'కల్తీ' కలవరం | Adulteration Is Disturbing In Medak District | Sakshi
Sakshi News home page

'కల్తీ' కలవరం

Published Thu, Jul 11 2019 10:23 AM | Last Updated on Thu, Jul 11 2019 10:23 AM

Adulteration Is Disturbing In Medak District - Sakshi

సాక్షి, మెదక్‌: మెతుకుసీమను ‘కల్తీ గాళ్ల దందా’ కలవరపెడుతోంది. కాసుల కక్కుర్తితో పలువురు అక్రమార్కులు ఉదయం అల్పాహారం నుంచి మొదలు రాత్రి భోజనం వరకు ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. పేరున్న హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌లు, బేకరీల నిర్వాహకులు అధికారులకు లంచాల ఎర చూపి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నూనెలు, పప్పులు.. ఇలా అన్ని సరుకులను కల్తీమయం చేస్తూ నాసిరకం వంటకాలతో అందినకాడికి దండుకుంటున్నారు. అయినా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 ధనార్జనే ధ్యేయంగా జిల్లాకు చెందిన పలువురు వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు కల్తీ నిత్యావసర సరుకులను వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులతో కుమ్మక్కై కల్తీ దందాను మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు కొనసాగిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు.

నాసిరకం, కుళ్లిన పదార్థాలతో..
జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, బేకరీలు ఇతరత్రా తినుబండారాల దుకాణాలు 103 ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఇవి కాకుండా లైసెన్స్‌ లేని హోటళ్లు కోకొల్లలు. అయితే.. కాసుల కక్కుర్తితో నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో నాసిరకం వస్తువులను వినియోగిస్తున్నారు. కుళ్లిన మాంసంతో సైతం ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకుల జేబులు డబ్బులతో నిండుతుంటే.. ప్రజలు రోగాలతో సతమతమవుతున్నారు. 

మహారాష్ట్ర నుంచి కల్తీ పప్పులు..
జిల్లాకు మహారాష్ట్ర నుంచి కల్తీ పప్పులు దిగుమతి అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మహారాష్ట్రలో పప్పుల దిగుబడి ఎక్కువ. ఈ క్రమంలో అక్కడి వ్యాపారులు కల్తీకి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాకు చెందిన కొంతమంది అక్కడి వారితో సంబంధాలు కొనసాగిస్తూ.. తక్కువ రేటుతో వచ్చే కల్తీ పప్పులను దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం.

కామారెడ్డి నుంచి నకిలీ నూనె..
జిల్లాకు ఆనుకుని ఉన్న కామారెడ్డి నుంచి కల్తీ నూనె దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉండడం.. రవాణా మార్గాలు పుష్కలంగా ఉండడంతో అక్కడే పలువురు వ్యాపారులు మంచి నూనెను కల్తీ చేసి ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అక్కడి నుంచే జిల్లాకు చెందిన పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బేకరీల నిర్వాహకులు తక్కువ రేటుతో కల్తీ నూనెను దిగుమతి చేసుకుని వంటకాల తయారీలో వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. జిల్లాకు చెందిన కొందరు ఆయిల్‌ మిల్లర్లు సైతం మహారాష్ట్ర నుంచి కల్తీ నూనెను జిల్లాకు తీసుకొచ్చి పేరున్న బ్రాండ్ల లేబుళ్లు వేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ.. అధికారులు చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపిపంచడంలేదు. నెలవారీగా మామూళ్లు అందుతుండడంతో ఫుడ్‌ఇన్‌స్పెక్టర్, ఇతర అధికారులు, ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారులు విఫలం..
జిల్లాలో కల్తీ వ్యాపారాలను అరికట్టడంతో అధికారులు విఫలమవుతున్నారు. గతంలో దుకాణాలు, గోదాంలు, నూనె షాపులు, హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, చికెన్, మటన్‌ సెంటర్లలో తనిఖీలు చేపట్టారు. శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపారు. ఆ తర్వాత కొందరిపై తూతూమంత్రపు జరిమానాలతో సరిపుచ్చారు. ప్రతి ఏడాది మొదట్లో ఈ ప్రక్రియ నామమాత్రంగా సాగుతోంది. ఎవరిపైనా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడంతో పలువురు అక్రమ వ్యాపారులు కల్తీ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. 

ఒకే ఒక్క ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌
జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, ఇతర తినుబండారాలు, బేకరీల్లో, షాపులతోపాటు మాంసం దుకాణాల్లో ఎప్పటికప్పుడూ నాణ్యతను పరిశీలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఫుడ్‌ సేఫ్టీ అధికారులది. అయితే.. ఈ అధికారులత కొరత రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు రవీందర్‌రావు ఒక్కరే ఉండడంతో తనిఖీలు సాగడం లేదని తెలుస్తోంది. జిల్లాకు సంబంధించి ఫుడ్‌ సేఫ్టీ అధికారికి సంబంధించిన కార్యాలయం ఉండగా.. ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ మినహా సిబ్బంది ఎవరినీ నియమించలేదు. దీంతో హోటళ్లలో నాణ్యతను పట్టించుకునే వారే కరువయ్యారు. 

సిబ్బంది లేకపోవడంతో..
ఐదు జిల్లాలకు నెనొక్కడినే ఉన్నా. జిల్లాకు ఒకరు చొప్పున సిబ్బందిని నియమిస్తే బాగుండు. అదనపు భారమైనప్పటికీ అన్ని జిల్లాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నా. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 62 శాంపిళ్లు సేకరించగా ఆహార పదార్థాల నాణ్యతకు సంబంధించి ఐదు,  లైసెన్స్‌ లేని 51 హోటళ్లను గుర్తించి కేసులు నమోదు చేశాం.
                                                        – జి.రవీందర్‌రావు, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ 
కొరవడిన అధికారుల పర్యవేక్షణ  
మెదక్‌ ప్రాంతంలోని హోటళ్ళు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల పై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వ్యాపారులు స్వలాభం కోసం తక్కువ ధరకు లభించే కల్తీ నూనె, సరుకులతో తయారుచేసిన ఆహార పదార్థాలను ప్రజలకు విక్రయిస్తున్నారు.  ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బిర్యానీ పాయింట్‌లలో ఎక్కువగా కల్తీ నూనెలను ఉపయోగిస్తుండటం వల్ల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అధికారులు స్పందించి తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
                                                                     – వినోద్‌కుమార్, ఫరీద్‌పూర్, మెదక్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement