- సరుకుల పంపిణీకి బయోమెట్రిక్
- తొలుత గ్రేటర్ పరిధిలో అమలు
- దశలవారీగా జిల్లా అంతటా విస్తరణ
- యంత్రాల కొనుగోలుకు ప్రతిపాదనలు
ప్రజాపంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకుండా జిల్లా యంత్రాంగం సరికొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల జారీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తోంది. చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ యంత్రాలను ప్రవేశ పెడుతోంది. సరుకుల పంపిణీలో పారదర్శకత, అవకతవకలు జరగకుండా బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇందులో భాగంగా తొలివిడతగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రేషన్‌షాపుల్లో తొలిసారిగా అమలు చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లా పరిధిలోకి వచ్చే జీహెచ్‌ఎంసీలోని 800 చౌకధరల దుకాణాల్లో ఈ విధానాన్ని ప్రారంభించాలని నిర్ణయించిన అధికారులు... బయోమెట్రిక్ మిషన్లను సమకూర్చుకునే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. యంత్రాల కొనుగోలుకు దాదాపు రూ.3 కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:బయోమెట్రిక్ ద్వారా విధానంతో రేషన్‌డీలర్ల అక్రమ వ్యాపారానికి ఫుల్‌స్టాప్ పెట్టవచ్చని అధికార యంత్రాంగం భావిస్తోంది. కనిష్టంగా ప్రతి షాపులో 30 శాతం దుర్వినియోగాన్ని అరికట్టువచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా యేటా రూ.150 నుంచి రూ. 300 కోట్ల వరకు ప్రభుత్వ సొమ్ము ఆదా అవుతుందని భావిస్తోంది. అంతేకాకుండా సరుకులు నల్లబజారుకు తరలకుండా డీలర్లలో జవాబుదారీతనం పెరుగుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం కార్డుదారులు వచ్చినా.. రాకున్నా, సరుకులు తీసుకున్నా.
తీసుకోకపోయినా ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి తీసుకున్న సరుకులు మాత్రం వెనక్కి రావడంలేదు. అంటే రేషన్ తీసుకోనివారి కోటా కూడా పక్కదారిపడుతుందన్నమాట. ఈ నేపథ్యంలో ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర సర్కారు.. కొత్త విధానాన్ని అమలు చేయడం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేయాలని సంకల్పించింది.
వేలిముద్ర తప్పనిసరి!
బయో మెట్రిక్ విధానంలో రేషన్ సరుకులు తీసుకోవాలంటే కార్డుదారుడు తప్పనిసరిగా దుకాణానికి రావాల్సివుంటుంది. వేలిముద్ర సరిపోలినట్లు గుర్తించిన తర్వాతే సరుకులు పంపిణీ చేస్తారు. అయితే, ప్రస్తుతం కుటుంబసభ్యుల్లో ఎవరు వచ్చినా సరకులు ఇస్తారా? కుటుంబ పెద్ద వస్తేనే రేషన్ ఇవ్వడమన్న విషయంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఈ విధానంలో కార్డుదారులకు మరో వెసులుబాటు కూడా ఉంది. తమ దగ్గర ఉన్న నగదుకు అనుగుణంగా నిర్దేశించిన సరకులను ఎన్నిసార్లయినా పొందే వీలుంది. ఉదాహరణకు.. తమకు రావాల్సిన రూ.20 కేజీల బియ్యాన్ని నాలుగు దఫాలుగా కూడా తీసుకోవచ్చన్నమాట. ప్రస్తుతం నగర శివార్లకే పరిమితం చేస్తున్న బయోమెట్రిక్ విధానాన్ని దశలవారీగా జిల్లా అంతటా విస్తరించనున్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’కి వివరించారు.
రేషన్ వేలిముద్ర
Published Mon, Apr 20 2015 11:57 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement