online training
-
కలల కొలువు సులువే
పోటీ ప్రపంచంలో ఇప్పుడంతా ఆన్లైన్ మయం. ఇందులో ముందుండాలంటే మిగిలిన వారితో పోలిస్తే భిన్న ప్రతిభా పాటవాలు అవసరం. తాము చదువుకున్న కోర్సుకు సంబంధించి అదనపు నైపుణ్యాలు ఉన్న వారికే కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. అలాంటి వారికే మంచి పే ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ విద్యకు, నైపుణ్యాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయడంతో పాటు జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న అంశాల్లో ప్రముఖ సంస్థల ద్వారా విద్యార్థులకు ఆన్లైన్లో శిక్షణ ఇప్పించేందుకు శ్రీకారం చుట్టింది. సాక్షి, అమరావతి: విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉన్నత విద్యనభ్యసించే ప్రతి విద్యార్థి నైపుణ్యాలతో ఆయా కోర్సులు పూర్తి చేసేలా ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది. ఇంతటితో ఆగకుండా వారు అత్యుత్తమ, కోరుకున్న ఉద్యోగాలు సాధించేందుకు ప్రముఖ సంస్థల ద్వారా ఆన్లైన్ శిక్షణ ఇప్పించేందుకు మరో అడుగు ముందుకు వేసింది. రానున్న కాలం మొత్తం డిజిటల్‌గా మారుతున్న తరుణంలో ఆయా అంశాల్లో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దుతోంది. ఇంటర్న్‌షిప్‌లకు అదనంగా కంపెనీలు, వివిధ పరిశ్రమలకు అవసరమైన ఐటీ తదితర సాంకేతిక నైపుణ్యాలను కూడా విద్యార్థులకు అందించేలా కార్యాచరణ చేపట్టింది. ఇందుకు అనుగుణంగా ప్రపంచంలోనే ప్రముఖ సంస్థలు అందిస్తున్న వివిధ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తోంది. ఈ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ ఇప్పించేందుకు 2.15 లక్షల మందిని గుర్తించారు. అలా గుర్తించిన వారితో పాటు మరికొంత మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడంతో ఆ సంఖ్య 2,45,700కు చేరింది. అయితే ఆయా సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు తొలి విడతలో 1.25 లక్షల మందిని గుర్తించి శిక్షణను చేపట్టింది. ఇందులో భాగంగా ఆన్లైన్ సంస్థల ద్వారా ఆన్లైన్ రీస్కిల్లింగ్, సర్టిఫికేషన్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తోంది. ఐటీ తదితర విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం వల్ల వారికి మరింత మేలు చేకూరనుంది. మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్, గూగుల్ వంటి సంస్థల నుంచి అందే ఈ సర్టిఫికేషన్ కోర్సులకు అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు ఉండడంతో విద్యార్థులు కోరుకున్న కొలువులను సులువుగా దక్కించుకోగలుగుతారు. ఇంటర్న్‌షిప్‌లకు పరిశ్రమలతో అనుసంధానం ఓవైపు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం.. మరో వైపు రాష్ట్రంలోని అన్ని కళాశాలలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానించింది. విద్యార్థులు తమ కోర్సును బట్టి ఈ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశం కల్పించింది. ఇందుకు ఉన్నత విద్యా మండలి ద్వారా ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేయించింది. అంతేకాకుండా జిల్లాల్లో ఆయా సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా విభాగాల ముఖ్య కార్యదర్శులతో కమిటీలను ఏర్పాటు చేసింది. ఇంటర్న్‌షిప్ కోసం రాష్ట్రంలోని మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమల వరకు ఉన్న వాటిని ఉన్నత విద్యా మండలి ఎంపిక చేసింది. ఇందులో తయారీ, సేవా రంగాల్లో శిక్షణ ఇవ్వనుంది. శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచే వారికి ఆ కంపెనీలే ఉద్యోగాలు ఇచ్చేలా చూస్తోంది. తయారీ సంస్థల్లో మైక్రో విభాగంలో 11,510, స్మాల్ 10,169, మీడియం 569, లార్జ్ 1,191, మెగా విభాగంలో 144 సంస్థలను గుర్తించారు. సేవల రంగంలో మైక్రో విభాగంలో 1,378, స్మాల్ 1,757, మీడియం 149, లార్జ్ 227, మెగా విభాగంలో 25 సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉండేలా ఏర్పాట్లు చేశారు. పెరుగుతున్న డిమాండ్ ముఖ్యంగా కోరుకున్న ఉద్యోగాలను దక్కించుకోవడానికి విద్యార్థులు ఆన్లైన్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్, మెడికల్, బీఏ, బీఎస్సీ, బీబీఏ, లా, జీమ్యాట్, ఎంబీఏ, సీఏ వంటి కోర్సులతో పాటు సివిల్ సర్వీసెస్, బ్యాంకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆన్లైన్ కోర్సులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే వివిధ రెగ్యులర్ కోర్సులను ఆన్లైన్ ద్వారా అందించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వ, అనుమతి పొందిన యూనివర్సిటీల ద్వారా అందిస్తున్న కోర్సులకు గుర్తింపు కూడా ఇచ్చింది. ప్రైవేట్ ఎడ్యుటెక్ సంస్థలు అందిస్తున్న కోర్సులకు కూడా గుర్తింపు వస్తే వీటిని అభ్యసించే వారి సంఖ్య మరింత పెరుగుతుంది. ఆన్లైన్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 2021 నాటికి సగటు వార్షిక వృద్ధి రేటు 33.6 శాతంగా ఉందని అధ్యయన సంస్థలు పేర్కొంటున్నాయి. ఆన్లైన్ కోర్సులను అభ్యసించే వారి సంఖ్య రానున్న కాలంలో 2.5 కోట్ల నుంచి 4.63 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాయి. -
‘సచివాలయ’ సిబ్బందికి శిక్షణ
సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా నిర్ధారించుకున్న అంశాలలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై బుధవారం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఆన్లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీ ఎస్ఐఆర్డీ డైరెక్టర్ జె.మురళీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే దాదాపు 15 వేల మంది వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకు బుధవారం ఉదయం 11 గంటల నుంచి 11.45 గంటల మధ్య ఆన్లైన్ విధానంలో శిక్షణ అందజేయనున్నారు. 45 నిమిషాల వీడియోను మంగళవారం సాయంత్రం నుంచే యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచుతారు. వీలున్న వారు ముందుగానే దానిని వీక్షించి, ఆన్లైన్ శిక్షణలోనూ పాల్గొనవచ్చు. శిక్షణ అనంతరం 12.10 గంటల నుంచి 12.25 మధ్య పది ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో కనీస మార్కులు తెచ్చుకోవాలి. కనీస మార్కులు సాధించని వారికి దఫాల వారీగా శిక్షణ కొనసాగుతుందే తప్ప.. వేరే ఎలాంటి చర్యలు ఉండవు. కాగా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు దాదాపు ఏడాది మొత్తం శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని జె.మురళీ ఆ ప్రకటనలో వివరించారు. -
స్టడీ సర్కిళ్లలో ప్రత్యక్ష శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రత్యక్ష శిక్షణకు స్టడీ సర్కిళ్లు సిద్ధమవుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో మూతబడ్డ విద్యాసంస్థలన్నీ ఇప్పుడు తెరుచుకోవడంతో, స్టడీ సర్కిళ్లను సైతం తెరిచి ప్రత్యక్ష శిక్షణ తరగతులు నిర్వహించాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ క్రమంలో త్వరలో జరగనున్న ఐబీపీఎస్ పరీక్షలతో పాటు ఇతర ఉద్యోగ ప్రకటనలకు తగినట్లు శిక్షణ ఇవ్వనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో హైదరాబాద్‌లో మూడు ప్రధాన స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కూడా సంక్షేమ శాఖల వారీగా ఒక్కో స్టడీ సర్కిల్‌ను నిర్వహిస్తున్నాయి. కోవిడ్‌తో ఈ కేంద్రాలు మూతపడడంతో ఆన్లైన్ శిక్షణ తరగతులు నిర్వహించారు. స్టడీ సర్కిళ్లను వచ్చే నెలలో తెరిచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగాలకు శిక్షణ... జాతీయ బ్యాంకుల్లో పెద్దఎత్తున ఉద్యో గ ఖాళీల భర్తీకి ఇటీవల ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి నవంబర్ మొదటి వారంలో శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. రైల్వేలో ఉద్యోగాలకు సైతం త్వరలో ప్రకటనలు వెలువడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఖాళీలను గుర్తించింది. శిక్షణ కోసం ఆశావహులు సిద్ధమవుతున్నారు. దీంతో స్టడీ సర్కిళ్లను పూర్తిస్థాయిలో తెరిచి ప్రత్యక్ష శిక్షణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే బీసీ స్టడీ సర్కిల్ పరిధిలో ఎస్సై, కానిస్టేబుల్ రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 11 స్టడీ సర్కిళ్లలో తాజాగా ప్రత్యక్ష శిక్షణను ప్రారంభిస్తోంది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ సైతం పూర్తి చేసింది. కాగా, సివిల్స్‌కు సిద్ధమవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తుండగా, ప్రత్యక్ష శిక్షణ కోసం అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వచ్చే నెల రెండో వారం లేదా చివరి వారంలో ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ డిమాండ్ ఉన్న వివిధ కోర్సులకు ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కోర్సులను విద్యార్థులు, నిరుద్యోగ యువతతో పాటు అధ్యాపకులకు ఉపయోగపడేలా ప్రముఖ సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈనెల 21లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆ సంస్థ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. వివరాలకు ఏపీఎస్ఎస్డీసీ టోల్ ఫ్రీ నంబర్ 18004252422కు ఫోన్ చేయవచ్చని తెలిపింది. రాస్బెర్రీ శిక్షణ ఈనెల 21 నుంచి జనవరి 4 వరకు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఆన్లైన్ ద్వారా రాస్‌బెర్రీపై శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణలో ఎంబెడెడ్ సిస్టమ్, సెన్సార్స్, కమ్యూనికేషన్ ప్రోటోకాల్, డిస్ప్లే, మోటార్స్, ఎలక్ట్రికల్ సిస్టం, రోబోటిక్స్ సిస్టం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాస్బెర్రీ పీ బోనస్ వంటి అంశాలను తెలుసుకుంటారు. ఆసక్తి ఉన్న బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ చదివిన విద్యార్థులు, అధ్యాపకులు, రీసెర్చర్లు హాజరుకావచ్చు. రిజిస్ట్రేషన్ లింకు https://www. apssdc. in/ లేదా shorturl.at/ hmt 46 డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ ప్రముఖ శిక్షణ సంస్థ నరేష్ టెక్నాలజీస్ సహకారంతో అధ్యాపకులు, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన, చదువుతున్న విద్యార్థులు, రీసెర్చర్లకు డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఈనెల 21వ తేదీ నుంచి రాత్రి 7:30 నుంచి 9 గంటల మధ్య నాలుగు వారాలపాటు ఏపీఎస్ఎస్డీసీ ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇవ్వనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ విజన్ డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్, డిప్లాయింగ్ ఏఐ ఇన్ హార్డ్‌వేర్ విభాగాల్లో శిక్షణ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు https:// www. apssdc. in/ లింక్ లేదా shorturl. at/ nKMNQ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. -
స్మార్ట్ ఫోన్ ఉందా?
సాక్షి, హైదరాబాద్: ‘‘బాబూ.. నేను గురుకుల పాఠశాల నుంచి మాట్లాడుతున్నాను. మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల్లో ఎవరికైనా స్మార్ట్‌ఫోన్ ఉందా? ఇంటర్నెట్ ప్యాకేజీ వాడుతున్నారా? వాళ్లు ఏ సమయంలో ఇంట్లో ఉంటారు? వెంటనే కనుక్కుని చెప్పు..’’ ఇదీ గురుకుల పాఠశాలల విద్యార్థుల నుంచి బోధన, బోధనేతర సిబ్బంది సేకరిస్తున్న సమాచారం. అన్‌లాక్ 3.0 ప్రక్రియ లోనూ విద్యాసంస్థల్ని తెరిచేందుకు మోక్షం కలగలేదు. కరోనా విజృంభణతో ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించట్లేదు. దీంతో విద్యార్థులు దారిమళ్లకుండా ఉండేందుకు బోధన, అభ్యసన కార్యక్రమాలను కొనసాగించాలని గురుకుల విద్యాసంస్థల సొసైటీలు భావిస్తున్నాయి. ఇం దులో భాగంగా ఆన్లైన్ తరగతుల నిర్వహణపై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఆన్లైన్ బోధన సాగుతోంది. ఈ క్రమంలో గురుకుల విద్యార్థులు చదువులో వెనుకబడకుండా వారికీ ఆన్లైన్ తరగతులను పూర్తిస్థాయిలో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఇందుకు అవసరమైన స్మార్ట్ఫోన్లు పిల్లల వద్ద ఏ మేరకు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలని భావిస్తున్న సొసైటీలు.. క్షేత్రస్థాయిలో ప్రిన్సిపాల్, టీచర్లకు బాధ్యతలు అప్పగించాయి. తమకందని మౌఖిక ఆదేశాల మేరకు వీరంతా సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. టెన్త్, ఇంటర్ సెకండియర్ వాళ్లకు.. ప్రస్తుతం గురుకుల సొసైటీలు పదోతరగతి, ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభించేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తిచేశాయి. ఇప్పటికే మహాత్మాజ్యోతిభా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించారు. టెన్త్, ఇంటర్ సెకండియర్ వాళ్లకు గత పక్షం రోజులుగా జూమ్, గూగుల్ మీటింగ్ యాప్‌ల్లో ఆన్లైన్ తరగతులు చెబుతున్నారు. ఇంటర్నెట్ ప్యాకేజీలను పరిశీలిస్తే.. అన్ని నెట్‌వర్క్‌ల్లో దాదాపు రోజుకు 1.5 జీబీ డాటా ఉంటుంది. దీంతో రెండు గంటల పాటు ఆన్లైన్ తరగతులు బోధిస్తే దాదాపు ఒక జీబీ డాటా వినియోగమవుతుంది. దీంతో మూడు తరగతులు మాత్రమే బోధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో ఉదయం రెండు, సాయంత్రం ఒక క్లాస్ ఉంటాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, తోబుట్టువులు ఇళ్లలో ఉన్న సమయాన్ని అంచనా వేసి ఇలా ఉదయం, సాయంత్రం తరగతులు చెబుతున్నామని, ఆన్లైన్ తరగతులను తను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ‘సాక్షి’కి చెప్పారు. 75 శాతం స్మార్ట్ఫోన్లే.. గురుకుల పాఠశాలల్లో ప్రతి తరగతిలో రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్లో గరిష్టంగా 40 మంది పిల్లలున్నారు. ఈ క్రమంలో ప్రతి సెక్షన్లో ఉన్న విద్యార్థులకు వ్యక్తిగతంగా ఫోన్లుచేసి వివరాలు సేకరించి ప్రత్యేక నమూనాలో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ పాఠశాలలు ఈ సమాచార సేకరణ పూర్తి చేశాయి. ప్రతి తరగతిలో గరిష్టంగా 75 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు లేదా అన్న, అక్కల్లో ఒకరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లు గుర్తించారు. తరగతుల వారీగా పరిశీలిస్తే కొన్ని సెక్షన్లలోని విద్యార్థుల వద్ద నూరు శాతం స్మార్ట్ ఫోన్లు ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. -
కరోనా నియంత్రణకు మేము సైతం
తణుకు : మహిళలు ఆకాశంలో సగభాగం అన్నారు పెద్దలు.. ఇప్పుడు కరోనా మహమ్మారి నియంత్రణకు సగం బాధ్యతను మహిళలు తీసుకుంటున్నారు.. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే నానుడి నిజం చేస్తూ ముందు ఇంట్లో మహిళలు అవగాహన పెంచుకుని తద్వారా కుటుంబ సభ్యులను హెచ్చరించేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మహమ్మారిని జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇస్తున్న ఆన్లైన్ శిక్షణ సత్ఫలితాలు ఇస్తోంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో సెల్ఫోన్లలో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 12,208 స్వయం సహాయక సంఘాల్లో 1.19 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 58,650 మంది ఈ ఆన్లైన్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. నిపుణులతో శిక్షణ జిల్లాలో ఈనెల 1 నుంచి మెప్మా మిషన్ డైరక్టరేట్ ఆధ్వర్యంలో ఆన్లైన్ శిక్షణ ప్రారంభించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నియంత్రణ లక్ష్యంతో ‘కోవిడ్–19 నివారణ – నియంత్రణలో సంఘ సభ్యులు’ అనే కార్యక్రమం రూపొందించారు. దీనిలో భాగంగా కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్వాక్రా మహిళలకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో అధికారులు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ శిక్షణ కొనసాగించనున్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు వారి ఇంటి నుంచే వారి కుటుంబ సభ్యులు సైతం ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. ప్రతి రోజు నాలుగు దశల్లో సుమారు అయిదు వేల మందికి ఆన్లైన్ శిక్షణ అందజేస్తున్నారు. ఈ శిక్షణలో ప్రధానంగా కోవిడ్ –19 సమయంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన జాగ్రత్తలు, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం, ఆరోగ్యకర అలవాట్లు, యోగా, ధ్యానం వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 30 మంది నిపుణుల బృందంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. మహిళకు అవగాహన కల్పించడం ద్వారా.. కరోనా మహమ్మారిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వినూత్న కార్యక్రమానికి స్పందన లభిస్తోంది. ఒక కుటుంబంలో ముందుగా మహిళకు అవగాహన కల్పిస్తే తద్వారా కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉంటారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం రూపకల్పన చేసింది. జిల్లాలో డ్వాక్రా మహిళలకు ఆన్లైన్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాం. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.–టి.ప్రవీణ, మెప్మా పీడీ, ఏలూరు రోగనిరోధక శక్తి ప్రధానం కోవిడ్–19 సమయంలో పాటించాల్సిన నియమాలపై జిల్లాలోని మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు ప్రధానంగా రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం ద్వారా కరోనా నివారణ సాధ్యమవుతుంది. ఆహార నియమాలు పాటించి పౌష్టికాహారం తీసుకుంటూ మానసిక ప్రశాంతత కోసం శ్వాస ప్రక్రియలు, యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నాం.–కె.మహాలక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ -
సేంద్రియ సేద్యంపై ఆన్లైన్ శిక్షణ
కేంద్ర వ్యవసాయ, సహకార, రైతుల సంక్షేమ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం (ఎన్.సి.ఓ.ఎం.) కనీసం గ్రామీణ రైతులు, మహిళా రైతులకు సేంద్రియ సేద్యపద్ధతులపై ఆన్లైన్లో 7 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. జూలై మొదటి వారంలో శిక్షణ ఇస్తారు. ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్/ డిగ్రీ/ పీజీ పాసైన గ్రామీణ యువ రైతులు, యువ మహిళా రైతులు అర్హులు. వయస్సుకు సంబంధించి నిబంధన లేదు. గ్రామీణ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. ఎన్.సి.ఓ.ఎం. కేంద్ర కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉండగా, మరో 8 చోట్ల ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. ప్రతి ప్రాంతీయ కార్యాలయం పరిధిలో వంద మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పరిధిలోని రైతులకు నాగపూర్‌లోని ప్రాంతీయ కార్యాలయం శిక్షణ ఇస్తుంది. రైతులు దరఖాస్తు పంపాల్సిన మెయిల్ ఐడి: rdrcof.ngp-agri@gov.in phone: 07118 297 054 దరఖాస్తు ఫారంను ఈ క్రింది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.. https://ncof.dacnet.nic.in/DowloadableForms/ApplicationFormForTraining.pdf -
ఇక ‘టీవీ’గా కోచింగ్
⇒ జేఈఈ పరీక్షలకు డీటూహెచ్, ఆన్లైన్ ఆధారిత శిక్షణ సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెరుున్, జేఈఈ అడ్వాన్సడ్ పరీక్షలకు హాజరయ్యే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు టీవీ ఆధారిత (డీటూహెచ్), ఆన్లైన్ శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) కసరత్తు చేస్తోంది. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఈ శిక్షణను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు కోచింగ్ కేంద్రాల్లో శిక్షణకు విద్యార్థులు దేశవ్యాప్తంగా ఏటా రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా వారికి ప్రత్యామ్నాయ బోధన అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఐఐటీలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఐఐటీ ప్రొఫెసర్లు అసిస్టెడ్ లెర్నింగ్ (ఐఐటీ-పాల్) పథకం కింద 11, 12వ తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్టుల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఢిల్లీ ఐఐటీ డెరైక్టర్ ప్రొఫెసర్ రాంగోపాల్‌రావు వెల్ల్లడించారు. ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి 200 పాఠాలు (లెక్చర్స్) రికార్డు చేసి డీ టూ హెచ్ విద్యా చానళ్ల ద్వారా ప్రసారం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన స్వయం ప్రభ ప్రత్యేక విద్యా చానళ్ల ద్వారా వీటిని ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సబ్జెక్టును ఒక్కో స్వయంప్రభ చానల్ ద్వారా నాలుగు చానళ్లలో నాలుగు సబ్జెక్టుల లెక్చర్లను ప్రసారం చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయా పాఠాలను విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచేందుకు ఎంహెచ్ఆర్డీ కసరత్తు చేస్తోంది. తద్వారా విద్యార్థులు ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని భావిస్తోంది. ఐఐటీ ప్రొఫెసర్లతోపాటు కేంద్రీయ విద్యాలయాల ఆధ్యాపకులతోనూ ఈ పాఠాలు రూపొందించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఆ పాఠాలకు సంబంధించి ఏమైనా సందేహాలు తలెత్తితే విద్యార్థులు ఆన్లైన్లో ఐఐటీ ప్రొఫెసర్లను సంప్రదించి, సమాధానాలు పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. ఏడాది తర్వాత కదలిక.. ఐఐటీ రూర్కీ డెరైక్టర్ అశోక్ మిశ్రా నేతృత్వంలో గతేడాది ఏర్పడిన కమిటీ జేఈఈ కోచింగ్‌పైనా అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా ఈ కోచింగ్‌పై రూ.24 వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని మిశ్రా స్పష్టం చేశారు. గ్రామీణ విద్యార్థులను జేఈఈ శిక్షణ పేరుతో ప్రైవేటు విద్యా సంస్థలు ఆకర్షిస్తూ.. వారిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో జేఈఈ పేరుతో వ్యాపారం చేస్తున్న ప్రైవేటు కోచింగ్ కేంద్రాలను నియంత్రించాలని గతేడాదే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అయినా కేంద్రం వాటిపై చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు జేఈఈ శిక్షణను ప్రారంభించేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ తక్కువ కాదు.. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ రాత పరీక్షకు ఏటా 13 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే 1.50 లక్షల వరకు హాజరవుతున్నారు. జేఈఈ అడ్వాన్సడ్కు దేశవ్యాప్తంగా గత ఏడాది టాప్ 1.08 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే 25 వేల మంది వరకున్నారు. జేఈఈ మెరుున్, జేఈఈ అడ్వాన్సడ్ పరీక్షలకు ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. అందులో సగం మంది విద్యార్థులు ఇంటర్‌తోపాటు జేఈఈ కోచింగ్ తీసుకుంటుండగా, మరో 30 శాతం మంది విద్యార్థులు ప్రత్యేకంగా జేఈఈ పరీక్ష రాసేందుకే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. వారి నుంచి శిక్షణ కేంద్రాలు రూ.65 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇలా జేఈఈ శిక్షణపైనే రూ.1,500 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. అలాగే పాఠశాల స్థారుులో 8వ తరగతి నుంచే ఐఐటీ చదువులు, శిక్షణ పేరుతో వ్యాపారం సాగుతోంది. పేద విద్యార్థులకు ఎంతో మేలు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చే టీవీ ఆధారిత, ఆన్లైన్ ఆధారిత జేఈఈ కోచింగ్‌తో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. జేఈఈ కోసం వేల రూపాయలు వెచ్చించడమే కాకుండా, హైదరాబాద్, ఇతర జిల్లా కేంద్రాల్లో ఉండి చదువుకునేందుకు భారీగా డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. ఆన్లైన్, టీవీ ఆధారిత శిక్షణతో పేద విద్యార్థులకు ఆర్థిక భారం తప్పుతుంది. ఐఐటీ ప్రొఫెసర్లు రూపొందించే పాఠాలు వారికి ఎంతో ఉపయోగపడతాయి. - పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు