Asphalt road
-
వాటా గోల.. నిర్మాణం డొల్ల
కర్నూలు–దేవనకొండ రోడ్డుపై విజి‘లెన్స్’ – తారు రోడ్డు, కంకర నమూనాల సేకరణ – పరీక్షకు పంపినæ విజిలెన్స్ అధికారులు – నాసిరకం పనులపై ఫిర్యాదు చేసిన ఎంపీ బుట్టా – ఆగుతూ సాగుతున్న రోడ్డు పనులు – అధికార పార్టీ నేతల తీరే కారణం సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు–దేవనకొండ రోడ్డు నిర్మాణం సా..గుతోంది. అధికార పార్టీ నేతల వసూళ్ల నేపథ్యంలో నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. నాసిరకం పనులపై స్వయంగా కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టా రేణుక అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే విజిలెన్స్ అధికారులు కొద్ది రోజుల క్రితం రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించినట్లు సమాచారం. వాస్తవంగా రోడ్డు వేయాల్సిన వెడల్పు? తవ్వాల్సిన లోతు? కంకర వినియోగం? నిబంధనలను ఎలా పాటిస్తున్నారు? అనే అంశాలను విజిలెన్స్ అధికారులు పరిశోధించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు అనుగుణంగా రోడ్డు నిర్మాణం చేపడుతున్న ప్రాంతాలను పరిశీలించి కంకరతో పాటు తారు నమూనాలను పరీక్ష కోసం పంపినట్లు తెలిసింది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ చేపట్టేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం మీద మరోసారి కర్నూలు–దేవనకొండ రోడ్డు నిర్మాణ వ్యవహారం విజిలెన్స్ తనిఖీలతో తెరమీదకు వచ్చింది. ఇదీ రోడ్డు కథ కర్నూలు నుంచి దేవనకొండ వరకు 4/4 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వరకు రోడ్డును వెడల్పు చేయడంతో పాటు కొత్త రోడ్డు నిర్మాణం కోసం జూలై 2009లో రూ.102.01 కోట్లకు పరిపాలన అనుమతినిస్తూ రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ ధర కంటే 27 శాతం తక్కువ ధరను కోట్ చేసి రోడ్డు పనులను జీవీఎస్ఆర్ సంస్థ దక్కించుకుంది. అయితే, వివిధ కారణాలతో పనులను నిలిపేసింది. తాము చెల్లించిన ఎర్నెస్ట్ మనీ డిపాజిట్(ఈఎండీ)ని కూడా తీసేసుకున్నా ఫరవాలేదనే రీతిలో కంపెనీ వ్యవహరించింది. అయితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ వ్యయాన్ని రూ.132 కోట్లకు పెంచి 1వ తేదీ నవంబర్ 2016 నాటికి పనులను పూర్తిచేయాలని 2014 నవంబర్‌లో ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఆ సమయానికి కూడా పనులు పూర్తయ్యేలా లేవు. ఆది నుంచీ వాటాల గోలనే.. కర్నూలు–దేవనకొండ రోడ్డు వ్యవహారంలో ఆది నుంచీ వాటాల గోల జరుగుతోంది. అధికార పార్టీ నేతలతో పాటు ఈ రోడ్డు వెంటనున్న పలువురు ప్రజా ప్రతినిధులు వాటా అడుగుతున్నారంటూ సదరు సంస్థ పనులు చేయకుండా వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణ వ్యయాన్ని పెంచి అదే సంస్థ పనులు చేపట్టేలా అధికార తెలుగుదేశం ప్రభుత్వం నవంబర్ 12, 2014లో నిర్మాణ వ్యయాన్ని రూ.132 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు అనుగుణంగా సదరు సంస్థ పనులను ప్రారంభించిన తర్వాత కూడా అధికార పార్టీ నేత, మాజీ మంత్రి కాస్తా రోడ్డు నిర్మాణ వ్యయంలో వాటా అడగడంతో పాటు తాము చెప్పిన ప్లాంటు నుంచే కంకర తీసుకెళ్లాలని షరతు విధించారు. అప్పట్లో కూడా కొద్ది రోజుల పాటు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగినా.. కోడుమూరుకు చెందిన అధికార పార్టీ నేత తమ నుంచే ఇసుక తీసుకెళ్లాలంటూ పనులు నిలిపివేయించారు. ఈ విధంగా ఎప్పటికప్పుడు రోడ్డు పనులకు అధికార పార్టీ నేతలు అడ్డుపడుతూనే ఉన్నారు. ఈ వాటాల గోల నేపథ్యంలో రోడ్డు పనులు కాస్తా నాసిరకంగా జరుగుతున్నాయనే ఆరోపణలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో పనుల నాణ్యతపై కర్నూలు ఎంపీ బుట్టా రేణుక విజిలెన్స్‌కు ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. -
ఇక ఒకే రోడ్డు... 30 ఏళ్లు!
కాంక్రీట్ వైట్ టాపింగ్‌తో సాధ్యం ♦ భాగ్యనగరిలో తొలిసారిగా బంజారాహిల్స్‌లో... ♦ ముందుకొచ్చిన సిమెంట్ తయారీదారుల సంఘం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వర్షాకాలం వచ్చిందంటే చాలు. రోడ్లు పాడవటమే కాదు. ఎక్కడపడితే అక్కడ గుంతలూ తేలుతాయి. ఇంకేముంది!! కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్. ఇక హైదరాబాద్‌లో ఇరుకు రోడ్లతో జనం కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చంటోంది సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ). వైట్ టాపింగ్ టెక్నాలజీతో వేసిన కాంక్రీటు రోడ్లను దీనికి చక్కని పరిష్కారంగా చెబుతోంది. ఈ రోడ్ల జీవిత కాలం 25-30 ఏళ్ల వరకు ఉంటుంది. ఎలాంటి నిర్వహణ ఖర్చూ ఉండదు. మధ్యలో రోడ్డు దెబ్బతింటుందన్న సమస్యే లేదు. విమానాశ్రయాల్లో రన్ వే మాదిరి రోడ్లు అందంగానూ ఉంటాయి. సీఎంఏ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలిసారిగా బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో ఒక కిలోమీటరు మేర ప్రయోగాత్మకంగా వైట్ టాపింగ్ టెక్నాలజీతో కాంక్రీటు రోడ్డు నిర్మాణం బుధవారం ప్రారంభమైంది. తారు రోడ్డును కాంక్రీటు రోడ్డుగా మార్పే ఈ వైట్ టాపింగ్. కోట్లాది రూపాయలు ఆదా...: ఒక చదరపు మీటరుకు తారు రోడ్డుకు సుమారు రూ.1,250 వ్యయం అవుతుంది. రోడ్ల జీవిత కాలం 3-4 ఏళ్లు మాత్రమే. పైగా నిర్వహణ ఖర్చులు ఏడాదికి ఒక కిలోమీటరుకు రూ.3.5 లక్షలకుపైమాటేనని అంచనా. అయితే వైట్ టాపింగ్ కాంక్రీట్ రోడ్డుకు చదరపు మీటరుకు రూ.1,400-1,500 అవుతుంది. నిర్వహణ ఖర్చులు ఉండవు. కేబుల్స్ వేయడానికి మధ్యలో రోడ్డును తవ్వాల్సిన అవసరమే లేదని భారతి సిమెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ ఎం.రవీందర్ రెడ్డి తెలిపారు. నిర్మాణ సమయంలోనే ప్రత్యేక డక్ట్ ఏర్పాటు చేస్తారన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ వి.కిషన్‌రావు, టెక్నికల్ హెడ్స్ మన్మోహన్ ఆర్ కలగల్, రామచంద్ర, జి.శ్రీనివాస, మై హోం సిమెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీజే మథాయ్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. వైట్ టాపింగ్ రోడ్లకు పూర్తిగా దేశీయంగా తయారైన సిమెంటు వాడొచ్చని, తద్వారా కోట్ల రూపాయల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయొచ్చని చెప్పారు. మనం ఉపయోగిస్తున్న తారులో 70 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదేనని వారు గుర్తు చేశారు. తెలంగాణ సీఎం చొరవతో...: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చొరవతో సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) బంజారాహిల్స్‌లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇప్పటికే సీఎంఏ బెంగళూరు, జైపూర్, చెన్నైలో ఇటువంటి డెమో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. భారతి, మహా, సాగర్, అల్ట్రాటెక్‌సహా17 సిమెంటు కంపెనీలు హైదరాబాద్ ప్రాజెక్టుకయ్యే రూ.2.2 కోట్లను భరిస్తున్నాయి. ఎం-40 పేవ్మెంట్ క్వాలిటీ కాంక్రీటును వాడుతున్నారు. కాంక్రీట్ రోడ్డు ప్రయోజనాలు.. ►ఒక కిలోమీటరు మేర రోడ్డు నిర్మాణాన్ని 8 రోజుల్లో పూర్తి చేయొచ్చు. ►ఇప్పటికే ఉన్న రోడ్డును పూర్తిగా తవ్వాల్సిన అవసరం లేదు. తారును తొలగించి నాణ్యమైన పోర్ట్‌ల్యాండ్ సిమెంటుతో కాంక్రీటు వేస్తారు. లేబర్ పెద్దగా అవసరం లేకుండా ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. ►తారు రోడ్డుతో పోలిస్తే కాంక్రీటు రోడ్ల నుంచి వెలువడే వేడి చాలా తక్కువ. చుట్టుపక్కల ఉన్న ఇల్లు, కార్యాలయాల్లో ఏసీలపై భారం తగ్గుతుంది. ►తారు రోడ్డు నలుపుగా ఉండడంతో ఇరువైపులా ఎక్కువ లైట్లను, అధిక కాంతిని వాడాల్సి వస్తుంది. ఈ రోడ్లకైతే ఆ స్థాయిలో లైట్లు అవసరం లేదు. 50% విద్యుత్ ఆదా. ►వాహనాలు పటుత్వం కోల్పోకుండా గ్రిప్ ఉండేలా రోడ్డుపై చారలుగా పూత ఉంటుంది. పర్యావరణానికి అనువైంది ►మొత్తంగా కుదుపులు, గుంతలు లేని రోడ్లుంటే వాహనాల నిర్వహణ ఖర్చులు చాలా తగ్గుతాయి. -
నవ్వుతారు వేస్తుండగానే ఊడిపోతోంది...
నాసిరకంగా నర్సంపేట - నెక్కొండ రహదారి రూ.12కోట్ల పనుల్లో కాంట్రాక్టర్ కక్కుర్తి ఆర్డీఓ తనిఖీల్లో నాణ్యతా లోపం బట్టబయలు పట్టించుకోని ఆర్ అండ్ బీ అధికారులు నర్సంపేట - వరంగల్ రోడ్డు పరిస్థితీ ఇంతే ఇదీ... నర్సంపేట - నెక్కొండ రహదారి. మెటల్ లెవలింగ్ పూర్తి కాగా... తారు రోడ్డు వేస్తున్నారు. ఫస్ట్ లేయర్లో భాగంగా నర్సంపేట నుంచి చెన్నారావుపేట వరకు ఒక సైడ్ పూర్తయింది. తారుపోసి ఏడు రోజులైంది. ఇంతవరకు బాగానే ఉన్నా... నాసిరకం పనులతో అప్పుడే అది బిచ్చలు బిచ్చలుగా ఊడిపోతోంది. నర్సంపేటకు కిలోమీటరున్నర దూరంలో కాకతీయ నగర్ వద్ద ఓ బాటసారి తన చేతులతో తారును తీయగా... అది ఇట్లే ఊడి వచ్చింది. రహదారి పనుల్లో కొట్టొచ్చిన నాణ్యతా లోపానికి ఇదే నిలువెత్తు సాక్ష్యం. నర్సంపేట, న్యూస్‌లైన్: నర్సంపేట నుంచి నెక్కొండ వరకు రూ.12 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 17.02 కిలోమీటర్ల రహదారి పనుల్లో నాణ్యత కొరవడింది. పర్యవేక్షణ కొరవడడంతో పాత రోడ్డును లెవల్ చేయుకుండానే తారు పోయుడంతో అది ఊడిపోతోంది. కాంట్రాక్టర్ కక్కుర్తి ఫలితంగా... వేసిన ఏడు రోజులకే లేస్తోంది. నాసిరకంగా పనులు జరుగుతుండడంతో ఇటీవల చెన్నారావుపేట గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. అధికారుల్లో చలనం రాకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అధికారులతో కాం ట్రాక్టర్ కుమ్మక్కై నాసిరకం పనులతో దండుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తగా... రెం డు రోజుల క్రితం నర్సంపేట ఆర్డీఓ స్వయంగా పరిశీలించారు. తారులో నీరు కలిపినట్లు తేలడంతోపాటు నాణ్యతలోపం, నాసిరకం సామగ్రితో పనులు జరుగుతున్నట్లు బట్టబయలైంది. అంతేకాదు... రహదారి పొడవునా నిర్మించిన కల్వర్టుల్లో నాణ్యత లోపించింది. సిమెంట్ శాతం తగ్గించడంతోపాటు నాసిరకం గొట్టాలను వినియోగించినట్లు, వెట్‌మిక్స్ పనులు మొక్కుబడిగా చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. అయినా... ఆర్ అండ్ బీ, క్వాలిటీ నియంత్రణ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. నర్సంపేట-వరంగల్ రహదారీ అంతే... నర్సంపేట నుంచి వరంగల్ వరకు రూ.22 కోట్లతో 22 కిలోమీటర్ల పొడవునా నిర్మిస్తున్న రహదారి పనుల్లో కూడా నాణ్యత కొరవడింది. రోడ్డు వెడల్పు పనుల్లో ప్రస్తుతం మెటల్ లెవలింగ్ చేస్తున్నారు. క్యూరింగ్ (నీరుచల్లడం) సరిగా లేకపోవడంతో కంకర లేస్తోంది. మూడు డ్రమ్ముల డాంబర్ సీజ్ తారు రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లేదని ఫిర్యాదు అం దడంతో పరిశీ లించా. రోడ్డు నిర్మా ణం కోసం వాడుతున్న డాంబర్‌లో వాటర్ కలపడాన్ని గ్రహించా. వెంటనే మూడు డ్రమ్ముల డాంబర్‌ను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించా. పనుల నిర్మాణంలో నాణ్యత ఉండడం లేదని ప్రాథమికంగా అంచనా వేశాను. దీనిపై కలెక్టర్‌కు నివేదిక అందజేస్తాం. - అరుణకువూరి, ఆర్డీఓ