీట్ (ఎస్‌డీబీసీ)ను 25 ఎంఎం మందం వేస్తారు. అంచుల వద్ద 25 ఎంఎం ఎస్‌డీబీసీ వేసి వైప్రో రోలర్‌తో సరిచేస్తారు. దీంతో రోడ్డు అందంగా కనిపించడంతో పాటు వర్షం పడినా రోడ్డుపై ఒక్క చినికూ నిలవదు. మధ్యాహ్నం పూట ఎండకు మెరుస్తూ రోడ్డు చెక్కుచెదరకుండా నాణ్యతతో ఉంటుంది. ఇలా వేసిన రోడ్డు నిర్మాణం కనీసం అయిదారేళ్ల పాటు పాడవదు. భారీ వర్షాలు పడితే గోతులు పడిన చోట మాత్రం కాస్త బిటుమిన్ లేస్తుంది. అంత కన్నా రోడ్డు పాడయ్యే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎలా వేస్తున్నారంటే..! ప్యాచ్ వర్క్‌లు చేయరు. రోడ్డును మాత్రం గాలితో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత ఏకంగా మెటల్ వేసుకుపోతారు. ఆ తర్వాత ఎంత మందం రోడ్డు కనిపించాలో అంతే మందం రోలర్ లో ఫిక్స్ చేయడం వల్ల అంతకన్నా గట్టిగా రోల్ చేయదు. దీంతో మందం కనిపించినా నాణ్యత అంతా గుల్ల. పైకి కనిపించినంత నాణ్యత రోడ్డులో లేకపోవడంతో వేసిన కొన్ని నెలల్లోనే తారు రోడ్డు గల్లంతవుతోంది. తారులోనే మాయ! జీవీఎంసీ రోడ్ల నిర్మాణంలోని మాయ అంతా ఇంతా కాదు. తారులోనే సగం మాయ చేసి రోడ్లు నిర్మిస్తున్నారు. అయిదు శాతం బిటుమిన్(తారు)కు బదులు 3 శాతం కన్నా తక్కువే వాడుతున్నారు. తారు రోడ్డుకు ప్రధాన శత్రువు నీరు. వర్షం పడగానే బిటుమిన్ శాతం తక్కువగా ఉన్న రోడ్డులో ఇంకిపోతుంది. ఇంకిపోయిన నీరు క్రమంగా మెటల్‌ను తారు నుంచి వేరు చే స్తుంది. దీంతో మెటల్ లేచిపోయి రోడ్డు కొద్ది రోజులకే అధ్వానంగా తయారవుతుంది. పాత రోడ్డుకు కొత్త రోడ్డును కలిపే టేక్ కోట్ బైండింగ్ కూడా నాణ్యతా లోపం వల్ల రోడ్లు త్వరగా పాడవుతున్నాయి. హాట్‌మిక్స్ రోడ్డు వేస్తే కనీసం అయిదేళ్లు ఉండాలి. అలా లేదంటే లోపాలున్నట్టే! -ఆర్‌అండ్‌బీలోని క్వాలిటీ కంట్రోల్ అధికారి -
శిథిలమైన గొడారి ఆనకట్ట
నాసిరకం మరమ్మతులతో నీరు వృథా వరదలకు కొట్టుకుపోయిన ఆఫ్రాన్ గట్లు పనుల్లో అవినీతి కారణమని రైతుల ఆరోపణ అనకాపల్లి: వేలాది ఎకరాల భూములకు సాగు నీరందించాల్సిన గొడారి ఆనకట్టకు నాణ్యత లేని మరమ్మతులు చేపట్టడంతో రెండేళ్లు కాకుండానే పరిస్థితి మొదటికొచ్చింది. దిగువ భూములకు సాగునీరు అందడం లేదు. సుమారు 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందిస్తున్న గొడారి ఆనకట్టపై నీటిపారుదల శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎడారవుతున్న పంట భూములు శారద నది పరీవాహక ప్రాంతంలో భాగంగా పట్టణానికి దిగువన ఉమ్మలాడ, ఎన్జీఓ కాలనీ మధ్య గొడారి ఆనకట్ట ఉంది. ఈ ఆనకట్ట పరిధిలో 4,494 ఎకరాల ఆయకట్టు ఉండగా, 2150 మంది రైతుల భూములకు సాగు నీరందిస్తోంది. ఎడమవైపున్న కృష్ణంరాజు కాలువకు సాగునీటి సరఫరాకు గొడారి ఆనకట్టే కీలకం. ఇటీవల మరోవైపు పైనుంచి వస్తున్న నీటి ప్రవాహం ఎన్జీఓ కాలనీ వైపున్న గట్టును బలహీనపరుస్తూ, గండి పడేందుకు కారణమవుతోంది. దీంతో తరచూ ఎన్జీఓ కాలనీ పరిసరాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. 1999లో గొడారి ఆనకట్ట ప్రాధాన్యాన్ని గుర్తించి పునర్నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు మంజూరు చేశారు. 2002లో పునర్నిర్మాణ పనులు పూర్తవడంతో ప్రారంభోత్సవం జరిగింది. మూడు నుంచి 4 ఆఫ్రాన్లు, ఎగువగోడ, దిగువగోడ, వరద గట్లు, రీచ్‌లతో గొడారి ఆనకట్టను నిర్మించారు. 2012, 2013 సంవత్సరాల్లో సంభవించిన భారీ తుపాన్లతో కుడివైపు గట్లకు గండ్లు పడ్డాయి. గొడారి ఆనకట్టను 13.48 కోట్ల నిధులతో పటిష్టపరిచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. ఆయన హఠాన్మరణంతో పనులకు గ్రహణం ఏర్పడింది. వైఎస్ అనంతరం వచ్చిన ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించాయి. నిధుల మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. వేలాది మంది రైతుల ఆశలు అడియాశలయ్యాయి. మరమ్మతుల్లో అవినీతి గొడారి ఆనకట్ట పరిధిలో వరద ఉధృతికి కొట్టుకుపోయిన అఫ్రాన్‌తో పాటు రీచ్‌ల తాత్కాలిక పనులు, కుడివైపు గట్ల పటిష్టానికి చేపట్టిన పనుల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.32.82 లక్షలతో నిర్మించిన ఆఫ్రాన్, రీచ్‌లు స్వల్ప వ్యవధిలోనే వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. సమీపంలోని ఆనకట్ట రాళ్లతో నాసిరకం పనులు చేపట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. గొడారి ఆనకట్ట నుంచి భారీగా నీరు ప్రవహించినప్పుడు ఆనకట్టకు సమీపంలోని భూములపై ఇసుక మేటలు వేయడంతో అవి భారీ ఇసుక ర్యాంపులుగా మారాయి. ఆనకట్టకు ఎగువన నీరుండాల్సి ఉన్నా లీకుల వల్ల సాగునీరు వృథాగా పోతోంది. -
నవ్వుతారు వేస్తుండగానే ఊడిపోతోంది...
నాసిరకంగా నర్సంపేట - నెక్కొండ రహదారి రూ.12కోట్ల పనుల్లో కాంట్రాక్టర్ కక్కుర్తి ఆర్డీఓ తనిఖీల్లో నాణ్యతా లోపం బట్టబయలు పట్టించుకోని ఆర్ అండ్ బీ అధికారులు నర్సంపేట - వరంగల్ రోడ్డు పరిస్థితీ ఇంతే ఇదీ... నర్సంపేట - నెక్కొండ రహదారి. మెటల్ లెవలింగ్ పూర్తి కాగా... తారు రోడ్డు వేస్తున్నారు. ఫస్ట్ లేయర్లో భాగంగా నర్సంపేట నుంచి చెన్నారావుపేట వరకు ఒక సైడ్ పూర్తయింది. తారుపోసి ఏడు రోజులైంది. ఇంతవరకు బాగానే ఉన్నా... నాసిరకం పనులతో అప్పుడే అది బిచ్చలు బిచ్చలుగా ఊడిపోతోంది. నర్సంపేటకు కిలోమీటరున్నర దూరంలో కాకతీయ నగర్ వద్ద ఓ బాటసారి తన చేతులతో తారును తీయగా... అది ఇట్లే ఊడి వచ్చింది. రహదారి పనుల్లో కొట్టొచ్చిన నాణ్యతా లోపానికి ఇదే నిలువెత్తు సాక్ష్యం. నర్సంపేట, న్యూస్‌లైన్: నర్సంపేట నుంచి నెక్కొండ వరకు రూ.12 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 17.02 కిలోమీటర్ల రహదారి పనుల్లో నాణ్యత కొరవడింది. పర్యవేక్షణ కొరవడడంతో పాత రోడ్డును లెవల్ చేయుకుండానే తారు పోయుడంతో అది ఊడిపోతోంది. కాంట్రాక్టర్ కక్కుర్తి ఫలితంగా... వేసిన ఏడు రోజులకే లేస్తోంది. నాసిరకంగా పనులు జరుగుతుండడంతో ఇటీవల చెన్నారావుపేట గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. అధికారుల్లో చలనం రాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అధికారులతో కాం ట్రాక్టర్ కుమ్మక్కై నాసిరకం పనులతో దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తగా... రెం డు రోజుల క్రితం నర్సంపేట ఆర్డీఓ స్వయంగా పరిశీలించారు. తారులో నీరు కలిపినట్లు తేలడంతోపాటు నాణ్యతలోపం, నాసిరకం సామగ్రితో పనులు జరుగుతున్నట్లు బట్టబయలైంది. అంతేకాదు... రహదారి పొడవునా నిర్మించిన కల్వర్టుల్లో నాణ్యత లోపించింది. సిమెంట్ శాతం తగ్గించడంతోపాటు నాసిరకం గొట్టాలను వినియోగించినట్లు, వెట్‌మిక్స్ పనులు మొక్కుబడిగా చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. అయినా... ఆర్ అండ్ బీ, క్వాలిటీ నియంత్రణ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. నర్సంపేట-వరంగల్ రహదారీ అంతే... నర్సంపేట నుంచి వరంగల్ వరకు రూ.22 కోట్లతో 22 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్న రహదారి పనుల్లో కూడా నాణ్యత కొరవడింది. రోడ్డు వెడల్పు పనుల్లో ప్రస్తుతం మెటల్ లెవలింగ్ చేస్తున్నారు. క్యూరింగ్ (నీరుచల్లడం) సరిగా లేకపోవడంతో కంకర లేస్తోంది. మూడు డ్రమ్ముల డాంబర్ సీజ్ తారు రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లేదని ఫిర్యాదు అం దడంతో పరిశీ లించా. రోడ్డు నిర్మా ణం కోసం వాడుతున్న డాంబర్‌లో వాటర్ కలపడాన్ని గ్రహించా. వెంటనే మూడు డ్రమ్ముల డాంబర్‌ను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించా. పనుల నిర్మాణంలో నాణ్యత ఉండడం లేదని ప్రాథమికంగా అంచనా వేశాను. దీనిపై కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం. - అరుణకువూరి, ఆర్డీఓ