సాక్షి, అమరావతి: విద్యా సంస్కరణల్లో భాగంగా రూ.16 వేల కోట్లకు పైగా వెచ్చించి ప్రభుత్వ విద్యా సంస్థలను నాడు – నేడు ద్వారా కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక సమర్థంగా నిర్వహణపై దృష్టి సారించింది. అభివృద్ధి పనులు చిరకాలం మన్నికతో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు మౌలిక లక్ష్యమైన విద్యా ప్రమాణాలు, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా చర్యలు చేపడుతోంది.
అస్తవ్యస్తంగా, దిశానిర్దేశం లేకుండా ఉన్న అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలను గాడిలో పెడుతోంది. ఇవి రెండూ ప్రత్యేక పర్యవేక్షణతో ముందుకు సాగేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు ఇవన్నీ పాఠశాల విద్యాశాఖ అధికారులు, టీచర్లతో సాగగా ఇప్పుడు ఇతర శాఖలకూ బాధ్యతలు అప్పగిస్తోంది. మండల స్థాయిలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను వేర్వేరుగా పర్యవేక్షించేందుకు ఇద్దరు చొప్పున ఎంఈవోలను ప్రభుత్వం నియమిస్తోంది. ఇందుకోసం అదనంగా 692 ఎంఈవో పోస్టులను ఇటీవల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసిన విషయం తెలిసిందే.
టీచర్లకు సాయంగా సచివాలయ సిబ్బంది
ఇప్పటివరకు పాఠశాలలకు సంబంధించి విద్యా వ్యవహారాలు, పాలనా వ్యవహారాలను విద్యాశాఖకు చెందిన టీచర్లు, ఎంఈవోలు, ఇతర అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఒకపక్క విద్యా వ్యవహారాలు, మరోపక్క అడ్మినిస్ట్రేటివ్ అంశాల బాధ్యతల వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. మండల విద్యాధికారుల పోస్టులు న్యాయ వివాదాలతో దశాబ్ద కాలంగా భర్తీ కాకపోవడంతో మండల స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది.
ప్రభుత్వం విద్యారంగంపై రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ లక్ష సాధనలో కీలకమైన క్షేత్రస్థాయి పర్యవేక్షణ కరవైంది. ఈ అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లలో అభివృద్ధి పనులతో పాటు పిల్లల ఆరోగ్య సంరక్షణ, హాజరు, చదువులపై దృష్టి పెట్టే బాధ్యతను సచివాలయాల సిబ్బందికి అప్పగించాలని నిర్ణయించింది. తమ పరిధిలోని పాఠశాలల టీచర్లకు విధి నిర్వహణలో వీరు సహకారం అందించనున్నారు.
క్రమ పద్ధతిలో నిరంతరం..
గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్య, సంక్షేమ సహాయకుడు, ఏఎన్‌ఎం, మహిళా పోలీసులకు స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తోంది. ఎవరెవరు ఏ పనులు చేయాలి? ఎప్పుడెప్పుడు ఆయా స్కూళ్లను పర్యవేక్షించాలో జాబ్ చార్టు రూపొందించింది. స్కూళ్ల పర్యవేక్షణ ఒక క్రమపద్ధతిలో నిరంతర ప్రక్రియగా కొనసాగేలా దీన్ని సిద్ధం చేశారు.
కమాండ్ కంట్రోల్‌కు సమాచారం..
సచివాలయాల సిబ్బంది స్కూళ్లను పరిశీలించిన అనంతరం ఆయా అంశాలను ఆన్‌లైన్‌లో నిర్ణీత లాగిన్ ద్వారా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. వాటికి సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేస్తారు. వారిచ్చే సమాచారం ప్రకారం ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారి వాటిని పరిష్కరిస్తారు.
అంశాల తీవ్రతను బట్టి పరిష్కారానికి సమయాన్ని నిర్దేశిస్తారు. దీనిపై పైస్థాయి అధికారులు పునఃపరిశీలన చేస్తారు. ఇదంతా ఎడ్యుకేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్తుంది. వీటితో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్ (14417), స్పందన ద్వారా అందే ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు.
హాజరుపై సంక్షిప్త సందేశాలు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల గైర్హాజరును నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్కూలుకు రాని విద్యార్థుల గురించి తల్లిదండ్రులు, ఆయా తరగతుల టీచర్ల ఫోన్లకు కార్పొరేట్ స్కూళ్ల తరహాలో సంక్షిప్త సందేశాన్ని పాఠశాల విద్యాశాఖ అందిస్తోంది.
వరుసగా మూడు రోజుల పాటు స్కూలుకు రాని విద్యార్థి సమాచారాన్ని వలంటీర్ల ఫోన్‌కూ సంక్షిప్త సందేశాల ద్వారా చేరవేస్తున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చేలా ఈ చర్యలు దోహదం చేస్తున్నాయి.
AP: మనబడి నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా సర్కారీ స్కూళ్లు
Published Tue, Oct 4 2022 3:51 AM | Last Updated on Tue, Oct 4 2022 2:37 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment