సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి చందంగా తయారైంది. రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన దీని అమలుపై ఇటీవల కద లిక రావడంతో ఇక కచ్చితంగా పథకం అమల్లోకి వస్తుందని అంతా భావించారు. మంత్రుల కమి టీ ఏర్పాటు, భోజనం అందించే సంస్థతో కమిటీ సంప్రదింపులు జరపడం, మంత్రులు మధ్యాహ్న భోజనాన్ని రుచి చూడటమూ జరిగిపోయింది. సమగ్ర ప్రతిపాదనలను ఈ నెల 6న సమర్పించాలంటూ కమిటీ పేర్కొనడంతో పథకం ప్రారంభం లాంఛనమే అనే స్థాయిలో హడావుడి జరిగింది. అయితే 2 వారాలైనా మధ్యాహ్న భోజనం అమలు ఊసే లేదు. దీంతో రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని 2 లక్షల మంది విద్యార్థులకు, డిగ్రీ, మోడల్ స్కూల్స్, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎడ్, డీఎడ్ కాలేజీల్లోని మరో 1.6 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలుకు నోచుకుంటుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఆగస్టు 15 నుంచే పథకాన్ని అమలు చేసేలా తొలుత కసరత్తు జరిగినా అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.
ప్రతిపాదనలకే పరిమితం...
ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూళ్లు, డిగ్రీ, ఐటీఐ కాలేజీల్లో చదివే విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. పాలిటెక్నిక్, బీఎడ్, డీఎడ్ కాలేజీల్లో చదువుతున్న వారిలోనూ నిరుపేద విద్యార్థులు ఉన్నారు. అందులో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులే అత్యధికం. అలాంటి వారికి మధ్యాహ్న భోజనం అందిస్తే కాలేజీకి రోజూ రావడంతోపాటు బాగా చదువుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావించారు. అంతేకాదు పనులకు వెళ్లే విద్యార్థులను చదువు వైపు మళ్లించవచ్చని అనుకున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌డబ్ల్యూడీసీ) అధికారులను సంప్రదించి పథకం అమలుకు ఖర్చు అంచనాల వివరాలను తెప్పించారు. పథకం పనులకు రూ. 42 కోట్లు అవసరం అవుతాయని పేర్కొంటూ టీఎస్‌డబ్ల్యూడీసీ ఫైలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపగా ఆర్‌ఐడీఎఫ్ నిధుల నుంచి ఆ మొత్తాన్ని కేటాయించాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు రోజువారీ నిర్వహణ, ఇతర ఖర్చులు కలుపుకుంటే ఏటా రూ. 201 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని అంచనా వేశారు. అంత మొత్తం వెచ్చించే పరిస్థితి లేదని 2016 నుంచి ఈ ఫైలును పక్కన పెట్టేశారు. అయితే ఇటీవల మళ్లీ ప్రభుత్వం మధ్యాహ్న భోజనంపై దృష్టి పెట్టింది. ఇంటర్మీడియెట్‌తోపాటు డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీఎడ్, డీఎడ్, మోడల్ స్కూల్స్ విద్యార్థులకూ భోజనం అందించేలా చర్యలు చేపట్టాలని భావించింది. ఇందులో భాగంగా భోజనం అందించే ఏజెన్సీతోనూ చర్చలు జరిపారు. దాదాపు 3.60 లక్షల మంది విద్యార్థులకు భోజనం అందించేందుకు ఎంత మొత్తం వెచ్చించాల్సి ఉంటుందన్న వివరాలతో ప్రతిపాదనలను ఇవ్వాలని మంత్రుల కమిటీ కోరింది. ఆగస్టు 6వ తేదీన ఆ ప్రతిపాదనలను అందజేయాలని పేర్కొంది. కానీ ఆ తరువాత నుంచి భోజనం అమలు విషయంలో కదలిక లేకుండాపోయింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో పథకాన్ని అమలు చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేయవద్దని, వీలైనంత త్వరగా పథ«కాన్ని అమలు చేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాలేజీల్లో ‘భోజనం’ ఊసేదీ?
Published Mon, Aug 20 2018 1:07 AM | Last Updated on Mon, Aug 20 2018 1:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment