AP: మరో ముందడుగు.. విద్యలో గేమ్‌ ఛేంజర్‌!  | CM Jagan Govt Agreement With Educational Tech Company BYJUs | Sakshi
Sakshi News home page

AP: మరో ముందడుగు.. విద్యలో గేమ్‌ ఛేంజర్‌! 

Published Fri, Jun 17 2022 2:00 AM | Last Updated on Fri, Jun 17 2022 5:35 PM

CM Jagan Govt Agreement With Educational Tech Company BYJUs - Sakshi

సీఎం జగన్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలతో రాష్ట్ర ప్రభుత్వ, బైజూస్‌ ప్రతినిధులు, మంత్రి బొత్స

నిర్ణయాల్లో సీఎం వేగం అనూహ్యం 

బైజూస్‌ సీఈవో రవీంద్రన్‌తో వర్చువల్‌గా మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌  
 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వేగం అనూహ్యం. ఇంత వేగంగా స్పందించిన తీరు మా అందరికీ చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మే 25న ఆయనతో నేను తొలిసారి దావోస్‌లో సమావేశమయినప్పుడు ఆయన ఈ ఆలోచన చెప్పారు. ఒక యంగ్‌ స్టార్టప్‌కన్నా వేగంగా అడుగులు ముందుకు వేయడం హర్షణీయం. ప్రైవేటు స్కూళ్లలోని పిల్లలకు అందుబాటులో ఉండే కంటెంట్‌ను ఎలాంటి వ్యత్యాసం లేకుండా ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులకూ అందుబాటులోకి తీసుకు వస్తుండటం గొప్ప విషయం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికి ముఖ్యమంత్రి ఇంత వేగంగా అడుగులు వేయడం మాకు చాలా ఉత్సాహాన్నిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎడ్యు టెక్‌ కంపెనీగా మాకు సామాజిక బాధ్యత కూడా ఉంది. లాభాల కోసం కాకుండా మంచి చేయడానికి మాకు ఇదొక చక్కటి అవకాశం. లక్షల మంది విద్యార్థులు దీని వల్ల లబ్ధి పొందుతారు.  
– రవీంద్రన్, బైజూస్‌ సీఈఓ 

సులభంగా అర్థం అయ్యేలా తీర్చిదిద్దిన విజువలైజేషన్, నాణ్యమైన కంటెంట్‌ బైజూస్‌ ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది. పెద్ద పెద్ద ప్రయివేటు స్కూళ్లలో ఏటా రూ.20 వేల నుంచి 24 వేల వరకూ చెల్లించగలుగుతున్న శ్రీమంతుల పిల్లలకు మాత్రమే లభిస్తున్న ఈ కంటెంట్‌.. రాష్ట్రంలో పేద పిల్లలందరికీ అందుబాటులోకి రానుండటం విద్యా రంగంలో మేలి మలుపు. ఇదొక గేమ్‌ ఛేంజర్‌.   
– సీఎం వైఎస్‌ జగన్‌   

బైజూస్‌తో కలిస్తే..
► ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకు 32 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. 
► బైజూస్‌ యాప్‌తో పాటు అదనంగా ఇంగ్లిష్‌ లెర్నింగ్‌ యాప్‌ కూడా ఉచితంగా అందుబాటులోకి వస్తుంది.   
► బైజూస్‌ లెర్నింగ్‌ యాప్‌లో బోధన అత్యంత నాణ్యంగా ఉంటుంది. యానిమేషన్‌ ద్వారా, బొమ్మల ద్వారా విద్యార్థులకు మరింత సులభంగా, క్షుణ్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది.  
► వినూత్న, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల వీడియో పాఠ్యాంశాలు అత్యంత స్పష్టతతో, నాణ్యతతో ఉంటాయి.  
► మ్యాథ్స్, సైన్స్, సోషల్‌ సబ్జెక్టులన్నీ ఇటు ఇంగ్లిష్‌లో, అటు తెలుగు మాధ్యమంలో కూడా అందుబాటులో ఉంటాయి. 
ద్వి భాషల్లో పాఠ్యాంశాలు ఉండడం వల్ల పిల్లలు సులభంగా నేర్చుకునేందుకు, భాషా పరమైన ఆటంకాలు లేకుండా విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.  
► విద్యార్థులు ఎంత వరకు నేర్చుకున్నారన్న దానిపై ప్రతి ఒక్కరికీ ఫీడ్‌ బ్యాక్‌ పంపుతారు. ఇది పిల్లలకు ఎంతో ఉపయోగం.  
► సీబీఎస్‌ఈ సిలబస్‌ ఆధారంగా మ్యాపింగ్‌ చేస్తూ యాప్‌లో పాఠ్యాంశాల రూపకల్పన చేశారు. ప్రతి సబ్జెక్టులోని ప్రతి అధ్యాయంలో వివిధ అంశాలపై ప్రశ్నావళి ఉంటుంది.  
► పునశ్చరణ చేసుకునేలా, నేర్చుకున్న విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసేందుకు, అభ్యసనం కోసం వెనువెంటనే ప్రశ్నలు, వీడియోలు, గేమ్స్, సిమ్ములేషన్స్‌.. ఇవన్నీ యాప్‌లో పొందుపరిచారు.  
► 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య శాస్త్రం సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా 
ఇంటరాక్టివ్‌ గేమ్స్‌ కూడా యాప్‌లో ఉంటాయి. ఏ తరహా పరిజ్ఞానం ఉన్న విద్యార్థి అయినా యాప్‌ ద్వారా సులభంగా పాఠాలు నేర్చుకోవచ్చు.  
► 6 నుంచి 8వ తరగతి వరకు మ్యాథ్స్‌లో ఆటో సాల్వర్‌ స్కాన్‌ క్వశ్చన్స్‌ (లైవ్‌ చాట్‌ పద్ధతి ద్వారా నేరుగా), 
స్టెప్‌ బై స్టెప్‌ సొల్యూషన్స్‌... ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బైజూస్‌ యాప్‌ ద్వారా లభిస్తాయి.  
► తరచూ సాధన చేయడానికి వీలుగా మోడల్‌ ప్రశ్నపత్రాలు కూడా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి.  
► విద్యార్థి నేర్చుకున్న ప్రగతిపై నెల వారీగా ప్రోగ్రెస్‌ రిపోర్టులు కూడా ఇస్తారు. ఆన్‌లైన్‌లో ఉపాధ్యాయుడితో మీటింగ్‌ కూడా ఉంటుంది.   

సాక్షి, అమరావతి: ప్రపంచంతో పోటీపడే విధంగా, ఉజ్వల భవిష్యత్తు ఉన్న పిల్లలను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, ద్విభాషలతో కూడిన పాఠ్య పుస్తకాలు, విద్యా కానుక, అమ్మ ఒడి, గోరుముద్ద లాంటి కార్యక్రమాలతో విద్యా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూనే... మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దేశంలో అత్యుత్తమ ఎడ్యుటెక్‌ కంపెనీగా అవతరించిన ‘బైజూస్‌’తో గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్, బైజూస్‌ వైస్‌ ప్రెసిడెంట్, పబ్లిక్‌ పాలసీ హెడ్‌ సుస్మిత్‌ సర్కార్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. వర్చువల్‌ పద్ధతిలో ‘బైజూస్‌’ వ్యవస్థాపకుడు, సీఈవో రవీంద్రన్‌ అమెరికా నుంచి దీన్లో పాల్గొన్నారు. 

పేద పిల్లలకు ఉచితంగా బైజూస్‌ ఈ–కంటెంట్‌  
రాష్ట్రంలో విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తొలి నుంచి ప్రత్యేక దృష్టి పెట్టారు. దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సందర్భంగా... యూనికార్న్‌లుగా అవతరించిన  పలు స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, సీఈఓలు, కీలక అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం కావటం తెలిసిందే. ఈ సమయంలో బైజూస్‌ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌తో... ఎడ్యుటెక్‌తో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మేలు జరగాల్సి ఉన్న అవసరాన్ని ప్రస్తావించారు.

ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు ఎక్కడైనా, ఎప్పుడైనా నేర్చుకునేలా ఈ– లెర్నింగ్‌ కార్యక్రమాలుండాలని... దీనిపై తగిన ప్రతిపాదనలతో రావాలని సూచించారు. దీనికి సరేనన్న రవీంద్రన్‌... తాజా ప్రతిపాదనలపై ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఫలితంగానే గురువారం బైజూస్‌ – రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎంఓయూ సాధ్యమయింది. ఇప్పటి వరకు కొందరికే పరిమితమైన ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ ఇకపై ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకు కూడా అందుబాటులోకి రానుంది. పేదరికమన్నది నాణ్యమైన చదువులకు అడ్డంకి కాకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

పకడ్బందీగా ప్రాజెక్టు అమలు  
బైజూస్‌తో ప్రభుత్వ ఒప్పందం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీదైన కంటెంట్‌ ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలందరికీ ఉచితంగా అందుబాటులోకి రావడం సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ‘వచ్చే విద్యా సంవత్సరం నాటికి బైజూస్‌ కంటెంట్‌ను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పాఠ్య పుస్తకాలుగా అందుబాటులోకి తీసుకురావాలి.

విజువల్‌ ప్రజెంటేషన్లు కూడా పిల్లలకు అందుబాటులోకి తేవడానికి ప్రతి తరగతి గదిలో నాడు–నేడు కింద టీవీ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2025 మార్చి నాటికి తమ 10వ తరగతి పరీక్షలను ఇంగ్లిష్‌ మీడియంలో సీబీఎస్‌ఈ నమూనాలో రాస్తారు. కనుక ఇప్పటి నుంచే వారిని నాణ్యమైన బోధనతో ముందుకు నడిపించాలి. అందుకే సెప్టెంబర్‌ నాటికి 4.70 లక్షల మంది 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌ ఇస్తాం.

ఈ విద్యార్థులకు 9, 10 తరగతుల్లోనూ ఈ ట్యాబ్‌ల ద్వారా ఈ–కంటెంట్‌ సులభంగా అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులందరికీ కొత్తగా ట్యాబ్‌లు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్‌ భాగస్వామ్యం చాలా పెద్ద అచీవ్‌మెంట్‌. నేను అడిగిన వెంటనే బైజూస్‌ వాళ్లు చాలా సానుకూలంగా స్పందించారు. ఏటా ట్యాబ్‌ల రూపంలో కనీసం మనకు రూ.500 కోట్లు ఖర్చు అవుతుంది’ అని ముఖ్యమంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ టీ. విజయకుమార్‌ రెడ్డి, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎం వీ శేషగిరిబాబు, ఎస్‌ఎస్‌ఏ ఎస్‌పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

పేద పిల్లల జీవితాలను మారుస్తుంది: సీఎం జగన్‌  
రాష్ట్ర ప్రభుత్వంతో బైజూస్‌ భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పేద పిల్లల జీవితాలను ఇది మారుస్తుందని పేర్కొన్నారు. ‘విద్యా వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చదిద్దడానికి బైజూస్‌ సీఈఓ రవీంద్రన్‌ లాంటి వారు ముందుకు రావడం శుభ పరిణామం. మంచి చదువులను నేర్పే దిశలో పిల్లలను ముందుండి నడిపించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.

పదో తరగతిలో ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్‌ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇది దోహద పడుతుంది. ఇక్కడున్న అందరి కలలు సాకారం కావడానికి బైజూస్‌ భాగస్వామ్యం గొప్ప బలాన్నిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక గేమ్‌ ఛేంజర్‌’ అని చెప్పారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement