
రూ.39,300 కోట్లతో రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు
త్వరలో అన్ని రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం
మహిళా రైల్వేస్టేషన్‌గా బేగంపేట కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి
సనత్‌నగర్: రైల్వే ‘కవచ్’రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సికింద్రాబాద్‌లో ఏర్పాటు కానుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలవనుందని పేర్కొన్నారు. రైల్వే భద్రతలో కవచ్ వ్యవస్థ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా విజయవంతమైందని చెప్పారు. బేగంపేట రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను రైల్వే అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. బేగంపేట, చర్లపల్లి, మేడ్చల్, యాకుత్‌పురా, నాంపల్లి, కాచిగూడ, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్, మలక్‌పేట్, ఉందానగర్ రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంగీకరించారని తెలిపారు. ఆయా రైల్వేస్టేషన్లకు అప్రోచ్ రోడ్ల కోసం భూమిని సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. బేగంపేట రైల్వేస్టేషన్‌ను రూ.38 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
ఇప్పటికే తొలివిడత పనులు పూర్తయ్యాయని చెప్పారు. దీనిని మహిళా రైల్వేస్టేషన్‌గా మార్చనున్నట్లు కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ నుంచి ఉన్నతాధికారి వరకు అంతా మహిళలే ఉంటారని తెలిపారు. ఇప్పటివరకు జైపూర్‌లోని గాం«దీనగర్ రైల్వేస్టేషన్ ఒక్కటే దేశంలో పూర్తిగా మహిళా సిబ్బందితో నడుస్తున్న రైల్వేస్టేషన్‌గా ఉంది.
రైల్వే ప్రాజెక్టులకు రూ.39,300 కోట్లు..
తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వేల కోసం కేంద్రం రూ.5,337 కోట్లు కేటాయించిందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. అలాగే రైల్వేల ఆధునీకరణలో భాగంగా రూ.39,300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 1,096 కిలోమీటర్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు చేపట్టినట్లు వివరించారు. 753 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌లు నిర్మిస్తామని, 453 ఆర్‌ఓబీ, ఆర్‌యూబీల నిర్మాణం పూర్తిచేశామని వెల్లడించారు.
సికింద్రాబాద్ నుంచి తెలంగాణలో ఏడు జిల్లాలను కలుపుతూ 9 స్టాప్‌లతో 5 వందేభారత్ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు. రూ.715 కోట్లతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మాదిరిగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి చెప్పారు. రూ.327 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు కూడా త్వరలో చేపట్టనున్నట్లు ప్రకటించారు. అన్ని రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
ఏబీసీడీలు కూడా తెలియకుండా కేంద్రంపై యుద్ధమా?
ఏబీసీడీలు కూడా తెలియకుండా కేంద్రంపై యుద్ధం చేయాలంటే ఎలా? అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కిషన్‌రెడ్డి చురకలంటించారు. గతంలో లాగా రెచ్చగొడితే ప్రజలు ఊరుకోరని, చైతన్యవంతులు అయ్యారని పేర్కొన్నారు. డీ లిమిటేషన్ వల్ల సీట్లు తగ్గుతాయని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment