వాటా గోల.. నిర్మాణం డొల్ల
కర్నూలు–దేవనకొండ రోడ్డుపై విజి‘లెన్స్’
– తారు రోడ్డు, కంకర నమూనాల సేకరణ
– పరీక్షకు పంపినæ విజిలెన్స్ అధికారులు
– నాసిరకం పనులపై ఫిర్యాదు చేసిన ఎంపీ బుట్టా
– ఆగుతూ సాగుతున్న రోడ్డు పనులు
– అధికార పార్టీ నేతల తీరే కారణం
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
కర్నూలు–దేవనకొండ రోడ్డు నిర్మాణం సా..గుతోంది. అధికార పార్టీ నేతల వసూళ్ల నేపథ్యంలో నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. నాసిరకం పనులపై స్వయంగా కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే విజిలెన్స్ అధికారులు కొద్ది రోజుల క్రితం రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించినట్లు సమాచారం. వాస్తవంగా రోడ్డు వేయాల్సిన వెడల్పు? తవ్వాల్సిన లోతు? కంకర వినియోగం? నిబంధనలను ఎలా పాటిస్తున్నారు? అనే అంశాలను విజిలెన్స్ అధికారులు పరిశోధించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు అనుగుణంగా రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రాంతాలను పరిశీలించి కంకరతో పాటు తారు నమూనాలను పరీక్ష కోసం పంపినట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ చేపట్టేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం మీద మరోసారి కర్నూలు–దేవనకొండ రోడ్డు నిర్మాణ వ్యవహారం విజిలెన్స్ తనిఖీలతో తెరమీదకు వచ్చింది.
ఇదీ రోడ్డు కథ
కర్నూలు నుంచి దేవనకొండ వరకు 4/4 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వరకు రోడ్డును వెడల్పు చేయడంతో పాటు కొత్త రోడ్డు నిర్మాణం కోసం జూలై 2009లో రూ.102.01 కోట్లకు పరిపాలన అనుమతినిస్తూ రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ ధర కంటే 27 శాతం తక్కువ ధరను కోట్ చేసి రోడ్డు పనులను జీవీఎస్‌ఆర్ సంస్థ దక్కించుకుంది. అయితే, వివిధ కారణాలతో పనులను నిలిపేసింది. తాము చెల్లించిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్(ఈఎండీ)ని కూడా తీసేసుకున్నా ఫరవాలేదనే రీతిలో కంపెనీ వ్యవహరించింది. అయితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ వ్యయాన్ని రూ.132 కోట్లకు పెంచి 1వ తేదీ నవంబర్ 2016 నాటికి పనులను పూర్తిచేయాలని 2014 నవంబర్‌లో ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఆ సమయానికి కూడా పనులు పూర్తయ్యేలా లేవు.
ఆది నుంచీ వాటాల గోలనే..
కర్నూలు–దేవనకొండ రోడ్డు వ్యవహారంలో ఆది నుంచీ వాటాల గోల జరుగుతోంది. అధికార పార్టీ నేతలతో పాటు ఈ రోడ్డు వెంటనున్న పలువురు ప్రజా ప్రతినిధులు వాటా అడుగుతున్నారంటూ సదరు సంస్థ పనులు చేయకుండా వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణ వ్యయాన్ని పెంచి అదే సంస్థ పనులు చేపట్టేలా అధికార తెలుగుదేశం ప్రభుత్వం నవంబర్ 12, 2014లో నిర్మాణ వ్యయాన్ని రూ.132 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు అనుగుణంగా సదరు సంస్థ పనులను ప్రారంభించిన తర్వాత కూడా అధికార పార్టీ నేత, మాజీ మంత్రి కాస్తా రోడ్డు నిర్మాణ వ్యయంలో వాటా అడగడంతో పాటు తాము చెప్పిన ప్లాంటు నుంచే కంకర తీసుకెళ్లాలని షరతు విధించారు. అప్పట్లో కూడా కొద్ది రోజుల పాటు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగినా.. కోడుమూరుకు చెందిన అధికార పార్టీ నేత తమ నుంచే ఇసుక తీసుకెళ్లాలంటూ పనులు నిలిపివేయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు రోడ్డు పనులకు అధికార పార్టీ నేతలు అడ్డుపడుతూనే ఉన్నారు. ఈ వాటాల గోల నేపథ్యంలో రోడ్డు పనులు కాస్తా నాసిరకంగా జరుగుతున్నాయనే ఆరోపణలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో పనుల నాణ్యతపై కర్నూలు ఎంపీ బుట్టా రేణుక విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.