Government educational institutions
-
ఉచిత విద్యుత్‌కు ఆదిబట్ల నుంచే అడుగులు
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ విద్యా సంస్థలకు అమలు చేయనున్న ఉచిత విద్యుత్ పథకం.. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ప్రాథమిక పాఠశాల నుంచి శనివారం ప్రారంభం కానుంది. ఈ స్కూల్లో 5వ తరగతి విద్యార్థిని ఎన్.అంజలి ‘ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని నా మనవి’అంటూ 9 డిసెంబర్ 2023న ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరం ఇందుకు స్ఫూర్తిగా నిలిచింది. 23 జూలై 2024న అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తామని సర్కారు కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖల విభాగాధిపతులకు ఆదేశాలు జారీ చేసింది.నా ఆశయం నెరవేరింది ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని నేను గతేడాది డిసెంబర్ నెలలో మా ఉపాధ్యాయుల సహకారంతో ముఖ్యమంత్రికి లేఖ రాశా. దీనిపై స్పందించిన ప్రభుత్వం సానుకూల ప్రకటనతోపాటు అమలు చేయడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం నేను ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నా. – ఎన్.అంజలి, విద్యార్థిని, ఆదిబట్ల -
ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో నిధులు విడుదలవక సర్కారీ బడులు, కళాశాలలు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రత్యేక పోర్టల్‌తో అనుసంధానం సర్కారీ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ప్రత్యేక ఆన్లైన్ వెబ్ పోర్టల్‌ను రూపొందించనున్నాయి. విద్యాసంస్థలు ఏ శాఖ పరిధిలోకి వస్తే ఆ శాఖ విభాగాధిపతి (హెచ్ఓడీ)కి ఆ పోర్టల్‌ను లాగిన్ చేసే సదుపాయం కల్పిస్తాయి. తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల వివరాలను వెబ్ పోర్టల్‌లో చేర్చడం/తొలగించడం/సవరణలు(యాడ్/డిలీట్/ఎడిట్) చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరాన్నిబట్టి ఆయా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని లేదా నిలిపివేయాలని కోరే వెసులుబాటును హెచ్ఓడీలు పొందనున్నారు. ఇన్‌చార్జీలకు ‘ఉచిత’బిల్లులు విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసినా ప్రతినెలా క్రమం తప్పకుండా మీటర్ రీడింగ్ తీసి ఇన్చార్జి అధికారికి బిల్లులు జారీ చేస్తారు. ఇన్చార్జి అధికారులకు బిల్లులు జారీ చేస్తే ఉచిత విద్యుత్ దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకు వారు చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడారు? ఎంత బిల్లు వచ్చిందనే వివరాలు అందులో ఉండనున్నాయి. అయితే ఆ బిల్లులను సదరు పాఠశాల/కళాశాల/విద్యాసంస్థ చెల్లించాల్సిన అవసరముండదు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించిన బిల్లులను సంబంధిత విభాగాధిపతులు తమ శాఖ బడ్జెట్ నిధుల నుంచి ప్రతి నెలా డిస్కంలకు చెల్లించనున్నాయి. విభాగాధిపతుల పర్యవేక్షణ... విభాగాధిపతులు తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల విద్యుత్ వినియోగం, బిల్లుల మొత్తం, గత కాలానికి సంబంధించిన వినియోగం, జారీ అయిన బిల్లులు, జరిపిన చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిల వంటి సమాచారంతో కూడిన నివేదికలను వెబ్ పోర్టల్‌లో చూసుకోవడానికి వీలుండనుంది. విద్యాసంస్థ, మండలం, జిల్లావారీగా సైతం ఈ నివేదికలు ఆన్లైన్లో జనరేట్ కానున్నాయి. సంబంధిత విభాగాధిపతులు బడ్జెట్ కేటాయింపుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించడానికి వీలుగా పోర్టల్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖతో సైతం అనుసంధానించనున్నారు. -
గండి కాదు.. అక్కసు గండం!
సాక్షి, అమరావతి: విద్యా సంస్కరణల ఫలితంగా పేద విద్యార్థులకు పెద్ద చదువులతో ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతుంటే పెత్తందారులు సహించలేకపోతున్నారు. అందినకాడికి రాళ్లు వేయడమే ధ్యేయంగా ఎల్లో మీడియాలో బురద కథనాలను అచ్చేసి కళ్ల మంటను చల్లార్చుకుంటున్నారు. ఇంగ్లీషు మీడియం చదువులు, నాడు–నేడుతో కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా తయారైన ప్రభుత్వ విద్యాసంస్థలపై నిత్యం అక్కసు వెళ్లగక్కుతూ పెత్తందారీ పోకడలను రుజువు చేసుకుంటున్నారు. ట్యాబ్‌లు, సీబీఎస్సీఈ సిలబస్, టోఫెల్ శిక్షణ, ఐబీ.. ఇలా ఏది చూసినా ప్రభుత్వ విద్యారంగం ధీటుగా ఉండటాన్ని చూసి భరించలేక చదువులకు గండి కొట్టే యత్నాలకు తెగబడ్డారు! కత్తిరింపులంటూ తప్పుడు లెక్కలు ప్రభుత్వం అమ్మ ఒడి సాయాన్ని పలు కారణాలతో తగ్గిస్తోందని, మూడేళ్లల్లో 1.86 లక్షల మంది తగ్గిపోయారంటూ ఈనాడు అబద్ధాలు అల్లేసింది. అమ్మ ఒడి మార్గదర్శకాల ప్రకారం ఆరు దశల ధ్రువీకరణ తప్పనిసరి. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి నేరుగా ఖాతాలోనే జమ అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వారికి మాత్రమే నిబంధనల ప్రకారం పథకం వర్తించదు. 2019–20, 2020–21లో కోవిడ్ కారణంగా విద్యార్థులకు 75 శాతం హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. 2021–22, 2022–23లో తొలుత నిర్దేశించిన ప్రమాణాలనే అమ్మ ఒడికి పాటిస్తున్నారు. కోవిడ్ రెండో దశలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడం తెలిసిందే. రోత రాతలు కాదా? నిర్వహణ పేరుతో రివర్స్ చెల్లింపులు అంటూ ఈనాడు మరో ఆరోపణ చేసింది. మనబడి నాడు–నేడు ద్వారా కల్పించిన సదుపాయాలను సక్రమంగా వినియోగించుకునేందుకు 2021లో పాఠశాల నిర్వహణ నిధిని, 2022లో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమ్మ ఒడి లబ్ధిదారుల నుంచి మినహాయించిన రూ.2 వేలు స్కూల్/ కాలేజీ కమిటీల ఖాతాలకే జమ అవుతుంది. ఆ మొత్తాన్ని పాఠశాలల్లో తక్షణ మరమ్మతుల కోసం ఖర్చు చేస్తున్నారు. నాడు–నేడుతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రమైన టాయిలెట్లను సమకూర్చడంతో బాలికల డ్రాప్ అవుట్లు తగ్గిపోయాయి. ‘టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్’ ద్వారా రూ.987.20 కోట్ల నిధి జమ అయింది. నిర్వహణ కోసం 46,661 మంది ఆయాలను నియమించి నెలకు రూ.6 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. గత మూడేళ్లలో ఆయాలకు రూ.882 కోట్లు వేతనాలుగా చెల్లించారు. మరి రివర్స్ చెల్లింపులు అంటూ రామోజీ రాతల్లో ఏమైనా అర్ధం ఉందా? ♦ కుటుంబ ఆదాయం గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు ఉన్నవారికి అమ్మ ఒడి వర్తించదు. పారిశుధ్య కార్మికులకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రస్తుతం రూ.18 వేల చొప్పున వేతనం పొందుతున్నందున నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నారు. ♦ కోవిడ్ సమయంలో ప్రైవేట్ విద్యాసంస్థలు తరగతులు నిర్వహించకున్నా ఫీజులు మాత్రం వసూలు చేశాయి. ప్రభుత్వం పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు పర్యాయాలు అమ్మ ఒడి నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ♦ నాడు–నేడు తొలిదశ కింద 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో పనులు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రెండో విడతలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టగా రూ.3,287 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ♦ మధ్యాహ్న భోజనానికి చంద్రబాబు హయాంలో ఏటా రూ.450 కోట్లు వ్యయం చేయగా ఇప్పుడు గోరుముద్ద ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. -
AP: సర్కారు బడిలో ‘టోఫెల్’ ట్రైనింగ్
మనం ఏ కార్యక్రమం తలపెట్టినా పేద వర్గాలను దృష్టిలో పెట్టుకోవాలి. వారి పట్ల సహృదయంతో పని చేయాలి. వారి జీవితాల్లో మార్పు తేవడం దేవుడి దృష్టిలో గొప్ప సేవ చేసినట్లే. ఇదొక సవాల్‌తో కూడుకున్న కార్యక్రమం. టోఫెల్ శిక్షణను కేవలం జూనియర్ స్థాయికే పరిమితం చేయకుండా ప్లస్ వన్, ప్లస్ టూ (ఇంటర్) వరకూ విస్తరించాలి. 11, 12వ తరగతులు పూర్తి చేసిన తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటారు. అందుకే జూనియర్ లెవెల్‌తో ఆపేయకుండా సీనియర్ లెవెల్ వరకూ విస్తరించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ప్రపంచ స్థాయికి ఎదిగేలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. విద్యారంగంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులను చేపట్టిన నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ‘టోఫెల్’ పరీక్షకు సన్నద్ధం చేస్తూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఒప్పందం చేసుకుంది. సీఎం జగన్ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఈటీఎస్’ ఇండియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ లెజో సామ్ ఊమెన్, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, ఈటీఎస్ అసెస్మెంట్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రుయి ఫెరీరా, డేనియల్, యూఫిఎస్ లెర్నింగ్ సహ వ్యవస్థాపకుడు అమిత్ కపూర్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ కపిల్, వైస్ ప్రెసిడెంట్ డిజిటల్ సేల్స్ ఇండియా కే–12 రాజీవ్ రజ్దాన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం అట్టడుగు వర్గాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను చేపడుతోందని తెలిపారు. రాష్ట్రంలోప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను పరిశీలించాలని ఈటీఎస్ బృందాన్ని ఆహ్వానించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. డిసెంబరు 21న మళ్లీ ట్యాబ్‌లు రాష్ట్రంలో 6వ తరగతి, ఆపై తరగతులకు సంబంధించి మొత్తం 63 వేల తరగతి గదులకు గాను 30,230 క్లాస్ రూమ్‌లు అంటే 50 శాతం జూలై చివరి నాటికి డిజిటలైజ్ చేస్తున్నాం. మిగిలిన వాటిని డిసెంబరు నాటికి సిద్ధం చేస్తాం. 8వ తరగతిలోకి అడుగు పెడుతున్న ప్రతి విద్యార్థి కి ట్యాబ్‌లు పంపిణీ చేశాం. ఈ ఏడాది డిసెంబరు 21న మళ్లీ ట్యాబ్‌ల పంపిణీ చేపడతాం. బైజూస్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం విద్యార్థులకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతున్నాం. 1 నుంచి 9వ తరగతి వరకు ద్విభాషా (బైలింగ్యువల్) పాఠ్యపుస్తకాలను సరఫరా చేశాం. వచ్చే ఏడాది 10వ తరగతికి కూడా ద్విభాషా పుస్తకాలను అందిస్తాం. టెన్త్ విద్యార్థులు 2025లో సీబీఎస్ఈ పరీక్షలకు ఇంగ్లిష్ మీడియంలో హాజరవుతారు. మానవ వనరులపై పెట్టుబడి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. దాదాపు 45 వేల ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాడు – నేడు ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. తొలిదశలో ఇప్పటికే 15,750కిపైగా స్కూళ్లను అభివృద్ధి చేయగా డిసెంబరు నాటికి మరో 16 వేలకు పైగా స్కూళ్లలో రెండో దశ పనులు కూడా పూర్తవుతాయి. వచ్చే ఏడాది మిగిలిన స్కూళ్లలో పనులు చేపడతాం. విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి విద్యార్థికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీని ఉచితంగా అందిస్తున్నాం. వీటికి అదనంగా ఇప్పుడు టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్, టోఫెల్ సీనియర్ పరీక్షలను కూడా ప్రవేశపెడుతున్నాం. ఇది మంచి మార్పులకు దారితీస్తుంది. ఇదంతా మానవ వనరులపై పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాం. కచ్చితంగా ఈ కార్యక్రమం ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుంది. ఒప్పందంలో ముఖ్యాంశాలు.. ♦ టోఫెల్ పరీక్షలు నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఈటీఎస్‌తో ఒక రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఒప్పందం చేసుకోవడం ఇదే ప్రథమం. ♦ ఈ ఒప్పందం ద్వారా అమెరికన్, యూరోపియన్ ఉచ్ఛారణలో పిల్లల నైపుణ్యాలను పెంపొందిస్తారు. ♦ విదేశీ యాసను అర్థం చేసుకోవడమే కాకుండా విద్యార్థులు చక్కగా మాట్లాడేలా శిక్షణ ఇస్తారు. ♦ 3, 4వ తరగతి పిల్లలకు విద్యా సంవత్సరం చివరలో మార్చిలో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. ♦ 5వ తరగతి పిల్లలకు అక్టోబరులో మరో సన్నాహక పరీక్ష అనంతరం మార్చిలో తుది పరీక్ష టోఫెల్ ప్రైమరీని నిర్వహిస్తారు. ♦ 6 – 8వ తరగతి విద్యార్థులకు విద్యా సంవత్సరం చివరిలో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష ఉంటుంది. ♦ 9వ తరగతి విద్యార్థులకు అక్టోబరులో మరో సర్టిఫైడ్ సన్నాహక పరీక్ష నిర్వహిస్తారు. తుది పరీక్ష టోఫెల్ జూనియర్ విద్యా సంవత్సరం చివరిలో జరుగుతుంది. ♦ 10వ తరగతి విద్యార్థులకు టోఫెల్ జూనియర్ స్పీకింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ♦పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడంలో భాగంగా 3 – 5 తరగతుల వారికి వారానికి మూడుసార్లు గంట సేపు స్మార్ట్ టీవీల ద్వారా ఆడియో, వీడియో కంటెంట్‌ను వినిపిస్తారు. ♦ 6 – 10వ తరగతి పిల్లలకు ఐఎఫ్‌పీల ద్వారా వారానికి మూడుసార్లు వీడియోలు ప్రదర్శిస్తారు. ♦ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారు. ♦ అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులు చదివే స్కూళ్లలో ఇంగ్లిష్ టీచర్లను మెరుగైన శిక్షణ, అవగాహన కోసం అమెరికాలోని ప్రిన్స్టన్కు మూడు రోజులపాటు పంపిస్తారు. ♦ ఒప్పందంలో భాగంగా టోఫెల్ పరీక్షలను సీనియర్ లెవెల్‌కూ (ప్లస్ –1, ప్లస్ –2) విస్తరించాలని సీఎం ఆదేశించారు. ఏపీ విద్యార్థులకు మంచి అవకాశాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనిక నాయకత్వంలోని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈటీఎస్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం విద్యలో నాణ్యత పెంచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. తద్వారా ప్రపంచంలోని ఏ ప్రాంతంతోనైనా విద్యార్థులు సులభంగా అనుసంధానం అవుతారు. విద్యాపరంగా, వృత్తిపరంగా ఏపీ విద్యార్థులకు మంచి అవకాశాలు దక్కుతాయి. నా తల్లిదండ్రులు ఫ్రాన్స్‌కు చెందినవారు కావడంతో ఇద్దరికీ ఇంగ్లిష్ రాదు. నేను ఆంగ్ల భాష నేర్చుకుని అమెరికాలో స్థిరపడి పౌరసత్వం పొందా. ఈటీఎస్ 75 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. మాది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సంస్థ. 180 దేశాల్లో 9 వేల ప్రాంతాల్లో ఇప్పటికే 50 మిలియన్లకు పైగా పరీక్షలు నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా 52 మంది టీచర్లను అమెరికాలోని ప్రిన్స్టన్కు పంపనుంది. వారికి అత్యుత్తమ శిక్షణ అందిస్తాం. – అలైన్ డౌమాస్, ఈటీఎస్ సీనియర్ డైరెక్టర్ -
ప్రతిభకు పట్టం
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను నియోజకవర్గ స్థాయిలో గురువారం ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట సత్కరించింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం కన్నులపండువగా సాగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, కేజీబీవీ మేనేజ్మెంట్ల పరిధిలోని సంస్థల్లో పదో తరగతిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులను సన్మానించారు. ఇలా నియోజకవర్గ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులు 678 మందిని, ఇంటర్లో వివిధ మేనేజ్మెంట్ జూనియర్ కాలేజీల్లో ఆయా గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచిన 662 మంది విద్యార్థులను సన్మానించారు. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ వేడుక నిర్వహిస్తోంది. విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్, పాఠశాలకు మెమెంటో ఇవ్వడంతోపాటు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా కొనసాగింది. ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కృషిని సర్వత్రా ప్రశంసించారు. విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలతో విద్యా రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, పల్నాడు జిల్లా నాదెండ్లలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, బాపట్ల జిల్లా వేమూరులో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, గంగాధర నెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, అనకాపల్లి జిల్లా మాడుగులలో డిప్యూటీ సీఎం ముత్యాలునాయుడు, తణుకు మండలం వేల్పూరులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విద్యార్థులను సన్మానించారు. కూలి పనులకు వెళ్తూనే టాపర్‌గా.. అవనిగడ్డ : కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఇంటర్ హెచ్ఈసీలో టాపర్‌గా నిలిచిన పేరుబోయిన హరిత ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కోడూరు మండలం పాలకాయతిప్పకు చెందిన పేరుబోయిన నాగమల్లేశ్వరరావు–వెంకటేశ్వరమ్మ పెద్ద కుమార్తె. కూలి పనులకు వెళ్లడం వల్ల 2019లో పదోతరగతి పరీక్షలకు హాజరు కాలేక పోయింది. ఆ మరుసటి సంవత్సరం కూలి పనులకు వెళుతూనే కష్టపడి చదివి పదో తరగతిలో 520 మార్కులు సాధించింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ హెచ్ఈసీలో చేరింది. 1000కి 893 మార్కులు సాధించి నియోజకవర్గంలో టాపర్‌గా నిలిచింది. జగనన్న ఆణిముత్యాల కార్యక్రమం కోసం హరిత కోసం గాలించిన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దుర్గారమేష్, అధ్యాపకులు తమిళనాడులో కూలి పనులకు వెళ్లిందని తెలుసుకుని అక్కడకు వెళ్లి తీసుకొచ్చారు. సన్మానం అనంతరం హరిత మాట్లాడుతూ.. ‘నాలాంటి పేద కుటుంబాలకు అమ్మఒడి, నగదు ప్రోత్సాహాల ద్వారా జగనన్న ఎంతో అసరాగా నిలిచారు’ అంటూ భావోద్వేగంతో కంట నీరుపెట్టింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం ద్వారా తాను డిగ్రీ చదువుకుని టీచర్ జాబ్ సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. హరితను డీఈవో తెహరా సుల్తానా, శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌బాబు ఓదార్చారు. మీ లాంటి వారు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే సీఎం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. -
ప్రతిభ చూపిన విద్యార్థులు.. ‘జగనన్న ఆణిముత్యాలు’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు (స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్)’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. ఈ అవార్డుల వేడుకను నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో నడుస్తున్న పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 2023 మార్చి, ఏప్రిల్ పబ్లిక్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు అవార్డులతో ప్రభుత్వం సన్మానించనుంది. ఇంటర్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారిని సత్కరించనుంది. విద్యా రంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ వేడుక నిర్వహిస్తోంది. మూడు స్థాయిల్లోనూ విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వనుంది. సంబంధిత పాఠశాలకు మెమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నారు. మార్కుల ఆధారంగా పదో తరగతిలో నియోజకవర్గం స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు 602 మంది ఉండగా, జిల్లా స్థాయిలో 606 మంది, రాష్ట్ర స్థాయిలో టాప్–3 మార్కులు సాధించిన విద్యార్థులు 38 మంది మొత్తం 1246 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ స్థాయిలో టాప్–1 మార్కులు సాధించిన వారు నియోజకవర్గం స్థాయిలో 750 మంది, జిల్లా స్థాయిలో 800 మంది, రాష్ట్ర స్థాయిలో 35 మంది మొత్తం 1,585 మంది విద్యార్థులు ఉన్నారు. 25న అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సత్కారం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 25న సన్మాన వేడుక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత మే 23న సన్మానించాలని భావించినా అదే రోజు ఏపీఈఏపీ సెట్ ఉన్నందున ఇంటర్ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా 25వ తేదీకి మార్చారు. నియోజకవర్గంలో అందరికీ అనువైన మండల కేంద్రంలో ఈ వేడుక నిర్వహిస్తారు. ఆ మండల విద్యాశాఖ అధికారి వేడుక నిర్వహణకు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు, ఇంటర్మీడియట్లో ప్రతి గ్రూప్‌లో టాపర్లను సత్కరిస్తారు. పదో తరగతి టాపర్లకు మొదటి బహుమతిగా రూ.15 వేలు, రెండో బహుమతిగా రూ.10 వేలు, మూడో బహుమతిగా రూ.5 వేలు నగదు అందజేస్తారు. ఇంటర్మీడియట్లో టాపర్లకు రూ.15 వేలు చొప్పున నగదు అందజేస్తారు. 27న జిల్లా స్థాయి వేడుక జిల్లా స్థాయిలో టాపర్స్‌గా నిలిచిన పదో తరగతి, ఇంటర్ విద్యార్థులను ఈ నెల 27న జిల్లా కేంద్రాల్లో సన్మానిస్తారు. ఈ వేడుకకు జిల్లా విద్యా శాఖాధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, కేజీబీవీ.. (ప్రభుత్వ, జెడ్పీ, మునిసిపల్ పాఠశాలలు ఒకే మేనేజ్మెంట్) విద్యార్థులు ఒక్కో మేనేజ్మెంట్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను సన్మానిస్తారు. పదో తరగతి విద్యార్థికి మొదటి స్థానంలో నిలిచినవారికి రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.15 వేలు నగదు అందిస్తారు. ఇంటర్లో గ్రూప్‌నకు ఒక్కరు చొప్పున టాపర్లకు ఒక్కొక్కరికి రూ.50 వేలు నగదు అందిస్తారు. 31న రాష్ట్ర స్థాయి వేడుక రాష్ట్ర స్థాయిలో ‘జగనన్న ఆణిముత్యాలు’ సన్మాన వేడుక ఈనెల 31న విజయవాడలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానిస్తారు. పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను సత్కరిస్తారు. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ మేనేజ్మెంట్ స్కూళ్లలో చదివి అత్యధిక మార్కులు సాధించిన మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సత్కారం అందుకుంటారు. మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.లక్ష, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.75 వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు బహుమతి అందిస్తారు. ఇంటర్లో గ్రూప్‌నకు ఒక్కరు చొప్పున నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురికి రూ.లక్ష చొప్పున అందిస్తారు. విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫలితాలను మెరుగుపరచడం, వారిని భావి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అద్భుతమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకంటే 3 రెట్లు అధికంగా రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం ఖర్చు చేస్తోంది. పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లుల ఆర్థిక కష్టాలను తీర్చేందుకు ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం అమలు చేస్తోంది. ఇందుకోసం అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం జమ చేస్తోంది. గత మూడేళ్లలో జగనన్న అమ్మ ఒడి పథకం కోసం ప్రభుత్వం రూ.19,617.6 కోట్లు ఖర్చు చేసింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు ‘మన బడి నాడు–నేడు’ పథకం కింద రూ.13 వేల కోట్లు వెచ్చించింది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా గత మూడేళ్లుగా పాఠశాలలు ప్రారంభించే సమయంలో ‘జగనన్న విద్యా కానుక’ కింద బ్యాగ్, అన్ని రకాల పుస్తకాలు, స్టిచింగ్ చార్జీతో కలిపి 3 జతల యూనిఫారాలు, బెల్టు, బూట్లు, సాక్స్‌లు అందిస్తోంది. అంతేగాక, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు, దుస్తులు మార్చుకునే గదులు, వాష్బేసిన్లు, టాయిలెట్ నిర్వహణ నిధిని ఏర్పాటు చేసింది. ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు, అన్ని పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించింది. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లను నియమించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒకే తేదీన ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్లు నిర్వహించడం గమనార్హం. ఇక ‘జగనన్న గోరుముద్ద’ పథకం కింద పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం కింద ప్రత్యేక మెనూతో ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తోంది. వారానికి ఐదు రోజులు గుడ్లు, చిక్కీలు పిల్లలకు అందజేస్తోంది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు రాగిజావను వారానికి మూడుసార్లు అందించడం విశేషం. ఇప్పుడు కొత్తగా ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. దేశంలో కనీవినీ ఎరుగని నిర్ణయం విద్యపై అత్యధిక ప్రేమ చూపే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్ప దేశంలో మరొకరు లేరు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు ఏ రాష్ట్రంలోనూ లేవు. ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట విద్యార్థులను సత్కరించడం గొప్ప విషయం. టాప్ స్కోరర్లలో సమాన మార్కులు ఎంతమంది సాధించినా వారందరినీ ‘జగనన్న ఆణిముత్యాలు’ కింద సత్కరించి, నగదు బహుమతులు అందజేస్తాం. – బొత్స సత్యనారాయణ,విద్యా శాఖ మంత్రి -
ఏపీ బడిబాటలో యూపీ
మూడున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన విద్యా సంస్కరణలు మంచి ఫలితాలిస్తున్నాయి. ఇందులో భాగంగా వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా విద్యా రంగం నూతన పంథాలో దూసుకుపోతూ దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఏపీలో నాడు–నేడు స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం శ్రీ’ స్కూళ్లకు ఇటీవల శ్రీకారం చుట్టింది. దేశంలో అన్ని వసతులతో 14,500కు పైగా స్కూళ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. వసతులు, విద్యార్థుల నైపుణ్యాల పెంపు లక్ష్యంతో ఐదేళ్ల కాల పరిమితితో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని సంకల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏపీ తరహా మోడల్ అమలుకు ఉత్తరప్రదేశ్ కూడా అడుగులు ముందుకు వేస్తోంది. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని తమ ప్రాంత స్కూళ్లలో వాటి అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా ఏపీలో ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నారు. డిజిటల్ తరగతులు, ఇంగ్లిష్, సైన్సు ల్యాబ్‌లు ఏర్పాటు చేయిస్తున్నారు. రూ.16 వేల కోట్లతో ప్రభుత్వ విద్యా సంస్థల రూపురేఖలు మారుస్తున్నారు. తొలివిడతలో 15,715 స్కూళ్లను సర్వాంగ సుందరంగా మార్పు చేశారు. రెండో విడత పనులూ ప్రారంభం అయ్యాయి. సమగ్ర అధ్యయనంతో నివేదిక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏపీ మోడల్‌ను అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 75 జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 15 వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనితీరును మెరుగు పరిచేందుకు శ్రీకారం చుట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ్ కిరణ్ ఆనంద్ ఆదేశాల మేరకు యూపీ ఈఎల్టీఐ ప్రిన్సిపల్ స్కంద్ శుక్లా, ప్రొఫెసర్ కులదీప్ పాండేతో కూడిన ఇద్దరు విద్యా శాఖ అధికారుల బృందం కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని విజయవాడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పలు పాఠశాలలను సందర్శించింది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌తో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని స్వయంగా పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న విద్యాభివృద్ధి కార్యాక్రమాలను అధ్యయనం చేసి, అక్కడి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ ఆ నివేదికలో పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని 44,512 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలలు మూడేళ్ల క్రితం ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మారడంతో పాటు కార్పొరేట్‌కు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు చేపట్టిన నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం, బైలింగ్యువల్ టెక్సŠట్ బుక్స్ వంటి కార్యక్రమాల గురించి నివేదించారు. పాఠశాలల నిర్వహణ ఎలా ఉందో స్పష్టంగా వివరించారు. కొత్తగా పాఠశాలల్లో ప్రవేశ పెడుతున్న ఫౌండేషనల్ స్కూళ్ల విధానం గురించి కూడా పేర్కొన్నారు. పరీక్షల విధానమూ భేష్.. ఏపీలోని పరీక్షల విధానం చాలా బాగుందని కమిటీ పేర్కొంది. విద్యార్థులకు ప్రతి మూడు నెలలకు ఫార్మేటివ్ అసెస్మెంట్, ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంటుంది. యూపీలో ఆరు నెలలకు ఒకసారి, చివరి పరీక్షల ద్వారా విద్యార్థులను సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే అంచనా వేస్తారు. ఏపీలో ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టుల వారీగా బోధన ఉండగా, ఇప్పుడు ఫౌండేషనల్ విధానంలో 3వ తరగతి నుంచి ఈ బోధన అందుబాటులో ఉంటుంది. బదిలీల్లో పారదర్శకత ఉపాధ్యాయుల బదిలీలు, పోస్టింగ్‌లు పూర్తిగా ఆన్లైన్లో ఉన్నాయని కమిటీ పేర్కొంది. ఎటువంటి మాన్యువల్ జోక్యం లేదని, అవినీతికి ఆస్కారం లేదని వివరించింది. 1–5 తరగతుల విద్యార్థుల కోసం డిజిటల్ తరగతులకు వీలుగా స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ప్యానెల్లు ఏర్పాటు చేయిస్తున్నారని, ఆన్లైన్ బోధనా విధానంలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో బోధనకు ఏర్పాట్లు చేశారని నివేదికలో పేర్కొన్నారు. నాడు–నేడు అద్భుతం 2019–20 నుండి మూడేళ్ల వ్యవధిలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, పాఠశాలలలోని ప్రస్తుత మౌలిక సదుపాయాలను మిషన్ మోడ్‌లోకి మార్చడానికి ‘నాడు–నేడు’ మోడల్‌తో అమలు చేస్తున్న కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయని యూపీ బృందం పేర్కొంది. రన్నింగ్ వాటర్‌తో టాయిలెట్లు, తాగునీటి సరఫరా.. పెద్ద, చిన్న మరమ్మతులతో పాటు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు.. సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డ్‌లు, పాఠశాల భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్‌లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేపట్టారని. వివిధ శాఖల సమన్వయం ద్వారా ఈ పనులు చేస్తున్నారని వివరించారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, పాఠశాల విద్య, పంచాయితీ రాజ్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, జువైనల్ సంక్షేమం, మత్స్య శాఖలతో సహా వివిధ శాఖల పరిధిలోని మొత్తం 44,512 పాఠశాలలను నాడు–నేడు ప్రాజెక్ట్ కవర్ చేస్తున్నట్లు నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలల్లో సంస్కరణలు చేపట్టేందుకు అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. -
సర్కారు బడుల్లో వన్ క్లాస్–వన్ టీవీ
జనగామ: దేశంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో కేంద్రం త్వరలోనే ‘వన్ క్లాస్–వన్ టీవీ’ కార్య క్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా డిజిటల్ బ్యాంకు యూని ట్ సేవలను ఆదివారం ప్రారంభించారు. జనగామ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డీబీయూ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద గిరిరెడ్డితోపాటు కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ అన్ని రకాల బ్యాంకు సేవలు డిజిటల్లో సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టార న్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన రూ.25లక్షల కోట్ల నగదును జన్‌ధన్ ఖాతాల ద్వారా అందించిందన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ముద్ర రుణాల కింద రూ.2,750కోట్ల రుణాలను డిజిటల్ ద్వారా చెల్లించామని వెల్లడించారు. నిధులు పక్కదారి పట్టకుండా ఉత్తరాది రాష్ట్రాలకు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో చెల్లింపు ప్రక్రియ జరుగుతోందని, దీనిని దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచన ప్రధాని చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డిజిటల్ పద్ధతిలో రూ.300కోట్ల స్కాలర్షిప్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించిన ఖాతాలను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరారు. -
AP: మనబడి నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా సర్కారీ స్కూళ్లు
సాక్షి, అమరావతి: విద్యా సంస్కరణల్లో భాగంగా రూ.16 వేల కోట్లకు పైగా వెచ్చించి ప్రభుత్వ విద్యా సంస్థలను నాడు – నేడు ద్వారా కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక సమర్థంగా నిర్వహణపై దృష్టి సారించింది. అభివృద్ధి పనులు చిరకాలం మన్నికతో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు మౌలిక లక్ష్యమైన విద్యా ప్రమాణాలు, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా చర్యలు చేపడుతోంది. అస్తవ్యస్తంగా, దిశానిర్దేశం లేకుండా ఉన్న అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలను గాడిలో పెడుతోంది. ఇవి రెండూ ప్రత్యేక పర్యవేక్షణతో ముందుకు సాగేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు ఇవన్నీ పాఠశాల విద్యాశాఖ అధికారులు, టీచర్లతో సాగగా ఇప్పుడు ఇతర శాఖలకూ బాధ్యతలు అప్పగిస్తోంది. మండల స్థాయిలో అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను వేర్వేరుగా పర్యవేక్షించేందుకు ఇద్దరు చొప్పున ఎంఈవోలను ప్రభుత్వం నియమిస్తోంది. ఇందుకోసం అదనంగా 692 ఎంఈవో పోస్టులను ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన విషయం తెలిసిందే. టీచర్లకు సాయంగా సచివాలయ సిబ్బంది ఇప్పటివరకు పాఠశాలలకు సంబంధించి విద్యా వ్యవహారాలు, పాలనా వ్యవహారాలను విద్యాశాఖకు చెందిన టీచర్లు, ఎంఈవోలు, ఇతర అధికారులే పర్యవేక్షిస్తున్నారు. ఒకపక్క విద్యా వ్యవహారాలు, మరోపక్క అడ్మినిస్ట్రేటివ్ అంశాల బాధ్యతల వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. మండల విద్యాధికారుల పోస్టులు న్యాయ వివాదాలతో దశాబ్ద కాలంగా భర్తీ కాకపోవడంతో మండల స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వం విద్యారంగంపై రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ లక్ష సాధనలో కీలకమైన క్షేత్రస్థాయి పర్యవేక్షణ కరవైంది. ఈ అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లలో అభివృద్ధి పనులతో పాటు పిల్లల ఆరోగ్య సంరక్షణ, హాజరు, చదువులపై దృష్టి పెట్టే బాధ్యతను సచివాలయాల సిబ్బందికి అప్పగించాలని నిర్ణయించింది. తమ పరిధిలోని పాఠశాలల టీచర్లకు విధి నిర్వహణలో వీరు సహకారం అందించనున్నారు. క్రమ పద్ధతిలో నిరంతరం.. గ్రామ, వార్డు సచివాలయాల్లోని విద్య, సంక్షేమ సహాయకుడు, ఏఎన్ఎం, మహిళా పోలీసులకు స్కూళ్ల పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగిస్తోంది. ఎవరెవరు ఏ పనులు చేయాలి? ఎప్పుడెప్పుడు ఆయా స్కూళ్లను పర్యవేక్షించాలో జాబ్ చార్టు రూపొందించింది. స్కూళ్ల పర్యవేక్షణ ఒక క్రమపద్ధతిలో నిరంతర ప్రక్రియగా కొనసాగేలా దీన్ని సిద్ధం చేశారు. కమాండ్ కంట్రోల్‌కు సమాచారం.. సచివాలయాల సిబ్బంది స్కూళ్లను పరిశీలించిన అనంతరం ఆయా అంశాలను ఆన్లైన్లో నిర్ణీత లాగిన్ ద్వారా వెబ్సైట్లో పొందుపరుస్తారు. వాటికి సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేస్తారు. వారిచ్చే సమాచారం ప్రకారం ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారి వాటిని పరిష్కరిస్తారు. అంశాల తీవ్రతను బట్టి పరిష్కారానికి సమయాన్ని నిర్దేశిస్తారు. దీనిపై పైస్థాయి అధికారులు పునఃపరిశీలన చేస్తారు. ఇదంతా ఎడ్యుకేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు వెళ్తుంది. వీటితో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్ (14417), స్పందన ద్వారా అందే ఫిర్యాదులను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు. హాజరుపై సంక్షిప్త సందేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల గైర్హాజరును నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్కూలుకు రాని విద్యార్థుల గురించి తల్లిదండ్రులు, ఆయా తరగతుల టీచర్ల ఫోన్లకు కార్పొరేట్ స్కూళ్ల తరహాలో సంక్షిప్త సందేశాన్ని పాఠశాల విద్యాశాఖ అందిస్తోంది. వరుసగా మూడు రోజుల పాటు స్కూలుకు రాని విద్యార్థి సమాచారాన్ని వలంటీర్ల ఫోన్‌కూ సంక్షిప్త సందేశాల ద్వారా చేరవేస్తున్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలలకు వచ్చేలా ఈ చర్యలు దోహదం చేస్తున్నాయి. -
పెంచిన ఫీజులను ప్రభుత్వమే భరించాలి: జాజుల
సాక్షి, హైదరాబాద్: గుట్టుగా పెంచిన ఇంజనీరింగ్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులను ప్రభుత్వమే భరించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా ప్రైవేటు సంస్థల మాదిరిగా ఫీజుల వసూళ్లకు తెగబడటం అన్యాయమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్డగోలుగా ఫీజులు పెంచడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం పెంచిన ఫీజులను తగ్గించాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. -
బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ: సీఎం జగన్
అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల నుంచి ల్యాప్‌టాప్‌ల ఆప్షన్ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ల్యాప్‌టాప్‌ల సహకారంతో వారికి కోచింగ్ ఇవ్వాలి. ఇందు కోసం ఇంటరాక్టివ్ విధానంలో, టెక్నాలజీని ఉపయోగించుకుంటూ.. ఎంపిక చేసిన నిపుణుల సహకారం తీసుకోవాలి. తద్వారా వీలైనంత ఎక్కువ మంది విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసే కార్యక్రమాన్ని రూపొందించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. బాలికల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని చెప్పారు. ఇందులో భాగంగా బ్రాండెడ్ కంపెనీలకు చెందిన శానిటరీ నేప్కిన్స్ను ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో బాలికలకు శానిటరీ నేప్కిన్స్ పంపిణీపై విద్య, వైద్య, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మార్చి 8 (మహిళా దినోత్సవం)న ఉచిత శానిటరీ నేప్కిన్స్ పంపిణీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, ఏప్రిల్ ఆఖరుకు ప్రతిష్టాత్మకమైన కంపెనీలతో సెర్ప్, మెప్మా.. ఎంఓయూలు కుదుర్చుకుంటాయని సీఎంకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినులకు జూలై 1 నుంచి ప్రతి నెలా ఉచితంగా శానిటరీ నేప్కిన్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ నేప్కిన్స్ ఇస్తామని, ఇందు కోసం సుమారు రూ.41.4 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందని వెల్లడించారు. ఆసరా, చేయూత కిరాణా స్టోర్స్‌లో తక్కువ ధరకే మంచి నాణ్యత కలిగిన, బయోడీగ్రేడబుల్ (త్వరగా భూమిలో కలిసిపోయే) శానిటరీ నేప్కిన్స్ అందుబాటులో ఉంచుతామన్నారు. ఇందు కోసం శానిటరీ నాప్కిన్స్ తయారు చేసే అత్యుత్తమ కంపెనీలతో మెప్మా, సెర్ప్ ఎంఓయూ చేసుకుంటాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శిక్షణ కోసం ప్రఖ్యాత సంస్థల సహకారం విద్యార్థినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇందు కోసం లాప్టాప్లను వాడుకోవాలని సూచించారు. అమ్మఒడి పథకంలో లాప్‌టాప్‌లు కావాలనుకున్న 9వ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు ఇప్పటికే ఆప్షన్ ఇచ్చామని సీఎం పేర్కొన్నారు. శిక్షణ కోసం ప్రఖ్యాత సంస్థలు, కోచింగ్ సెంటర్ల సహకారం తీసుకునే దిశగా ప్రణాళిక రచించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులకు లాప్టాప్లను ఇచ్చే సమయానికి, దాన్ని గరిష్టంగా వాడుకుని ఎలా లబ్ధి పొందవచ్చో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
విద్య, వైద్యరంగాలను పరిరక్షించాలి
- కలెక్టర్‌కు సీపీఎం బృందం వినతి గుంటూరు వెస్ట్ : ప్రభుత్వ విద్యాసంస్థలు, వైద్యశాలల్లోని సమస్యలను పరిష్కరించాలని సీపీఎం ప్రతినిధి బృందం శుక్రవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జిల్లా విద్యాశాఖాధికారి కేవీ శ్రీనివాసరెడ్డిలను కలిసి వినతిపత్రాలు అందజేసింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని, ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కొత్తగా ఉపాధ్యాయులను నియమించకపోవడం వల్ల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని అన్నారు. స్కూళ్లలో ప్రాథమిక వసతులు కల్పించాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో డాక్టర్ పోస్టులు, జీజీహెచ్‌లో స్టాఫ్ నర్సుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. అన్ని సెంటర్లలో జనరిక్ మందుల షాపులను పెట్టాలని, మందులకు బడ్జెట్లో నిధులు పెంచాలని కోరారు. ఈ బృందంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజీ, వై.రాధాకృష్ణ, జేవీ రాఘవులు, నాయకులు ఈమని అప్పారావు, కాకుమాను నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.