practicles
-
ఇంటర్ పరీక్షలకు వేళాయె
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ పరీక్షలకు రంగం సిద్ధమైంది. మూడేళ్లుగా ఇంటర్ పరీక్షలు పలు కారణాలతో వాయిదా పడటం, అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవడం, కరోనా సమయంలో రద్దు చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అయితే ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం ఈనెల 15 నుంచి పరీక్షలు జరుగనున్నాయి. పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా ఏలూరులోని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షాణాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. నైతికత, మానవ విలువలపై పరీక్షలు ఇంటర్ పరీక్షల్లో భాగంగా ముందుగా ఈనెల 15న నైతికత, మానవ విలువలు అనే సబ్జెక్టుపై పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్ష ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. అలాగే ఈనెల 17న పర్యావరణ విద్య అనే సబ్జెక్టుపై పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు పూర్వ పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఏలూరు జిల్లాలో 96 కేంద్రాల్లో 12,785 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 113 కేంద్రాల్లో 15,966 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 41 కేంద్రాల్లో 5,372 మంది మొత్తంగా 34,123 మంది హాజరుకానున్నారు. ప్రాక్టికల్స్‌కు సర్వం సిద్ధం పరీక్షల్లో భాగంగా ముందుగా ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈనెల 20 నుంచి వీరికి ప్రాక్టికల్స్ ప్రారంభమై వచ్చేనెల 7వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు నాన్ జంబ్లింగ్ విధానంలో పరీక్షలు రాయవచ్చు. మొత్తంగా 8,417 మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షల కోసం 76 కేంద్రాలను సిద్ధం చేశారు. అలాగే జనరల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఈనెల 26న ప్రారంభం కానున్నాయి. 147 కేంద్రాల్లో 24,227 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వచ్చేనెల 15 నుంచి.. ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు వచ్చేనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 73,521 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే సీసీ కెమెరాలన్నింటినీ ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాగే ప్రతి కేంద్రాన్నీ సెల్ఫోన్రహిత జోన్‌గా ప్రకటించారు. ఎవరూ కేంద్రాలకు సెల్‌ఫోన్ తీసుకురాకూడదనే నిబంధన విధించారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా.. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయ్యేలా అధ్యాపకులకు సూచనలిచ్చాం. కళాశాలల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడానికి ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నాం. విద్యార్థులు కళాశాలలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడటం, వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించడం వంటివి చేస్తున్నాం. – కె.చంద్రశేఖరబాబు, ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, ఏలూరు -
AP: ఇంటి దగ్గరే ‘ప్రాక్టికల్స్’
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా పాఠశాలలను చాలాకాలంగా మూసి ఉంచినందున విద్యా సంవత్సరపు పని దినాలను తగ్గించి పాఠ్యప్రణాళికలో మార్పులు చేసిన సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అందుకు అనుగుణంగా ల్యాబ్ ప్రయోగాల (ప్రాక్టికల్స్)లోనూ మార్పులు చేసింది. 9, 10 తరగతుల విద్యార్థులకు అనుకున్న మేర ప్రయోగాల ప్రక్రియను ల్యాబ్‌లలో నిర్వహించే పరిస్థితులు లేనందున ఇంటినుంచే అందుబాటులో ఉన్న వనరులతో ప్రయోగాలు చేపట్టేలా ప్రత్యామ్నాయాలను నిర్దేశించింది. ఇందుకు సంబంధించి సీబీఎస్ఈ తాజాగా విధివిధానాలను ప్రకటించింది. ఉపాధ్యాయుల ముఖాముఖి సూచనలతో నిర్వహించే ల్యాబ్ ప్రయోగాలకు బదులు వారి మార్గనిర్దేశంలో ఇంటినుంచే విద్యార్థులు తమ ప్రాక్టికల్ వర్కులు, ప్రాజెక్టు వర్కులు పూర్తిచేయవచ్చని సూచించింది. ఈ ప్రయోగాల ద్వారా అభ్యాస ఫలితాలు ఒకే విధంగా ఉండేలా ఆయా అంశాలను రూపొందించి విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. గత ఏడాది సెప్టెంబర్‌లో లాక్డౌన్ కారణంగా ల్యాబ్ ప్రయోగాలు నిర్వహించలేని పరిస్థితుల్లో సీబీఎస్ఈ అన్ని పాఠశాలల్లోని 9 నుంచి 12 తరగతుల విద్యార్థులతో ఆన్లైన్ ప్లాట్‌ఫాం ‘ఓల్యాబ్స్టో’ ద్వారా సీబీఎస్ఈ కరిక్యులమ్‌ను, ప్రయోగాల ప్రక్రియలను వర్చువల్ రూపంలో విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. తాజాగా వీటితోపాటు జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) మాన్యువల్ నుంచి మరికొన్ని ఇతర ప్రయోగ కార్యకలాపాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్టు ప్రకటించింది. అందుబాటులో ఉండే వనరులతోనే ప్రయోగాలు విద్యార్థులు తమ ఇంటివద్ద అందుబాటులో ఉండే వనరులతోనే ఈ ప్రయోగాలు చేపట్టేలా ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రక్రియలను విద్యార్థులతో అనుసరింప చేయాలని సీబీఎస్ఈ ఆయా పాఠశాలలకు సూచనలు చేసింది. ఈ కంటెంట్ దీక్షా పోర్టల్ ద్వారా కూడా అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. విద్యార్థులకు ఇబ్బంది రాకుండా రక్షిత పద్ధతుల్లో ఇంటివద్దే ప్రయోగాలు చేసేలా ఆయా మెటీరియల్‌ను సూచించాలని టీచర్లకు నిర్దేశించింది. విద్యార్థుల్లో జ్ఞానాన్ని పెంపొందించడంలో పాఠ్యబోధన ఎంత ముఖ్యమో.. ప్రాక్టికల్స్ కూడా అంతకంటే ముఖ్యమైనవని పేర్కొంటున్న సీబీఎస్ఈ వీటికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. సీబీఎస్ఈలో ప్లస్ 2లోనే ప్రయోగాలు చేపట్టించేలా కాకుండా 9వ తరగతి నుంచే విద్యార్థులకు వాటిని అమలు చేయిస్తోంది. -
ఇంటర్ విద్యార్థులకు 'ఆధార్' పరీక్ష
- జిల్లాలో ఆధార్ కార్డులు లేని 10వేల మంది విద్యార్థులు - ఆధార్ నంబర్ అప్లోడ్ కాకపోతే ఫలితాల నిలిపివేత - ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు కొత్త టెన్షన్ మొదలైంది. ఇప్పటివరకు పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు ఇక ఆధార్ కార్డు కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి తలెత్తింది. విద్యార్థులందరూ ఆధార్ నంబరును సమర్పించాలని ఇంటర్మీడియెట్ బోర్డు నిబంధన విధించడమే ఇందుకు కారణం. ఆధార్ నంబరు లేకుండా పరీక్ష రాసినా... వారి ఫలితాలను నిలిపివేస్తామని బోర్డు ప్రకటించింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, కార్పొరేట్ కళాశాలల్లో ఆధార్ పరీక్షను పూర్తిచేసుకునేందుకు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 10వేల మంది విద్యార్థులు ఆధార్ నంబరు సమర్పించలేదు. ఆధార్ కార్డులు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు తమ పిల్లలకు ఆధార్ కార్డులను వీలైంత త్వరగా తీసుకొచ్చి కళాశాలల్లో ఇచ్చేందుకు తల్లిదండ్రులు నానా హైరానా పడుతున్నారు. ఆధార్ ఎందుకంటే... ఇంటర్ మార్కుల జాబితాను మరింత పకడ్బందీగా జారీచేయడం కోసమే ఆధార్ నంబరు స్వీకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ బోర్డు జారీచేసే మార్కుల జాబితాలో విద్యార్థి పేరు, ఇతర వివరాలతోపాటు ఆధార్ నంబరు కూడా ఉంటుంది. తద్వారా నకిలీ మార్కులిస్టులను నిరోధించవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మా ర్కుల లిస్టు పోయినవారు మళ్లీ కావాల్సివస్తే సులభంగా పొందేందుకూ అవకాశం ఉంటుంది. జిల్లాలో 95 శాతం పూర్తి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 64,590 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 65,989 మంది ఉన్నారు. గత నెల రోజులుగా ఇంటర్ బోర్డు అధికారులు కళాశాల యాజమాన్యాలు, ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశాలు నిర్వహించి 95 శాతం మేర ఆధార్ వివరాలు సేకరించారు. ఇప్పటివరకు 1,21,630 మంది విద్యార్థుల ఆధార్ నంబర్లు ఆప్‌లోడ్ చేశారు. మరో పది వేల మంది వరకు ఆధార్ నంబర్లు ఇవ్వాల్సి ఉంది. ఆర్ఐవో ఎన్.రాజారావు ‘సాక్షి’తో మాట్లాడుతూ విద్యార్థుల రికార్డుల భద్రత కోసమే ఆధార్ ఆప్‌లోడ్ చేస్తున్నామని చెప్పారు. రేపటి నుంచి ప్రాక్టికల్స్ గురువారం నుంచి మార్చి 4 వరకు ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు జిల్లాలో 51 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.