కొవ్వలి ఉన్నత పాఠశాల తరగతి గదిలో నోబెల్ గ్రహీత క్రెమెర్ బృందం
భీమడోలు/దెందులూరు: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న పథకాల ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారని నోబెల్ అవార్డు గ్రహీత (అర్థ శాస్త్రం) ప్రొఫెసర్ మైకేల్ రాబర్ట్ క్రెమెర్ చెప్పారు. విద్యారంగంలో పథకాలు, సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందన్నారు. వీటి సత్ఫలితాలు భవిష్యత్తులో ప్రతి ఒక్కరం చూస్తామని, విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెరి్నంగ్ (పాల్) ప్రాజెక్టు అమలు చేస్తున్న ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల, దెందులూరు మండలం కొవ్వలి జెడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం చికాగోలోని దిల్ యూనివర్సిటీకి చెందిన ఎమిలీ క్యుపిటో బృందంలోని ఐదుగురు సభ్యులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు, టీచర్లకు గణిత విద్యాబోధన, వాటిలోని మెలకువలను నేర్చుకునేందుకు అందజేసిన గణిత ట్యాబ్‌ల పనితీరును పరిశీలించారు.
బైజూస్ ట్యాబ్‌లను 8వ తరగతి చిన్నారులు అర్థవంతంగా వినియోగించడం చూసి మెచ్చుకున్నారు. 8, 9 తరగతి గదుల్లోని చిన్నారులు గణిత ట్యాబ్‌ల వినియోగించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గణిత పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి ఈ ట్యాబ్‌లు ఎలా ఉపయోగపడుతున్నాయి, ఇబ్బందులు పడుతున్నారా, ఉపాధ్యాయులు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సమాధానాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
నోటు పుస్తకాలను పరిశీలించారు. గణితాభ్యసన కార్యక్రమాల అమలు గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తరగతుల్లో ఎక్కువమంది విద్యార్థులు ఉంటున్నారని, ట్యాబ్‌లలో గణిత బోధనను వినే సమయంలో వినికిడి ఆటంకాలు లేకుండా హెడ్‌ఫోన్లు ఇవ్వాలని పూళ్ల హైస్కూలు విద్యార్థులు ఆ బృందం సభ్యులను కోరారు. ఈ సందర్భంగా క్రెమెర్ మాట్లాడుతూ తాము అందజేసిన గణిత ట్యాబ్‌లు సబ్జెక్టుకు సంబంధించిన విద్యాసామర్థ్యాలను పెంపొందించేందుకు దోహద పడుతున్నాయని, బైజూస్ ట్యాబ్‌లు 8వ తరగతిలోని అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థి దశ నుంచి నేర్చుకోవడం ద్వారా ప్రగతి సాధిస్తారన్నారు. పాల్ ప్రాజెక్టు ద్వారా కోవిడ్ సమయంలో విద్యార్థులకు ట్యాబ్‌లు అందించామని, విద్యార్థులు వాటిని వినియోగించే విషయంలో ఉపాధ్యాయులు తీసుకున్న శ్రద్ధ బాగుందని చెప్పారు. అనంతరం క్రెమెర్‌ను పూళ్లలో సర్పంచ్ దాయం సుజాత ప్రసాద్, హెచ్‌ఎం భువనేశ్వరరావు, ఉపాధ్యాయులు, కొవ్వలిలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు సత్కరించారు. రాష్ట్ర కో ఆర్డినేటర్ కె.వి.సత్యం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment