- జిల్లాలో ఆధార్ కార్డులు లేని 10వేల మంది విద్యార్థులు
- ఆధార్ నంబర్ అప్‌లోడ్ కాకపోతే ఫలితాల నిలిపివేత
- ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు కొత్త టెన్షన్ మొదలైంది. ఇప్పటివరకు పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు ఇక ఆధార్ కార్డు కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి తలెత్తింది. విద్యార్థులందరూ ఆధార్ నంబరును సమర్పించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధన విధించడమే ఇందుకు కారణం. ఆధార్ నంబరు లేకుండా పరీక్ష రాసినా... వారి ఫలితాలను నిలిపివేస్తామని బోర్డు ప్రకటించింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, కార్పొరేట్ కళాశాలల్లో ఆధార్ పరీక్షను పూర్తిచేసుకునేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 10వేల మంది విద్యార్థులు ఆధార్ నంబరు సమర్పించలేదు. ఆధార్ కార్డులు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు తమ పిల్లలకు ఆధార్ కార్డులను వీలైంత త్వరగా తీసుకొచ్చి కళాశాలల్లో ఇచ్చేందుకు తల్లిదండ్రులు నానా హైరానా పడుతున్నారు.
ఆధార్ ఎందుకంటే...
ఇంటర్ మార్కుల జాబితాను మరింత పకడ్బందీగా జారీచేయడం కోసమే ఆధార్ నంబరు స్వీకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ బోర్డు జారీచేసే మార్కుల జాబితాలో విద్యార్థి పేరు, ఇతర వివరాలతోపాటు ఆధార్ నంబరు కూడా ఉంటుంది. తద్వారా నకిలీ మార్కులిస్టులను నిరోధించవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మా ర్కుల లిస్టు పోయినవారు మళ్లీ కావాల్సివస్తే సులభంగా పొందేందుకూ అవకాశం ఉంటుంది.
జిల్లాలో 95 శాతం పూర్తి
జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 64,590 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 65,989 మంది ఉన్నారు. గత నెల రోజులుగా ఇంటర్ బోర్డు అధికారులు కళాశాల యాజమాన్యాలు, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాలు నిర్వహించి 95 శాతం మేర ఆధార్ వివరాలు సేకరించారు. ఇప్పటివరకు 1,21,630 మంది విద్యార్థుల ఆధార్ నంబర్లు ఆప్‌లోడ్ చేశారు. మరో పది వేల మంది వరకు ఆధార్ నంబర్లు ఇవ్వాల్సి ఉంది. ఆర్‌ఐవో ఎన్.రాజారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ విద్యార్థుల రికార్డుల భద్రత కోసమే ఆధార్ ఆప్‌లోడ్ చేస్తున్నామని చెప్పారు.
రేపటి నుంచి ప్రాక్టికల్స్
గురువారం నుంచి మార్చి 4 వరకు ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు జిల్లాలో 51 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఇంటర్ విద్యార్థులకు 'ఆధార్' పరీక్ష
Published Wed, Feb 11 2015 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM
Advertisement
Advertisement