intermediate students
-
విద్యార్థుల కోసం ఆధార్ క్యాంపులు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి 4రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా 1,485 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలలో ప్రత్యేక ఆధార్ క్యాంపుల నుంచి నిర్వహించనుంది. కనీసం పదేళ్ల వ్యవధిలో ఒక్కసారైనా ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పదేళ్ల వ్యవధిలో ఒక్కసారి కూడా తమ ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోనివారు దాదాపు 80 లక్షల మంది ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ప్రతినెలా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 7 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వయస్సు వారికి ప్రభుత్వం పూర్తి ఉచితంగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ 15 ఏళ్లలోపు వయసు కలిగిన విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తూ వచ్చింది. ఈ నెలలో 15నుంచి 17 ఏళ్ల వయసులోపు విద్యార్థులకు జూనియర్ కాలేజీల్లో క్యాంపులు నిర్వహిస్తోంది. సచివాలయాల్లో నిర్వహించే ప్రత్యేక ఆధార్ క్యాంపుల్లో ఆధార్ కార్డులో బయోమెట్రిక్ అప్డేట్ సేవలను ఉచితంగా అందజేయడంతో పాటు నిర్ణీత రుసుంతో అదనంగా మరో 10 రకాల ఆధార్ సేవలను పొందే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బయోమెట్రిక్ (ఫొటో, ఐరిస్, ఫింగర్ ప్రింట్) అప్డేట్, పేరు మార్పు, పుట్టిన తేదీ వివరాల మార్పు, జెండర్, చిరునామా మార్పు సేవలతో పాటు కొత్తగా ఆధార్ వివరాల నమోదు, ఆధార్ కార్డు డౌన్లోడ్ సేవలను కూడా ఆ క్యాంపుల్లో పొందవచ్చు. -
ఫెయిలైన విద్యార్థులంతా పాస్..
-
AP: నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
మచిలీపట్నం: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అంతా సిద్ధమైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు మొదటి, రెండో సంవత్సరం కలిపి జిల్లాలో 1,13,538 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరి కోసం 142 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండో సంవత్సరం వారికి మధ్యాహ్నం 2.30 నుంచి 5.30గంటల వరకు టైం టేబుల్ మేరకు ప్రతి రోజూ పరీక్ష ఉంటుంది. నేడు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష పేపర్ -1కి 2వ సెట్ ప్రశ్న పత్రాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. బుధవారం నుంచి 23 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకి హల్ టిక్కెట్స్ 4 లక్షల మంది విద్యార్ధులు డౌన్ లోడ్ చేసుకున్నారు. కోవిడ్ కారణంగా ఈ ఏడాది జులైలో జరగాల్సిన ఇంటర్ పరీక్షలు సుప్రీంకోర్టు ఆదేశాల నేపద్యంలో రద్దు అయిన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్దులెవరైనా ఈ సప్లిమెంటరీ పరీక్షలకి హాజరుకావచ్చు. రేపు(గురువారం) ఇంగ్లీష్, 17న మేథమెటిక్స్- A, బోటనీ, సివిక్స్ పేపర్లు, 18న మేథమెటిక్స్-B, జువాలజీ, హిస్టరీ పరీక్షలు, 20 న ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు, 21 న కెమిస్ట్రీ, కామర్స్, సోషయాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పరీక్షలు, 22న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జి కోర్స్ మేద్స్, 23వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పరీక్షలు, ఈ నెల 27 న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 28న ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్ధులు మాస్కులు ధరించి పరీక్షలకి హాజరుకావాల్సి ఉంటుంది. నిమిషం నిబందనని అమలు చేయడం లేదని అధికారులు పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల పరీక్షా కేంద్రాలకి ఆలస్యంగా హాజరైనా విద్యార్ధులని అనుమతించాలని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద థర్మల్ స్కానింగ్ ద్వారా తనిఖీలు చేయనున్నారు. పరీక్షల నిర్వహణకి ప్రతీ జిల్లాకి ఒక కోవిడ్ ప్రోటోకాల్ అధికారిని నియామించారు. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్ధుల సౌకర్యార్ధం టోల్ ఫ్రీ నంవర్ 18002749868 ఏర్పాటు చేశారు. వాట్సప్ ద్వారా ఫిర్యాదుకి 9391282578 నంబర్ని అధికారులు అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష ఎందుకంటే.. కోవిడ్ కారణంగా పరీక్షలు రద్దు చేసి, అంతా కనీస మార్కులతో ఉత్తీర్ణులైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారి మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పేరిట మరో అవకాశం ఇచ్చింది. దీంతో పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్, ఓఎంఆర్ షీట్స్, నామినల్ రోల్స్ షీట్స్, డీ–ఫామ్స్‌ను ఇప్పటికే పరీక్ష కేంద్రాలకు పంపించారు. జంబ్లింగ్ విధానంలోనే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా తనిఖీ బృందాలను పర్యవేక్షణకు ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో హైపవర్ కమిటీ కూడా కేంద్రాలను తనిఖీ చేయనుంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలి.. ఇంటర్ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9గంటలకు ప్రారంభమవుతాయి. అయితే నిమిషం లేటు అయినా పరీక్షలకు విద్యార్థులను అనుమతించరు. పరీక్షకు అరగంట ముందుగానే ఉదయం 8.30లకు కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు. ఇదే రీతిన సెకండ్ ఇయర్ విద్యార్థులను మధ్యాహ్నం 2 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షలు ముగిసేంత వరకూ కేంద్రాల్లో వైద్య సిబ్బందితో శిబిరాలు నిర్వహిస్తారు. కట్టుదిట్టంగా కోవిడ్ నిబంధనలు.. పరీక్షా కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చేయాలని కలెక్టర్ నివాస్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు ప్రతి ఒక్క విద్యారి్థనీ థర్మల్ స్క్రీనింగ్ చేయాలని సూచించారు. ప్రతి కేంద్రంలోనూ ప్రత్యేకంగా ఐసోలేషన్ గది ఏర్పాటు చేశారు. కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఆ గదిలో కూర్చొబెట్టి పరీక్ష రాయించనున్నారు. ఏర్పాట్లు పూర్తి చేశాం.. కోవిడ్ నిబంధనల మేరకు ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులకు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలి. కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరిగేలా నిర్వాహకులు శ్రద్ధ తీసుకోవాలి. – పెదపూడి రవికుమార్, ఆర్ఐఓ -
ఇంటర్ విద్యార్థులను తికమకపెడుతున్న త్రికోణమితి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా సిలబస్‌లో కోత పెట్టడం వల్ల ఇంటర్మీడియెట్ విద్యార్థులకు తలనొప్పులు తప్పడం లేదు. మొదటి సంవత్సరంలో బేసిక్స్ (ప్రాథమికాంశాలు) వదిలేయడంతో రెండో ఏడాది కొన్ని పాఠాలు అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దీనివల్ల పోటీ పరీక్షల్లోనూ విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవని అధ్యాపకులు అంటున్నారు. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. 70 శాతానికి కుదింపు కోవిడ్ వల్ల గతేడాది విద్యాసంస్థలు పనిచేయని విషయం తెలిసిందే. ఆన్లైన్ పాఠాలు కూడా చాలారోజులు జరగలేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇంటర్ ఫస్టియర్ సిలబస్‌ను 70 శాతానికి కుదించారు. దీంతో విద్యార్థులు కొన్ని చాప్టర్ల జోలికి అసలుకే వెళ్లలేదు. వీటిల్లో పలు కీలక విషయాలపై ప్రాథమిక అవగాహన కల్పించే చాప్టర్లు కూడా ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే తప్ప రెండో ఏడాదిలో పాఠాలు అర్థం కానివి కొన్ని ఉన్నాయని అధ్యాపకులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రైవేటు కాలేజీలు కుదించిన చాప్టర్లను కూడా విద్యార్థులకు బోధించినా ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఆన్లైన్ పాఠాలు అర్థం కాక, సిలబస్ కోతతో విద్యార్థుల పరిస్థితి, ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఫస్టియర్‌లో చదవకపోతే కష్టమే.. ఫస్టియర్ గణితంలో త్రికోణమితి (ట్రిగొనమెట్రీ) చాప్టర్‌ను వదిలేశారు. రెండో ఏడాదిలో ఇది మరింత లోతుగా ఉంది. ప్రాథమిక అవగాహన ఉంటే తప్ప క్లిష్టమైన లెక్కలను చేయలేని పరిస్థితి ఉంటుందంటున్నారు. విశ్లేషణాత్మక గణిత సూత్రాలన్నీ ఫస్టియర్‌లో ఉన్నాయని, దాని కొనసాగింపు రెండో ఏడాది ఇచ్చారని అధ్యాపకులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రభుత్వ కాలేజీలో త్రికోణమితిపై కాలేజీ అధ్యాపకులు పరిశీలన చేశారు. 60 మందిలో కనీసం 20 మంది కూడా ఓ మోస్తరు క్లిష్టమైన త్రికోణమితి లెక్కలు చేయలేని పరిస్థితి కన్పించింది. జంతుశాస్త్రంలో ప్రొటోజోవా గమనం, ప్రత్యుత్పత్తి చాప్టర్లను కూడా కోత మూలంగా విద్యార్థులు ముట్టుకోలేదు. కానీ రెండో సంవత్సరంలో ఈ చాప్టర్లు మరింత లోతుగా ఉన్నాయి. ప్రాథమిక అవగాహన మొత్తం మొదటి ఏడాదిలోనే ఉందని, అది లేకుండా రెండో ఏడాదిలో విద్యార్థులకు సబ్జెక్టు అర్థం కావడం లేదని జువాలజీ లెక్చరర్ ఒకరు తెలిపారు. బొద్దింక కోతకు సంబంధించి సబ్జెక్టు ఫస్టియర్‌లో ఉంది. దీన్ని తెలుసుకుంటేనే రెండో ఏడాది మానవుల్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కీలకమైన విషయాలు అర్థమవుతాయని లెక్చరర్లు చెబుతున్నారు. కుదింపు జాబితాలో ‘బొద్దింక’ ఎగిరిపోవడంతో రెండో ఏడాది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రసాయన శాస్త్రంలో మూల సూత్రాలన్నీ ఫస్టియర్‌లో ఉంటాయి. ఇవి తెలియకుండా రెండో ఏడాది కొనసాగింపుగా వచ్చే చాప్టర్లు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. హిస్టరీ, ఎకనామిక్స్ అన్ని సబ్జెక్టుల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. పైగా ఈ ఏడాది రెండో సంవత్సరం వంద శాతం సిలబస్ పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేయడంతో ఆయా పాఠాలను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పోటీ పరీక్షలపైనా ప్రభావం భవిష్యత్తులో జేఈఈ, ఎంసెట్ వంటి అన్ని రకాల పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల పాలిట కుదించిన చాప్టర్లు శాపంగా మారే అవకాశం కన్పిస్తోంది. తగ్గించిన 30 శాతం సిలబస్ నుంచి ప్రతి ఏటా గణితంలో 20 నుంచి 30 మార్కులు వస్తున్నాయని అధ్యాపకులు చెబుతున్నారు. అలాగని ఫస్టియర్ నుంచి రెండో ఏడాదికి ప్రమోట్ అయిన విద్యార్థులు ఇప్పుడు కోత పెట్టిన పాఠాలపై దృష్టి పెట్టే పరిస్థితి కన్పించడం లేదు. సాధారణంగా రెండో ఏడాది మధ్య నుంచే విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండో ఏడాది సిలబస్ పూర్తి చేయడమే కష్టంగా ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో ఈ ఏడాది 1,600 మంది గెస్ట్ లెక్చరర్లను కొనసాగించకపోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీన్ని ఎలా అధిగమించాలో తెలియక విద్యార్థులు ఆందోళన పడుతున్నారు. ఆ చాప్టర్లపై అవగాహన కలిగించాలి ఫస్టియర్‌లో త్రికోణమితి బేసిక్స్ చదువుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో రెండో ఏడాదిలో ఈ పాఠం విద్యార్థులకు కష్టంగా ఉంది. బోధిస్తున్నప్పుడు చాలామంది విద్యార్థులకు అర్థం కావడం లేదు. రెండో ఏడాదిలోనూ ఆ పాఠాలు తీసేస్తే బాగుండేది. ఫస్టియర్‌లో కోత పెట్టిన చాప్టర్లపై కొంత అవగాహన కల్గించాల్సిన అవసరం ఉంది. – రఘురాం, గణితం అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, జడ్చర్ల -
కాఫీ క్యాప్సూల్: ఇక పర్సులో కూడా కాఫీ తీసుకెళ్లొచ్చు
తిరువంతనపురం: ప్రస్తుత విద్యా విధానాన్ని యాంత్రికతతో పోల్చుతుంటారు. ఇది ఏ మాత్రం సృజన లేని విధానం వైపుగా వెళుతోందని, పిల్లలు కీ ఇచ్చే బొమ్మల్లా తయారవుతున్నారని వాపోయే వారూ ఉన్నారు. అలాంటిది కేరళ ఎర్నాకుళంలోని ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ పాఠశాల 12వ తరగతి విద్యార్థినులు నలుగురు కలిసి ఫిల్టర్ కాఫీ క్యాప్సుల్‌ను తయారు చేసి, అంతర్జాతీయ గుర్తింపు పొందారు. సౌందర్య లక్ష్మి, ఎలిషా అనోరీ కడుతోస్, దింపాల్, శివనందన్.. ఈ నలుగురు అమ్మాయిలు కాఫీ షాపులకు కూడా వెళ్లలేదు కానీ, కాఫీ ప్రేమికులు తమ అభిమాన పానీయాన్ని సేవించడానికి, ఆ ఆస్వాదనలో మునిగిపోవడానికి సహాయపడే విధంగా ఒక కొత్త ఉత్పత్తిని తీసుకు వచ్చి, కాఫీ ప్రియుల ప్రశంసలు అందుకుంటున్నారు. తేయాకుతో ప్రయోగాలు ‘అమెరికాలో జరిగే టై గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపార పరిధిని పెంచే విషయంలో కొత్త కొత్త ఆహ్వానాలు కోరింది. మన దేశం నుంచి వచ్చిన వాటిలో ఎనిమిది ఐడియాలను తీసుకుంది. వాటిలో ఈ స్కూల్ విద్యార్థుల బృందం చేసిన ఉత్పత్తి ఫిల్టర్ కాఫీ క్యాప్సూల్. ఈ విద్యార్థులు అందించిన ‘కాఫీ పిల్’ కు మంచి ఆదరణ లభించింది. ఇది ఫిల్టర్ కాఫీని క్యాప్సూల్‌లో ప్యాక్ చేయడానికి వీలుగా ఉంటుంది. దీని ఉత్పత్తికి, రూపకల్పనకు చేసిన కృషిని ఈ బృంద నాయకురాలు సౌందర్య వివరిస్తూ ‘మా స్కూల్ వద్ద ఓ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, కొత్త ఐడియాలు కోరారు. అయితే, అంతకుముందే మా సొంత వ్యాపారంతో ముందుకు రావాలన్న ఆలోచనలో ఉన్న మేము తేయాకులతో రకరకాల ప్రయోగాలు చేశాం. ముందు ఒక చిన్న బంతిలో టీ ఆకులను జొప్పించి, కప్పు నీళ్లతో టీని తయారు చేశాం’ అని సగర్వంగా చెబుతోంది. సేంద్రియ పద్ధతిలో కాఫీ ‘ఇది పూర్తిగా సేంద్రియ పద్ధతి. కాగితం లేదా ఇతర హానికారక పదార్థాలేవీ ఉపయోగించలేదు. మా పరిశోధన చాలా విస్తృతంగా జరిగింది. బంతి పరిమాణం నుంచి సాచెట్లోకి తీసుకువచ్చాం. ఆ తర్వాత క్యాప్సూల్ అయితే ఉపయోగకరంగా ఉంటుందని, పర్స్‌లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు అనే ఆలోచనకు వచ్చాం. ఈ క్యాప్సూల్‌ని వేడినీటిలో వేసినప్పుడు కరిగిపోయి, డికాషన్ తయారవుతుంది. ఈ విధానం వల్ల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే సమస్యే తలెత్తదు. ఇది మంచి వ్యాపార ఆలోచనగా గుర్తించాం’ అని తెలియజేసే ఈ పరిశోధక బృందం తమ ప్రొడక్ట్‌కు లోగోను కూడా జోడించి ట్రేడ్‌మార్క్ లైసెన్స్ కి సబ్మిట్ చేశారు. ‘12 వ తరగతి పూర్తి చేసిన తర్వాత మేం మా వ్యాపార ఆలోచనను పూర్తిస్థాయి వెంచర్‌గా మారుస్తాం’ అని ఈ బృందం సంతోషంగా తమ సృజన గురించి వివరిస్తోంది. -
మమ్మల్నీ పాస్ చేయరూ.. ఇంటర్ విద్యార్థుల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది మార్చిలో ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన 1,92,172 మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. కరోనా కారణంగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించని అధికారులు అప్పట్లో వారిని కనీస మార్కులతో పాస్ చేస్తామని మౌఖికంగా పేర్కొన్నారు. కానీ దానిపై అధికారిక ప్రకటన జారీ చేయలేదు. మరోవైపు గత మార్చిలోనే ఇంటర్ సెకండియర్ వార్షిక పరీక్షల్లో ఫెయిలైన 1.47 లక్షల మంది విద్యార్థులకు కనీస ఉత్తీర్ణత మార్కులు వేసి పాస్ చేశారు. దీంతో తమనూ కనీస మార్కులతో పాస్ చేస్తారని ఫస్టియర్ ఫెయిలైన విద్యార్థులు భావించారు. అయితే నేటికీ దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడం, పరీక్షల షెడ్యూల్ విడుదల కావడం, ఫీజు తేదీలనూ ఇంటర్ బోర్డు ప్రకటించడంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఒకేసారి అన్ని పరీక్షలూ రాసేదెలా? ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న వారిలో ఫస్టియర్ ఫెయిలైన 1,92,172 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. మే 1 నుంచి ప్రారంభమయ్యే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు వారు కూడా హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు కరోనా కారణంగా వార్షిక పరీక్షలనే మేలో నిర్వహిస్తుండటంతో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహించే అవకాశమే లేకుండా పోయింది. ఉన్న సమయం ద్వితీయ సంవత్సర సిలబస్ చదువుకునేందుకే సరిపోతుంది. కాగా, తాము రెండేళ్ల పరీక్షలను ఒకేసారి ఎలా రాస్తామని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఫస్టియర్‌లో తమను పాస్ మార్కులతో ఉత్తీర్ణులను చేయాలని కోరుతున్నారు. లేకపోతే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం ఇంటర్ ఫస్టియర్‌లో ఫెయిలైన 1,92,172 మంది విద్యార్థుల విషయమై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కష్టసాధ్యం. పైగా ఆయా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంది. కాబట్టి వారికి పరీక్షలు నిర్వహించాలా లేదా ఉత్తీర్ణత మార్కులు వేసి పాస్ చేయాలా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు చేస్తాం. అయితే కనీస మార్కులతో పాస్ చేయాలనే అంశాన్ని ప్రభుత్వానికి పంపే నివేదికలో పేర్కొంటాం. – సయ్యద్ ఉమర్ జలీల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి -
తూర్పుగోదావరి: క్లాస్‌రూంలో పెళ్లి
-
క్లాస్‌రూంలో పెళ్లి చేసుకున్న ఇంటర్ స్టూడెంట్స్
సాక్షి, తూర్పుగోదావరి : ఇంటర్మీడియట్ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తరగతి గదిలోనే పెళ్లి చేసుకున్న ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జూనియర్ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇంటర్మీడియట్ సెకండియర్ ఎంపీసీ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు గతనెల 17న తరగతి గదిలోనే తూతూమంత్రంగా వివాహం చేసుకున్నారు. మూడు ముళ్లు వేసి బొట్టు పెట్టి పెళ్లి చేసుకున్న తతంగం మొత్తాన్ని వీడియో తీసుకున్నారు. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో కాలేజీ ప్రిన్సిపల్ వారికి టీసీ ఇచ్చి పంపించేశారు. అయితే ఇది నిజమైన పెళ్లికాదని, సోషల్ మీడియాలో లైకుల కోసం మాత్రమే చేశామని విద్యార్థులు చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థుల పేరేంట్స్‌కు సమాచారం ఇచ్చామని తెలిపారు. అయితే విద్యార్థులు చేసిన పనితో వారి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో ఇలాంటి పిచ్చి పనులు చేయడమేంటని తలపట్టుకుంటున్నారు. చదువుకోమని కాలేజీ పంపిస్తే తమ పరువును ఇలా బజారుకీడుస్తారా అంటూ వాపోతున్నారు. -
సర్కారు కొలువుకు ఉచిత శిక్షణ
సాక్షి, సిద్దిపేట : సర్కార్ ఉద్యోగం సాధిస్తే జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. అందులోనూ పోలీస్ ఉద్యోగమంటే యువతకు ఎంతో క్రేజీ. ఇంటర్మీడియట్ పూర్తి కాగానే కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసుకున్న, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పోలీస్ కానిస్టేబుల్ శిక్షణను అందించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలు కోసం జిల్లా కేంద్రాల్లోని జూనియర్ కళాశాలలను ఎంపిక చేసింది. టీశాట్, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్, విద్యాహెల్ప్ లైన్ల సహకారంతో నిర్వహించనున్న ఈ శిక్షణకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్(పీటీసీ)గా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో పీటీసీని ఏర్పాటు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించగా అందులో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్స్, స్టూడెంట్ కౌన్సిలర్లు శిక్షణలో భాగస్వాములు కానున్నారు. చక్కని స్పందన ఇంటర్ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ శిక్షణకు జిల్లాలోని విద్యార్థుల నుంచి చక్కని స్పందన లభిస్తుంది. 100మంది విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణను అందించాల్సి ఉంటుంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ పూర్తి చేసిన, ద్వితీయ సంవత్సరం చదువుతున్న అర్హులైన విద్యార్థులతో పాటు మోడల్ స్కూల్స్, రెసిడెన్సియల్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 20 పోలీస్ ట్రైనింగ్ శిక్షణా కేంద్రాల్లో సిద్దిపేట జిల్లా నుంచి ఉత్తమ స్పందన లభించినట్లు తెలుస్తుంది. మొత్తంగా 300లకు పైగా విద్యార్థులకు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హతలు అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారై ఉండాలి. వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. పురుషులు 167.5 సెం. మీ ఎత్తు, చాతి 86.3 సె.మీతో పాటు గాలి పీల్చినపుడు అదనంగా 3 సెం. మీలు ఉండాలి. మహిళలు 156.7 సెం. మీ ఎత్తు, 80 సెం.మీ చాతి గాలిపీల్చినపుడు 3 సె.మీ అదనంగా కలిగి ఉండాలి. నేడే ఎంపికలు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గురువారం ఉదయం 10 గంటల నుంచి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శారీరక ధృడత్వ పరీక్షలను నిర్వహించి ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు తమ టెన్త్, ఇంటర్, ఆధార్‌కార్డు జిరాక్స్‌లను వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మున్సిపల్ శాఖ సహకారంతో మైదానాన్ని శుభ్రం చేశారు. ఎంపికల కోసం పోలీసు శాఖ సహకారాన్ని తీసుకుని అభ్యర్థుల చాతి విస్తీర్ణం, ఎత్తు, బరువులను కొలవనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి అవసరమైన శిక్షణను త్వరలోనే ప్రారంభించనున్నారు. శిక్షణ ఉదయం 6 నుంచి 7గంటల వరకు ఫిజికల్ ప్రాక్టీస్ ఉంటుంది. అనంతరం తరగతులను నిర్వహించి సిలబస్‌లోని అంశాలను వివరిస్తారు. రోజువారి క్యాలెండర్‌ను రూపొందించి తరగతులను నిర్వహిస్తారు. అధ్యాపకులు, పోలీస్‌శాఖ వారిచే స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలను ఇప్పిస్తారు. దాతలు సహకరిస్తే ట్రాక్‌షూట్, టీషర్ట్‌లతో పాటు స్టడీ మెటీరియల్‌ను అందించే ప్రయత్నం చేస్తున్నారు. పక్షం రోజులకోసారి గెస్ట్ లెక్చర్లతో ఉపన్యాసాలు ఉంటాయి. సిలబస్ పూర్తయ్యేంత వరకు లేదా త్వరలో ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే వరకు శిక్షణను అందించనున్నారు. -
ఇంటర్లో గ్రేస్ మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో కనీస పాస్ మార్కులను (గ్రేస్ మార్కులు) ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదనలు పంపించినా... కనీస పాస్ మార్కులు ఇచ్చేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఇబ్బందికరమన్న ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు కూడా మూడు ప్రతిపాదనలను ప్రభు త్వానికి పంపించింది. అందులో ప్రభుత్వం ఏ ప్రతిపాదనకు ఓకే అంటే దానిని అమలు చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. (నిర్లక్ష్యమే అసలైన మహమ్మారి) వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన 3,29,340 మంది విద్యార్థులు అందరికీ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదించారు. అందరికీ పరీక్షల నిర్వహణ కుదరదనుకుంటే 1,67,630 మంది ప్రథమ సంవత్సర విద్యార్థులను పక్కన పెట్టి... 1,61,710 మంది ద్వితీయ సం వత్సర విద్యార్థులకైనా పరీక్షలు నిర్వహించా లని మరో ప్రతిపాదన చేశారు. ఇక ఈ రెండూ వద్దనుకుంటే విద్యార్థులకు కనీస పాస్ మార్కులను ఇచ్చి ఉత్తీర్ణులను చేసే ప్రతిపాద నను పంపించారు. ఆ మూడు ప్రతిపాదన లతో కూడిన ఫైలు ప్రస్తుతం సీఎం ఆమోదం కోసం పంపించారు. అయితే గతంలో ఉన్నత స్థాయిలో జరిగిన భేటీలో ప్రస్తుత కరోనా పరి స్థితుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవ చ్చనే అభిప్రాయానికే అధికారులు వచ్చారు. 10 నుంచి 20 వరకు గ్రేస్ మార్కులు కలపాలనే ఆలోచన చేసినా... అప్పటికీ పాస్ కాని వారు కోర్టులకు వెళితే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనాల్సి వస్తుందనే భావనతో అందరికీ పాస్ మార్కులు వేయాలనే ప్రతిపాదన వైపే మొగ్గారు. మొత్తం మూడు ప్రతిపాదనలతో సీఎం ఆమోదానికి ఫైలును పంపించారు. సీఎం ఓకే చెప్పాక ఇంటర్ బోర్డు తదుపరి కార్యాచరణను చేపట్టనుంది. ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో విద్యార్థులకు 100 మార్కులకుగాను 35 మార్కులు వేసి పాస్ చేయనున్నారు. మ్యాథమెటిక్స్‌లో గరిష్ట మార్కులు 75కు గాను 27 మార్కులను వేసి పాస్ చేస్తారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో 60 మార్కులకు 21 మార్కులు వస్తే పాస్ కాబట్టి ఆ మార్కులను వేసి విద్యార్థులందరిని పాస్ చేయనున్నారు. మరోవైపు ఇపుడు విద్యార్థులు మార్చిలో పాస్ అయినట్లు ఇవ్వాలా? జూన్/జూలైలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కింద పాస్ అయినట్లు ఇవ్వాలా? అన్న విషయంలోనూ నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేశారు. -
పోలీసుల సమయస్ఫూర్తి.. పరీక్ష రాసిన విద్యార్థులు
సాక్షి, లోకేశ్వరం(ముథోల్): పోలీసుల సమయస్ఫూర్తి ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడింది. బస్సు రాకపోవడంతో ఆరుగురు విద్యార్థులు ఆందోళనకు గురై.. వెంటనే 100కు డయల్ చేశారు. దీంతో పోలీసులు వచ్చి వారిని పరీక్ష కేంద్రానికి సమయానికి చేర్చారు. ఈ సంఘటన లోకేశ్వరంలో చోటుచేసుకుంది. మండలంలోని రాయపూర్‌కాండ్లీ, నగర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండలకేంద్రంలోని పరీక్షకేంద్రంలో ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. శుక్రవారం బస్ కోసం వేచిచూసినా.. సమయానికి రాలేదు. దీంతో వారు వెంటనే 100కు డయల్ చేశారు. వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై యాసీర్‌అరాఫత్ తన వాహనంలో ఆయా గ్రామాలకు చేరుకుని వారిని వాహనంలో ఎక్కించుకుని పరీక్ష కేంద్రం వద్ద వదిలిపెట్టారు. మరో ఐదు నిమిషాలు ఆలస్యమైతే విద్యార్థులు పరీక్షకు దూరమయ్యేవారు. పోలీసుల సమయస్ఫూర్తిని గ్రామస్తులు అభినందించారు. -
ఇంటర్ విద్యార్థుల కోసం యూట్యూబ్ చానెల్
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల కోసం యూట్యూబ్ చానెల్ ను ఇంటర్మీడియట్ బోర్డు అందుబాటులోకి తీసుకొస్తోంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పేరుతో ఇప్పటికే రూపొందించిన ఈ చానెల్లో వీడియో పాఠాలు పొందుపరుస్తున్నట్లు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల పాఠాలు అందులో పొందుపరిచినట్లు తెలిపారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన అన్ని పాఠాలను, ప్రథమ సంవత్సర పాఠాలను ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల ఆధ్వర్యంలో రూపొందిస్తున్నామని త్వరలోనే వాటిని అందులో పొందుపరుస్తామని పేర్కొన్నారు. టీశాట్, ఇతర వెబ్సైట్లకు సంబంధించిన పాఠాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. అన్ని సబ్జెక్టుల పాఠాలను రూపొందించాక వాటిని నిఫుణుల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలన జరిపి అప్రూవల్ తీసుకుంటామన్నారు. ఆయా వీడియో పాఠాలను విద్యార్థులకు వచ్చే జూన్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్త విద్యాసంవత్సరంలో విద్యార్థులు వాటిని ప్రారంభం నుంచే వీక్షించేలా చర్యలు చేపడతామని తెలిపారు. సైన్స్ ప్రాక్టికల్స్ ఎలా చేయాలన్న దానిపైనా పాఠాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పాఠాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే కాకుండా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కూడా చూసుకునేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు జేఈఈ, నీట్‌కు సంబంధించిన పాఠాలను కూడా రూపొందించే ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అమలు చేస్తున్నట్లు జలీల్ వెల్లడించారు. ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ (ఓఎంఆర్) బార్ కోడ్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించి ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ను (ఓసీఆర్) ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఓఎంఆర్‌లో బార్ కోడ్ విధానం ఉండనుం డగా, ఓసీఆర్‌లో విద్యార్థుల ఫొటోలు స్కాన్ చేస్తారని, ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకా రంతో పరీక్షలకు వచ్చింది ఆ విద్యార్థు లేనా? ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసేందుకు వచ్చారా? అన్నది సులభంగా గుర్తించే వీలుంటుందని వెల్లడించారు. ఓఎంఆర్ బబ్లింగ్‌ను మాత్రమే చూడనుంది. ఓసీఆర్ మాత్రం పదాల్లో రాసిన వివరాలను, నంబర్లను, బబ్లింగ్ నంబ ర్లను కూడా గుర్తిస్తుందని వెల్లడించారు. దాంతో జవాబులకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లో ఏమైనా తేడా లొస్తే వాటిని సులభంగా గుర్తించొచ్చని వివరించారు. ఒక విద్యార్థికి ఒక సబ్జెక్టులో 90% మార్కులు వచ్చి, మరొక సబ్జెక్టులో 9 మార్కు లే వస్తే ఆ అబ్నార్మల్ డిఫరెన్స్‌ను ఏఐతో గుర్తించొచ్చని వివరించారు. మార్చి 4 నుంచి ప్రారంభం అయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షలకు 9,65,840 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 1,339 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
మృత్యు తీరం.. స్నానానికి వెళ్లి..
అంతవరకు అక్కడే కలిసి తిరిగారు. అక్కడే కలిసి తిన్నారు. నవ్వుకున్నారు.. ఆడుకున్నారు.. సందడిగా గడిపారు. ఒక్క క్షణంలో పరిస్థితులు తారుమారైపోయాయి. వారి నవ్వులన్నీ సముద్ర ఘోషలో కలిసిపోయాయి. సందడులు రోదనలుగా మారిపోయాయి. అందంగా కనిపించిన సముద్ర తీరం తన భయంకర రూపాన్ని ప్రదర్శించింది. నది నీటి కలయికతో రూపు కోల్పోయి ఉన్న తీరం నలుగురు యువకులను అమాంతం లోపలకు లాక్కుపోయింది. కళింగపట్నం బీచ్‌లో ఆదివారం స్నానానికి దిగిన నలుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయి ఒడ్డు చేరగా.. మిగిలిన ముగ్గురి ఆచూకీ ఇంకా దొరకలేదు. యువకులంతా ఒకే కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. చేతికి అందివచ్చిన బిడ్డలు అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది. సాక్షి, గార(శ్రీకాకుళం రూరల్): కార్తీక ఆదివారం సందర్భంగా గార మండలంలోని కళింగపట్నం–మత్స్యలేశం పరిధిలో బీచ్‌కు వచ్చిన ఆరుగురు ఇంటర్ యువకుల్లో నలుగురు గల్లంతయ్యారు. శ్రీకాకుళంలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న శిర్ల శివరామిరెడ్డి (ప్రవీణ్‌కుమార్ రెడ్డి), కనుమూరు సంజయ్, యజ్ఞ నారాయణ పండా, అనపర్తి సుధీర్, షేక్ అబ్దుల్లా, లింగాల రాజసింహాలు ఆదివారం బీచ్‌కు వెళ్లారు. అక్కడే భోజనం ముగించుకొని కొంతసేపు ఇసుక దిబ్బలపై ఆడుకున్నారు. వారిలో రాజసింహా ఒడ్డునే ఉండగా, ఐదుగురు యువకులు సముద్రంలో దిగారు. ప్రమాదం పసిగట్టలేని వారంతా ఒకరిపై సరదాగా నీరు జల్లుకుంటూ ఆనందంగా గడిపారు. నీటిలో వడి ఎక్కువగా ఉండడంతో లోపలకు వెళ్లిపోవడం వారు గమనించలేకపోయారు. గమనించే సరికే నీరు లోపలకు లాక్కువెళ్లిపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన మెరైన్ పోలీసులు షేక్ అబ్దుల్లాను కాపాడగలిగారు. శిర్ల శివరామిరెడ్డి (ప్రవీణ్‌కుమార్ రెడ్డి), కనుమూరు సంజయ్, యజ్ఞ నారాయణ పండా, అనపర్తి సుధీర్‌లు మాత్రం నీటిలో మునిగిపోయారు. వీరిలో కొంత సేపటి తర్వాత సుధీర్ మృతదేహం కనిపించగా పోలీసులు ఒడ్డుకు తీసుకువచ్చారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ ఇంకా దొరకలేదు. పౌర్ణమి రోజులు కావడంతో రాత్రిపూట సముద్రం ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి. రోజంతా సందడి కనిపించిన తీరంలో ఈ ఘటనతో భయానక వాతావరణం నెలకొంది. మెరైన్ సీఐ అంబేడ్కర్, ఇన్చార్జి ఎస్సై సింహాచలం, స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాలింపు చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు అబ్దు ల్లా, రాజసింహతో మాట్లాడి సంఘటన తీరును తెలుసుకున్నారు. డీఎస్పీ మూర్తి, శ్రీకాకుళం పట్టణ సీఐ లలిత, తహసీల్దార్ జెన్ని రామారావు, మెరైన్ ఎస్ఐ జగన్ తదితరులు ఉన్నారు. ఆఖరి క్షణంలో... సముద్రస్నానంలో గల్లంతైన స్నేహితులు అంతా మెరిట్ స్టూడెంట్లే! శ్రీకాకుళం రూరల్: ఆ విద్యార్థులంతా టెన్త్‌లో మంచి మార్కులు సాధించిన వారే. ఒక్కొక్కరూ ఒక్కో పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశారు. ఇంటర్ ఒకే క్యాంపస్‌లో చదవడంతో మంచి స్నేహితులు అయ్యారు. రెండు రోజులు సెలవులు కావడంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా పిక్నిక్కు వెళ్లారు. తిరిగి వచ్చేస్తామనే అనుకున్నారు గానీ.. ఇంతలో విధి ఇలా వికృతంగా ఆడుకుంది. కళింగపట్నం బీచ్‌లో గల్లంతైన వారంతా శ్రీకాకుళంలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గల్లంతైన వారి కుటుంబ నేపథ్యా లు పరిశీలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో కథ. గల్లంతైన వారిలో ముగ్గురు వారి తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడం విషాదకరం. బిడ్డల పరిస్థితిపై సమాచారం అందుకున్న ఆ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఎదిగి ఆదుకుంటారనుకున్న బిడ్డలు ఇలా అర్ధంతరంగా వదిలివెళ్లిపోయారని తెలిసి కంటికీమింటికీ ఏకధారగా రోదించారు. పచ్చళ్లు అమ్ముకుంటూ.. గల్లంతైన వారిలో ఒకడైన సుధీర్ తండ్రి కృష్ణ పచ్చళ్లు అమ్ముకుంటూ బతుకుతున్నారు. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళానికి వలస వచ్చిన వీరు పాతబ్రిడ్జి సమీపంలోని హయాతీనగరంలో నివాసముంటూ పచ్చళ్లు తయారు చేస్తుంటారు. సుధీర్ ఇంటర్ ఎంపీసీ సెకండియర్ చదువుతున్నారు. సుధీర్ తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం. ఒక్కగానొక్క కొడుకు సముద్రంలో మునిగి చనిపోయాడని తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదించారు. సుధీర్ పదో తరగతి వరకూ శ్రీకాకుళంలోని కేశవరెడ్డి స్కూల్లో చదివాడు. ఇంటికి వెళ్దామన్నా రాలేదు.. రెండు రోజులు సెలవులు వచ్చాయి. ఇంటికి వెళ్దామని తన తమ్ముడు యోగ్యనారాయణ పండాను బతిమలాడినా రాలేదని యజ్ఞ నారాయణ పండా అక్క ఇంద్రావతి పండా రోదిస్తూ చెప్పింది. వీరిద్దరూ కలిసి శ్రీకాకుళంలోని మహాలక్ష్మీనగర్ కాలనీలో తమ బంధువుల ఇంటి వద్ద అద్దెకు ఉంటూ చదువుకుంటున్నారు. తండ్రి పూర్ణచంద్రపండా ఇచ్ఛాపురంలోని నర్మదేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు. తల్లి నమితా పండా గృహిణి. వీరికి ఇద్దరు సంతానం. అందులో రెండో అబ్బాయి నారాయణ పండా. ఇతను పదోతరగతి వరకూ ఇచ్ఛాపురంలోని జ్ఞానభారతి పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఇంటర్మీడియట్ శ్రీచైతన్యలోని బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బిడ్డ పరిస్థితి తెలిసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అక్క ఇంద్రావతి రోదన ఆపడం ఎవరి తరం కాలేదు. దేవుని సేవలు చేస్తున్నా.. గల్లంతైన వారిలో ఒకరైన సంజయ్ తండ్రి ఐరన్ కుమార్ నిత్యం దేవుని సేవలోనే ఉంటారు. ఇండియన్ ఇమాజినల్ మిషన్‌లో ఆయన పనిచేస్తున్నారు. ఈ దంపతులకు కూడా సంజయ్ ఒక్కగానొక్క సంతానం. నిత్యం దేవుని సేవలో గడిపే తమకు ఇంత పెద్ద దుఖం వస్తుందని ఊహించలేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. ఎదిగి వచ్చిన కొడుకు ఇలా అయిపోవడంతో తల్లడిల్లిపోయారు. వీరు శ్రీకాకుళంలోని ఏపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్నారు. తల్లి సుశీలా డీఆర్డీఏలో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి కరుమారి సంజయ్ శ్రీచైతన్యలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు కేంద్రీయ విద్యాలయంలో పదోతరగతి పూర్తి చేశాడు. బయటకు వెళ్తానని చెప్పి.. ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్తానని చెప్పిన కొడుకు మళ్లీ తిరిగిరాకుండా వెళ్లిపోతాడని అనుకోలేదని శివరామిరెడ్డి తల్లిదండ్రులు రామిరెడ్డి, లత భోరున విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు చిర్ల శివరామరెడ్డి ఇలా సముద్రంలో గల్లంతవుతాడని ఊహిం చలేదని వారు రోదిస్తున్నారు. శ్రీకాకుళంలోని 80 ఫీట్‌రోడ్‌లో వీరు నివాసం ఉంటున్నారు. తండ్రి వృత్తిరీత్యా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు. శ్రీచైతన్య కళాశాల్లో ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నాడు. పదోతరగతి కుడా శ్రీచైతన్య టెక్నో స్కూల్లోనే చదివాడు.(చదవండి: సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతు) -
ప్రభుత్వ చర్యలతో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల కట్టడి
సాక్షి, అమరావతి: విద్యను వ్యాపారంలా చూడకుండా ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కోసం కమిషన్‌ను తీసుకొస్తున్నట్టు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యారంగంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సోమవారం అసెంబ్లీలో సమాధానమిచ్చారు. సేవా దృక్పథంతో విద్యను అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. మోడల్ స్కూళ్ల పేరుతో మూసేసిన స్కూళ్లను మళ్లీ తెరిపించే దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 10 ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభించామని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఒకే యాజమాన్యం పలు ప్రైవేటు విద్యాసంస్థలను నడుపుతోందని, పర్యవేక్షణ, నియంత్రణ లేకపోవడంతో ప్రైవేటు విద్యాసంస్థలు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పలు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల కట్టడి జరుగుతోందని కథనాలు వస్తున్నాయన్నారు. అమ్మఒడి పథకాన్ని పగడ్బందీగా అమలుచేస్తామని, అమ్మఒడి పథకం ద్వారా రాష్ట్రంలో ఏడు లక్షలమందికిపైగా లబ్ధి చేకూరుతుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత పాటిస్తామని తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలుచేస్తున్నారని, దీనిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలను సేవా దృక్పథంతో నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సురేశ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ.. ప్రైవేటు విద్య వ్యాపారంలా మారిపోయిందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు సరైన ప్రమాణాలు పాటించడంలేదని, నాణ్యమైన విద్య అందివ్వడం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ఎల్కేజీ చదువు కోసం రూ. 25వేల నుంచి లక్ష వరకు ప్రైవేటు స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తున్నాయని సభకు తెలిపారు. అనుమతులు లేకపోయినా కొన్ని ప్రైవేటు స్కూళ్లు రెసిడెన్షియల్ క్యాంపస్‌లను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రించాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ.. చాలావరకు ప్రైవేటు స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నారాయణ సంస్థలకు ధారాదత్తం చేసిందని మండిపడ్డారు. -
సీఎం జగన్‌కు ఇంటర్ విద్యార్థుల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి : ‘అమ్మఒడి’ పథకాన్ని ఇంటర్మీడియట్‌కు కూడా వర్తింపజేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం శాససభ ఆవరణలో సీఎంను కలిసి హర్షం వ్యక్తం చేశారు. అమ్మఒడి పథకం సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు ఎంతగానో తోడ్పడుతోందని, అమ్మలకు ఆసరాగా నిలుస్తోందని విద్యార్థులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. పేదరికం కారణంగా బాలికలను పదవ తరగతి పూర్తికాగానే ఉన్నత చదువులకు వెళ్ళకుండా నిలిపివేస్తున్న తల్లిదండ్రులకు ఈ పథకం అండగా నిలుస్తోందని, బాలికలు సైతం ఉన్నత విద్య చదువుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. అమ్మఒడి పథకం.. తల్లులకు బంగారు ఒడిగా.. పిల్లలకు చదువుల తల్లిగా మారిందని సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ‘ధన్యవాదాలు సీఎం సార్’ అంటూ ఇంటర్మీడియట్ విద్యార్థులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ‘మా మంచి ముఖ్యమంత్రి’ అంటూ నగర వీధుల్లో కదం తొక్కారు. చదవండి: ధన్యవాదాలు సీఎం సార్ -
ధన్యవాదాలు సీఎం సార్
పట్నంబజారు (గుంటూరు) : ‘అమ్మ ఒడి’ పథకం ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వర్తింపజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గుంటూరులో విద్యార్థిలోకం ముక్తకంఠంతో కృతజ్ఞతలు తెలిపింది. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్వచ్ఛందంగా రోడ్డెక్కి ‘ధన్యవాదాలు సీఎం సార్’ అంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. ‘మా మంచి ముఖ్యమంత్రి’ అంటూ నగర వీధుల్లో కదం తొక్కారు. లక్ష్మీపురంలో భారీ ర్యాలీ నిర్వహించి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో విద్యావ్యవస్థ కార్పొరేట్ కోరల్లో చిక్కుకోవడంతో విద్యార్థులు విలవిల్లాడారన్నారు. ఈ దశలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జగన్ ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉన్నత ఆశయంతో అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ పధకం తొలుత పాఠశాలలకే పరిమితమని ప్రకటించినా.. తర్వాత విశాల దృక్పథంతో ఇంటర్‌కు కూడా వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. అందుకు గాను యావత్ విద్యార్థి లోకం తరుపున సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. పానుగంటి చైతన్య మాట్లాడుతూ, టీడీపీ పాలనలో అందని ద్రాక్షగా మారిన విద్యను అందరికీ అందుబాటులోకి తేవడమే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ముఖ్యమంత్రి నవరత్నాల పథకంలో విద్యా రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్ధి విభాగం నేతలు విఠల్, రవి, బాజి పాల్గొన్నారు. -
ఇంటర్ విద్యార్థులతో ఆటలు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల వెల్లడిలో ఇంత అలసత్వమా...? ఇంటర్మీడియెట్ బోర్డు నిర్వాకం వల్ల ఇన్ని తప్పులా..? అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ సమస్యల కారణంగా మొదటి నుంచి డాటా ప్రాసెస్‌లో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. దీంతో గందరగోళానికి గురైన బోర్డు ఫలితాలను సరిగ్గా ఇవ్వలేకపోయింది. మెమో ల్లో తప్పులకు కారణమైంది. 8.7 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన ఫలితాల విషయంలో అలసత్వం ప్రదర్శించింది. వందలాది మంది విద్యార్థుల ఫలితాల్లో తప్పులు దొర్లాయి. పొరపాట్లను సరిదిద్దేందుకు బోర్డు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముగ్గురు విద్యార్థుల ఫలితాల విషయంలో చీఫ్ సూపరింటెండెంట్లు పొరపాటు చేశారంటూ నెపాన్ని వారిపై నెట్టివేసింది. సామర్థ్యంలేని సాఫ్ట్వేర్ సంస్థకు డాటా ప్రాసెస్, ఫలితాల ప్రాసెస్ పనులను అప్పగించడంపై మొదటి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో తప్పులు దొర్లడంతో శుక్రవారం ఆ ఫలితాలను సవరించింది. పొరపాట్లు దొర్లిన విద్యార్థులు వందలాది మంది ఉన్నా ముగ్గురి విషయంలోనే తప్పిదాలు జరిగాయ ని బోర్డు ప్రకటించింది. పొరపాట్లను సవరించామని వెల్లడించింది. విద్యార్థులు అధికారిక సమాచారం కోసం తమ వెబ్సైట్ (bie.telangana.gov.in)లోగాని, హెల్ప్‌డెస్క్(040–24600110)లోగాని సంప్రదించవచ్చని సూచించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి అశోక్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. బోర్డు కార్యదర్శి ఏం చెప్పారంటే... ‘ఇంటర్మీడియెట్–2019 ఫలితాల్లో ముగ్గురు విద్యార్థుల మార్కుల మెమోల్లో తప్పులు దొర్లాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థి కావలి సాయికిరణ్ (హాల్‌టికెట్ నంబర్ 1959240336) ఇంగ్లిష్ పేపరు–2 పరీక్ష రాసినా ఆబ్సెంట్, ఫెయిల్ అని రిజల్ట్ వచ్చింది. ముద్దసాని ప్రణయ్వ్యాస్(1959249896) ద్వితీయ సంవత్సరం సంస్కృతం పేపరు–2 పరీక్షకు హాజరైనా ఆబ్సెంట్, ఫెయిల్ అని వచ్చింది. ఈ ఇద్దరి విషయంలో ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు బ్లాంక్ బార్కోడ్ వివరాలను ఇంటర్ బోర్డుకు సమర్పించనందున ఆ సబ్జెక్టుల మార్కులు మెమోల్లో రాలేదు. ఆ వివరాలను పరీక్ష కేంద్రం నుంచి సేకరించి ఆ విద్యార్థుల మెమోల్లో పొందుపరిచి సంబంధిత కాలేజీలకు పంపిస్తాం. మరో విద్యార్థి బైరెడ్డి వర్షిత్‌రెడ్డి(1959248716) ద్వితీయ సంవత్సరం ఇంగిష్ పేపరు–2 పరీక్షకు హాజరైనా మెమోలో ఆబ్సెంట్, ఫెయిల్ అని వచ్చింది. ఆ విద్యార్థి బ్లాంక్ బార్ కోడ్ వివరాలను బోర్డుకు సమర్పించే సమయంలో చీఫ్ సూపరింటెండెంట్ విద్యార్థి హాల్‌టికెట్‌ను తప్పుగా పొందుపర్చడం వల్ల మెమోలో ఆబ్సెంట్, ఫెయిల్ అని వచ్చింది. ఆ విద్యార్థికి సంబంధించిన సరైన హాల్‌టికెట్ నంబరుతో మార్కుల వివరాలను మెమోలో పొందుపరిచి సంబంధిత కాలేజీకి పంపిస్తాం. మేం పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనలో పారదర్శకత, బాధ్యతతో, తప్పులు లేకుండా చేపట్టాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి సమాచారం కోసమైనా బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను లేదా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలి’అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్న బోర్డు ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాల తప్పిదాల విషయంలో ఇంటర్మీడియెట్ బోర్డు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తోంది. తమ నిర్ణయాల వల్ల ఎలాంటి తప్పులు దొర్లలేదని, పరీక్షల నిర్వహణ సిబ్బంది తప్పిదాల కారణంగా మూడు తప్పులే జరిగాయంటూ సరైన సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. వందల మంది విద్యార్థుల మెమోల్లో మార్కులు రాలేదని, అనేక తప్పులు దొర్లాయని కాలేజీల యాజమాన్యాలు ఇంటర్మీడియెట్ బోర్డుకు శుక్రవారం రాతపూర్వకంగా విజ్ఞప్తులు చేసినా.. పెద్దగా తప్పులు జరగలేదన్నట్లు బోర్డు వ్యవహరించడం అనేక విమర్శలకు కారణం అవుతోంది. 44 మంది ఫస్టియర్ విద్యార్థులకు మెమోల్లో ఆబ్సెంట్ పడిందని, కొన్ని సబ్జెక్టుల్లో మార్కులు పడలేదని ఓ కాలేజీ యాజమాన్యం బోర్డుకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. ద్వితీయ సంవత్సరంలోనూ 77 మంది విద్యార్థులకు మార్కులు పడలేదని, ఆబ్సెంట్ అని వచ్చిందని సదరు యాజమాన్యం బోర్డు అధికారులకు విద్యార్థుల పేర్లు, హాల్‌టికెట్ నంబర్లు, సబ్జెక్టులవారీ మార్కులు, మార్కులు రాని సబ్జెక్టుల వివరాలను అందజేసింది. ఇలా పదుల సంఖ్యలో కాలేజీలు బోర్డుకు విజ్ఞప్తులు అందజేసినా బోర్డు కార్యదర్శి అశోక్ మాత్రం కేవలం ముగ్గురు విద్యార్థుల విషయంలోనే పొరపాట్లు దొర్లాయని ప్రభుత్వాన్నే తప్పుదోవ పట్టిస్తూ నివేదిక అందజేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తలేదని, సదరు సాఫ్ట్వేర్ సంస్థను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అనుభవంలేని సంస్థ వల్లే ఫలితాల్లో తప్పిదాలు : లక్ష్మణ్ ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి సాంకేతిక అంశాలు చూసే బాధ్యతను అనుభవం లేని సంస్థకు అప్పగించి విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఆ సంస్థ నిర్వాకం ఫలితంగా ఎన్నో తప్పులు దొర్లాయని, ఇది విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాలు వెలువడ్డ తర్వాత ఇప్పటివరకు ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డ నేపథ్యంలో ఈ తప్పిదాలపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు. అవకతవకలపై గతంలో ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని విమర్శించారు. ఇదివరకు పరీక్షలకు సాంకేతికతను అందించిన అనుభవమున్న సంస్థను కాదని, ఓ ముఖ్యనేత సన్నిహితులకు చెందిన సంస్థకు ఆ కీలకబాధ్యత అప్పగించారని లక్ష్మణ్ ఆరోపించారు. తొమ్మిది లక్షల మందికిపైగా విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం సమాధానం చెప్పా లని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 18న ఉదయం ఫలితాలు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ తప్పి దాలను కప్పిపుచ్చుకోవడానికే సాయం త్రం 5 గంటలకు ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. -
కాలేజీల్లో ‘భోజనం’ ఊసేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి చందంగా తయారైంది. రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన దీని అమలుపై ఇటీవల కద లిక రావడంతో ఇక కచ్చితంగా పథకం అమల్లోకి వస్తుందని అంతా భావించారు. మంత్రుల కమి టీ ఏర్పాటు, భోజనం అందించే సంస్థతో కమిటీ సంప్రదింపులు జరపడం, మంత్రులు మధ్యాహ్న భోజనాన్ని రుచి చూడటమూ జరిగిపోయింది. సమగ్ర ప్రతిపాదనలను ఈ నెల 6న సమర్పించాలంటూ కమిటీ పేర్కొనడంతో పథకం ప్రారంభం లాంఛనమే అనే స్థాయిలో హడావుడి జరిగింది. అయితే 2 వారాలైనా మధ్యాహ్న భోజనం అమలు ఊసే లేదు. దీంతో రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని 2 లక్షల మంది విద్యార్థులకు, డిగ్రీ, మోడల్ స్కూల్స్, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎడ్, డీఎడ్ కాలేజీల్లోని మరో 1.6 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలుకు నోచుకుంటుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఆగస్టు 15 నుంచే పథకాన్ని అమలు చేసేలా తొలుత కసరత్తు జరిగినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ప్రతిపాదనలకే పరిమితం... ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూళ్లు, డిగ్రీ, ఐటీఐ కాలేజీల్లో చదివే విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. పాలిటెక్నిక్, బీఎడ్, డీఎడ్ కాలేజీల్లో చదువుతున్న వారిలోనూ నిరుపేద విద్యార్థులు ఉన్నారు. అందులో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే అత్యధికం. అలాంటి వారికి మధ్యాహ్న భోజనం అందిస్తే కాలేజీకి రోజూ రావడంతోపాటు బాగా చదువుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. అంతేకాదు పనులకు వెళ్లే విద్యార్థులను చదువు వైపు మళ్లించవచ్చని అనుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌డబ్ల్యూడీసీ) అధికారులను సంప్రదించి పథకం అమలుకు ఖర్చు అంచనాల వివరాలను తెప్పించారు. పథకం పనులకు రూ. 42 కోట్లు అవసరం అవుతాయని పేర్కొంటూ టీఎస్‌డబ్ల్యూడీసీ ఫైలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపగా ఆర్ఐడీఎఫ్ నిధుల నుంచి ఆ మొత్తాన్ని కేటాయించాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు రోజువారీ నిర్వహణ, ఇతర ఖర్చులు కలుపుకుంటే ఏటా రూ. 201 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని అంచనా వేశారు. అంత మొత్తం వెచ్చించే పరిస్థితి లేదని 2016 నుంచి ఈ ఫైలును పక్కన పెట్టేశారు. అయితే ఇటీవల మళ్లీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టింది. ఇంటర్మీడియెట్‌తోపాటు డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎడ్, డీఎడ్, మోడల్ స్కూల్స్ విద్యార్థులకూ భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని భావించింది. ఇందులో భాగంగా భోజనం అందించే ఏజెన్సీతోనూ చర్చలు జరిపారు. దాదాపు 3.60 లక్షల మంది విద్యార్థులకు భోజనం అందించేందుకు ఎంత మొత్తం వెచ్చించాల్సి ఉంటుందన్న వివరాలతో ప్రతిపాదనలను ఇవ్వాలని మంత్రుల కమిటీ కోరింది. ఆగస్టు 6వ తేదీన ఆ ప్రతిపాదనలను అందజేయాలని పేర్కొంది. కానీ ఆ తరువాత నుంచి భోజనం అమలు విషయంలో కదలిక లేకుండాపోయింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో పథకాన్ని అమలు చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయవద్దని, వీలైనంత త్వరగా పథ«కాన్ని అమలు చేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ప్రాక్టికిల్స్..
ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ అంటేనే ప్రయోగాల కోర్సులు. రెండేళ్ల చదువు పూర్తి చేసేలోపు భౌతిక, రసాయన, జంతు, వృక్ష శాస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలు పూర్తి చేయాలి. ప్రయోగశాలకు వెళ్లి నేర్చుకోవాలి. చెట్టు, పుట్ట వెంబడి తిరిగి ఆకులు, పువ్వులు, మొక్కలు సేకరించాలి. ఇంటిలో ఉన్న బొద్దింకలతో పాటు కప్పలు, ఎర్రలు (వానపాములు) పట్టుకొని శస్త్రచికిత్సలు చేయాలి.. బొమ్మలు గీయాలి... రికార్డులు రాయాలి.. అప్పుడే ప్రాక్టికల్స్‌కు సిద్ధమైనట్టు. లేకపోతే ఫెయిల్.. మరో ఏడాది వేచి ఉండి ప్రాక్టికల్స్ రాస్తేనే ఉత్తీర్ణత.. ఇదంతా ఒకప్పటి మాట.. మరి ఇప్పుడేం జరుగుతోందంటే.. సాక్షి, సిద్దిపేట కాలానికి అనుగుణంగా సిలబస్‌లో మార్పులొచ్చినా.. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలు మారలేదు. అధ్యాపకులతో పాటు విద్యార్థులు ‘రెడీమేడ్’ ప్రయోగాలకు అలవాటు పడ్డారు. దానికి అనుగుణంగా పలు కళాశాలల్లో విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయించడం మరిచిపోయారు. పరీక్షలకు వచ్చే పరిశీలకులు, డిపార్టుమెంట్ ఆఫీసర్‌ను మచ్చిక చేసుకొని తమ విద్యార్థులకు కావాల్సినన్ని మార్కులు వేయించే పనిలో పలు ప్రైవేట్ కళాలల యాజమాన్యాలు ఇప్పటి నుండే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుండి నిర్వహించాలని ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 20 ప్రభుత్వ, 42 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 14 మోడల్ స్కూల్స్, 12 సోషల్ వెల్ఫేర్ కళాశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ప్రథమ సంవత్సరంలో 12,101 మంది, ద్వితీయ సంవత్సరం 12,256 మొత్తం 24,357 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ఈ ఏడాది ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరయ్యే వారిలో 4,084 మంది ఎంపీసీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ), 1,675 మంది బైపీసీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజి) ప్రాక్టికల్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అయితే వీరిలో ఇప్పటి వరకు సగానికి పైగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ చేయించలేదనే ఆరోపణలున్నాయి. మేనేజ్ చేసుకోవడమే మార్గం విద్యార్థులతో ప్రాక్టికల్స్ చేయించలేదు. కానీ తమ కళాశాల విద్యార్థులకు మాత్రం స్టేట్ ర్యాంకులు రావాలి. అందరూ ఉత్తీర్ణులు కావాలి. అంటే ఒక్కటే ఒక్క మార్గం. ప్రాక్టికల్స్ పరీక్షల కోసం వచ్చే పరిశీలకులు తమకు అనువైన వారు కావాలి. అందుకోసం బోర్డు వద్దకు వెళ్లైనా అనుకూలమైన వారితో డ్యూటీ వేయించుకునే ప్రయత్నాలను పలు కళాశాలల యాజమాన్యాలు ఇప్పటికే మొదలు పెట్టినట్లు సమాచారం. అదేవిధంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి నియమించే డిపార్టుమెంట్ అధికారిని కూడా తమకు అనుకూలమైన వారిని రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో విద్యార్థులకు ఏమీ తెలియకపోయినా.. నిర్దేశించిన మార్కులు వేయించుకోవచ్చనేది వారి ధీమా. అయితే ఇలా ఇంటర్లో అడ్డదారిన అధిక మార్కులు సాధించిన పలువురు విద్యార్థులు తమకున్న థియరీ పరిజ్ఞానంతో ఐఐటీ, మెడికల్, ఇంజనీరింగ్‌లో సీట్లు పొందినా.. అక్కడ ప్రాక్టికల్స్ చేయడం రాక, తోటి విద్యార్థుల ముందు చులకన కావడం, అవమానంగా భావిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించలేక పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులను యంత్రం మాదిరిగా బట్టీ పట్టించి అధిక మార్కులు తెప్పిస్తున్నారని, ప్రాక్టికల్స్‌లో కూడిన బోధన లేకపోవడం విచారకరమని విద్యానిపుణులు అంటున్నారు. సాధారణ పరిజ్ఞానం కరువు పలువురు విద్యార్థులకు పిప్పెట్, బ్యూరెట్, ఘటం, ఆమ్లం, క్షారం, లవణం, వెర్నియర్ కాలిపస్, స్క్రూగేజీ, లఘులోలకం, అయస్కాంతం రకాలు, విద్యుత్ ప్రవాహం అంటే ఏమిటో తెలియదు. అదేవిధంగా ఏకదళ బీజం, ద్విదళ బీజం, కేసరాలు, అండాశయం, అంతర్ నిర్మాణాల గురించి అస్సలు తెలియని వారు కూడా ఉన్నారు. అదేవిధంగా జువాలజికి సంబంధించి డిటెక్షన్ అంటే తెలియదు. స్పెసిమిన్, స్లైడ్స్ గురించి అవగాహన లేనివారు ఉన్నట్లు పలువురు అధ్యాపకులే చెప్పడం విశేషం. దీంతో ఇటువంటి పరిస్థితిలో ఉన్న విద్యార్థులు రికార్డులు, హెర్బిరియం వంటికి రెడిమేడ్‌గా తీసుకువచ్చినా ప్రాక్టికల్స్ ఏం చేస్తారనేది ఆశ్చర్యకరమైన విషయం. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు.. జిల్లాలోని పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయంపై కళాశాలల యాజమాన్యాలకు సర్క్యులర్లు పంపించాం. ప్రరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. బోర్డు నిబంధనలు ఉల్లంగిస్తే చర్యలు తీసుకుంటాం. – నర్సింహులు, జిల్లా ఇంటర్ విద్యాధికారి -
ఇంటర్మీడియెట్‌లో 8పాయింట్ల గ్రేడింగ్
-
8పాయింట్ల గ్రేడింగ్
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్‌లో ఎనిమిది పాయింట్ల గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు మొదలుపెట్టింది. ఈ అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకొని, గ్రేడింగ్ విధానం అమలుకు ఉత్తర్వులు జారీ చేయనుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. 2018 మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, 2019లో రెండో సంవత్సర విద్యార్థులకు ఈ విధానాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. మార్కుల విధానం వల్ల తల్లి దండ్రులు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొనడంతో ఆ అంచనాలను అందుకోలేని విద్యార్థులు ఆత్మహత్యలవైపు మళ్లుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కుల విధానానికి స్వస్తిపలికి కేవలం గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని ఇంటర్ బోర్డు, తల్లిదండ్రులు, ప్రైవేటు యాజమాన్య ప్రతినిధులతో ఏర్పాటైన సలహా కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇంటర్లో గ్రేడింగ్ విధానం ఉన్నా ఏ గ్రేడ్‌లో ఎంత మంది ఉత్తీర్ణులవుతున్నారనే వివరాలను మాత్రమే బోర్డు ఇస్తోంది. విద్యార్థుల మెమోల్లో గ్రేడ్లను ఇవ్వడం లేదు. కానీ ఇకపై మార్కులు ఇవ్వకుండా గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని బోర్డు నిర్ణయానికి వచ్చింది. పదో తరగతి తరహాలోనే.... రాష్ట్రంలో పదో తరగతి తరహాలోనే ఇంటర్లో గ్రేడింగ్ విధానాన్ని బోర్డు అమల్లోకి తేనుంది. ఎనిమిది పాయింట్లుగా తీసుకురానున్న ఈ విధానంలో ప్రతి సబ్జెక్టుకు మార్కుల పరిధిని బట్టి గ్రేడ్ పాయింట్లు, గ్రేడ్, అన్ని సబ్జెక్టుల్లో గ్రేడ్ పాయింట్లనుబట్టి గ్రేడ్ పాయింట్ల యావరేజ్ ఇస్తారు. అలాగే ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో వచ్చిన గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల యావరేజ్నుబట్టి ఓవరాల్ గ్రేడ్ ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఫెయిల్ అయిన వారికి మాత్రం జీరో గ్రేడ్ పాయింట్‌తో ఈ గ్రేడ్ ఇస్తారు. ఎంసెట్‌లో వెయిటేజీపై 3 ప్రతిపాదనలు... గ్రేడింగ్ విధానం అమలు నేపథ్యంలో ఇంటర్ మార్కులకు ఉన్న వెయిటేజీ విషయంలో బోర్డు ప్రభుత్వానికి పంపేందుకు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో తొలి ప్రతిపాదన ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని తొలగించి ఎంసెట్ మెరిట్ ఆధారంగానే ప్రవేశాలు చేపట్టడం. ఇక రెండోది మార్కులకు బదులు సబ్జెక్టులవారీగా గ్రేడ్లను పరిగణనలోకి తీసుకోవడం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చే గ్రేడ్లనుబట్టి వెయిటేజీని లెక్కించి ఇవ్వడం. ఇక మూడోది విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చినా బోర్డు వద్ద మార్కులు ఉంటాయి కాబట్టి ఎంసెట్ ర్యాంకుల ఖరారు కోసం విద్యార్థుల మార్కులను బోర్డు ఎంసెట్ కన్వీనర్‌కు అందజేస్తే ఆ మార్కుల ఆధారంగా వెయిటేజీ లెక్కించి ఎంసెట్ ర్యాంకులు ఖరారు చేయడం. అయితే ఈ మూడు ప్రతిపాదనల్లో వెయిటేజీ రద్దుపైనే బోర్డు దృష్టిసారిçంచినట్లు తెలిసింది. ఎందుకంటే విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఇంప్రూవ్మెంట్ రాసినా, ఇంటర్ మార్కుల కోసం లేదా జవాబు పత్రం ఫొటోకాపీ కోసం దరఖాస్తు చేసుకున్నా మార్కులు వారికి తెలిసేటప్పటికి ప్రవేశాలు పూర్తవుతాయి కాబట్టి ఇబ్బంది ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. -
జాతీయ సైకిల్ పోలో పోటీలకు జిల్లా క్రీడాకారులు
ఒంగోలు: జాతీయ సైకిల్ పోలో పోటీలకు జిల్లాకు చెందిన నలుగురు ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జరిగిన రాష్ర్టస్థాయి సైకిల్ పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టు 6-2తేడాతో ప్రథమస్థానాన్ని కైవసం చేసుకుంది. స్థానిక ఆర్ఐవో కార్యాలయానికి ఆర్ఐవో ఉదయగిరి రమేష్‌బాబు క్రీడాకారులను ప్రశంసించారు. జాతీయ జట్టుకు ఎంపికైన పఠాన్షార్జాన్, కట్టా శివకృష్ణ, కుంచాల విజయ్, పోట్లూరి నరేష్‌లు జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. అండర్-19 స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఎం.హరనాథబాబు, ఏబీఎం కాలేజీ ప్రిన్సిపాల్ మోజెస్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ‘టీవీ’గా కోచింగ్
⇒ జేఈఈ పరీక్షలకు డీటూహెచ్, ఆన్లైన్ ఆధారిత శిక్షణ సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెరుున్, జేఈఈ అడ్వాన్సడ్ పరీక్షలకు హాజరయ్యే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు టీవీ ఆధారిత (డీటూహెచ్), ఆన్లైన్ శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) కసరత్తు చేస్తోంది. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి ఈ శిక్షణను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటు కోచింగ్ కేంద్రాల్లో శిక్షణకు విద్యార్థులు దేశవ్యాప్తంగా ఏటా రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా వారికి ప్రత్యామ్నాయ బోధన అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఐఐటీలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఐఐటీ ప్రొఫెసర్లు అసిస్టెడ్ లెర్నింగ్ (ఐఐటీ-పాల్) పథకం కింద 11, 12వ తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్టుల్లో ఈ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఢిల్లీ ఐఐటీ డెరైక్టర్ ప్రొఫెసర్ రాంగోపాల్‌రావు వెల్ల్లడించారు. ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి 200 పాఠాలు (లెక్చర్స్) రికార్డు చేసి డీ టూ హెచ్ విద్యా చానళ్ల ద్వారా ప్రసారం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించిన స్వయం ప్రభ ప్రత్యేక విద్యా చానళ్ల ద్వారా వీటిని ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సబ్జెక్టును ఒక్కో స్వయంప్రభ చానల్ ద్వారా నాలుగు చానళ్లలో నాలుగు సబ్జెక్టుల లెక్చర్లను ప్రసారం చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయా పాఠాలను విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచేందుకు ఎంహెచ్ఆర్డీ కసరత్తు చేస్తోంది. తద్వారా విద్యార్థులు ప్రైవేటు కోచింగ్ కేంద్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని భావిస్తోంది. ఐఐటీ ప్రొఫెసర్లతోపాటు కేంద్రీయ విద్యాలయాల ఆధ్యాపకులతోనూ ఈ పాఠాలు రూపొందించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. ఆ పాఠాలకు సంబంధించి ఏమైనా సందేహాలు తలెత్తితే విద్యార్థులు ఆన్లైన్లో ఐఐటీ ప్రొఫెసర్లను సంప్రదించి, సమాధానాలు పొందేలా ఏర్పాట్లు చేస్తోంది. ఏడాది తర్వాత కదలిక.. ఐఐటీ రూర్కీ డెరైక్టర్ అశోక్ మిశ్రా నేతృత్వంలో గతేడాది ఏర్పడిన కమిటీ జేఈఈ కోచింగ్‌పైనా అధ్యయనం చేసింది. దేశవ్యాప్తంగా ఈ కోచింగ్‌పై రూ.24 వేల కోట్ల వ్యాపారం జరుగుతోందని మిశ్రా స్పష్టం చేశారు. గ్రామీణ విద్యార్థులను జేఈఈ శిక్షణ పేరుతో ప్రైవేటు విద్యా సంస్థలు ఆకర్షిస్తూ.. వారిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో జేఈఈ పేరుతో వ్యాపారం చేస్తున్న ప్రైవేటు కోచింగ్ కేంద్రాలను నియంత్రించాలని గతేడాదే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. అయినా కేంద్రం వాటిపై చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం ప్రైవేటు కోచింగ్ కేంద్రాలకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు జేఈఈ శిక్షణను ప్రారంభించేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ తక్కువ కాదు.. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ రాత పరీక్షకు ఏటా 13 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే 1.50 లక్షల వరకు హాజరవుతున్నారు. జేఈఈ అడ్వాన్సడ్కు దేశవ్యాప్తంగా గత ఏడాది టాప్ 1.08 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే 25 వేల మంది వరకున్నారు. జేఈఈ మెరుున్, జేఈఈ అడ్వాన్సడ్ పరీక్షలకు ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. అందులో సగం మంది విద్యార్థులు ఇంటర్‌తోపాటు జేఈఈ కోచింగ్ తీసుకుంటుండగా, మరో 30 శాతం మంది విద్యార్థులు ప్రత్యేకంగా జేఈఈ పరీక్ష రాసేందుకే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. వారి నుంచి శిక్షణ కేంద్రాలు రూ.65 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఇలా జేఈఈ శిక్షణపైనే రూ.1,500 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా. అలాగే పాఠశాల స్థారుులో 8వ తరగతి నుంచే ఐఐటీ చదువులు, శిక్షణ పేరుతో వ్యాపారం సాగుతోంది. పేద విద్యార్థులకు ఎంతో మేలు కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చే టీవీ ఆధారిత, ఆన్లైన్ ఆధారిత జేఈఈ కోచింగ్‌తో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. జేఈఈ కోసం వేల రూపాయలు వెచ్చించడమే కాకుండా, హైదరాబాద్, ఇతర జిల్లా కేంద్రాల్లో ఉండి చదువుకునేందుకు భారీగా డబ్బు వెచ్చించాల్సి వస్తోంది. ఆన్లైన్, టీవీ ఆధారిత శిక్షణతో పేద విద్యార్థులకు ఆర్థిక భారం తప్పుతుంది. ఐఐటీ ప్రొఫెసర్లు రూపొందించే పాఠాలు వారికి ఎంతో ఉపయోగపడతాయి. - పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు -
జేఈఈ మెయిన్-2016లో మెరవాలంటే..
ఇంటర్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ విద్యార్థులు ఇంటర్మీడియెట్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ నెలాఖరుకు మెయిన్ సిలబస్, ఇంటర్ రెండేళ్ల సిలబస్‌లో ఉన్న ఉమ్మడి అంశాలను పూర్తి చేయాలి. జనవరిలో మెయిన్ సిలబస్‌లో ఉండి, ఇంటర్లో లేని అంశాలపై దృష్టి పెట్టాలి. ఫిబ్రవరి నుంచి పూర్తిగా ఇంటర్ పరీక్షల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. మార్చి చివరి వారంలో ఇంటర్ పరీక్షలు పూర్తయిన తర్వాత మెయిన్ పరీక్షపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. అప్పటికే తాము రాసుకున్న సొంత నోట్స్, షార్ట్ కట్ ఫార్ములాల ఆధారంగా రివిజన్ చేయాలి. ఆ సమయంలో కొత్త అంశాలు (అంటే అప్పటి వరకు చదవని, విస్మరించిన అంశాలు) చదవడం ఏ మాత్రం సరికాదు. టైం మేనేజ్మెంట్ ఇంటర్మీడియెట్ అకడమిక్ తరగతుల సమయాన్ని మినహాయిస్తే అందుబాటులో ఉండే సమయంలో కనీసం ఆరు నుంచి ఏడు గంటలు మెయిన్, ఇంటర్మీడియెట్ అంశాల ప్రిపరేషన్‌కు కేటాయించాలి. రోజూ ప్రతి సబ్జెక్ట్ చదివే విధంగా సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి. చదివేటప్పుడే ముఖ్యమైన అంశాలతో నోట్స్ రాసుకోవడంతోపాటు ఫార్ములాలు, సిద్ధాంతాలు ఉండేలా చూసుకోవాలి. ఇది రివిజన్ సమయంలో బాగా ఉపకరిస్తుంది. ఇలా ఇప్పటి నుంచే రోజూ వ్యూహాత్మకంగా ప్రిపరేషన్ సాగిస్తూ కనీసం 150 మార్కులు లక్ష్యంగా కృషి చేస్తే ‘కటాఫ్ రేంజ్’లో నిలిచే అవకాశాలు మెరుగవుతాయి. జేఈఈ మెయిన్-2015, 2014 అధికారిక కటాఫ్ స్కోర్లు విభాగం 2015 2014 కామన్ మెరిట్ లిస్ట్ 105 115 ఓబీసీ 70 74 ఎస్సీ 50 53 ఎస్టీ 44 47 మెయిన్ ద్వారా సీట్లు భర్తీ చేసే ఇన్స్టిట్యూట్లు - సీట్ల సంఖ్య ఇన్స్టిట్యూట్లు సంఖ్య సీట్లు ఎన్ఐటీలు 31 17,920 ట్రిపుల్ ఐటీలు 18 2,228 ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు 18 3,920 మొత్తం 67 24,068 గమనిక: ఎన్‌ఐటీల్లోని సీట్లలో 50 శాతం సీట్లను సదరు నిట్ ఏర్పాటై ఉన్న రాష్ట్ర విద్యార్థులకు హోం స్టేట్ కోటా కింద కేటాయిస్తారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ విద్యార్థులకు నిట్ వరంగల్‌లో 370 (మొత్తం సీట్లు 740); నిట్ తాడేపల్లిగూడెంలో 240 (మొత్తం సీట్లు 480) సీట్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు హోం స్టేట్ కోటాలో రిజర్వేషన్ ఉంటుంది. కాన్సెప్ట్స్, అప్లికేషన్స్, ప్రాక్టీస్ మెయిన్‌లో విజయానికి మూడు ముఖ్యమైన సూత్రాలు అనుసరించాలి. అవి కాన్సెప్ట్ ఆధారిత అధ్యయనం, అప్లికేషన్ నాలెడ్జ్, వీటిని ఆధారం చేసుకుంటూ నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఇంటర్ సిలబస్ అంతా సీబీఎస్ఈ స్థాయిలోనే ఉంది కాబట్టి జేఈఈ కోసం ప్రత్యేకంగా చదవాల్సిన అంశాలు చాలా తక్కువ. దీన్ని అనుకూలంగా మలచుకోవాలి. ఇంటర్ సిలబస్‌లోని అంశాలను చదువుతున్నప్పుడే వాటిని కాన్సెప్ట్ ఆధారితంగా, అప్లికేషన్ దృక్పథంతో అధ్యయనం చేస్తే జేఈఈ మెయిన్‌కు కూడా ప్రిపరేషన్ సరిపోతుంది. అదే విధంగా సెల్ఫ్ ప్రాక్టీస్, మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్‌లు కూడా మెయిన్‌లో విజయ సోపానాలు. - వాకచర్ల ప్రమోద్, జేఈఈ-మెయిన్ 2015 టాపర్ జేఈఈ మెయిన్ - 2016 సమాచారం అర్హత: బీటెక్ కోర్సు ఔత్సాహికులు 45 శాతం మార్కులతో; బీఆర్క్, బీప్లానింగ్ ఔత్సాహికులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. (రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు ఉంటుంది). 2014, 2015లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసినవారు; 2016లో చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. వయో పరిమితి: అక్టోబర్ 1, 1991 తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులు అక్టోబర్ 1, 1986 తర్వాత జన్మించి ఉండాలి. గరిష్ట పరిమితి: జేఈఈ-మెయిన్‌కు గరిష్టంగా మూడుసార్లు హాజరు కావచ్చు. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: డిసెంబర్ 1, 2015 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 31, 2015 పరీక్ష తేదీలు: ఆఫ్‌లైన్ పరీక్ష: ఏప్రిల్ 3 ఆన్లైన్ పరీక్ష: ఏప్రిల్ 9, ఏప్రిల్ 10 వెబ్సైట్: www.jeemain.nic.in 150 మార్కులు లక్ష్యంగా పెట్టుకుంటే.. జేఈఈ మెయిన్ అభ్యర్థులు 150 మార్కులు లక్ష్యంగా పెట్టుకుని కృషి చేయాలి. అప్పుడే పరీక్షలో నెగెటివ్ మార్కింగ్‌కు గురైనా కటాఫ్ రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రిపరేషన్ పరంగా కేవలం రీడింగ్‌కే పరిమితం కాకుండా వీలైనంత మేర ప్రాక్టీస్ చేయాలి. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్స్, డి-బ్లాక్ ఎలిమెంట్స్ వంటి వాటిని నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్‌కు ఉపకరిస్తుంది. ఇక ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లో అధిక శాతం అంశాలు ఇంటర్ రిలేటెడ్‌గా ఉంటాయి. కాబట్టి వాటిలో క్లిష్టంగా ఉన్న వాటిని ఛాయిస్ కోణంలో వదిలేద్దాం అనే భావన సరికాదు. తదుపరి పాఠ్యాంశాల్లో రాణింపుపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. జేఈఈ మెయిన్ ఔత్సాహిక అభ్యర్థులు డిసెంబర్ చివరికి జేఈఈ సిలబస్ పూర్తి చేసుకునే విధంగా ప్లాన్ రూపొందించుకోవడం మేలు. - డి.కె.ఝా, డెరైక్టర్, విజన్40 ఐఐటీ అకాడమీ, ఆథర్-అరిహంత్ పబ్లికేషన్స్ తెలంగాణ ఇంటర్మీడియెట్ ఎగ్జామ్-2016 టైం టేబుల్ ప్రథమ సంవత్సరం తేదీ సబ్జెక్ట్ మార్చి 2 సెకండ్ లాంగ్వేజ్ మార్చి 4 ఇంగ్లిష్ మార్చి 8 మ్యాథ్స్ 1-ఎ, బోటనీ, సివిక్స్, సైకాలజీ మార్చి 10 మ్యాథ్స్ 1-బి, జువాలజీ, హిస్టరీ మార్చి 12 ఫిజిక్స్, ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజ్ మార్చి 15 కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ఆర్ట్స్, మ్యూజిక్ మార్చి 17 జియాలజీ, హోంసైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మార్చి 19 జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజ్ ద్వితీయ సంవత్సరం తేదీ సబ్జెక్ట్ మార్చి 3 సెకండ్ లాంగ్వేజ్ మార్చి 5 ఇంగ్లిష్ మార్చి 9 మ్యాథ్స్ 2-ఎ, బోటనీ, సివిక్స్, సైకాలజీ మార్చి 11 మ్యాథ్స్ 2-బి, జువాలజీ, హిస్టరీ మార్చి 14 ఫిజిక్స్, ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజ్ మార్చి 16 కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ మార్చి 18 జియాలజీ, హోంసైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మార్చి 21 జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజ్ -
ఇంటర్ విద్యార్థులకు 'ఆధార్' పరీక్ష
- జిల్లాలో ఆధార్ కార్డులు లేని 10వేల మంది విద్యార్థులు - ఆధార్ నంబర్ అప్లోడ్ కాకపోతే ఫలితాల నిలిపివేత - ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు కొత్త టెన్షన్ మొదలైంది. ఇప్పటివరకు పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు ఇక ఆధార్ కార్డు కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి తలెత్తింది. విద్యార్థులందరూ ఆధార్ నంబరును సమర్పించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధన విధించడమే ఇందుకు కారణం. ఆధార్ నంబరు లేకుండా పరీక్ష రాసినా... వారి ఫలితాలను నిలిపివేస్తామని బోర్డు ప్రకటించింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, కార్పొరేట్ కళాశాలల్లో ఆధార్ పరీక్షను పూర్తిచేసుకునేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 10వేల మంది విద్యార్థులు ఆధార్ నంబరు సమర్పించలేదు. ఆధార్ కార్డులు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు తమ పిల్లలకు ఆధార్ కార్డులను వీలైంత త్వరగా తీసుకొచ్చి కళాశాలల్లో ఇచ్చేందుకు తల్లిదండ్రులు నానా హైరానా పడుతున్నారు. ఆధార్ ఎందుకంటే... ఇంటర్ మార్కుల జాబితాను మరింత పకడ్బందీగా జారీచేయడం కోసమే ఆధార్ నంబరు స్వీకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ బోర్డు జారీచేసే మార్కుల జాబితాలో విద్యార్థి పేరు, ఇతర వివరాలతోపాటు ఆధార్ నంబరు కూడా ఉంటుంది. తద్వారా నకిలీ మార్కులిస్టులను నిరోధించవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మా ర్కుల లిస్టు పోయినవారు మళ్లీ కావాల్సివస్తే సులభంగా పొందేందుకూ అవకాశం ఉంటుంది. జిల్లాలో 95 శాతం పూర్తి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 64,590 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 65,989 మంది ఉన్నారు. గత నెల రోజులుగా ఇంటర్ బోర్డు అధికారులు కళాశాల యాజమాన్యాలు, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాలు నిర్వహించి 95 శాతం మేర ఆధార్ వివరాలు సేకరించారు. ఇప్పటివరకు 1,21,630 మంది విద్యార్థుల ఆధార్ నంబర్లు ఆప్‌లోడ్ చేశారు. మరో పది వేల మంది వరకు ఆధార్ నంబర్లు ఇవ్వాల్సి ఉంది. ఆర్ఐవో ఎన్.రాజారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ విద్యార్థుల రికార్డుల భద్రత కోసమే ఆధార్ ఆప్‌లోడ్ చేస్తున్నామని చెప్పారు. రేపటి నుంచి ప్రాక్టికల్స్ గురువారం నుంచి మార్చి 4 వరకు ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు జిల్లాలో 51 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.