పుచ్చిపోయిన పప్పు.. బూజు పట్టిన బెల్లం | Non Qualified Goods Distributed Government | Sakshi
Sakshi News home page

పుచ్చిపోయిన పప్పు.. బూజు పట్టిన బెల్లం

Published Fri, Jan 11 2019 2:55 AM | Last Updated on Fri, Jan 11 2019 2:55 AM

Non Qualified Goods Distributed Government - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌
ఈమె పేరు జయమ్మ (రేషన్‌ కార్డు నంబర్‌122700100427). అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో రేషన్‌ దుకాణంలో ప్రభుత్వం ఇచ్చిన చంద్రన్న సంక్రాంతి కానుక సరుకులు తీసుకొని ఇంటికొచ్చింది. ప్యాకింగ్‌లో ఉన్న కందిపప్పు, గోధుమపిండి తీసి చూడగా అందులో పురుగులు కన్పించాయి. బెల్లం బూజు పట్టింది. రేషన్‌ డీలర్‌ వద్దకు తీసుకెళ్లి సమస్యను వివరించింది. పురుగులున్న విషయాన్ని గుర్తించి అధికారులు ఆమెకు వేరే సరుకులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గోనేపల్లివారిపాలెం గ్రామానికి చెందిన కోనేటి వెంకటసుబ్బయ్య సంక్రాంతి పండుగకు ప్రభుత్వం ఇచ్చిన చంద్రన్న సరుకులు తీసుకున్నాడు. ప్లాస్టిక్‌ డబ్బాలో బూజు పట్టిన బెల్లం కన్పించింది. ఆ గ్రామంలో మరో 100 మందికి ఇలాగే బూజు పట్టిన బెల్లం వచ్చింది. దాన్ని వెనక్కి తీసుకుని, నాణ్యమైన బెల్లం ఇవ్వాలని కోరితే తనకు సంబంధం లేదంటూ రేషన్‌ డీలర్‌ చేతులెత్తేశాడు. 

పండుగల సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న చంద్రన్న కానుకలో నాణ్యత మచ్చుకైనా కనిపించడం లేదు. పుచ్చిపోయిన కందిపప్పు, పురుగులు పట్టిన శనగపప్పు, బూజు పట్టి పాకంలా మారిన బెల్లం, కాలం చెల్లిన నెయ్యితో పండుగపూట పిండివంటలు ఎలా చేసుకోవాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ సరుకుల పంపిణీ టెండర్లను ప్రతిఏటా అధికార పార్టీ నాయకులే దక్కించుకుంటున్నారు. వారు పనికిరాని సరుకులు పంపిణీ చేస్తున్నా అధికారులు గట్టిగా నిలదీయలేకపోతున్నారు. చంద్రన్న కానుక పథకం అమలుకు ప్రతిఏటా దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

నాసిరకం సరుకులు ఇస్తున్నారంటూ లబ్ధిదారులు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఫిర్యాదులు చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. నాణ్యత లేని కానుక సరఫరా చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. పనికిరాని సరుకులు తీసుకుని ఏం చేసుకోవాలని ప్రశ్నిస్తే... ఉచితంగా ఇస్తున్నాం, నోరు మూసుకొని తీసుకెళ్లండి అంటూ అధికార పార్టీ నేతలు, డీలర్లు దబాయిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. నాణ్యత లేని, కాలం తీరిన సరుకులను సేకరించి, చంద్రన్న కానుక పేరిట పేదలకు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

వేలిముద్ర పడితేనే సరుకులు 
ఈ–పాస్‌ యంత్రంలో వేలిముద్రలు పడితేనే లబ్ధిదారులకు సంక్రాంతి కానుక సరుకులు అందజేస్తున్నారు. వివిధ కారణాలతో వేలిముద్రలు సరిగా పడని 18 నుండి 20 శాతం మందికి సరుకులు ఇప్పటికీ అందలేదు. రాష్ట్రంలో 1.44 కోట్ల తెల్లరేషన్‌కార్డులున్న కుటుంబాలు ఉండగా, ఇప్పటిదాకా 1.17 కోట్ల కుటుంబాలకు మాత్రమే చంద్రన్న కానుక సరుకులు అందాయి. దాదాపు 27 లక్షల కుటుంబాలకు సరుకులు అందలేదు. 

తూకాల్లోనూ మోసాలే..
చంద్రన్న కానుక పేరిట ఇస్తున్న సరుకుల్లో నాణ్యత లేకపోవడంతోపాటు తూకాల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. నెయ్యి 100 గ్రాములు ఇవ్వాల్సి ఉండగా ప్యాకెట్లలో 90 గ్రాములు మాత్రమే ఉంటోంది. అరకిలో నూనెకు బదులు 450 గ్రాములే ఇస్తున్నారు. గోధుమపిండి, కందిపప్పు, శనగపప్పు 10 నుంచి 30 గ్రాముల తక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు అంటున్నారు. ఒక్కో కానుకకు రాష్ట్ర ప్రభుత్వం రూ.207.94 వెచ్చిస్తోంది. ఇందులో అరకిలో బెల్లం ధర రూ.24.70, అరకిలో గోధుమ పిండి రూ.29.78, అరకిలో శనగపప్పు రూ.29.58, అరకిలో కందిపప్పు రూ.36.50, అర లీటర్‌ పామాయిల్‌ రూ.39.83, 100 గ్రాముల నెయ్యి ధర రూ.30.55, సంచికి రూ.17 చొప్పున కేటాయిస్తోంది. బయట మార్కెట్‌లో ఇవే ధరలకు నాణ్యమైన సరుకులు వస్తాయని లబ్ధిదారులు చెబుతున్నారు. చంద్రన్న కానుక పథకం కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూర్చేలా ఉందని పేర్కొంటున్నారు. 

మిగిలిపోయిన పాత పప్పు అంటగట్టారు 
‘‘సంక్రాంతి సందర్భంగా ఇచ్చిన చంద్రన్న కానుక పూర్తిగా నాసిరకంగా ఉంది. నల్లగా మారిన బెల్లం ఇచ్చారు. తింటే ఏమౌతుందోనని భయమేస్తోంది. శనగపప్పు, కందిపప్పులో పురుగులు కనిపించాయి. మిగిలిపోయిన పాత పప్పును అంటగట్టారని అనుమానంగా ఉంది’’   
 – మల్లెల భవానీ, ఆటోనగర్, విజయవాడ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement