
డీపీఆర్ తయారీ ముసుగులో నిర్మాణ పనులు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుపై తీవ్ర చర్యలు
డీపీఆర్ కోసం చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలని ఏపీకి ఆదేశం
తవ్వకాలను పూడ్చి సైట్ పూర్వస్థితినిపునరుద్ధరించాలని సూచన
ఇది తమ ప్రభుత్వ విజయమేనన్న మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించి డీపీఆర్ తయారీ ముసుగులో ఏపీ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగిస్తోందని అందిన ఫిర్యాదులపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. డీపీఆర్ తయారీ కోసం చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనని, ఎక్కడైనా తవ్వకాలు జరిపితే వాటినీ పూడ్చివేయాల్సిందేనని స్పష్టం చేసింది.
ప్రాజెక్టు నిర్మిత స్థలాన్ని దాని వాస్తవ పూర్వస్థితికి పునరుద్ధరించిన తర్వాతే పర్యావరణ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత నెల 27న రాయలసీమ ప్రాజెక్టుపై వచ్చిన ఫిర్యాదుపై చర్చించి కేంద్ర నిపుణుల మదింపు కమిటీ ఈ మేరకు ప్రభుత్వానికి అదనపు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో, డీపీఆర్ తయారీకి సంబంధించిన పనులు మినహా ఇతర ఏ చర్యలు ప్రాజెక్టు సైట్‌లో చేపట్టలేదని పేర్కొంటూ అఫిడవిట్ రూపంలో స్వీయధ్రువీకరణ సమర్పించాలని స్పష్టంచేసింది.
సైట్ పునరుద్ధరణకు తీసుకున్న చర్యలను ఫొటోలు, ఇతర ఆధారాలతో సహా సమర్పించాలని, ఇందుకు వాడిన పద్ధతులను, గడువులనూ తెలపాలని ఆదేశించింది. అఫిడవిట్‌లో అవాస్తవాలను పొందుపరిస్తే జల, వాయు, పర్యావరణ చట్టాల కింద సంబంధిత అధికారులు శిక్షార్హులవుతారని హెచ్చరించింది.
ప్రాంతీయ అధికారి, కేంద్ర జలసంఘం, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రిసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడిగా ప్రాజెక్టు సైట్‌ను తనిఖీ చేశాక ఈ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని కోరింది. డీపీఆర్ తయారీ ముసుగులో పర్యావరణానికి ఏదైనా హానీ చేసినట్టు తనిఖీల్లో గుర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వ విజయం: మంత్రి ఉత్తమ్
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయమేనని నీటిపారుదల శాఖమంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం కృష్ణా బోర్డు, ఎన్జీటీ, కృష్ణా ట్రిబ్యునల్–2, సుప్రీం కోర్టులను ఆశ్రయించిందన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని తాను కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయగా, శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శికి లేఖ రాశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment