కలల కొలువు సులువే | Andhra Pradesh Govt skill enhancement jobs with free online courses | Sakshi
Sakshi News home page

కలల కొలువు సులువే

Published Mon, Oct 3 2022 3:26 AM | Last Updated on Mon, Oct 3 2022 2:50 PM

Andhra Pradesh Govt skill enhancement jobs with free online courses - Sakshi

పోటీ ప్రపంచంలో ఇప్పుడంతా ఆన్‌లైన్‌ మయం. ఇందులో ముందుండాలంటే మిగిలిన వారితో పోలిస్తే భిన్న ప్రతిభా పాటవాలు అవసరం. తాము చదువుకున్న కోర్సుకు సంబంధించి అదనపు నైపుణ్యాలు ఉన్న వారికే కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. అలాంటి వారికే మంచి పే ప్యాకేజీలు అందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఉత్తమ విద్యకు, నైపుణ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేయడంతో పాటు జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న అంశాల్లో ప్రముఖ సంస్థల ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇప్పించేందుకు శ్రీకారం చుట్టింది.

సాక్షి, అమరావతి: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉన్నత విద్యనభ్యసించే ప్రతి విద్యార్థి నైపుణ్యాలతో ఆయా కోర్సులు పూర్తి చేసేలా ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది. ఇంతటితో ఆగకుండా వారు అత్యుత్తమ, కోరుకున్న ఉద్యోగాలు సాధించేందుకు ప్రముఖ సంస్థల ద్వారా ఆన్‌లైన్‌ శిక్షణ ఇప్పించేందుకు మరో అడుగు ముందుకు వేసింది.

రానున్న కాలం మొత్తం డిజిటల్‌గా మారుతున్న తరుణంలో ఆయా అంశాల్లో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దుతోంది. ఇంటర్న్‌షిప్‌లకు అదనంగా కంపెనీలు, వివిధ పరిశ్రమలకు అవసరమైన ఐటీ తదితర సాంకేతిక నైపుణ్యాలను కూడా విద్యార్థులకు అందించేలా కార్యాచరణ చేపట్టింది.

ఇందుకు అనుగుణంగా ప్రపంచంలోనే ప్రముఖ సంస్థలు అందిస్తున్న వివిధ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తోంది. ఈ కోర్సుల్లో ఆన్‌లైన్‌ శిక్షణ ఇప్పించేందుకు 2.15 లక్షల మందిని గుర్తించారు. అలా గుర్తించిన వారితో పాటు మరికొంత మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడంతో ఆ సంఖ్య 2,45,700కు చేరింది.

అయితే ఆయా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు తొలి విడతలో 1.25 లక్షల మందిని గుర్తించి శిక్షణను చేపట్టింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ సంస్థల ద్వారా ఆన్‌లైన్‌ రీస్కిల్లింగ్, సర్టిఫికేషన్‌ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తోంది.

ఐటీ తదితర విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం వల్ల వారికి మరింత మేలు చేకూరనుంది. మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, గూగుల్‌ వంటి సంస్థల నుంచి అందే ఈ సర్టిఫికేషన్‌ కోర్సులకు అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు ఉండడంతో విద్యార్థులు కోరుకున్న కొలువులను సులువుగా దక్కించుకోగలుగుతారు. 

ఇంటర్న్‌షిప్‌లకు పరిశ్రమలతో అనుసంధానం
ఓవైపు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. మరో వైపు రాష్ట్రంలోని అన్ని కళాశాలలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానించింది. విద్యార్థులు తమ కోర్సును బట్టి ఈ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ చేయడానికి అవకాశం కల్పించింది.

ఇందుకు ఉన్నత విద్యా మండలి ద్వారా ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయించింది. అంతేకాకుండా జిల్లాల్లో ఆయా సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా విభాగాల ముఖ్య కార్యదర్శులతో కమిటీలను ఏర్పాటు చేసింది.

ఇంటర్న్‌షిప్‌ కోసం రాష్ట్రంలోని మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమల వరకు ఉన్న వాటిని ఉన్నత విద్యా మండలి ఎంపిక చేసింది. ఇందులో తయారీ, సేవా రంగాల్లో శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచే వారికి ఆ కంపెనీలే ఉద్యోగాలు ఇచ్చేలా చూస్తోంది.

తయారీ సంస్థల్లో మైక్రో విభాగంలో 11,510, స్మాల్‌ 10,169, మీడియం 569, లార్జ్‌ 1,191, మెగా విభాగంలో 144 సంస్థలను గుర్తించారు. సేవల రంగంలో మైక్రో విభాగంలో 1,378, స్మాల్‌ 1,757, మీడియం 149, లార్జ్‌ 227, మెగా విభాగంలో 25 సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉండేలా ఏర్పాట్లు చేశారు. 

పెరుగుతున్న డిమాండ్‌
ముఖ్యంగా కోరుకున్న ఉద్యోగాలను దక్కించుకోవడానికి విద్యార్థులు ఆన్‌లైన్‌ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్, మెడికల్, బీఏ, బీఎస్సీ, బీబీఏ, లా, జీమ్యాట్, ఎంబీఏ, సీఏ వంటి కోర్సులతో పాటు సివిల్‌ సర్వీసెస్, బ్యాంకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌ కోర్సులను ఆశ్రయిస్తున్నారు.

ఇప్పటికే వివిధ రెగ్యులర్‌ కోర్సులను ఆన్‌లైన్‌ ద్వారా అందించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వ, అనుమతి పొందిన యూనివర్సిటీల ద్వారా అందిస్తున్న కోర్సులకు గుర్తింపు కూడా ఇచ్చింది. ప్రైవేట్‌ ఎడ్యుటెక్‌ సంస్థలు అందిస్తున్న కోర్సులకు కూడా గుర్తింపు వస్తే వీటిని అభ్యసించే వారి సంఖ్య మరింత పెరుగుతుంది.

ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 2021 నాటికి సగటు వార్షిక వృద్ధి రేటు 33.6 శాతంగా ఉందని అధ్యయన సంస్థలు పేర్కొంటున్నాయి. ఆన్‌లైన్‌ కోర్సులను అభ్యసించే వారి సంఖ్య రానున్న కాలంలో 2.5 కోట్ల నుంచి 4.63 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement