ఇది కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజా ఎస్పీఎన్‌ఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ స్క్రీన్‌పై విద్యా బోధన ప్రారంభమైంది. వివరణాత్మకంగా, సమర్థవంతంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా చెబుతున్నారు. మోపిదేవి ఉన్నత పాఠశాలలో సైతం 8 ఐఎఫ్‌పీ స్క్రీన్లు అందుబాటులోకి తెచ్చి విద్యార్థులకు బోధన ప్రారంభించారు.
నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి: ఒక్కసారి వినగానే, చూడగానే విద్యార్థుల మదిలో నిలిచిపోయేలా.. ఎప్పుడు ఆ అంశం ప్రస్తావన వచ్చినా పుట్టుపూర్వోత్తరాలన్నీ గుర్తుకొచ్చేలా 2డి, 3డి చిత్రాలతో డిజిటల్ పాఠాలు బోధించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో విప్లవాత్మక టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక డిజిటల్ టెక్నాలజీతో విద్యా బోధనకు ఏర్పాట్లు చేసింది.
ఇప్పటికే నాడు–నేడుతో సర్కారీ స్కూళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటంతోపాటు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లను ఉచితంగా అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. అగ్ర దేశాల్లో విద్యా బోధనకు వినియోగించే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా అందుబాటులోకి తెస్తోంది. తొలివిడత నాడు–నేడు పూర్తయిన 15,713 ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వీటిని వినియోగించనున్నారు.
వీటి వినియోగంపై జేఎన్‌టీయూ ప్రొఫెసర్లతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. పాఠశాలలకు సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ చదివే విద్యార్థులు కూడా వారానికి ఒకసారి ఆయా స్కూళ్లను సందర్శించి సాంకేతిక సమస్యలను పరిష్కరించనున్నారు. ఈ మేరకు స్వచ్ఛందంగా సేవలు అందించేలా ఉన్నత విద్యా మండలి ముందుకు వచ్చింది. చదువులకు అండగా నిలుస్తూ, విద్యార్థుల తల రాతను మార్చేలా నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.59 వేల కోట్లకు పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది.
గూగుల్ అసిస్టెంట్ సదుపాయం
దశాబ్దాలుగా ఉపాధ్యాయులు నల్ల బోర్డుపై తెల్ల చాక్ పీస్‌తో బోధిస్తున్నారు. ఆధునిక విధానాలకు అనుగుణంగా విద్యార్థులు మెరుగ్గా రాణించేలా మనబడి నాడు – నేడు తొలి విడతలో తీర్చిదిద్దిన 5,675 ఉన్నత పాఠశాలలు, ప్లస్ 2 తరగతుల్లో అత్యాధునిక ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ) 30,212 తరగతి గదుల్లో అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ అసిస్టెంట్ సదుపాయం కలిగిన ఇంటరాక్టివ్ స్మార్ట్ ప్యానెళ్లను ఆరు నుంచి 10వ తరగతి వరకు క్లాస్‌కు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు.
ప్రతి స్క్రీన్‌కు ఇరువైపులా నాలుగు అడుగుల పొడవు, వెడల్పుతో గ్రీన్ చాక్‌పీస్ బోర్డులను కూడా అమరుస్తున్నారు. పాఠ్య పుస్తకాల్లో, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌ల్లో, ఐఎఫ్‌పీ స్క్రీన్లలో ఒకే కంటెంట్ ఉండడంతో విద్యార్థికి మెరుగైన బోధన అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం నాడు – నేడు రెండో విడతలో మరో 15 వేల పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో 3,800 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో పనులు పూర్తయిన వాటిల్లో ఐఎఫ్‌పీ స్క్రీన్లు ఏర్పాటు చేసి డిసెంబర్ నాటికి అన్ని స్కూళ్లల్లోను డిజిటల్ స్క్రీన్లు అందుబాటులోకి తేనున్నారు.
మరో 10,038 పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు
మనబడి నాడు–నేడు ద్వారా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యా బోధనను రాష్ట్ర ప్రభుత్వం నవీకరించింది. ప్రాథమిక పాఠశాలకు ఒకటి చొప్పున 10 వేల స్మార్ట్ టీవీలను అందించి గతేడాది ఇంగ్లిష్ ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చింది. వీడియో పాఠాల ద్వారా బోధనతో మెరుగైన ఫలితాలు రావడంతో ఇప్పుడు కొత్తగా 10,038 ప్రాథమిక స్కూళ్లకు అంతే సంఖ్యలో స్మార్ట్ టీవీలను డిజిటల్ కంటెంట్‌తో ఏర్పాటు చేస్తోంది.
మూడో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది ‘టోఫెల్– ప్రైమరీ’ శిక్షణ అందిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన కంటెంట్‌ను వీడియో, ఆడియో రూరంలో స్మార్ట్ టీవీల ద్వారా బోధించనున్నారు. ఇక నాడు – నేడు రెండో దశలో పనులు జరుగుతున్న మరో 11,200 ప్రాథమిక పాఠశాలల్లోనూ డిసెంబర్ నాటికి స్మార్ట్ టీవీలు రానున్నాయి.
ఇక్కడ కనిపిస్తున్నది కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం అయోధ్య రామాపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని తరగతి గది. తరగతి గదుల్లో బోధన అందిస్తూ, అక్కడే చదువుకుని అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను చూపించి పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచుతున్నారు. ఇదే మండలంలోని ఉండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైతం ఐఎఫ్‌పీ స్క్రీన్ డిజిటల్ బోధన ప్రారంభమైంది.
ఇది పల్నాడు జిల్లా క్రోసూరు ఏపీ మోడల్ స్కూల్‌లోని తరగతి గది. విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన కోసం 165 సెం.మీ వైశాల్యం కలిగిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ) బోర్డును సిద్ధం చేశారు. దీనికి 256 జీబీ డేటా పాఠ్యాంశాలతో ఎస్డీ కార్డును అనుసంధానించి స్మార్ట్ బోధన నిర్వహించవచ్చు. ఒకపక్క స్క్రీన్‌పై వీడియో పాఠాన్ని విద్యార్థులు చూస్తుండగా.. మరోపక్క అదే స్క్రీన్‌పై సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేయవచ్చు. పాఠాలను రికార్డు చేయవచ్చు. అవసరమైన వాటిని నేరుగా ప్రింట్ తీసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment