ఇక ఒకే రోడ్డు... 30 ఏళ్లు! | The same road for 30 years! | Sakshi
Sakshi News home page

ఇక ఒకే రోడ్డు... 30 ఏళ్లు!

Published Thu, Jul 30 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

ఇక ఒకే రోడ్డు... 30 ఏళ్లు!

ఇక ఒకే రోడ్డు... 30 ఏళ్లు!

 కాంక్రీట్ వైట్ టాపింగ్‌తో సాధ్యం
♦ భాగ్యనగరిలో తొలిసారిగా బంజారాహిల్స్‌లో...
♦ ముందుకొచ్చిన సిమెంట్ తయారీదారుల సంఘం
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వర్షాకాలం వచ్చిందంటే చాలు. రోడ్లు పాడవటమే కాదు. ఎక్కడపడితే అక్కడ గుంతలూ తేలుతాయి. ఇంకేముంది!! కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్. ఇక హైదరాబాద్‌లో ఇరుకు రోడ్లతో జనం కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చంటోంది సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ). వైట్ టాపింగ్ టెక్నాలజీతో వేసిన కాంక్రీటు రోడ్లను దీనికి చక్కని పరిష్కారంగా చెబుతోంది. ఈ రోడ్ల జీవిత కాలం 25-30 ఏళ్ల వరకు ఉంటుంది. ఎలాంటి నిర్వహణ ఖర్చూ ఉండదు.

మధ్యలో రోడ్డు దెబ్బతింటుందన్న సమస్యే లేదు. విమానాశ్రయాల్లో రన్ వే మాదిరి రోడ్లు అందంగానూ ఉంటాయి. సీఎంఏ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలిసారిగా బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో ఒక కిలోమీటరు మేర ప్రయోగాత్మకంగా వైట్ టాపింగ్ టెక్నాలజీతో కాంక్రీటు రోడ్డు నిర్మాణం బుధవారం ప్రారంభమైంది. తారు రోడ్డును కాంక్రీటు రోడ్డుగా మార్పే ఈ వైట్ టాపింగ్.

 కోట్లాది రూపాయలు ఆదా...: ఒక చదరపు మీటరుకు తారు రోడ్డుకు సుమారు రూ.1,250 వ్యయం అవుతుంది. రోడ్ల జీవిత కాలం 3-4 ఏళ్లు మాత్రమే. పైగా నిర్వహణ ఖర్చులు ఏడాదికి ఒక కిలోమీటరుకు రూ.3.5 లక్షలకుపైమాటేనని అంచనా. అయితే వైట్ టాపింగ్ కాంక్రీట్ రోడ్డుకు చదరపు మీటరుకు రూ.1,400-1,500 అవుతుంది. నిర్వహణ ఖర్చులు ఉండవు. కేబుల్స్ వేయడానికి మధ్యలో రోడ్డును తవ్వాల్సిన అవసరమే లేదని భారతి సిమెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ ఎం.రవీందర్ రెడ్డి తెలిపారు.

నిర్మాణ సమయంలోనే ప్రత్యేక డక్ట్ ఏర్పాటు చేస్తారన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ వి.కిషన్‌రావు, టెక్నికల్ హెడ్స్ మన్మోహన్ ఆర్ కలగల్, రామచంద్ర, జి.శ్రీనివాస, మై హోం సిమెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీజే మథాయ్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. వైట్ టాపింగ్ రోడ్లకు పూర్తిగా దేశీయంగా తయారైన సిమెంటు వాడొచ్చని, తద్వారా కోట్ల రూపాయల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయొచ్చని చెప్పారు. మనం ఉపయోగిస్తున్న తారులో 70 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదేనని వారు గుర్తు చేశారు.

 తెలంగాణ సీఎం చొరవతో...: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చొరవతో సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) బంజారాహిల్స్‌లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇప్పటికే సీఎంఏ బెంగళూరు, జైపూర్, చెన్నైలో ఇటువంటి డెమో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. భారతి, మహా, సాగర్, అల్ట్రాటెక్‌సహా17 సిమెంటు కంపెనీలు హైదరాబాద్ ప్రాజెక్టుకయ్యే రూ.2.2 కోట్లను భరిస్తున్నాయి. ఎం-40 పేవ్‌మెంట్ క్వాలిటీ కాంక్రీటును వాడుతున్నారు.
 
 కాంక్రీట్ రోడ్డు ప్రయోజనాలు..
►ఒక కిలోమీటరు మేర రోడ్డు నిర్మాణాన్ని 8 రోజుల్లో పూర్తి చేయొచ్చు.
►ఇప్పటికే ఉన్న రోడ్డును పూర్తిగా తవ్వాల్సిన అవసరం లేదు. తారును తొలగించి నాణ్యమైన పోర్ట్‌ల్యాండ్ సిమెంటుతో కాంక్రీటు వేస్తారు. లేబర్ పెద్దగా అవసరం లేకుండా ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు.
►తారు రోడ్డుతో పోలిస్తే కాంక్రీటు రోడ్ల నుంచి వెలువడే వేడి చాలా తక్కువ. చుట్టుపక్కల ఉన్న ఇల్లు, కార్యాలయాల్లో ఏసీలపై భారం తగ్గుతుంది.
►తారు రోడ్డు నలుపుగా ఉండడంతో ఇరువైపులా ఎక్కువ లైట్లను, అధిక కాంతిని వాడాల్సి వస్తుంది. ఈ రోడ్లకైతే ఆ స్థాయిలో లైట్లు అవసరం లేదు. 50% విద్యుత్ ఆదా.
►వాహనాలు పటుత్వం కోల్పోకుండా గ్రిప్ ఉండేలా రోడ్డుపై చారలుగా పూత ఉంటుంది. పర్యావరణానికి అనువైంది
►మొత్తంగా కుదుపులు, గుంతలు లేని రోడ్లుంటే వాహనాల నిర్వహణ ఖర్చులు చాలా తగ్గుతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement