కోవిడ్ పరిణామాల నేపథ్యంలో కంపెనీలు తమ వ్యాపార ప్రణాళికలు సజావుగా నిర్వహించుకునేందుకు మరింతగా తోడ్పడటంపై సీఎంఏ కసరత్తు చేస్తోంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సుల్లో మార్పులపైనా దృష్టి పెడుతోంది. దివాలా కోడ్ వంటివి అమల్లోకి రావడంతో కాస్ట్ అకౌంటెంట్లు కొంగొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ పి. రాజు అయ్యర్ ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఈ అంశాలు వెల్లడించారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..
కోవిడ్ నేపథ్యంలో ఐసీఏఐ తీసుకున్న చర్యలు..
అనేక సంవత్సరాలుగా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ (సీఎంఏ) పాత్ర అనేక మార్పులకు లోనైంది. తాజాగా కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో కార్పొరేట్ గవర్నెన్స్ కోణంలో కోవిడ్–19 అనంతరం బోర్డు రిపోర్టింగ్ విధానాలు, వ్యాపారాల కొనసాగింపు ప్రణాళికలకు సంబంధించిన టెక్నికల్ గైడ్ పేరిట రెండు ముఖ్యమైన పత్రాలను ఇనిస్టిట్యూట్ రూపొందించింది. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో బోర్డు స్థాయి సమీక్షలు, అలాగే లాక్‌డౌన్‌ల తర్వాత వ్యాపారాన్ని కొనసాగించే ప్రణాళికల అమలు సజావుగా జరిగేందుకు తోడ్పడాలన్నది వీటి ఉద్దేశ్యం. అలాగే, వివిధ కార్యకలాపాలను సక్రమంగా, సకాలంలో మదింపు చేయడంలో కంపెనీలకు సహాయకారిగా ఉండేలా యాక్టివిటీ ఆధారిత పెర్ఫార్మెన్స్ కాస్టింగ్ విధానాన్ని కూడా మేము రూపొందించాం. ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను తగిన విధంగా రూపొందించడం, ధరల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, లాభదాయకమైన/నష్టదాయకమైన ఉత్పత్తులు/కార్యకలాపాలను గుర్తించడం మొదలైన వాటికి ఇది ఉపయోగపడగలదు. అలాగే, వ్యాపార ప్రణాళికలను, బడ్జెటింగ్‌ను, వనరుల కేటాయింపు .. వినియోగాన్ని మెరుగుపర్చుకునేందుకు తోడ్పడగలదు.
దివాలా కోడ్‌పై ..
దేశీయంగా అమలు చేసిన అత్యంక కీలకమైన ఆర్థిక సంస్కరణల్లో ఐబీసీ కూడా ఒకటి. నిర్దిష్ట కాల వ్యవధిలో ఒకవైపు వాటాదారులందరి ప్రయోజనాలనూ పరిరక్షిస్తూనే మరోవైపు సంక్షోభంలో చిక్కుకున్న సంస్థలను గట్టెక్కించడంలో సమతౌల్యత పాటించేందుకు ఇది తోడ్పడుతుంది. రుణ సంస్కృతి మెరుగుపర్చడం, మొండిపద్దుల నుంచి ఎంతో కొంత రాబట్టడం, రుణదాతలు.. రుణగ్రహీతల మధ్య సమీకరణలు తదితర అంశాల్లో గడిచిన అయిదేళ్లలో ఐబీసీ గణనీయమైన మార్పు తెచ్చిం ది. ప్రస్తుతానికైతే ఈ చట్టం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఎంతో కీలకమైన చట్టం ప్రభావాలను అంచనా వేయడానికి అయిదేళ్ల వ్యవధి అనేది చాలా స్వల్ప కాలం. నిర్దేశిత లక్ష్యాల సాధనకు తోడ్పడేలా ఐబీసీలోని పలు నిబంధనలకు ఎప్పటికప్పుడు తగు విధంగా సవరణలు చేస్తున్నారు. ఐబీసీ విజయవంతంగానే అమలవుతోంది. అయితే, ఇప్పటికీ వ్యక్తిగత దివాలా, సీమాంతర దివాలా, గ్రూప్ దివాలా వంటి వాటికి సంబంధించిన నిబంధనలను ఇంకా నోటిఫై / అమలు చేయాల్సి ఉంది.
ఐబీసీలో సీఎంఏల పాత్ర.. జీఎస్‌టీ అమలు..
చాలా మంది సీఎంఏలు ప్రస్తుతం దివాలా ప్రక్రియకు సంబంధించి ప్రొఫెషనల్స్‌గా మారారు. తరచుగా ఐబీసీ కింద పలు కేసులు చూస్తున్నారు. తాత్కాలిక పరిష్కార నిపుణులుగా, పరిష్కార నిపుణులుగా సీఎంఏలు .. ఫోరెన్సిక్ ఆడిట్, పరిష్కార ప్రణాళిక రూపకల్పన మొదలైన వాటిలో సహాయకరంగా ఉంటున్నారు. ఇక జీఎస్‌టీ విషయానికి వస్తే, వివిధ రాష్ట్రాల్లో వివిధ సిద్ధాంతాల ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో దీని అమల్లో సాంకేతికంగానే కాకుండా ఇతరత్రా సవాళ్లు కూడా ఎదురయ్యాయి. అయినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి ఆర్థిక మంత్రి, దివంగత అరుణ్ జైట్లీ.. సవాళ్లను అధిగమించి జీఎస్‌టీ దీర్ఘకాలికంగా జీఎస్‌టీ విజయవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు.
కాస్ట్ అకౌంటెంట్లకు కొత్త కెరియర్ అవకాశాలు
కంపెనీ నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ప్రభావితం చేసేలా కాలక్రమేణా ఫ్యాక్టరీల స్థాయి నుంచి బోర్డు రూమ్‌ల్లోకి సీఎంఏల పాత్ర విస్తరించింది. ట్యాక్సేషన్, కాస్ట్ ఆడిట్, కన్సల్టెన్సీ, కార్పొరేట్ చట్టాలు, ఆర్బిట్రేషన్, దివాలా పరిష్కార నిపుణులు, స్వతంత్ర డైరెక్టర్లు, బ్యాంకింగ్, బీమా తదితర విభాగాల్లో సీఎంఏలు అనేక మైలురాళ్లు అధిగమించారు. ప్రస్తుతం వ్యాపార సంస్థలు అనిశ్చితి, సంక్లిష్టత వంటి సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాటి మనుగడకు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ కీలకంగా మారింది. కంపెనీ సామర్థ్యాలను, ఉత్పాదకతను, ఫలితాలను మెరుగుపర్చుకునేందుకు మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ సహాయకరంగా ఉండగలదు. అన్ని ఆర్థిక కార్యకలాపాల్లోనూ సీఎంఏలు చోదకశక్తిగా ఉంటారు కాబట్టి ప్రభుత్వ.. ప్రైవేట్ రంగాలు, బహుళ జాతి సంస్థల్లో.. చైర్మన్, ఎండీ, డైరెక్టర్ ఫైనాన్స్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీస్, సీఈవో, జీఎం, ఫైనాన్స్ మేనేజర్ వంటి టాప్ మేనేజ్‌మెంట్ హోదాలను దక్కించుకోవడానికి అవకాశాలు మరింతగా పెరిగాయి.
అవసరాలకు తగ్గట్లుగా కోర్సులో మార్పుచేర్పులు
కొంగొత్త టెక్నాలజీల రాకతో వ్యాపార పరిస్థితులు అసాధారణంగా, శరవేగంగా మారిపోతున్నాయి. కొత్తగా ఎదురయ్యే ప్రతిబంధకాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారాల్సి రావడం వల్ల ప్రొఫెషనల్ అకౌంటెన్సీ సంస్థలపై తీవ్ర ఒత్తిడి ఉంటోంది. కొత్త లక్ష్యాలు, కొత్త సాధనాలు, కొత్త కోర్సులను రూపొందించాల్సి వస్తోంది. సీఎంఏ కోర్సు కోసం కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టడంపై కసరత్తు జరుగుతోంది. బిజినెస్ డేటా అనలిటిక్స్, బిజినెస్ కమ్యూనికేషన్ మొదలైనవి ప్రవేశపెట్టాము. ఇనిస్టిట్యూట్ తమ విద్యార్థుల కోసం ఎస్‌ఏపీ సర్టిఫికేషన్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సర్టిఫికేషన్, ఈ–ఫైలింగ్ వంటివి ప్రపంచ స్థాయి శిక్షణ సదుపాయాలు కల్పిస్తోంది. 15 నెలల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి చేశాం.
Comments
Please login to add a commentAdd a comment