CMA
-
Microsoft-OpenAI: రెండూ కలిస్తే ఏమవుతుంది?
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్, చాట్‌జీపీటీ సృష్టికర్త ఓపెన్ఏఐ భాగస్వామ్యాన్ని, దానికి సంబంధించిన ఇటీవల పరిణామాల్ని యూకే నియంత్రణ సంస్థ నిశితంగా పరిశీలిస్తోంది. ఈ దిగ్గజ కంపెనీల కలయిక యూకేలోని కంపెనీ మధ్య పోటీపై ఎలాంటి ప్రభావం చూపనుందన్న అంశాన్ని గమనిస్తోంది. ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ అనుబంధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్‌ను ప్రభావితం చేయగలదా అని యూకేకి చెందిన కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) పరిశీలిస్తోంది. ఈమేరకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. అభిప్రాయ సేకరణ (ITC) అనేది సమాచార సేకరణ ప్రక్రియలో మొదటి భాగమని, అధికారికంగా మొదటిదశ విచారణకు ముందు చేపట్టే ప్రక్రియ అని సీఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ఏఐలో ఇటీవల అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో మైక్రోసాఫ్ట్ ప్రవేశించింది. ఈ పరిణామాల దృష్ట్యా మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ భాగస్వామ్యం, ఇటీవల పరిణామాలు కంపెనీల పోటీపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది తెలుసుకునేందుకు అభిప్రాయ సేకరణకు పిలుపునిచ్చింది. ఓపెన్ఏఐలో నాటకీయ పరిణామాలు గత నెలలో ఓపెన్ఏఐ బోర్డు నాటకీయ చర్యలో సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించింది. తరువాత, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల తమ అధునాతన ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించాలని ఆయను ఆహ్వానించారు. అయితే ఓపెన్ఏఐ పూర్తిగా కొత్త బోర్డ్‌తో ఆల్ట్‌మన్‌ను సీఈవోగా పునరుద్ధరించడంతో ఈ నాటకీయ పరిణామానికి ముగింపు పడింది. ‘ఏఐ డెవలపర్ల మధ్య నిరంతర పోటీ అవసరం. ఇది ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు, వృద్ధి, బాధ్యతాయుతమైన అభ్యాసాలను అందించడంలో సహాయపడుతుంది’ సీఎంఏ అభిప్రాయపడింది. మైక్రోసాఫ్ట్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం ఈ రంగంలో కంపెనీల మధ్య పోటీని దెబ్బతీసే ప్రమాదం ఉందా అని సీఎంఏ సమీక్షిస్తోంది. -
కోవిడ్ నేపథ్యంలో కాస్ట్ అకౌంటెంట్లకు కొత్త అవకాశాలు
కోవిడ్ పరిణామాల నేపథ్యంలో కంపెనీలు తమ వ్యాపార ప్రణాళికలు సజావుగా నిర్వహించుకునేందుకు మరింతగా తోడ్పడటంపై సీఎంఏ కసరత్తు చేస్తోంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సుల్లో మార్పులపైనా దృష్టి పెడుతోంది. దివాలా కోడ్ వంటివి అమల్లోకి రావడంతో కాస్ట్ అకౌంటెంట్లు కొంగొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ పి. రాజు అయ్యర్ ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఈ అంశాలు వెల్లడించారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే.. కోవిడ్ నేపథ్యంలో ఐసీఏఐ తీసుకున్న చర్యలు.. అనేక సంవత్సరాలుగా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ (సీఎంఏ) పాత్ర అనేక మార్పులకు లోనైంది. తాజాగా కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో కార్పొరేట్ గవర్నెన్స్ కోణంలో కోవిడ్–19 అనంతరం బోర్డు రిపోర్టింగ్ విధానాలు, వ్యాపారాల కొనసాగింపు ప్రణాళికలకు సంబంధించిన టెక్నికల్ గైడ్ పేరిట రెండు ముఖ్యమైన పత్రాలను ఇనిస్టిట్యూట్ రూపొందించింది. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో బోర్డు స్థాయి సమీక్షలు, అలాగే లాక్డౌన్ల తర్వాత వ్యాపారాన్ని కొనసాగించే ప్రణాళికల అమలు సజావుగా జరిగేందుకు తోడ్పడాలన్నది వీటి ఉద్దేశ్యం. అలాగే, వివిధ కార్యకలాపాలను సక్రమంగా, సకాలంలో మదింపు చేయడంలో కంపెనీలకు సహాయకారిగా ఉండేలా యాక్టివిటీ ఆధారిత పెర్ఫార్మెన్స్ కాస్టింగ్ విధానాన్ని కూడా మేము రూపొందించాం. ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను తగిన విధంగా రూపొందించడం, ధరల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, లాభదాయకమైన/నష్టదాయకమైన ఉత్పత్తులు/కార్యకలాపాలను గుర్తించడం మొదలైన వాటికి ఇది ఉపయోగపడగలదు. అలాగే, వ్యాపార ప్రణాళికలను, బడ్జెటింగ్‌ను, వనరుల కేటాయింపు .. వినియోగాన్ని మెరుగుపర్చుకునేందుకు తోడ్పడగలదు. దివాలా కోడ్‌పై .. దేశీయంగా అమలు చేసిన అత్యంక కీలకమైన ఆర్థిక సంస్కరణల్లో ఐబీసీ కూడా ఒకటి. నిర్దిష్ట కాల వ్యవధిలో ఒకవైపు వాటాదారులందరి ప్రయోజనాలనూ పరిరక్షిస్తూనే మరోవైపు సంక్షోభంలో చిక్కుకున్న సంస్థలను గట్టెక్కించడంలో సమతౌల్యత పాటించేందుకు ఇది తోడ్పడుతుంది. రుణ సంస్కృతి మెరుగుపర్చడం, మొండిపద్దుల నుంచి ఎంతో కొంత రాబట్టడం, రుణదాతలు.. రుణగ్రహీతల మధ్య సమీకరణలు తదితర అంశాల్లో గడిచిన అయిదేళ్లలో ఐబీసీ గణనీయమైన మార్పు తెచ్చిం ది. ప్రస్తుతానికైతే ఈ చట్టం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఎంతో కీలకమైన చట్టం ప్రభావాలను అంచనా వేయడానికి అయిదేళ్ల వ్యవధి అనేది చాలా స్వల్ప కాలం. నిర్దేశిత లక్ష్యాల సాధనకు తోడ్పడేలా ఐబీసీలోని పలు నిబంధనలకు ఎప్పటికప్పుడు తగు విధంగా సవరణలు చేస్తున్నారు. ఐబీసీ విజయవంతంగానే అమలవుతోంది. అయితే, ఇప్పటికీ వ్యక్తిగత దివాలా, సీమాంతర దివాలా, గ్రూప్ దివాలా వంటి వాటికి సంబంధించిన నిబంధనలను ఇంకా నోటిఫై / అమలు చేయాల్సి ఉంది. ఐబీసీలో సీఎంఏల పాత్ర.. జీఎస్టీ అమలు.. చాలా మంది సీఎంఏలు ప్రస్తుతం దివాలా ప్రక్రియకు సంబంధించి ప్రొఫెషనల్స్‌గా మారారు. తరచుగా ఐబీసీ కింద పలు కేసులు చూస్తున్నారు. తాత్కాలిక పరిష్కార నిపుణులుగా, పరిష్కార నిపుణులుగా సీఎంఏలు .. ఫోరెన్సిక్ ఆడిట్, పరిష్కార ప్రణాళిక రూపకల్పన మొదలైన వాటిలో సహాయకరంగా ఉంటున్నారు. ఇక జీఎస్టీ విషయానికి వస్తే, వివిధ రాష్ట్రాల్లో వివిధ సిద్ధాంతాల ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో దీని అమల్లో సాంకేతికంగానే కాకుండా ఇతరత్రా సవాళ్లు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ఆర్థిక మంత్రి, దివంగత అరుణ్ జైట్లీ.. సవాళ్లను అధిగమించి జీఎస్టీ దీర్ఘకాలికంగా జీఎస్టీ విజయవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు. కాస్ట్ అకౌంటెంట్లకు కొత్త కెరియర్ అవకాశాలు కంపెనీ నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ప్రభావితం చేసేలా కాలక్రమేణా ఫ్యాక్టరీల స్థాయి నుంచి బోర్డు రూమ్‌ల్లోకి సీఎంఏల పాత్ర విస్తరించింది. ట్యాక్సేషన్, కాస్ట్ ఆడిట్, కన్సల్టెన్సీ, కార్పొరేట్ చట్టాలు, ఆర్బిట్రేషన్, దివాలా పరిష్కార నిపుణులు, స్వతంత్ర డైరెక్టర్లు, బ్యాంకింగ్, బీమా తదితర విభాగాల్లో సీఎంఏలు అనేక మైలురాళ్లు అధిగమించారు. ప్రస్తుతం వ్యాపార సంస్థలు అనిశ్చితి, సంక్లిష్టత వంటి సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటి మనుగడకు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కీలకంగా మారింది. కంపెనీ సామర్థ్యాలను, ఉత్పాదకతను, ఫలితాలను మెరుగుపర్చుకునేందుకు మేనేజ్మెంట్ అకౌంటింగ్ సహాయకరంగా ఉండగలదు. అన్ని ఆర్థిక కార్యకలాపాల్లోనూ సీఎంఏలు చోదకశక్తిగా ఉంటారు కాబట్టి ప్రభుత్వ.. ప్రైవేట్ రంగాలు, బహుళ జాతి సంస్థల్లో.. చైర్మన్, ఎండీ, డైరెక్టర్ ఫైనాన్స్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీస్, సీఈవో, జీఎం, ఫైనాన్స్ మేనేజర్ వంటి టాప్ మేనేజ్మెంట్ హోదాలను దక్కించుకోవడానికి అవకాశాలు మరింతగా పెరిగాయి. అవసరాలకు తగ్గట్లుగా కోర్సులో మార్పుచేర్పులు కొంగొత్త టెక్నాలజీల రాకతో వ్యాపార పరిస్థితులు అసాధారణంగా, శరవేగంగా మారిపోతున్నాయి. కొత్తగా ఎదురయ్యే ప్రతిబంధకాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారాల్సి రావడం వల్ల ప్రొఫెషనల్ అకౌంటెన్సీ సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉంటోంది. కొత్త లక్ష్యాలు, కొత్త సాధనాలు, కొత్త కోర్సులను రూపొందించాల్సి వస్తోంది. సీఎంఏ కోర్సు కోసం కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టడంపై కసరత్తు జరుగుతోంది. బిజినెస్ డేటా అనలిటిక్స్, బిజినెస్ కమ్యూనికేషన్ మొదలైనవి ప్రవేశపెట్టాము. ఇనిస్టిట్యూట్ తమ విద్యార్థుల కోసం ఎస్ఏపీ సర్టిఫికేషన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్టిఫికేషన్, ఈ–ఫైలింగ్ వంటివి ప్రపంచ స్థాయి శిక్షణ సదుపాయాలు కల్పిస్తోంది. 15 నెలల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి చేశాం. -
కాంతులీనే కెరీర్‌కు..
ఎంబీఏ ఉత్తీర్ణులకు దీటుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిస్తున్న కోర్సు.. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ). ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈ కోర్సును అందిస్తోంది. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్ అనే మూడు దశలుగా ఉండే సీఎంఏను పూర్తిచేస్తే జాబ్ మార్కెట్లో మంచి వేతనాలతో కొలువులు దక్కించుకోవచ్చు. ఈ నేపథ్యంలో సీఎంఏ కోర్సులో దశలు, అర్హతలు.. పరీక్ష విధానం.. ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకుందాం.. సీఎంఏలో దశలివే..: సీఎంఏలో మూడు దశలుంటాయి. అవి.. 1. ఫౌండేషన్, 2. ఇంటర్మీడియెట్, 3. ఫైనల్. మొదటి దశ ఫౌండేషన్: సీఎంఏ కోర్సులోని మొదటి దశను ఫౌండేషన్ అని వ్యవహరిస్తారు. ఇంటర్ లేదా 10+2లో ఏ గ్రూప్ చదివినవారైనా దీనికి నమోదు చేసుకోవచ్చు. ఇందులోని మొత్తం 8 సబ్జెక్టులను నాలుగు పేపర్లుగా విభజించారు. ప్రతి పేపర్‌ను 100 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఏడాదిలో జూన్, డిసెంబర్లో పరీక్షలు నిర్వహిస్తారు. ముందు రిజిస్ట్రేషన్ తప్పనిసరి: సీఎంఏ చదవాలంటే ముందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికోసం ఇంటర్మీడియెట్ లేదా 10+2, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించాలి.రెండో దశ.. ఇంటర్మీడియెట్: ఫౌండేషన్ ఉత్తీర్ణులు ఇంటర్మీడియెట్‌కు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత ఏడాదికి పరీక్షలు రాయడానికి అర్హత లభిస్తుంది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు కూడా నేరుగా ఇంటర్మీడియెట్‌కు నమోదు చేసుకోవచ్చు. ఏటా జూన్, డిసెంబర్‌ల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ రెండు గ్రూపులుగా ఉంటుంది. అవి.. గ్రూప్–1: ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. అవి.. ఫైనాన్షియల్ అకౌంటింగ్, లాస్ అండ్ ఎథిక్స్, డైరెక్ట్ ట్యాక్సేషన్, కాస్ట్ అకౌంటింగ్. ఒక్కో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఒక్కో పేపర్లో కనీసం 40 శాతం మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు పొందితే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు. గ్రూప్–2: ఇందులో నాలుగు పేపర్లుంటాయి. అవి.. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సేషన్, కంపెనీ అకౌంట్స్ అండ్ ఆడిట్. ఒక్కో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. నాలుగు పేపర్లకు కలిపి 400 మార్కులు కేటాయించారు. వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా వేర్వేరుగా ఆరు నెలల వ్యవధిలో రాయొచ్చు. ప్రాక్టికల్ ట్రైనింగ్: సీఎంఏ ఫైనల్ పరీక్ష రాయాలంటే ఆరు నెలల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు గుర్తింపు పొందిన సంస్థల్లో లేదా ఇప్పటికే పనిచేస్తున్న కాస్ట్ అకౌంటెంట్ల వద్ద ఆర్నెల్ల పాటు ప్రాక్టికల్ శిక్షణ పొందాలి. ఈ సమయంలో ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.2 వేలు నుంచి రూ.5 వేల వరకు సై్టపెండ్ పొందొచ్చు. మూడో దశ.. సీఎంఏ ఫైనల్: ప్రాక్టికల్ శిక్షణ పూర్తయిన విద్యార్థి ఫైనల్ పరీక్ష రాయొచ్చు. ఇందులో కూడా రెండు గ్రూపులు (గ్రూప్ 3, గ్రూప్ 4) ఉంటాయి. వీలును బట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా ఒక్కో గ్రూప్ వేర్వేరుగా ఆర్నెల్ల వ్యవధిలో రాయొచ్చు. ఏటా జూన్, డిసెంబర్‌ల్లో సీఎంఏ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫైనల్ పరీక్ష విధానం: గ్రూప్–3: ఇందులో నాలుగు పేపర్లుంటాయి. అవి.. కార్పొరేట్ లాస్ అండ్ కంప్లైయన్స్, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ – డెసిషన్ మేకింగ్, డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్. ఒక్కో పేపర్ 100 మార్కులకు ఉంటుంది. ప్రతి పేపర్లో కనీసం 40 మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు సాధించినవారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. గ్రూప్–4: ఇందులో కూడా నాలుగు పేపర్లుంటాయి. అవి.. కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ప్రాక్టీస్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్, స్ట్రాటజిక్ ఫెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ వాల్యుయేషన్. ఒక్కో పేపర్‌ను 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్లో కనీసం 40 మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు పొందితే ఉత్తీర్ణులైనట్లు. ఫైనల్ ఉత్తీర్ణులు కంప్యూటర్ శిక్షణ పూర్తయిన తర్వాత కాస్ట్ అకౌంటెంట్లుగా గుర్తింపు పొందుతారు. ఫైనల్ ఉత్తీర్ణులు నేరుగా ఉద్యోగంలో చేరొచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేయాలంటే మరో రెండున్నరేళ్లు ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాలి. దీన్ని పూర్తిచేసినవారికి కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా.. సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ (సీవోపీ) అందిస్తుంది. అవకాశాలెన్నో..: సీఎంఏ ఉత్తీర్ణులకు సీఎంఏ ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పిస్తోంది. హెచ్‌సీఎల్, ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐటీసీ, సిప్లా, జెన్‌ప్యాక్ట్ వంటి బహుళజాతి కంపెనీలు మంచి వేతన ప్యాకేజీలతో వీరిని నియమించుకుంటున్నాయి. ఎంబీఏ చేసినవారికి ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయో.. సీఎంఏలకు కూడా అవే ఉంటాయి. మేనేజ్మెంట్, ప్రొఫెషనల్ కోర్సులు అందించే విద్యా సంస్థల్లో లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్‌గా పనిచేయొచ్చు. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ కీలక పదవులను నిర్వర్తించొచ్చు. ఉద్యోగం ఇష్టం లేనివారు స్వయం ఉపాధి పొందొచ్చు. వెబ్సైట్: www.icmai.in ఎం.ఎస్.ఎస్. ప్రకాశ్, డైరెక్టర్, మాస్టర్‌మైండ్స్ -
సీఎంఏ.. సర్వీసెస్ to సాఫ్ట్వేర్..
గెస్ట్ కాలమ్ ఉజ్వల అవకాశాలకు అందిస్త్తున్న సేవరంగం నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థల వరకు అన్నింటా కాస్ట్ అండ్ అకౌంటెన్సీ విభాగానిది కీలకభూమిక. విశ్లేషణా నైపుణ్యం, ప్రశ్నించే లక్షణం ఉన్న అభ్యర్థులు అకౌంటెన్సీ కోర్సుల్లో తేలిగ్గా విజయం సాధించొచ్చు అంటున్న.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా -హైదరాబాద్ చాప్టర్ చైర్మన్, విజయ్ కిరణ్ అగస్త్యతో గెస్ట్ కాలం... కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సులు క్లిష్టమైనవి! ఎంత చదివినా వీటిలో ఉత్తీర్ణత సాధించడం కష్టం! అనే అభిప్రాయాలు చాలా మంది విద్యార్థుల్లో ఉన్నాయి. ఇలాంటి భావనల వల్లే ఈ కోర్సుల్లో ప్రవేశించాలనే ఉత్సాహం ఉన్నవారు కూడా వెనకడుగు వేస్తున్నారు. భయాన్ని వీడి ముందడుగేస్తే..ఈ కోర్సుల్లో సులభంగా విజయం సాధించవచ్చనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. ఔత్సాహికులు ఇంటర్మీడియెట్ అర్హతతోనే కోర్సులో ప్రవేశించవచ్చు. మూడు దశలుగా (ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్) ఉండే ఈ కోర్సు పూర్తిచేసిన వారికి కలర్‌ఫుల్ కెరీర్ ఆప్షన్లు ఖాయం. ప్రొడక్షన్‌కే పరిమితం కాదు గతంలో కాస్ట్ అకౌంటెంట్లకు ఉత్పత్తి సంస్థల్లో మాత్రమే అవకాశాలు లభిస్తాయనే అభిప్రాయం ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, టెలికం, సాఫ్ట్వేర్, బీపీవో ఇలా ప్రతి రంగంలోనూ వీరికి అవకాశాలు లభిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం, ఈ కోర్సు పూర్తిచేసిన వారికి.. తక్కువ ఖర్చుతో సంస్థ కార్యకలాపాలను నిర్వహించే నైపుణ్యాలుంటాయని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తుండటమే. దీంతో ఆయా సంస్థలన్నీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహించి, కొలువులను అందిస్తున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సు పూర్తిచేసి సభ్యత్వాన్ని సొంతం చేసుకున్న వారికి అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. అదే విధంగా వీరికి యూకేకు చెందిన కాస్ట్ అకౌంటింగ్ ఇన్స్టిట్యూట్లు సీఐఎంఏ, ఏసీసీఏలు నిర్వహించే పరీక్షల్లో కొన్ని పేపర్లకు మినహాయింపు ఇస్తున్నాయి. వీటిని పూర్తిచేస్తే కామన్వెల్త్ దేశాలన్నింటిలోనూ ఉద్యోగాలు చేసే అవకాశం లభిస్తుంది. ఫస్ట్ అటెంప్ట్‌లోనే.. సీఎంఏ కోర్సు (మూడు దశలు)ను తొలి ప్రయత్నంలోనే పూర్తిచేయడం కష్టమనే అభిప్రాయం సరికాదు. ప్రాక్టికల్ అప్రోచ్, అనలిటికల్ థింకింగ్‌తో అంశాలను అధ్యయనం చేస్తే అన్ని దశలనూ తొలి ప్రయత్నంలోనే పూర్తి చేయొచ్చు. ‘ఫౌండేషన్’ నుంచే పునాదులు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సులో ఫౌండేషన్ స్థాయిలోనే ప్రవేశిస్తే విద్యార్థుల్లో బలమైన పునాది ఏర్పడుతుందని నేను భావిస్తాను. ఇంటర్/10+2 అర్హతతో ఫౌండేషన్ కోర్సు పరీక్షలు పూర్తిచేస్తే ఇంటర్మీడియెట్‌లో ప్రవేశం లభిస్తుంది. దీంతో పాటు డెరైక్ట్ ఎంట్రీ స్కీం కింద బ్యాచిలర్ డిగ్రీ విద్యార్థులు నేరుగా ఇంటర్మీడియెట్ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చు. కానీ, ఈ రంగంపై నిజమైన ఆసక్తి ఉన్న వారు ఫౌండేషన్ నుంచే ఈ దిశగా అడుగులు వేయడం ప్రయోజనకరం. ఏటా రెండు సార్లు (జూన్, డిసెంబర్) నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షలకు జూలై 31, జనవరి 31లోపు; నాలుగు సార్లు (మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్) నిర్వహించే ఫౌండేషన్ పరీక్షలకు వరుసగా అక్టోబర్ 31, జనవరి 31, ఏప్రిల్ 30, జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబినార్స్, ఆన్లైన్ లెక్చర్స్ సీఎంఏ కోర్సు రెగ్యులర్ కోచింగ్ తీసుకోలేని విద్యార్థులకు వెబినార్స్ ద్వారా ఆన్లైన్ లెక్చర్స్, అదే విధంగా ఆన్లైన్ ఇంటరాక్టివ్ సెషన్స్ అందుబాటులోకి తెచ్చాం. ముఖ్యంగా కామర్స్ సంబంధిత ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు నా పరంగా ఇచ్చే సలహా... ఒక సమస్యకు సంబంధించి ఎలా? అనే దృక్పథం నుంచి ఎందుకు? అనే దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఎందుకు? అనే ప్రశ్న తలెత్తినప్పుడే మనలో ఆ సమస్యను పరిష్కరించాలనే ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రమంలో అనేక నైపుణ్యాలను అలవడుతాయి. అభ్యర్థులు ప్రారంభం నుంచే చదవడం, వ్యక్తీకరించడం, ప్రణాళిక- అమలు .. వంటి అంశాలను ఆచరణలో పెడితే విజయవంతంగా కోర్సును పూర్తి చేసుకొని కలర్‌ఫుల్ కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. -
సిమెంట్ కు సహజ వనరుల కొరత!
♦ ప్రస్తుతమున్న బొగ్గు, సున్నపురాయి నిల్వలు 30 ఏళ్ల వరకే ♦ ఆ తర్వాత పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకం; ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలని సూచన ♦ సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) అధ్యక్షులు డాక్టర్ శైలేంద్ర చౌక్సీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘సిమెంట్ ఉత్పత్తికి ప్రధాన వనరులు బొగ్గు, సున్నపురాయి వంటి సహజ వనరులే. కానీ, మన దేశంలో వీటి లభ్యత రోజురోజుకూ తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది కూడా. ప్రస్తుతం దేశంలో ఉన్న సహజ వనరులు మరో 30 ఏళ్ల వరకు మాత్రమే ఈ పరిశ్రమకు సరిపోతాయి. మరి ఆ తర్వాత పరిస్థితేంటి? అంటే ఏ ఒక్కరి దగ్గరా సమాధానం లేదని’’ సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) అధ్యక్షులు డాక్టర్ శైలేంద్ర చౌక్సీ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సిమెంట్ పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకమని చెప్పుకొచ్చారు. అందుకే సిమెంట్ ఉత్పత్తిలో ప్రారంభ స్థాయి నుంచే ఆధునిక సాంకేతికత వినియోగించడంతో పాటూ సాధ్యమైనంత వరకూ ముడి పదార్థాలు, వ్యర్థాల పున ర్ వినియోగం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చౌక్సీ సూచించారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) సంయుక్త ఆధ్వర్యంలో ‘12వ గ్రీన్ సిమెంటెక్-2016’ రెండు రోజుల సదస్సు గురువారమిక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా శైలేంద్ర చౌక్సీ ఏమన్నారంటే.. ♦ రానున్న రోజుల్లో దేశంలో సిమెంట్ వినియోగ సగటు పెరగనుంది. స్మార్ట్ సిటీ లు, అందరికీ ఇళ్లు, మెరుగైన మౌలిక వసతుల కల్పన వంటి అనేక పథకాలే ఇందుకు కారణం. అయితే ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలు సిమెంట్ పరిశ్రమకు ప్రతిబంధకంగా ఉన్నాయి. ఈ విషయాన్ని సంబంధిత మంత్రిత్వ శాఖ దృష్టికీ తీసుకెళ్లాం. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. ♦ దేశంలో ఏటా 380 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి అవుతుంది. అయితే గత నాలుగే ళ్లుగా ఉత్పత్తి 2-4 శాతం తగ్గింది. గత రెండు దశాబ్ధాలుగా సిమెంట్ పరిశ్రమ వార్షిక వృద్ధి రేటు 8 శాతాని కంటే తక్కువకు పడిపోయింది. దేశ ఆర్థిక సంక్షోభం, ప్రపంచ మాంద్యం, గ్రామీణ ఆర్థిక ప్రతికూలతలు ఇందుకు కారణం. కానీ గత ఐదేళ్ల నుంచి ఎన్నడూ చూడని విధంగా గతేడాది మార్చి నెలలో 11 శాతం వృద్ధి కనిపించింది. ఈ ఏడాది మొత్తం మీద 6 శాతం వృద్ధి రేటుంటుందని అంచనా వేస్తున్నాం. ♦ సదస్సులో కేశోరాం ఇండస్ట్రీస్ (గ్రీన్కో ప్లాటినం), అల్ట్రాటెక్ సిమెంట్ లి. (గ్రీన్కో గోల్డ్)లకు గ్రీన్కో అవార్డులు, దాల్మియా సిమెంట్, ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అలైస్ లి., జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ లి., అల్ట్రాటెక్ ఎక్స్‌ట్రాలైట్ ఏఏసీ బ్లాక్స్లకు గ్రీన్‌ప్రో అవార్డులు అందించారు. అలాగే గ్రీన్ చాంపియన్స్ ఆఫ్ ఇండియన్ సిమెంట్ సెక్టార్, కాంపోసైట్ సిమెంట్ మార్చి 2016 పబ్లికేషన్స్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఏ సెక్రటరీ జనరల్ ఎన్ఏ విశ్వనాథన్, గ్రీన్‌సిమెంటెక్ చైర్మన్ జీ జయరామన్, కో-చైర్మన్లు కేఎన్ రావు, ఎల్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ఒకే రోడ్డు... 30 ఏళ్లు!
కాంక్రీట్ వైట్ టాపింగ్‌తో సాధ్యం ♦ భాగ్యనగరిలో తొలిసారిగా బంజారాహిల్స్‌లో... ♦ ముందుకొచ్చిన సిమెంట్ తయారీదారుల సంఘం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వర్షాకాలం వచ్చిందంటే చాలు. రోడ్లు పాడవటమే కాదు. ఎక్కడపడితే అక్కడ గుంతలూ తేలుతాయి. ఇంకేముంది!! కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్. ఇక హైదరాబాద్‌లో ఇరుకు రోడ్లతో జనం కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చంటోంది సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ). వైట్ టాపింగ్ టెక్నాలజీతో వేసిన కాంక్రీటు రోడ్లను దీనికి చక్కని పరిష్కారంగా చెబుతోంది. ఈ రోడ్ల జీవిత కాలం 25-30 ఏళ్ల వరకు ఉంటుంది. ఎలాంటి నిర్వహణ ఖర్చూ ఉండదు. మధ్యలో రోడ్డు దెబ్బతింటుందన్న సమస్యే లేదు. విమానాశ్రయాల్లో రన్ వే మాదిరి రోడ్లు అందంగానూ ఉంటాయి. సీఎంఏ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలిసారిగా బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో ఒక కిలోమీటరు మేర ప్రయోగాత్మకంగా వైట్ టాపింగ్ టెక్నాలజీతో కాంక్రీటు రోడ్డు నిర్మాణం బుధవారం ప్రారంభమైంది. తారు రోడ్డును కాంక్రీటు రోడ్డుగా మార్పే ఈ వైట్ టాపింగ్. కోట్లాది రూపాయలు ఆదా...: ఒక చదరపు మీటరుకు తారు రోడ్డుకు సుమారు రూ.1,250 వ్యయం అవుతుంది. రోడ్ల జీవిత కాలం 3-4 ఏళ్లు మాత్రమే. పైగా నిర్వహణ ఖర్చులు ఏడాదికి ఒక కిలోమీటరుకు రూ.3.5 లక్షలకుపైమాటేనని అంచనా. అయితే వైట్ టాపింగ్ కాంక్రీట్ రోడ్డుకు చదరపు మీటరుకు రూ.1,400-1,500 అవుతుంది. నిర్వహణ ఖర్చులు ఉండవు. కేబుల్స్ వేయడానికి మధ్యలో రోడ్డును తవ్వాల్సిన అవసరమే లేదని భారతి సిమెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ ఎం.రవీందర్ రెడ్డి తెలిపారు. నిర్మాణ సమయంలోనే ప్రత్యేక డక్ట్ ఏర్పాటు చేస్తారన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ వి.కిషన్‌రావు, టెక్నికల్ హెడ్స్ మన్మోహన్ ఆర్ కలగల్, రామచంద్ర, జి.శ్రీనివాస, మై హోం సిమెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీజే మథాయ్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. వైట్ టాపింగ్ రోడ్లకు పూర్తిగా దేశీయంగా తయారైన సిమెంటు వాడొచ్చని, తద్వారా కోట్ల రూపాయల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయొచ్చని చెప్పారు. మనం ఉపయోగిస్తున్న తారులో 70 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదేనని వారు గుర్తు చేశారు. తెలంగాణ సీఎం చొరవతో...: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చొరవతో సిమెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) బంజారాహిల్స్‌లో ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇప్పటికే సీఎంఏ బెంగళూరు, జైపూర్, చెన్నైలో ఇటువంటి డెమో ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. భారతి, మహా, సాగర్, అల్ట్రాటెక్‌సహా17 సిమెంటు కంపెనీలు హైదరాబాద్ ప్రాజెక్టుకయ్యే రూ.2.2 కోట్లను భరిస్తున్నాయి. ఎం-40 పేవ్మెంట్ క్వాలిటీ కాంక్రీటును వాడుతున్నారు. కాంక్రీట్ రోడ్డు ప్రయోజనాలు.. ►ఒక కిలోమీటరు మేర రోడ్డు నిర్మాణాన్ని 8 రోజుల్లో పూర్తి చేయొచ్చు. ►ఇప్పటికే ఉన్న రోడ్డును పూర్తిగా తవ్వాల్సిన అవసరం లేదు. తారును తొలగించి నాణ్యమైన పోర్ట్‌ల్యాండ్ సిమెంటుతో కాంక్రీటు వేస్తారు. లేబర్ పెద్దగా అవసరం లేకుండా ఆధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు. ►తారు రోడ్డుతో పోలిస్తే కాంక్రీటు రోడ్ల నుంచి వెలువడే వేడి చాలా తక్కువ. చుట్టుపక్కల ఉన్న ఇల్లు, కార్యాలయాల్లో ఏసీలపై భారం తగ్గుతుంది. ►తారు రోడ్డు నలుపుగా ఉండడంతో ఇరువైపులా ఎక్కువ లైట్లను, అధిక కాంతిని వాడాల్సి వస్తుంది. ఈ రోడ్లకైతే ఆ స్థాయిలో లైట్లు అవసరం లేదు. 50% విద్యుత్ ఆదా. ►వాహనాలు పటుత్వం కోల్పోకుండా గ్రిప్ ఉండేలా రోడ్డుపై చారలుగా పూత ఉంటుంది. పర్యావరణానికి అనువైంది ►మొత్తంగా కుదుపులు, గుంతలు లేని రోడ్లుంటే వాహనాల నిర్వహణ ఖర్చులు చాలా తగ్గుతాయి. -
సీఎంఏలో గుంటూరు విద్యార్థిని ప్రతిభ
గుంటూరు: సీఏ కోర్సుల ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని ముళ్లపూడి దీప్తి ఉత్తమ ప్రతిభ కనబరుస్తోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ప్రకటించిన సీఎంఏ ఫైనల్ ఫలితాల్లో బాలికల విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. సీఏ ప్రవేశ పరీక్ష అయిన సీఏ-సీపీటీలో జాతీయస్థాయిలో 9వ ర్యాంకు, ఐసీడబ్ల్యుఏ ఇంటర్లో 10వ ర్యాంకు కైవసం చేసుకుంది. సీఎంఏ ఫైనల్ గ్రూప్-3తోపాటు, ఫైనాన్షియల్ ఎనాలసిస్-బిజినెస్ వాల్యూయేషన్ పేపర్లో మహిళా విభాగంలో అత్యధిక మార్కులు సాధించి, సీఎంఏ ఫైనల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కోల్‌కత్తాలోని ఐసీఏఐ సంస్థ మార్చి 20న జరగనున్న సీఏ విద్యార్థుల కాన్వొకేషన్లో దీప్తికి రజత పతకంతో పాటు, డాక్టర్ అజిత్ సింఘ్వయ్ బంగారు పతకం, నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ మెరిట్ అవార్డు బుక్ ప్రైజ్ బహుకరించనుంది. -
సీఏ, సీఎస్, సీఎంఏ.. ప్రాక్టికల్ ట్రైనింగ్.. పరిపూర్ణతకు మార్గం
చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ); కంపెనీ సెక్రటరీ (సీఎస్); కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్ (సీఎంఏ).. కామర్స్ రంగంలో దశాబ్దాలుగా ఆదరణ పొందుతున్న ప్రొఫెషనల్ కోర్సులు. నేటి పారిశ్రామికీకరణ, గ్లోబలైజేషన్ యుగంలో వీటికి మరింత డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు వీటి విషయంలో ఎదురవుతున్న సమస్య... నైపుణ్య లేమి. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన నియంత్రణ సంస్థలు ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు ప్రాధాన్యమిచ్చాయి. మరే ఇతర కోర్సుల్లో లేని విధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను తప్పనిసరి చేశాయి. క్షేత్ర నైపుణ్యాలు పెంపొందించుకోవడం కరిక్యులంలో భాగం చేశాయి. ఈ నేపథ్యంలో సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల ప్రాక్టికల్ ట్రైనింగ్‌పై ఫోకస్.. సీఏ.. ఆర్టికల్‌షిప్‌కు అత్యంత ప్రాధాన్యం చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సులో ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను ఆర్టికల్షిప్గా పేర్కొంటున్నారు. కోర్సు నియంత్రణ సంస్థ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్‌డ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆర్టికల్‌షిప్‌నకు అత్యంత ప్రాధాన్యమిస్తూ నిబంధనలు అమలు చేస్తోంది. మూడేళ్ల ఆర్టికల్‌షిప్ పూర్తి చేసినవారిని మాత్రమే కోర్సు ఫైనల్ పరీక్షల్లో హాజరుకు అనుమతిస్తోంది. సీఏ విద్యార్థులు కోర్సు రెండో దశ ఐపీసీసీలో పేరు నమోదు చేసుకున్నప్పటి నుంచే గుర్తింపు పొందిన ఆడిటర్ లేదా ఆడిట్ సంస్థ వద్ద ఆర్టికల్ ట్రైనింగ్‌లో అడుగుపెట్టాలి. విద్యార్థులు తాము థియరిటికల్‌గా చదువుతున్న అంశాలను అప్పటికప్పుడు ప్రాక్టికల్‌గా అన్వయించే నైపుణ్యాలు సొంతం చేసుకునేలా చేయడమే ఈ నిబంధన ప్రధాన ఉద్దేశం. ఫలితంగా ఫైనల్ సర్టిఫికెట్ చేతికందేనాటికి విద్యార్థికి ఒక పూర్తిస్థాయి సీఏకు అవసరమైన అన్ని నైపుణ్యాలు లభిస్తాయి. ఆర్టికల్‌షిప్ సమయంలో ట్రైనీకి నిర్ణీత మొత్తంలో స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. అదే విధంగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా సెలవులు ఇవ్వాలని కూడా ఐసీఏఐ స్పష్టం చేసింది. సమస్యలివే ట్రైనీలు తమ ఆర్టికల్‌షిప్ సమయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తమను సదరు సంస్థ లేదా సర్టిఫైడ్ ఆడిటర్ అన్ని విభాగాల్లో పాల్పంచుకోనీయడం లేదని, దీనివల్ల అన్ని అంశాలపై అవగాహన లభించట్లేదని ట్రైనీలు అంటున్నారు. అంతేకాకుండా సీఏ పరీక్షల ప్రిపరేషన్ కోణంలో ఐసీఏఐ నిర్దేశించిన విధంగా సెలవుల మంజూరు కూడా ఉండట్లేదని చెబుతున్నారు. దీనికి ప్రిన్సిపల్ ఆడిటర్స్ స్పందిస్తున్న తీరు భిన్నంగా ఉంటోంది. ఆర్టికల్ ట్రైనీలు ఒక సంస్థలోని అన్ని కార్యకలాపాల్లో పాల్పంచుకోవాలనే విషయంలో ఆ సంస్థ లేదా ఆడిటర్ దృక్పథం ప్రధాన పాత్ర పోషిస్తుందంటున్నారు. క్లయింట్లు ఎక్కువగా ఉన్న సంస్థలో ఆడిటర్ తమ క్లయింట్లకు త్వరగా సేవలందించాలనే లక్ష్యంగా ఉంటారు. ఇలాంటి సంస్థల్లో ఆర్టికల్ ట్రైనీలకు అన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎక్కువ సమయం కేటాయించే పరిస్థితి ఉండదు. కాబట్టి అభ్యర్థులే సహజ చొరవతో పరిశీలన నైపుణ్యాలను పెంచుకుని సంస్థలో జరుగుతున్న కార్యకలాపాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. సెలవుల మంజూరు కూడా సంస్థ లేదా ఆడిటర్పైనే ఆధార పడి ఉంటుంది. ‘చిన్న సంస్థల్లో సిబ్బంది తక్కువగా ఉంటారు. అలాంటి వారు విధుల పరంగా ఆర్టికల్ ట్రైనీలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతోవారికి సెలవులు మంజూరు చేయడంలో కొంత సమస్య ఎదురవుతోంది’ అంటున్నారు హైదరాబాద్‌లోని ప్రముఖ ఆడిట్ సంస్థ నిర్వాహకులు. ఆర్టికల్షిప్తోపాటు అదనంగా.. నిర్దేశించిన ఆర్టికల్‌షిప్ పూర్తయిన తర్వాత మూడు నెలలపాటు జనరల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్(జీఎంటీ) కూడా చేయాలి. అకౌంటింగ్ నైపుణ్యాలతోపాటు నిర్వహణ పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఐసీఏఐ ఈ జీఎంటీకి రూపకల్పన చేసింది. కానీ.. చాలామంది విద్యార్థులు సిలబస్ విస్తృతంగా ఉండే సీఏ కోర్సు పరీక్షలో ఉత్తీర్ణతకే ప్రాధాన్యమిస్తున్నారు. థియరిటికల్ ప్రిపరేషన్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తూ డమ్మీ ఆర్టికల్స్‌ను అన్వేషిస్తున్నారనే అభిప్రాయముంది. తప్పనిసరిగా ప్రత్యక్షంగా ఆర్టికల్‌షిప్ పూర్తి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్టికల్స్, థియరీ రెండింటికీ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగితే ప్రాక్టికల్ నైపుణ్యాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. ఆర్టికల్‌షిప్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారం కోసం ఐసీఏఐను సంప్రదించవచ్చు. సీఎంఏలోనూ మూడున్నరేళ్లు.. కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ).. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే కోర్సు. మారిన నిబంధనలతో సర్వీసెస్ నుంచి సాఫ్ట్వేర్ వరకు అన్ని రంగాల్లోనూ ఇప్పుడు కాస్ట్ అకౌంటెంట్ల అవసరం ఏర్పడింది. ప్రధానంగా ఉత్పత్తి సంస్థల్లో కాస్ట్ అకౌంటెంట్ల డిమాండ్ ఎక్కువ. సీఏంఏ కోర్సు నిర్వహణ సంస్థ ఐసీఎంఏఐ విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలకు పెద్దపీట వేస్తోంది. సీఏ మాదిరిగానే మూడున్నరేళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను తప్పనిసరి చేసింది. అయితే సీఎంఏ కోర్సు విషయంలో విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా కొంత వెసులుబాటు ఉంది. సీఏలో మాదిరిగా మూడేళ్లు ఆర్టికల్ చేస్తేనే ఫైనల్ పరీక్షకు అర్హత అనే నిబంధన సీఎంఏలో లేదు. కోర్సు రెండోదశగా పేర్కొనే ఇంటర్మీడియెట్ తర్వాత ఆరు నెలలు తొలి దశ ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకుంటే.. ఫైనల్ పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి లభిస్తుంది. తర్వాత ఫైనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక తప్పనిసరిగా మూడేళ్లపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి. అప్పుడే సంస్థ నుంచి స్టూడెంట్‌షిప్ లభిస్తుంది. అంతేకాకుండా సీఎంఏ విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు సీఏతో పోల్చితే ఎక్కువ మార్గాలు ఉన్నాయనేది నిపుణుల అభిప్రాయం. కేవలం ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ల వద్దే కాకుండా సంస్థల్లోనూ ప్రాక్టికల్ శిక్షణ పూర్తి చేసుకునే వీలుంది. సీఎంఏ ప్రాక్టికల్ ట్రైనింగ్ విషయంలో విద్యార్థులు పేర్కొంటున్న సమస్యలు.. అన్ని విభాగాలపై అవగాహన కల్పించకపోవడం, పరీక్షలకు సెలవులు ఇవ్వకపోవడం. అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థ ఏదో ఒక విభాగంలో వారిని నియమిస్తోంది. దాంతో అన్ని అంశాలపై అవగాహన లభించడం లేదు. విద్యార్థులు చొరవగా ఆయా విభాగాల్లోని వారితో మాట్లాడం ద్వారా అక్కడి పనితీరును తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సీఎస్.. ట్రైనింగ్ తప్పనిసరి.. కానీ.. కంపెనీ సెక్రటరీ కోర్సు... ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా మూడు దశలుగా నిర్వహించే ఈ కోర్సులోనూ ప్రాక్టికల్ ట్రైనింగ్ తప్పనిసరి. ప్రస్తుతం ఫౌండేషన్ కోర్సు, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ అనే మూడు దశలుగా సీఎస్ కోర్సు స్వరూపం ఉంది. తాజా నిబంధనల ప్రకారం- ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా ఫౌండేషన్ కోర్సు నుంచే దీన్ని ప్రారంభించొచ్చు. ఫౌండేషన్ కోర్సు నుంచి మూడేళ్లు; ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ తర్వాత రెండేళ్లు; ప్రొఫెషనల్ కోర్సు తర్వాత ఒక ఏడాది ప్రాక్టికల్ ట్రైనింగ్ (అప్రెంటీస్‌షిప్) పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ తాజా మార్పు విషయంలోనే ఈ రంగంలోని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎస్ తుది దశ అయిన ప్రొఫెషనల్ కోర్సు తర్వాత ఏడాది వ్యవధిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేస్తే చాలు అనే వెసులుబాటు కారణంగా.. అత్యధిక శాతం మంది అభ్యర్థులు ప్రాక్టికల్స్‌కు అత్యల్ప ప్రాధాన్యమిస్తారని అంటున్నారు. ముందుగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా వ్యవహరిస్తారని పర్యవసానంగా క్షేత్ర నైపుణ్యాలు కొరవడతాయని చెబుతున్నారు. ఇది భవిష్యత్ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఔత్సాహికులు వెసులుబాట్లు గురించి అన్వేషించకుండా.. క్షేత్ర నైపుణ్యాలు పెంచుకునే విధంగా వీలైనంత ఎక్కువ సమయం ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు కేటాయించాలి. అప్పుడే తాము అకడమిక్‌గా చదువుకున్న అంశాలకు సంబంధించి రియల్‌టైం అప్లికేషన్స్‌పై అవగాహన ఏర్పడుతుంది. కంపెనీల చట్టం, ఇతర న్యాయ పరమైన సబ్జెక్ట్‌ల ప్రాధాన్యం ఎక్కువగా ఉండే సీఎస్‌లో పరిపూర్ణత లభించాలంటే ప్రాక్టికల్ అప్రోచ్‌కు పెద్దపీట వేయాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టికల్ ట్రైనింగ్ (అప్రెంటీస్‌షిప్) విషయంలో వ్యక్తిగతంగానైనా చొరవ చూపి ముందుకు సాగాలి. అప్పుడే కోర్సులో చేరిన లక్ష్యం నెరవేరడంతోపాటు సుస్థిర భవిష్యత్తు సొంతమవుతుంది. ప్రొఫెషనల్‌గా రూపొందాలంటే.. ప్రాక్టికల్ నాలెడ్జ్, స్కిల్ సెట్ల అవసరం సీఏ, సీఎంఏ, సీఎస్ కెరీర్‌కు చాలా ఎక్కువ. కారణం.. తాము చదివిన అంశాలను తక్షణమే అన్వయించాల్సిన విధంగా విధులు ఉంటాయి. దాంతో ఈ రంగంలో మంచి ప్రొఫెషనల్‌గా పేరు గడించాలంటే తప్పనిసరిగా ప్రాక్టికల్ అప్రోచ్ పెంపొందించుకోవాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత గురించి ఆందోళన చెందకుండా అకడమిక్ సిలబస్ ప్రిపరేషన్ సాగిస్తూనే ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో వాటిని అన్వయించే నైపుణ్యాలు పెంచుకుంటే సర్టిఫికెట్ సొంతం చేసుకోవడం ఎంతో సులభం. చేయూతనిస్తున్న ఇన్స్టిట్యూట్లు.. సీఏ, సీఎస్, సీఎంఏ కోర్సుల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పరంగా విద్యార్థులకు సదరు నిర్వహణ ఇన్స్టిట్యూట్లు చేయూతనిస్తున్నాయి. ట్రైనింగ్ మార్గాలు అన్వేషిస్తున్న అభ్యర్థులకు సహకరిస్తున్నాయి. ఆయా ఇన్స్టిట్యూట్ల చాప్టర్లను సంప్రదిస్తే ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు అవకాశం కల్పిస్తున్న సంస్థలు, ప్రాక్టీసింగ్ ఆడిటర్స్/సెక్రటరీస్ సమాచారం తెలియజేస్తున్నాయి. పోస్టల్ కోచింగ్ ద్వారా కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు; నాన్-మెట్రోస్లోని విద్యార్థులకు ఈ సదుపాయం ఎంతో మేలు చేస్తోంది. ప్రాక్టికల్ థింకింగ్ ఉంటేనే... సీఏ కెరీర్లో అడుగుపెట్టే విద్యార్థులు ముందుగా తమలో ప్రాక్టికల్ థింకింగ్ లెవెల్స్‌పై స్పష్టతకు రావాలి. ఎందుకంటే.. సీఏ కోర్సులో ప్రాక్టికాలిటీ ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ రంగంలోని సీనియర్లను, సంస్థలను, ప్రాక్టీసింగ్ సీఏలను సంప్రదించి తమ అవగాహన స్థాయి తెలుసుకోవాలి. ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఆర్టికల్ షిప్) విషయానికొస్తే.. పకడ్బందీ అన్వేషణ సాగించాలి. సదరు సంస్థ లేదా ఆడిటర్‌కు ఉన్న గుర్తింపు, క్లయింట్ల సంఖ్య-స్థాయి ఆధారంగా ఆర్టికల్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఆర్టికల్‌షిప్ సమయంలో సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకునే కోణంలో కృషి చేస్తే పరిపూర్ణ అవగాహన లభిస్తుంది. ‘పరీక్షలో ఉత్తీర్ణతకే ప్రాధాన్యమిద్దాం. తర్వాత విధుల్లో చేరి ప్రాక్టికల్ నాలెడ్జ్ సొంతం చేసుకోవచ్చు’ అనే ఆలోచన సరికాదు. - ఎం.దేవరాజ రెడ్డి, చైర్మన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్,ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సీఎంఏ.. క్షేత్ర నైపుణ్యాలు ఎంతో ముఖ్యం సీఎంఏ కోర్సు విషయంలో క్షేత్ర నైపుణ్యాలు ఎంతో ముఖ్యం. అందుకే మూడున్నరేళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను తప్పనిసరి చేశాం. ఇదే సమయంలో విద్యార్థుల కోణంలోనూ ఆలోచించి వెసులుబాటు కల్పించాం. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. వీలైనంత వరకు ఫైనల్ పరీక్ష నాటికి అధిక శాతం ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను పూర్తి చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ సమయంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాటు చేశాం. కాబట్టి ఒకటిరెండు సంఘటనలు చూసి ఆందోళన చెందకుండా.. నైపుణ్యాలు పెంచుకునేందుకు కృషి చేయాలి. - ఎ.ఎస్. దుర్గా ప్రసాద్, చైర్మన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిరంతర అవగాహనతోనే సీఎస్‌లో రాణింపు సీఎస్ కోర్సులో రాణించాలంటే నిరంతర అవగాహనే ప్రధానం. ఇందుకు సాధనం ప్రాక్టికల్ ట్రైనింగ్(అప్రెంటీస్‌షిప్). దీని విషయంలో ప్రస్తుతం పలు వెసులుబాట్లు ఉన్నాయి. ఔత్సాహిక విద్యార్థులు వాటి గురించి పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే విధంగా అడుగులు వేయాలి. ముఖ్యంగా లీగల్ నాలెడ్జ్ ఆవశ్యకత ఎక్కువగా ఉండే సీఎస్ కోర్సులో రియల్‌టైం ఎక్స్పోజర్ ఎంతో అవసరం. దీన్ని గుర్తించి ఎగ్జిక్యూటివ్ దశ నుంచే ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రారంభించడం మంచిది. - డి. వాసుదేవరావు, చైర్మన్, ఐసీఎస్ఐ-హైదరాబాద్ చాప్టర్ ఎడ్యూ ఇన్ఫో విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ఏఐసీటీఈ చర్యలు భారతదేశంలోని ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్‌లో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను పెంచే దిశగా ఏఐసీటీఈ చర్యలు తీసుకుంటోంది. ఉన్నత విద్యను అంతర్జాతీయీకరణ చేయాలనే ఉద్దేశంతోపాటు, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇన్స్టిట్యూట్లలో సాంస్కృతిక వైవిధ్యం కూడా పెరుగుతుందని, ఫలితంగా మన విద్యార్థులు భవిష్యత్తులో విదేశాల్లోనూ రాణించేందుకు ఆస్కారం లభిస్తుందని ఏఐసీటీఈ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో చదవాలనుకుంటున్న ఔత్సాహిక విదేశీ విద్యార్థుల కోసం అమెరికాలో నిర్వహిస్తున్న స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ మాదిరిగా ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేసే దిశగా ఏఐసీటీఈ వేగంగా అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి భారత్‌కు ఉన్నత విద్య కోసం వస్తున్న విద్యార్థుల సంఖ్య 2013 నాటికి 1.3 లక్షలు ఉండగా ప్రతి ఏటా వస్తున్న సంఖ్యను పరిగణిస్తే అది 15 శాతంలోపే ఉంటోంది. తాజాగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.