
జాతీయ న్యాయ నిపుణుల సదస్సులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ప్రజలంతా విలువలు ఆచరించినప్పుడే ధర్మం పరిఢవిల్లుతుందని వెల్లడి
న్యాయవాదులు సానుకూల ధృక్పథాన్ని అలవాటు చేసుకోవాలి: జస్టిస్ ఎస్వీ భట్టి
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మికత, ధర్మ పరిరక్షణలో ప్రపంచానికి భారత్ స్ఫూర్తిదాయకమని.. ప్రజలంతా వాటిని ఆచరించి శాంతి పొందాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉద్ఘాటించారు. ధర్మ రాజ్యం అంటే.. రూల్ ఆఫ్ లా అని.. సరైన విలువలు, సరైన ఆలోచన, సేవలు, కరుణ, నీతి, నైతికత పాటించడమే ధర్మమని వివరించారు. దేశం ధర్మ రాజ్యంగా ప్రగతి బాట పయనించాలని మహాత్ముడు అభిలాషించారని చెప్పారు. ఆర్థిక భారతమే కాదు.. వికసిత్, విరాసిత్ భారత్ ఆవశ్యకతనూ ప్రధాని మోదీ వెల్లడించారన్నారు.
మనసును నిగ్రహించుకుని చట్టపరమైన, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడంపై బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో జాతీయ న్యాయనిపుణుల సదస్సు శనివారం హైదరాబాద్‌లోని శాంతి సరోవర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్టితోపాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు మాట్లాడారు.
గుడిలో పూజలు, అర్చన, ప్రదక్షిణలు చేయడం మాత్రమే కాదు, ధర్మాన్ని పాటించడం కూడా ఆధ్యాత్మికమే అని గవర్నర్ అభిప్రాయపడ్డారు. శాంతి లేని బతుకు నిరర్థకమని.. స్వామి వివేకానందుడే స్ఫూరిగా ఆధ్యాత్మికాన్ని ఆచరించాలని సూచించారు. ఆధ్యాత్మికాన్ని పెంపొందించడంలో బ్రహ్మకుమారీల పాత్ర అభినందనీయమన్నారు. మితిమీరిన ‘ఇన్‌స్టంట్’కు అలవాటుపడితే అనారోగ్యాన్ని ఆహ్వానించినవారవుతారని హెచ్చరించారు.
ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వండి: జస్టిస్ ఎస్వీ భట్టి
న్యాయమూర్తులు, న్యాయవాదులు సానుకూల ధృక్పథంతో ముందుకు సాగినప్పుడే అసాధ్యాలు కూడా సుసాధ్యం కాగలవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సారస వెంకటనారాయణ భట్టి చెప్పారు. న్యాయవాదులకు స్వీయ అవగాహన ఉండాలని, కేసును, కక్షిదారుడిని అర్థం చేసుకున్నప్పుడే సమర్థ వాదన సాధ్యపడుతుందన్నారు. గెలుపోటములను ఒకేలా స్వీకరించాలని.. అపజయానికి కుంగిపోవడం, విజయానికి పొంగిపోవడం వృత్తినే కాదు, వ్యక్తిత్వాన్నీ దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు.
ఏం చేస్తున్నాం.. ఎలా చేస్తున్నాం.. అనే సమీక్ష అందరికీ అవసరమన్నారు. వృత్తిపరంగా ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయని.. కొన్నిసార్లు మనసు కలుషితం అవుతుందని చెప్పారు. సానుకూలత లేకుండా సరైన నిర్ణయం తీసుకోలేమని చెబుతూ.. జరిగిందేదో జరిగిపోయింది.. సానుకూలంగా ముందుకెళ్తాను అనే ధోరణిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ వి.ఈశ్వరయ్య, జస్టిస్ బీడీ రాథి, బార్ కౌన్సిల్ మాజీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి, మాజీ అడ్వొకేట్ జనరల్‌లు దేశాయి ప్రకాశ్‌రెడ్డి, బీఎస్ ప్రసాద్ పాల్గొన్నారు.
జీఎస్టీ.. దేశ ఆర్థిక చరిత్రలో ఓ మలుపు: గవర్నర్
వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టడం మన దేశ ఆర్థిక చరిత్రలో ఒక మలుపు అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. శనివారం తాజ్ దక్కన్ హోటల్‌లో తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో జీఎస్టీ రూపకల్పనలో కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ పాత్రపై సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ మధ్య సమన్వయం అవసరమన్నారు. ఒకే దేశం.. ఒకే పన్ను విధానానికి జీఎస్టీ దోహదం చేసిందన్నారు.
సాహసోపేతమైన సంస్కరణల మాదిరిగానే జీఎస్టీని ప్రవేశపెట్టినప్పుడు అవాంతరాలు తప్పలేదని పేర్కొన్నారు. ఎక్కడైతే ప్రజలకు న్యాయం అందుతుందో.. అక్కడ ధర్మంతోపాటు రాజుకు బలమైన పునాది ఏర్పడుతుందని కౌటిల్యుడు చెప్పిన మాటలను ఉదహరించారు. పన్ను చెల్లింపుదారులందరూ ప్రభుత్వం అందిస్తున్న వన్ టైమ్ వడ్డీ మాఫీ పథకాన్ని ఈ నెల 31లోగా పన్ను చెల్లించి లబ్ధి పొందాలని రాష్ట్ర వాణిజ్య పన్నుల కమిషనర్ కె.హరిత పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్టి మాట్లాడారు. ఎఫ్‌టీసీసీఐ జీఎస్టీ కమిటీ చైర్మన్ మొహమ్మద్ ఇర్షాద్ అహ్మద్, బాంబే హైకోర్టు సీనియర్ న్యాయవాదులు లక్ష్మీకుమారన్, శ్రీధరన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment