భయం..అభయం..! | Tele Manas is inspiring the spirit of Inter students | Sakshi
Sakshi News home page

భయం..అభయం..!

Published Wed, Feb 12 2025 4:15 AM | Last Updated on Wed, Feb 12 2025 4:15 AM

Tele Manas is inspiring the spirit of Inter students

అన్నీ మర్చిపోయిన ఫీలింగ్‌ కలుగుతోంది..

ఫెయిల్‌ అవుతామనే భయం

నిద్ర పట్టడం లేదు..

1382 టోల్‌ ఫ్రీ నంబర్‌కు పెద్ద సంఖ్యలో ఫోన్లు

ఇంటర్‌ విద్యార్థుల్లో మనోధైర్యం నింపుతున్న టెలి మానస్‌  

పరీక్షల సమయంలో ఒత్తిడికి గురవుతున్నవారికి కౌన్సెలింగ్‌  

వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 24X7 సేవలు 

సూచనలు, చిట్కాలు, పాటించాల్సిన జాగ్రత్తలతో విద్యార్థులకు భరోసా 

1382 టోల్‌ ఫ్రీ నంబర్‌కుపెద్ద సంఖ్యలో ఫోన్లు 

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో కాల్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు పరీక్షల భయాన్ని, చదువుకు సంబంధించిన ఒత్తిడిని అధిగమించి, ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలకు సిద్ధమయ్యేలా తోడ్పడేందుకు ఏర్పాటైన ‘టెలి మానస్‌’సత్ఫలితాలనిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ నేతృత్వంలో నడుస్తున్న టెలి మానస్‌ను 1382 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా విద్యార్థులు పెద్ద సంఖ్యలో సంప్రదిస్తున్నారు. తల్లిదండ్రులు తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెబుతున్నారు. తమలోని ఆందోళన తెలియజేస్తున్నారు. 

వారి సమస్యలను, ఆందోళనను సావధానంగా వింటున్న టెలి మానస్‌ సైకాలజిస్టులు అవసరమైన కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఒత్తిడిని అధిగమించేలా సలహాలు, అనుసరించాల్సిన చిట్కాలు తెలియజేస్తున్నారు. అనేకమంది తల్లిదండ్రులు కూడా టెలీ మానస్‌ను ఆశ్రయిస్తుండటం గమనార్హం కాగా.. పిల్లల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో కౌన్సెలర్లు వారికి సూచనలిస్తున్నారు. 

తమ కౌన్సెలింగ్‌ విద్యార్థుల్లో మనో ధైర్యాన్ని నింపుతోందని సైకాలజిస్టులు, కౌన్సెలర్లు చెబుతున్నారు. డిసెంబర్‌ 24 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ మధ్యకాలంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ –మల్కాజిగిరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఫోన్లు వచ్చినట్లు వివరించారు.  

అర్ధరాత్రి వేళల్లోనూ కౌన్సెలింగ్‌
మంచి ర్యాంకులురావాలంటూ తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలు విధిస్తున్న టార్గెట్లతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షల తేదీలు సమీపిస్తున్న కొద్దీ వారిని భయం వెంటాడుతోంది. కాలేజీలో చెప్పలేక, ఇంట్లో మాట్లాడలేక దిగులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే అనేకమంది టెలి మానస్‌ను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిద్రండుల నుంచి ఈ తరహా ఫోన్లు రోజుకు సగటున 20 వరకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. టోల్‌ ఫ్రీ నంబర్‌ను 24 గంటలూ
అందుబాటులో ఉంచడంతో కొంతమంది అర్ధరాత్రి కూడా ఆందోళన పడుతూ ఫోన్లుచేస్తున్నారని  వివరించారు.

అన్నీ మర్చిపోయిన ఫీలింగ్‌ కలుగుతోంది.. 
టెలి మానస్‌కు వరంగల్‌ నుంచి ఓ విద్యార్థి ఫోన్‌ చేశాడు. ‘నేను హైదరాబాద్‌లో ప్రైవేటు రెసిడెన్షియల్‌ కాలేజీలో చదువుతున్నా. కాలేజీ పరీక్షల్లో ప్రతిసారీ మంచి మార్కులే వచ్చేవి. కానీ రెండు రోజులుగా భయం వేస్తోంది. నాన్న ఫోన్‌ చేసి మంచి ర్యాంకు కొడతావ్‌గా అంటాడు. 

కాలేజీ వాళ్ళేమో అర్ధరాత్రి కూడా చదవాల్సిందేఅంటున్నారు. పుస్తకం పట్టుకుంటే వణుకు వస్తోంది. అన్నీ మర్చి పోయానేమో అనే ఫీలింగ్‌ వస్తోంది..’అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. దీంతో అతనికి సైకాలజిస్టు ఒకరు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఒత్తిడిని అధిగమించేలా పలు సూచనలిచ్చారు.  

నిద్ర పట్టడం లేదు..
హైదరాబాద్‌ నుంచి సుమారు 40 రోజుల వ్యవధిలోనే అత్యధిక సంఖ్యలో 68 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. ఇందులో 28 మంది పరీక్షల తేదీ ప్రకటించిన తర్వాత నిద్ర పట్టడం లేదని తెలిపారు. 18 మంది పరీక్షలంటే గుబులేస్తోందని చెప్పారు. వీళ్లలో 12 మంది తల్లిదండ్రులు తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మంచి మార్కులు ఎలా వస్తాయో అన్న భయం వెంటాడుతోందని చెప్పారు.

ఆరుగురు మానసిక ఒత్తిడితో తలనొప్పి వస్తోందని చెప్పారు. మంచి ఆహారం తీసుకోవాలని, తగినంత సమయం నిద్ర పోవాలని సూచించడంతో పాటు, చదువు విషయంలో వారిని మానసికంగా ధైర్య పరిచేలా
కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

భయం భయంగా ఉంటున్నారు..
ఖమ్మంలోని ఓ గురుకుల ఉపాధ్యాయుడు ఫోన్‌ చేసి.. ‘బాగా చదివే నలుగురు విద్యార్థులు ఎందుకో మూడు రోజులుగా భయం భయంగా ఉంటున్నారు. గుచ్చి గుచ్చి అడిగితే పరీక్షలంటే కంగారుగా ఉందని చెప్పారు..’అని వివరించారు. దీంతో విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అప్పట్నుంచి వారు కాస్త ధైర్యంగా ఉన్నారని ఉపాధ్యాయుడు తెలిపారు. 

రంగారెడ్డి జిల్లా నుంచి పది మంది విద్యార్థులు పరీక్ష రాసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హాల్‌ టికెట్ల గురించి అడిగారు. మరో ఆరుగురు ఫెయిల్‌ అవుతామనే భయం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్‌ తర్వాత వారిలో ధైర్యం కన్పించిందని టెలి మానస్‌ సిబ్బంది చెప్పారు.  

ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్‌ జిల్లాల నుంచి 12 ఫోన్‌ కాల్స్‌ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చాయి. పిల్లలు పరీక్షలంటే భయపడుతున్నారని, వాళ్ళను ఏ విధంగా సన్నద్ధం చేయాలో చెప్పమని అడిగారు. ఆహారం, నిద్ర, తాగునీరు విషయంలో జాగ్రత్తలపై ఆరా తీశారు.  

చదవడం కన్నా రాయడం మంచిది
తల్లిదండ్రులు, కాలేజీలు విద్యార్థులపై మార్కులు,ర్యాంకుల కోసం ఒత్తిడి చేయొద్దు. వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి. రాత్రి నిద్ర సరిగా పోకుండా చదివితే ఉపయోగం లేదు. ఉదయాన్నే లేచి రివిజన్‌ చేసుకుంటే బెటర్‌. బాగా చదివిన సబ్జెక్టులు, చాప్టర్స్‌పై దృష్టి పెట్టాలి. టెన్షన్‌ తెప్పించే వాటిని సమయాన్ని బట్టి చూసుకోవడం మంచిది. 

పరీక్ష భయం ఉన్న వారు చదవడం కన్నా..సమాధానాలు ఒకటికి రెండుసార్లు రాయడం మంచిది. దీనివల్ల పరీక్ష తేలికగా రాసే వీలుంది. సబ్జెక్టులో ఇబ్బంది ఉంటే ఆందోళన చెందకుండా సంబంధిత లెక్చరర్‌ను కలిసి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. 

ఇళ్లలో టీవీలు, సెల్‌ఫోన్లకు విద్యార్థులే కాదు..తల్లిదండ్రులూ దూరంగా ఉండాలి. దీనివల్ల మానసికంగా చదివే కమాండ్‌ వస్తుంది. తల్లిదండ్రులు విద్యార్థి ఆందోళన గుర్తించాలి. బంధువులు, పరిచయస్తులతో ప్రోత్సాహకరమైన మాటలు చెప్పించాలి.   పరీక్షల సమయంలో ఆహారం, మంచినీరు చాలా ముఖ్యం. 

మంచి పౌష్టికాహారంతో పాటు, సమయ పాలన అనుసరించాలి. మెదడుకు 80 శాతం, ఇతర శరీర భాగాలకు 20 శాతం ఆక్సిజన్‌ అవసరం. ఇది
నీళ్ళ ద్వారానే ఎక్కువగా సమకూరుతుంది.ఉదయం వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడిని దూరంచేసుకోవచ్చు.
- పి.జవహర్‌లాల్‌ నెహ్రూ సీనియర్‌ సైకాలజిస్టు, టెలి మానస్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement