ఏపీ విద్యార్థులకు లక్కీ చాన్స్‌.. పెద్ద ఉద్యోగం పక్కా | Reforms in education sector giving good results with AP govt | Sakshi
Sakshi News home page

ఏపీ విద్యార్థులకు లక్కీ చాన్స్‌.. పెద్ద ఉద్యోగం పక్కా

Published Fri, Feb 17 2023 3:34 AM | Last Updated on Fri, Feb 17 2023 7:30 AM

Reforms in education sector giving good results with AP govt - Sakshi

సాక్షి, అమరావతి: ఇటు ఉన్నత చదువు.. అటు ఉద్యోగం!.. ఒకేసారి రెండు లక్ష్యాలు నెరవేరే చాన్స్‌.. ప్రతిష్టాత్మక బిట్స్‌ పిలానీలో ఎంటెక్‌ అడ్మిషన్‌.. నెలనెలా స్టైపెండ్‌.. కనీసం రూ.5 లక్ష­లతో జాబ్‌.. ఇదంతా సాధారణ డిగ్రీతోనే సాకారం కానుంది. యువత నైపుణ్యాలను పెంపొందిస్తూ, ఉద్యో­గావకాశాలను మెరుగుపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి మంచి ఫలితాలు లభిస్తు­న్నాయి. విద్యార్థులు చదువులు పూర్తి చేసి బయ­టకు రాగానే అవకాశాలను అందిపుచ్చుకునేలా పలు ప్రముఖ సంస్థల ద్వారా శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుండడంతో రాష్ట్రంలో ఏటా ప్లేస్‌మెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, గూగుల్, బ్లూప్రిజమ్, ఏడబ్ల్యూఎస్‌ తదితర ప్రముఖ సంస్థలు మన విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు నైపుణ్యాలకు అనుగుణంగా ఉద్యోగావకాశాలూ కల్పిస్తున్నాయి. నేటి అవసరాలకు అనుగుణంగా కోర్సు­లను ప్రవేశపెట్టడంతోపాటు ఆయా సంస్థలు కోరుకునే నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఆంగ్ల భాషా ప్రావీణ్యం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో ప్రతిష్టాత్మక సంస్థలు మన విద్యార్ధులకు అవకాశాలు కల్పించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ ‘‘విప్రో’’ విద్యార్ధులకు ఉన్నత చదువుతోపాటు ఉద్యోగం కూడా ఇచ్చేలా ‘వర్క్‌ – ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌’ని రాష్ట్ర ప్రభుత్వంతో కలసి అమలు చేసేందుకు ముందుకొచ్చింది. 

బిట్స్‌ పిలానీలో ఎంటెక్‌.. ఆపై ఉద్యోగం
వర్క్‌ – ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అర్హులైన విద్యార్థులకు విప్రో సంస్థ ఫుల్‌ టైమ్‌ జాబ్, ఫుల్‌ స్పాన్సర్‌షిప్‌తో ‘బిట్స్‌ – పిలానీ’ (బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ)లో ఎంటెక్‌ కోర్సు చదివే అవకాశం కల్పిస్తోంది. 2021, 2022, 2023 బ్యాచ్‌లకు చెందిన గ్రాడ్యుయేట్‌ అభ్యర్ధులకు ఈ అవకాశం కల్పించనున్నారు. బీసీఏ, బీఎస్సీ గ్రాడ్యుయేట్లను అర్హులుగా పరిగణించనున్నారు.

కంప్యూటర్‌ సైన్సు, ఐటీ, మేథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఆయా కోర్సులు పూర్తిచేసిన వారు ఇందుకు అర్హులు. తప్పనిసరిగా 60 శాతం మార్కులు లేదా 6 సీజీపీఏ కలిగి ఉండాలి. బ్యాక్‌లాగ్‌తో ఒకసబ్జెక్టు వరకు అవకాశం కల్పిస్తారు. అయితే 6వ సెమిస్టర్‌ నాటికి అన్ని బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మూడేళ్ల కాలపరిమితిలో డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ అవకాశం కల్పించనున్నారు. 

నెలవారీ స్టైఫండ్‌.. రూ.5 లక్షల ప్యాకేజీతో జాబ్‌
వర్క్‌ – ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌కి ఎంపికైన వారికి ఎంటెక్‌ చేసే సమయంలో నెలవారీ స్టైఫండ్‌ను విప్రో సంస్థ అందించనుంది. స్టైఫండ్‌ కింద మొదటి ఏడాది నెలకు రూ.15,488 చొప్పున అందిస్తారు. రెండో ఏడాది నెలకు రూ.17,553 చొప్పున, మూడో ఏడాది రూ.19,618 చొప్పున ఇస్తారు. నాలుగో ఏడాది నెలకు రూ.23 వేలు చొప్పున చెల్లిస్తారు. కోర్సు పూర్తైన వెంటనే సంస్థలోనే ఉద్యోగాన్ని కల్పిస్తారు.

ఎంటెక్‌లో పెర్ఫార్మెన్స్‌ ఆధారంగా వేతనాన్ని నిర్ణయిస్తారు. వేతనాల ప్యాకేజీ ఏడాదికి రూ.5 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. శిక్షణ కాలం 60 నెలలు. ఎంటెక్‌ విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం జాయినింగ్‌ బోనస్‌ కింద రూ.76 వేలు చెల్లిస్తారు. అయితే ఎంపికైన అభ్యర్ధులు మధ్యలో నిష్క్రమించినా, అగ్రిమెంట్‌కు భిన్నంగా వ్యవహరించినా ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రూ.75 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 

దరఖాస్తుకు రేపే తుది గడువు
రాష్ట్రంలోని విద్యార్థుల కోసం మూడు నగరాల్లో ఎంపిక ప్రక్రియ చేపడతారు. అసెస్‌మెంటు, డిస్కషన్‌ల ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. విప్రో ద్వారా 8,000 మందిని ఎంపిక  చేస్తారు. దీనికి సంబంధించి వర్సిటీల రిజిస్ట్రార్లు, ప్రిన్సిపాళ్లపై ఇప్పటికే చర్చించారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 2021, 2022 బ్యాచ్‌ గ్రాడ్యుయేట్లకు ఫిబ్రవరి 23న గుంటూరులో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

ఉత్తరాంధ్ర అభ్యర్థులకు అసెస్‌మెంట్, బిజినెస్‌ రౌండ్‌లను విశాఖపట్నంలో ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో నిర్వహిస్తారు. రాయలసీమ విద్యార్ధులకు ఫిబ్రవరి 28న తిరుపతిలో ఎంపిక ప్రక్రియను చేపడతారు. 2023 బ్యాచ్‌ విద్యార్ధులకు అసెస్‌మెంట్, బిజినెస్‌ రౌండ్ల ఎంపిక ప్రక్రియ మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. తేదీలను తరువాత ప్రకటిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు https://bit.ly//apsche-wipro వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 18వ తేదీలోగా రిజిస్టర్‌ చేసుకోవాలి. 

నాస్కామ్, మైక్రోసాఫ్ట్‌తో ఇప్పటికే..
నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌ (నాస్కామ్‌) ద్వారా విద్యార్థులకు శిక్షణ కోర్సుల్లో రాష్ట్ర ప్రభుత్వం తర్ఫీదు అందిస్తోంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు నాస్కామ్‌లో సభ్యత్వం కలిగిన 3 వేలకు పైగా సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించేలా ఒప్పందం చేసుకుని అమల్లోకి తెచ్చింది.

మైక్రోసాఫ్ట్‌ ద్వారా వివిధ సర్టిఫికేషన్‌ కోర్సులను విద్యార్ధులకు ఉచితంగా అందిస్తుండడంతో అంతర్జాతీయ స్థాయి ఉద్యోగావకాశాలు మరింత సులభతరమయ్యాయి. మైక్రోసాఫ్ట్‌ ద్వారా శిక్షణకు ప్రభుత్వం రూ.32 కోట్లకు పైగా వెచ్చించింది. ఇక సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్, బ్లూప్రిజమ్, ఆల్టరీ ఎక్స్, ఫుల్‌స్టాక్‌ తదితర సంస్థల ద్వారా లక్షలాది మందికి శిక్షణ కార్యక్రమాలు అమలవుతున్నాయి.

‘ఉన్నత’ దృష్టి ఫలితమే..
పాఠశాల విద్యను బలోపేతం చేస్తూనే ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అత్యుత్తమ ఫలితాలు ఆవిష్కృతమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రొఫెసర్‌ బాలకృష్ణన్‌ నేతృత్వంలో నిపుణుల బృందాన్ని నియమించి ఆ నివేదిక ప్రకారం ఉన్నత విద్యలో పలు సంస్కరణలను ముఖ్యమంత్రి చేపట్టారు. ఉన్నత చదువులు అభ్యసించే వారికి జగనన్న విద్యాదీవెన కింద  పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు జగనన్న వసతి దీవెన కింద ఏటాదికి రూ.20 వేల వరకు అందిస్తున్నారు.

కరిక్యులమ్‌ను నేటి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేశారు. డిగ్రీ కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చి ఆనర్‌ కోర్సులకు శ్రీకారం చుట్టారు. ఇంజనీరింగ్‌తోపాటు డిగ్రీ విద్యార్ధులకు కూడా ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేశారు. ఇంటర్న్‌షిప్‌కోసం రాష్ట్రవ్యాప్తంగా 27,119 పరిశ్రమలు, ఇతర సంస్థలను కాలేజీలకు అనుసంధానించారు. దీనికోసం ప్రత్యేక పోర్టల్‌ తెచ్చారు.

ఇంటర్న్‌షిప్‌ సమయంలో పనితీరును అనుసరించి ఆయా సంస్థల్లోనే ఉద్యోగాలు దక్కుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలో విద్యార్ధులకు ప్లేస్‌మెంట్లు గతంలో కన్నా భారీగా పెరిగాయి. 2018–19లో 37 వేల ప్లేస్‌మెంట్లు మాత్రమే ఉండగా 2021–22 నాటికి 42 శాతం వృద్ధి సాధించి 85 వేలకు పెరిగాయి. 2022–23లో 1,20,000 ప్లేస్‌మెంట్లను సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement