కాంతులీనే కెరీర్‌కు.. | Institute of Cost Accountants of India and the course | Sakshi
Sakshi News home page

కాంతులీనే కెరీర్‌కు..

Published Mon, Jan 2 2017 3:56 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

కాంతులీనే కెరీర్‌కు..

కాంతులీనే కెరీర్‌కు..

ఎంబీఏ ఉత్తీర్ణులకు దీటుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిస్తున్న కోర్సు.. కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ (సీఎంఏ). ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అండ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ఈ కోర్సును అందిస్తోంది. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్‌ అనే మూడు దశలుగా ఉండే సీఎంఏను పూర్తిచేస్తే జాబ్‌ మార్కెట్‌లో మంచి వేతనాలతో కొలువులు దక్కించుకోవచ్చు. ఈ నేపథ్యంలో సీఎంఏ కోర్సులో దశలు, అర్హతలు.. పరీక్ష విధానం.. ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకుందాం..

సీఎంఏలో దశలివే..: సీఎంఏలో మూడు దశలుంటాయి. అవి.. 1. ఫౌండేషన్, 2. ఇంటర్మీడియెట్, 3. ఫైనల్‌.
మొదటి దశ ఫౌండేషన్‌: సీఎంఏ కోర్సులోని మొదటి దశను ఫౌండేషన్‌ అని వ్యవహరిస్తారు. ఇంటర్‌ లేదా 10+2లో ఏ గ్రూప్‌ చదివినవారైనా దీనికి నమోదు చేసుకోవచ్చు. ఇందులోని మొత్తం 8 సబ్జెక్టులను నాలుగు పేపర్లుగా విభజించారు. ప్రతి పేపర్‌ను 100 మార్కులకు డిస్క్రిప్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఏడాదిలో జూన్, డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.

ముందు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి: సీఎంఏ చదవాలంటే ముందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. దీనికోసం ఇంటర్మీడియెట్‌ లేదా 10+2, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలి.రెండో దశ.. ఇంటర్మీడియెట్‌: ఫౌండేషన్‌ ఉత్తీర్ణులు ఇంటర్మీడియెట్‌కు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ తర్వాత ఏడాదికి పరీక్షలు రాయడానికి అర్హత లభిస్తుంది. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులు కూడా నేరుగా ఇంటర్మీడియెట్‌కు నమోదు చేసుకోవచ్చు. ఏటా జూన్, డిసెంబర్‌ల్లో ఇంటర్మీడియెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్‌ రెండు గ్రూపులుగా ఉంటుంది. అవి..

గ్రూప్‌–1: ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. అవి.. ఫైనాన్షియల్‌ అకౌంటింగ్, లాస్‌ అండ్‌ ఎథిక్స్, డైరెక్ట్‌ ట్యాక్సేషన్, కాస్ట్‌ అకౌంటింగ్‌. ఒక్కో పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఒక్కో పేపర్‌లో కనీసం 40 శాతం మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు పొందితే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు.

గ్రూప్‌–2: ఇందులో నాలుగు పేపర్లుంటాయి. అవి.. ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్, కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సేషన్, కంపెనీ అకౌంట్స్‌ అండ్‌ ఆడిట్‌. ఒక్కో పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది. నాలుగు పేపర్లకు కలిపి 400 మార్కులు కేటాయించారు.  వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా వేర్వేరుగా ఆరు నెలల వ్యవధిలో రాయొచ్చు.
ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌: సీఎంఏ ఫైనల్‌ పరీక్ష రాయాలంటే ఆరు నెలల ప్రాక్టికల్‌ శిక్షణ తప్పనిసరి. ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులు గుర్తింపు పొందిన సంస్థల్లో లేదా ఇప్పటికే పనిచేస్తున్న కాస్ట్‌ అకౌంటెంట్ల వద్ద ఆర్నెల్ల పాటు ప్రాక్టికల్‌ శిక్షణ పొందాలి. ఈ సమయంలో ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.2 వేలు నుంచి రూ.5 వేల వరకు సై్టపెండ్‌ పొందొచ్చు.

మూడో దశ.. సీఎంఏ ఫైనల్‌: ప్రాక్టికల్‌ శిక్షణ పూర్తయిన విద్యార్థి ఫైనల్‌ పరీక్ష రాయొచ్చు. ఇందులో కూడా రెండు గ్రూపులు (గ్రూప్‌ 3, గ్రూప్‌ 4) ఉంటాయి. వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా ఒక్కో గ్రూప్‌ వేర్వేరుగా ఆర్నెల్ల వ్యవధిలో రాయొచ్చు. ఏటా జూన్, డిసెంబర్‌ల్లో సీఎంఏ ఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

ఫైనల్‌ పరీక్ష విధానం: గ్రూప్‌–3: ఇందులో నాలుగు పేపర్లుంటాయి. అవి.. కార్పొరేట్‌ లాస్‌ అండ్‌ కంప్లైయన్స్, స్ట్రాటజిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్‌ కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌ – డెసిషన్‌ మేకింగ్, డైరెక్ట్‌ ట్యాక్స్‌ లాస్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌. ఒక్కో పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది. ప్రతి పేపర్‌లో కనీసం 40 మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించినవారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు.

గ్రూప్‌–4: ఇందులో కూడా నాలుగు పేపర్లుంటాయి. అవి.. కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌ లాస్‌ అండ్‌ ప్రాక్టీస్, కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆడిట్, స్ట్రాటజిక్‌ ఫెర్ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బిజినెస్‌ వాల్యుయేషన్‌. ఒక్కో పేపర్‌ను 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌లో కనీసం 40 మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు పొందితే ఉత్తీర్ణులైనట్లు. ఫైనల్‌ ఉత్తీర్ణులు కంప్యూటర్‌ శిక్షణ పూర్తయిన తర్వాత కాస్ట్‌ అకౌంటెంట్లుగా గుర్తింపు పొందుతారు. ఫైనల్‌ ఉత్తీర్ణులు నేరుగా ఉద్యోగంలో చేరొచ్చు. సొంతంగా ప్రాక్టీస్‌ చేయాలంటే మరో రెండున్నరేళ్లు ప్రాక్టికల్‌ శిక్షణ తీసుకోవాలి. దీన్ని పూర్తిచేసినవారికి కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా.. సర్టిఫికెట్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ (సీవోపీ) అందిస్తుంది.

అవకాశాలెన్నో..: సీఎంఏ ఉత్తీర్ణులకు సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కల్పిస్తోంది. హెచ్‌సీఎల్, ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐటీసీ, సిప్లా, జెన్‌ప్యాక్ట్‌ వంటి బహుళజాతి కంపెనీలు మంచి వేతన ప్యాకేజీలతో వీరిని నియమించుకుంటున్నాయి. ఎంబీఏ చేసినవారికి ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయో.. సీఎంఏలకు కూడా అవే ఉంటాయి. మేనేజ్‌మెంట్, ప్రొఫెషనల్‌ కోర్సులు అందించే విద్యా సంస్థల్లో లెక్చరర్స్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్, అసోసియేట్‌ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్‌గా పనిచేయొచ్చు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ కీలక పదవులను నిర్వర్తించొచ్చు. ఉద్యోగం ఇష్టం లేనివారు స్వయం ఉపాధి పొందొచ్చు. వెబ్‌సైట్‌: www.icmai.in

ఎం.ఎస్‌.ఎస్‌. ప్రకాశ్, డైరెక్టర్, మాస్టర్‌మైండ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement