ఇక ‘టీవీ’గా కోచింగ్ | online training in dth for intermediate students | Sakshi
Sakshi News home page

ఇక ‘టీవీ’గా కోచింగ్

Published Tue, Nov 8 2016 4:39 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

ఇక ‘టీవీ’గా కోచింగ్

ఇక ‘టీవీ’గా కోచింగ్

జేఈఈ పరీక్షలకు డీటూహెచ్, ఆన్‌లైన్ ఆధారిత శిక్షణ
 
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెరుున్, జేఈఈ అడ్వాన్‌‌సడ్ పరీక్షలకు హాజరయ్యే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు టీవీ ఆధారిత (డీటూహెచ్), ఆన్‌లైన్ శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) కసరత్తు చేస్తోంది. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఈ శిక్షణను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు కోచింగ్ కేంద్రాల్లో శిక్షణకు విద్యార్థులు దేశవ్యాప్తంగా ఏటా రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా వారికి ప్రత్యామ్నాయ బోధన అందించేందుకు చర్యలు చేపడుతోంది.
 
ఐఐటీలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఐఐటీ ప్రొఫెసర్లు అసిస్టెడ్ లెర్నింగ్ (ఐఐటీ-పాల్) పథకం కింద 11, 12వ తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్టుల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఢిల్లీ ఐఐటీ డెరైక్టర్ ప్రొఫెసర్ రాంగోపాల్‌రావు వెల్ల్లడించారు. ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి 200 పాఠాలు (లెక్చర్స్) రికార్డు చేసి డీ టూ హెచ్ విద్యా చానళ్ల ద్వారా ప్రసారం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన స్వయం ప్రభ ప్రత్యేక విద్యా చానళ్ల ద్వారా వీటిని ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సబ్జెక్టును ఒక్కో స్వయంప్రభ చానల్ ద్వారా నాలుగు చానళ్లలో నాలుగు సబ్జెక్టుల లెక్చర్లను ప్రసారం చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
 
 ఆయా పాఠాలను విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచేందుకు ఎంహెచ్‌ఆర్‌డీ కసరత్తు చేస్తోంది. తద్వారా విద్యార్థులు ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని భావిస్తోంది. ఐఐటీ ప్రొఫెసర్లతోపాటు కేంద్రీయ విద్యాలయాల ఆధ్యాపకులతోనూ ఈ పాఠాలు రూపొందించి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. ఆ పాఠాలకు సంబంధించి ఏమైనా సందేహాలు తలెత్తితే విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఐఐటీ ప్రొఫెసర్లను సంప్రదించి, సమాధానాలు పొందేలా ఏర్పాట్లు చేస్తోంది.
 
ఏడాది తర్వాత కదలిక..
ఐఐటీ రూర్కీ డెరైక్టర్ అశోక్ మిశ్రా నేతృత్వంలో గతేడాది ఏర్పడిన కమిటీ జేఈఈ కోచింగ్‌పైనా అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా ఈ కోచింగ్‌పై రూ.24 వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని మిశ్రా స్పష్టం చేశారు. గ్రామీణ విద్యార్థులను జేఈఈ శిక్షణ పేరుతో ప్రైవేటు విద్యా సంస్థలు ఆకర్షిస్తూ.. వారిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో జేఈఈ పేరుతో వ్యాపారం చేస్తున్న ప్రైవేటు కోచింగ్ కేంద్రాలను నియంత్రించాలని గతేడాదే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అయినా కేంద్రం వాటిపై చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు జేఈఈ శిక్షణను ప్రారంభించేందుకు సిద్ధమైంది.
 
తెలుగు రాష్ట్రాల్లోనూ తక్కువ కాదు..
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ రాత పరీక్షకు ఏటా 13 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే 1.50 లక్షల వరకు హాజరవుతున్నారు. జేఈఈ అడ్వాన్‌‌సడ్‌కు దేశవ్యాప్తంగా గత ఏడాది టాప్ 1.08 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే 25 వేల మంది వరకున్నారు. జేఈఈ మెరుున్, జేఈఈ అడ్వాన్‌‌సడ్ పరీక్షలకు ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు.

అందులో సగం మంది విద్యార్థులు ఇంటర్‌తోపాటు జేఈఈ కోచింగ్ తీసుకుంటుండగా, మరో 30 శాతం మంది విద్యార్థులు ప్రత్యేకంగా జేఈఈ పరీక్ష రాసేందుకే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. వారి నుంచి శిక్షణ కేంద్రాలు రూ.65 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇలా జేఈఈ శిక్షణపైనే రూ.1,500 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. అలాగే పాఠశాల స్థారుులో 8వ తరగతి నుంచే ఐఐటీ చదువులు, శిక్షణ పేరుతో వ్యాపారం సాగుతోంది.

 పేద విద్యార్థులకు ఎంతో మేలు
 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చే టీవీ ఆధారిత, ఆన్‌లైన్ ఆధారిత జేఈఈ కోచింగ్‌తో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. జేఈఈ కోసం వేల రూపాయలు వెచ్చించడమే కాకుండా, హైదరాబాద్, ఇతర జిల్లా కేంద్రాల్లో ఉండి చదువుకునేందుకు భారీగా డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. ఆన్‌లైన్, టీవీ ఆధారిత శిక్షణతో పేద విద్యార్థులకు ఆర్థిక భారం తప్పుతుంది. ఐఐటీ ప్రొఫెసర్లు రూపొందించే పాఠాలు వారికి ఎంతో ఉపయోగపడతాయి.
 - పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement