సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల వెల్లడిలో ఇంత అలసత్వమా...? ఇంటర్మీడియెట్ బోర్డు నిర్వాకం వల్ల ఇన్ని తప్పులా..? అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ సమస్యల కారణంగా మొదటి నుంచి డాటా ప్రాసెస్‌లో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. దీంతో గందరగోళానికి గురైన బోర్డు ఫలితాలను సరిగ్గా ఇవ్వలేకపోయింది. మెమో ల్లో తప్పులకు కారణమైంది. 8.7 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన ఫలితాల విషయంలో అలసత్వం ప్రదర్శించింది. వందలాది మంది విద్యార్థుల ఫలితాల్లో తప్పులు దొర్లాయి. పొరపాట్లను సరిదిద్దేందుకు బోర్డు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముగ్గురు విద్యార్థుల ఫలితాల విషయంలో చీఫ్ సూపరింటెండెంట్లు పొరపాటు చేశారంటూ నెపాన్ని వారిపై నెట్టివేసింది. సామర్థ్యంలేని సాఫ్ట్‌వేర్ సంస్థకు డాటా ప్రాసెస్, ఫలితాల ప్రాసెస్ పనులను అప్పగించడంపై మొదటి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో తప్పులు దొర్లడంతో శుక్రవారం ఆ ఫలితాలను సవరించింది. పొరపాట్లు దొర్లిన విద్యార్థులు వందలాది మంది ఉన్నా ముగ్గురి విషయంలోనే తప్పిదాలు జరిగాయ ని బోర్డు ప్రకటించింది. పొరపాట్లను సవరించామని వెల్లడించింది. విద్యార్థులు అధికారిక సమాచారం కోసం తమ వెబ్‌సైట్ (bie.telangana.gov.in)లోగాని, హెల్ప్‌డెస్క్(040–24600110)లోగాని సంప్రదించవచ్చని సూచించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి అశోక్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
బోర్డు కార్యదర్శి ఏం చెప్పారంటే...
‘ఇంటర్మీడియెట్–2019 ఫలితాల్లో ముగ్గురు విద్యార్థుల మార్కుల మెమోల్లో తప్పులు దొర్లాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థి కావలి సాయికిరణ్ (హాల్‌టికెట్ నంబర్ 1959240336) ఇంగ్లిష్ పేపరు–2 పరీక్ష రాసినా ఆబ్సెంట్, ఫెయిల్ అని రిజల్ట్ వచ్చింది. ముద్దసాని ప్రణయ్‌వ్యాస్(1959249896) ద్వితీయ సంవత్సరం సంస్కృతం పేపరు–2 పరీక్షకు హాజరైనా ఆబ్సెంట్, ఫెయిల్ అని వచ్చింది. ఈ ఇద్దరి విషయంలో ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు బ్లాంక్ బార్‌కోడ్ వివరాలను ఇంటర్ బోర్డుకు సమర్పించనందున ఆ సబ్జెక్టుల మార్కులు మెమోల్లో రాలేదు. ఆ వివరాలను పరీక్ష కేంద్రం నుంచి సేకరించి ఆ విద్యార్థుల మెమోల్లో పొందుపరిచి సంబంధిత కాలేజీలకు పంపిస్తాం. మరో విద్యార్థి బైరెడ్డి వర్షిత్‌రెడ్డి(1959248716) ద్వితీయ సంవత్సరం ఇంగిష్ పేపరు–2 పరీక్షకు హాజరైనా మెమోలో ఆబ్సెంట్, ఫెయిల్ అని వచ్చింది. ఆ విద్యార్థి బ్లాంక్ బార్ కోడ్ వివరాలను బోర్డుకు సమర్పించే సమయంలో చీఫ్ సూపరింటెండెంట్ విద్యార్థి హాల్‌టికెట్‌ను తప్పుగా పొందుపర్చడం వల్ల మెమోలో ఆబ్సెంట్, ఫెయిల్ అని వచ్చింది. ఆ విద్యార్థికి సంబంధించిన సరైన హాల్‌టికెట్ నంబరుతో మార్కుల వివరాలను మెమోలో పొందుపరిచి సంబంధిత కాలేజీకి పంపిస్తాం. మేం పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనలో పారదర్శకత, బాధ్యతతో, తప్పులు లేకుండా చేపట్టాం. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి సమాచారం కోసమైనా బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను లేదా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలి’అని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్న బోర్డు
ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాల తప్పిదాల విషయంలో ఇంటర్మీడియెట్ బోర్డు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తోంది. తమ నిర్ణయాల వల్ల ఎలాంటి తప్పులు దొర్లలేదని, పరీక్షల నిర్వహణ సిబ్బంది తప్పిదాల కారణంగా మూడు తప్పులే జరిగాయంటూ సరైన సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. వందల మంది విద్యార్థుల మెమోల్లో మార్కులు రాలేదని, అనేక తప్పులు దొర్లాయని కాలేజీల యాజమాన్యాలు ఇంటర్మీడియెట్ బోర్డుకు శుక్రవారం రాతపూర్వకంగా విజ్ఞప్తులు చేసినా.. పెద్దగా తప్పులు జరగలేదన్నట్లు బోర్డు వ్యవహరించడం అనేక విమర్శలకు కారణం అవుతోంది. 44 మంది ఫస్టియర్ విద్యార్థులకు మెమోల్లో ఆబ్సెంట్ పడిందని, కొన్ని సబ్జెక్టుల్లో మార్కులు పడలేదని ఓ కాలేజీ యాజమాన్యం బోర్డుకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. ద్వితీయ సంవత్సరంలోనూ 77 మంది విద్యార్థులకు మార్కులు పడలేదని, ఆబ్సెంట్ అని వచ్చిందని సదరు యాజమాన్యం బోర్డు అధికారులకు విద్యార్థుల పేర్లు, హాల్‌టికెట్ నంబర్లు, సబ్జెక్టులవారీ మార్కులు, మార్కులు రాని సబ్జెక్టుల వివరాలను అందజేసింది. ఇలా పదుల సంఖ్యలో కాలేజీలు బోర్డుకు విజ్ఞప్తులు అందజేసినా బోర్డు కార్యదర్శి అశోక్ మాత్రం కేవలం ముగ్గురు విద్యార్థుల విషయంలోనే పొరపాట్లు దొర్లాయని ప్రభుత్వాన్నే తప్పుదోవ పట్టిస్తూ నివేదిక అందజేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సాఫ్ట్‌వేర్ సమస్యలు తలెత్తలేదని, సదరు సాఫ్ట్‌వేర్ సంస్థను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.
అనుభవంలేని సంస్థ వల్లే ఫలితాల్లో తప్పిదాలు : లక్ష్మణ్
ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి సాంకేతిక అంశాలు చూసే బాధ్యతను అనుభవం లేని సంస్థకు అప్పగించి విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. ఆ సంస్థ నిర్వాకం ఫలితంగా ఎన్నో తప్పులు దొర్లాయని, ఇది విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాలు వెలువడ్డ తర్వాత ఇప్పటివరకు ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డ నేపథ్యంలో ఈ తప్పిదాలపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు. అవకతవకలపై గతంలో ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని విమర్శించారు. ఇదివరకు పరీక్షలకు సాంకేతికతను అందించిన అనుభవమున్న సంస్థను కాదని, ఓ ముఖ్యనేత సన్నిహితులకు చెందిన సంస్థకు ఆ కీలకబాధ్యత అప్పగించారని లక్ష్మణ్ ఆరోపించారు. తొమ్మిది లక్షల మందికిపైగా విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం సమాధానం చెప్పా లని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 18న ఉదయం ఫలితాలు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ తప్పి దాలను కప్పిపుచ్చుకోవడానికే సాయం త్రం 5 గంటలకు ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment