AP: జూనియర్‌ కాలేజీలకు మహర్దశ | AP Govt decided to change government junior colleges look | Sakshi
Sakshi News home page

AP: జూనియర్‌ కాలేజీలకు మహర్దశ

Published Sun, Aug 28 2022 3:38 AM | Last Updated on Sun, Aug 28 2022 8:43 AM

AP Govt decided to change government junior colleges look - Sakshi

సాక్షి, అమరావతి: మన బడి నాడు–నేడు కింద ప్రభుత్వ స్కూళ్లలో సకల సౌకర్యాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల రూపురేఖలు మార్చేందుకు సంకల్పించింది. నాడు–నేడు రెండో దశ కింద రాష్ట్రంలో 468 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు రూ.280 కోట్ల వ్యయం చేయనుంది.

విద్యార్థుల తల్లిదండ్రులతో కాలేజీ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి.. వీటి ఆధ్వర్యంలో కాలేజీల్లో నాడు–నేడు కింద పనులు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చేపట్టే నాడు–నేడు పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా బిల్లుల చెల్లింపులో పారదర్శకతకు పెద్దపీట వేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

మార్గదర్శకాలు ఇవి..
► ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నాడు–నేడు కింద రన్నింగ్‌ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, తాగునీటి సరఫరా పనులు, ఇతర మేజర్, మైనర్‌ పనులు, కాలేజీ క్యాంపస్‌కు పెయింటింగ్, విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, క్లాస్‌ రూమ్‌ ఫర్నీచర్, గ్రీన్‌ చాక్‌బోర్డు, కాంపౌండ్‌ వాల్‌ పనులను చేపట్టాలి. 
► కాలేజీ ప్రిన్సిపాల్‌ కన్వీనర్‌గా.. విద్యార్థుల తల్లిదండ్రులతో మొత్తం 8 మంది సభ్యులతో కాలేజీ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలి. ఇద్దరు కాలేజీ విద్యార్థుల తల్లులు, ఒక విద్యార్థి తండ్రి, క్రియాశీలకంగా ఉండే ఇద్దరు అధ్యాపకులు, క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్, ఇంజనీర్, దాతలు ఎవరైనా ఉంటే వారు కమిటీ సభ్యులుగా ఉంటారు. 
► కమ్యూనిటీ కాంట్రాక్ట్‌ విధానంలో అభివృద్ధి కమిటీలు నాడు–నేడు పనులను చేపట్టాలి.
► కాలేజీ అభివృద్ధి కమిటీ సభ్యుల పేరుతో జాయింట్‌ బ్యాంకు ఖాతాను తెరవాలి. కాలేజీ దగ్గరలో ఏ బ్యాంకులో ఖాతా తెరవాలో కమిటీ సమావేశమై తీర్మానం చేయాలి. దీని ప్రకారం.. కాలేజీ అభివృద్ధి కమిటీ పేరుతో ఆ బ్యాంకులో ఖాతా తెరవాలి. ఆ ఖాతా ద్వారానే సంబంధిత కాలేజీ నాడు–నేడు పనులకు నిధులను ఖర్చు పెట్టాలి. చెక్‌ల ద్వారానే చెల్లింపులు చేయాలి. చెక్‌లపై ప్రిన్సిపాల్‌ సంతకంతో పాటు మిగతా ఏడుగురు సభ్యుల సంతకాలు తప్పనిసరి. 
► నాడు–నేడు పనులను స్థానిక మేస్త్రీ, కూలీల ద్వారా చేపట్టాలి. అవసరమైన సామగ్రిని కూడా స్థానికంగానే ప్రభుత్వం నిర్ధారించిన ధరకు కొనుగోలు చేయాలి. కమిటీ నిర్ధారించిన ధరలను మినిట్స్‌ బుక్‌లో రికార్డు చేయాలి. ఈ విషయంలో ఇంజనీర్‌.. కమిటీకి తగిన సూచనలు చేయాలి.
► కమిటీ సభ్యులంతా వారంలో ఒక రోజు కాలేజీలో సమావేశం కావాలి. కాలేజీలో చేపట్టాల్సిన పనులు, మౌలిక వసతులపై నిర్ణయం తీసుకోవాలి. కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించకూడదు. 
► కమిటీ తీసుకున్న నిర్ణయాల మేరకే సామగ్రి కొనుగోలు, బిల్లుల చెల్లింపులు జరగాలి. ప్రతి చెల్లింపులకు కమిటీ తీర్మానం తప్పనిసరిగా ఉండాలి. ఖర్చు చేసిన ప్రతి రూపాయి, పనులకు సంబంధించిన వివరాలన్నీ పక్కాగా పుస్తకంలో నమోదు చేయాలి. 
► పనులకు మెటీరియల్‌ కొనుగోలు కోసం కమిటీ సభ్యులందరూ మార్కెట్‌కు వెళ్లి మెటీరియల్‌ నాణ్యత, ప్రమాణాలను స్వయంగా పరిశీలించాలి. 
► నాడు–నేడు కార్యక్రమంలో వినియోగించే మెటీరియల్‌ కనీసం 75 ఏళ్లపాటు మన్నికతో ఉండేలా చర్యలు తీసుకోవాలి. 
► కాలేజీ అభివృద్ధి కమిటీ సభ్యుల సూచనల మేరకు ఇంజనీర్‌ అంచనాలను రూపొందించాలి. 
► పనులను వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement