సంగారెడ్డి: చెడ్డీ గ్యాంగ్.. గేటెడ్ కాలనీవాసుల్లో దడ పుట్టిస్తోంది. వారం రోజుల క్రితం అమీన్‌పూర్ శివారులోని ప్రణీత్ హోమ్స్‌లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. చెడ్డీలు వేసుకున్న కొందరు అమీన్‌పూర్ పట్టణంలోని పలు కాలనీలో సంచరిస్తున్నట్టు సీసీ కెమెరాల్లో గుర్తించారు. 2022 మార్చి, ఏప్రిల్ లోనూ ఈ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. ఇప్పటివరకు ఆ గ్యాంగ్‌లోని ఏ ఒక్కరిని పోలీసులు గుర్తించలేదు. తాజాగా మళ్లీ దొంగతనాలు జరగుతుండడంతో కాలనీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.
గేటెడ్ కమ్యూనిటీలే లక్ష్యం..
అమీన్‌పూర్, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న దొంగలు ఎవరనేది నేటికీ వెల్లడి కాలేదు. అయితే ఇటీవల బీరంగూడ ప్రణీత్ హోమ్స్‌లో జరిగిన చోరీని పరిశీలిస్తే తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేశారని తెలుస్తోంది.
అది కూడా ముందుగా తమకు అందిన సమాచారం మేరకే ఆ ఇళ్లలో చోరీకి పాల్పడినట్టు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఈ కాలల్లో పనిచేసిన వారు, పరిసరాలు తెలిసినవారే దొంగతనాలకు పాల్పడుతున్నారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే కొందరు నేరస్తులు అమీన్‌పూర్‌లో తలదాచుకుంటున్నారని గతంలో జరిగిన కొన్ని కేసుల్లో గుర్తించారు.
రాయలసీమ ప్రాంతంలో ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు పోలీసులు కళ్లు గప్పి అమీన్‌పూర్‌లోని గేటెడ్ కమ్యూనిటీలో స్థిరపడ్డాడు. అతడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. మరో సంఘటనలో కొద్దిరోజుల క్రితం ఇద్దరి మహిళలను అపహరించి ఇక్రిశాట్ కాలనీలోని ఓ ఇంట్లో దాచి ఉంచారు. వారి అరుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిని బట్టి చూస్తే ఈ ప్రాంతంలో నేరస్తులు ఆశ్రయం పొందుతున్నారని తెలుస్తోంది. కొన్నిసార్లు 100కు ఫోన్ చేసినా స్పందన కరువైందని అమీన్‌పూర్ వాసులు ఆరోపిస్తున్నారు. రాత్రిపూట పోలీసులు వాహనాలు సంచరించడం లేదని చెబుతున్నారు.
కాలనీల్లో గస్తీ పెంచాం..
అమీన్‌పూర్ పరిధిలో దొంగలు సంచరిస్తున్న నేపథ్యంలో గస్తీ పెంచాం. గేటెడ్ కమ్యూనిటీలతో పాటు వివిధ కాలనీల సెక్యూరిటీని అప్రమత్తం చేస్తున్నాం. అపరిచిత, కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించాం. ప్రణీత్, ప్రణవ్ పనోరమలో చోరీకి పాల్పడిన వారిపై నిఘా ఉంచాం. త్వరలోనే వారిని పట్టుకుంటాం. – శ్రీనివాసులురెడ్డి, అమీన్‌పూర్ సీఐ
Comments
Please login to add a commentAdd a comment