Telangana Govt Cuts 30 Percent Inter Syllabus | Read More- Sakshi
Sakshi News home page

Trigonometry-Inter Syllabus:ఇంటర్‌ విద్యార్థులను తికమకపెడుతున్న త్రికోణమితి

Published Thu, Sep 9 2021 3:35 AM | Last Updated on Thu, Sep 9 2021 12:57 PM

Telangana Govt Drops 30 Per Cent Syllabus For Intermediate Students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ కారణంగా సిలబస్‌లో కోత పెట్టడం వల్ల ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు తలనొప్పులు తప్పడం లేదు. మొదటి సంవత్సరంలో బేసిక్స్‌ (ప్రాథమికాంశాలు) వదిలేయడంతో రెండో ఏడాది కొన్ని పాఠాలు అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. దీనివల్ల పోటీ పరీక్షల్లోనూ విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవని అధ్యాపకులు అంటున్నారు. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.  

70 శాతానికి   కుదింపు 
కోవిడ్‌ వల్ల గతేడాది విద్యాసంస్థలు పనిచేయని విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ పాఠాలు కూడా చాలారోజులు జరగలేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇంటర్‌ ఫస్టియర్‌ సిలబస్‌ను 70 శాతానికి కుదించారు. దీంతో విద్యార్థులు కొన్ని చాప్టర్ల జోలికి అసలుకే వెళ్లలేదు. వీటిల్లో పలు కీలక విషయాలపై ప్రాథమిక అవగాహన కల్పించే చాప్టర్లు కూడా ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే తప్ప రెండో ఏడాదిలో పాఠాలు అర్థం కానివి కొన్ని ఉన్నాయని అధ్యాపకులు చెబుతున్నారు.

దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రైవేటు కాలేజీలు కుదించిన చాప్టర్లను కూడా విద్యార్థులకు బోధించినా ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఆన్‌లైన్‌ పాఠాలు అర్థం కాక, సిలబస్‌ కోతతో విద్యార్థుల పరిస్థితి, ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారింది.    

ఫస్టియర్‌లో చదవకపోతే కష్టమే..
ఫస్టియర్‌ గణితంలో త్రికోణమితి (ట్రిగొనమెట్రీ) చాప్టర్‌ను వదిలేశారు. రెండో ఏడాదిలో ఇది మరింత లోతుగా ఉంది. ప్రాథమిక అవగాహన ఉంటే తప్ప క్లిష్టమైన లెక్కలను చేయలేని పరిస్థితి ఉంటుందంటున్నారు. విశ్లేషణాత్మక గణిత సూత్రాలన్నీ ఫస్టియర్‌లో ఉన్నాయని, దాని కొనసాగింపు రెండో ఏడాది ఇచ్చారని అధ్యాపకులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రభుత్వ కాలేజీలో త్రికోణమితిపై కాలేజీ అధ్యాపకులు పరిశీలన చేశారు.

60 మందిలో కనీసం 20 మంది కూడా ఓ మోస్తరు క్లిష్టమైన త్రికోణమితి లెక్కలు చేయలేని పరిస్థితి కన్పించింది. జంతుశాస్త్రంలో ప్రొటోజోవా గమనం, ప్రత్యుత్పత్తి చాప్టర్లను కూడా కోత మూలంగా విద్యార్థులు ముట్టుకోలేదు. కానీ రెండో సంవత్సరంలో ఈ చాప్టర్లు మరింత లోతుగా ఉన్నాయి. ప్రాథమిక అవగాహన మొత్తం మొదటి ఏడాదిలోనే ఉందని, అది లేకుండా రెండో ఏడాదిలో విద్యార్థులకు సబ్జెక్టు అర్థం కావడం లేదని జువాలజీ లెక్చరర్‌ ఒకరు తెలిపారు.

బొద్దింక కోతకు సంబంధించి సబ్జెక్టు ఫస్టియర్‌లో ఉంది. దీన్ని తెలుసుకుంటేనే రెండో ఏడాది మానవుల్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కీలకమైన విషయాలు అర్థమవుతాయని లెక్చరర్లు చెబుతున్నారు. కుదింపు జాబితాలో ‘బొద్దింక’ ఎగిరిపోవడంతో రెండో ఏడాది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రసాయన శాస్త్రంలో మూల సూత్రాలన్నీ ఫస్టియర్‌లో ఉంటాయి. ఇవి తెలియకుండా రెండో ఏడాది కొనసాగింపుగా వచ్చే చాప్టర్లు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది.

హిస్టరీ, ఎకనామిక్స్‌ అన్ని సబ్జెక్టుల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. పైగా ఈ ఏడాది రెండో సంవత్సరం వంద శాతం సిలబస్‌ పూర్తి చేయాలని ఇంటర్‌ బోర్డ్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఆయా పాఠాలను తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.  

పోటీ పరీక్షలపైనా  ప్రభావం 
భవిష్యత్తులో జేఈఈ, ఎంసెట్‌ వంటి అన్ని రకాల పోటీ పరీక్షలు రాసే విద్యార్థుల పాలిట కుదించిన చాప్టర్లు శాపంగా మారే అవకాశం కన్పిస్తోంది. తగ్గించిన 30 శాతం సిలబస్‌ నుంచి ప్రతి ఏటా గణితంలో 20 నుంచి 30 మార్కులు వస్తున్నాయని అధ్యాపకులు చెబుతున్నారు. అలాగని ఫస్టియర్‌ నుంచి రెండో ఏడాదికి ప్రమోట్‌ అయిన విద్యార్థులు ఇప్పుడు కోత పెట్టిన పాఠాలపై దృష్టి పెట్టే పరిస్థితి కన్పించడం లేదు. సాధారణంగా రెండో ఏడాది మధ్య నుంచే విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతుంటారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రెండో ఏడాది సిలబస్‌ పూర్తి చేయడమే కష్టంగా ఉంది. ప్రభుత్వ కాలేజీల్లో ఈ ఏడాది 1,600 మంది గెస్ట్‌ లెక్చరర్లను కొనసాగించకపోవడం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీన్ని  ఎలా అధిగమించాలో తెలియక విద్యార్థులు ఆందోళన పడుతున్నారు.  

ఆ చాప్టర్లపై అవగాహన కలిగించాలి 
ఫస్టియర్‌లో త్రికోణమితి బేసిక్స్‌ చదువుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో రెండో ఏడాదిలో ఈ పాఠం విద్యార్థులకు కష్టంగా ఉంది. బోధిస్తున్నప్పుడు చాలామంది విద్యార్థులకు అర్థం కావడం లేదు. రెండో ఏడాదిలోనూ ఆ పాఠాలు తీసేస్తే బాగుండేది. ఫస్టియర్‌లో కోత పెట్టిన చాప్టర్లపై కొంత అవగాహన కల్గించాల్సిన అవసరం ఉంది.  
– రఘురాం, గణితం అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, జడ్చర్ల 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement