సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు (స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్)’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. ఈ అవార్డుల వేడుకను నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ మేనేజ్‌మెంట్లలో నడుస్తున్న పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 2023 మార్చి, ఏప్రిల్ పబ్లిక్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు అవార్డులతో ప్రభుత్వం సన్మానించనుంది.
ఇంటర్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారిని సత్కరించనుంది. విద్యా రంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ వేడుక నిర్వహిస్తోంది. మూడు స్థాయిల్లోనూ విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వనుంది. సంబంధిత పాఠశాలకు మెమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నారు.
మార్కుల ఆధారంగా పదో తరగతిలో నియోజకవర్గం స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు 602 మంది ఉండగా, జిల్లా స్థాయిలో 606 మంది, రాష్ట్ర స్థాయిలో టాప్–3 మార్కులు సాధించిన విద్యార్థులు 38 మంది మొత్తం 1246 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ స్థాయిలో టాప్–1 మార్కులు సాధించిన వారు నియోజకవర్గం స్థాయిలో 750 మంది, జిల్లా స్థాయిలో 800 మంది, రాష్ట్ర స్థాయిలో 35 మంది మొత్తం 1,585 మంది విద్యార్థులు ఉన్నారు.
25న అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సత్కారం
అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఈ నెల 25న సన్మాన వేడుక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత మే 23న సన్మానించాలని భావించినా అదే రోజు ఏపీఈఏపీ సెట్ ఉన్నందున ఇంటర్ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా 25వ తేదీకి మార్చారు. నియోజకవర్గంలో అందరికీ అనువైన మండల కేంద్రంలో ఈ వేడుక నిర్వహిస్తారు.
ఆ మండల విద్యాశాఖ అధికారి వేడుక నిర్వహణకు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు, ఇంటర్మీడియట్‌లో ప్రతి గ్రూప్‌లో టాపర్లను సత్కరిస్తారు. పదో తరగతి టాపర్లకు మొదటి బహుమతిగా రూ.15 వేలు, రెండో బహుమతిగా రూ.10 వేలు, మూడో బహుమతిగా రూ.5 వేలు నగదు అందజేస్తారు. ఇంటర్మీడియట్‌లో టాపర్లకు రూ.15 వేలు చొప్పున నగదు అందజేస్తారు.
27న జిల్లా స్థాయి వేడుక
జిల్లా స్థాయిలో టాపర్స్‌గా నిలిచిన పదో తరగతి, ఇంటర్ విద్యార్థులను ఈ నెల 27న జిల్లా కేంద్రాల్లో సన్మానిస్తారు. ఈ వేడుకకు జిల్లా విద్యా శాఖాధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, కేజీబీవీ.. (ప్రభుత్వ, జెడ్పీ, మునిసిపల్ పాఠశాలలు ఒకే మేనేజ్‌మెంట్) విద్యార్థులు ఒక్కో మేనేజ్‌మెంట్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను సన్మానిస్తారు.
పదో తరగతి విద్యార్థికి మొదటి స్థానంలో నిలిచినవారికి రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.15 వేలు నగదు అందిస్తారు. ఇంటర్‌లో గ్రూప్‌నకు ఒక్కరు చొప్పున టాపర్లకు ఒక్కొక్కరికి రూ.50 వేలు నగదు అందిస్తారు.
31న రాష్ట్ర స్థాయి వేడుక
రాష్ట్ర స్థాయిలో ‘జగనన్న ఆణిముత్యాలు’ సన్మాన వేడుక ఈనెల 31న విజయవాడలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రతిభావంతులైన విద్యార్థులను సన్మానిస్తారు. పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను సత్కరిస్తారు.
ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ మేనేజ్‌మెంట్ స్కూళ్లలో చదివి అత్యధిక మార్కులు సాధించిన మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి సత్కారం అందుకుంటారు. మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.లక్ష, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ.75 వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు బహుమతి అందిస్తారు. ఇంటర్‌లో గ్రూప్‌నకు ఒక్కరు చొప్పున నాలుగు గ్రూపుల్లో అత్యధిక మార్కులు సాధించిన నలుగురికి రూ.లక్ష చొప్పున అందిస్తారు.
విద్యకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫలితాలను మెరుగుపరచడం, వారిని భావి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో అద్భుతమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకంటే 3 రెట్లు అధికంగా రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం ఖర్చు చేస్తోంది. పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లుల ఆర్థిక కష్టాలను తీర్చేందుకు ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం అమలు చేస్తోంది.
ఇందుకోసం అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం జమ చేస్తోంది. గత మూడేళ్లలో జగనన్న అమ్మ ఒడి పథకం కోసం ప్రభుత్వం రూ.19,617.6 కోట్లు ఖర్చు చేసింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు ‘మన బడి నాడు–నేడు’ పథకం కింద రూ.13 వేల కోట్లు వెచ్చించింది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగేలా గత మూడేళ్లుగా పాఠశాలలు ప్రారంభించే సమయంలో ‘జగనన్న విద్యా కానుక’ కింద బ్యాగ్, అన్ని రకాల పుస్తకాలు, స్టిచింగ్ చార్జీతో కలిపి 3 జతల యూనిఫారాలు, బెల్టు, బూట్లు, సాక్స్‌లు అందిస్తోంది.
అంతేగాక, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు, దుస్తులు మార్చుకునే గదులు, వాష్‌బేసిన్లు, టాయిలెట్ నిర్వహణ నిధిని ఏర్పాటు చేసింది. ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు, అన్ని పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించింది. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లను నియమించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒకే తేదీన ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్‌మెంట్లు నిర్వహించడం గమనార్హం.
ఇక ‘జగనన్న గోరుముద్ద’ పథకం కింద పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనం కింద ప్రత్యేక మెనూతో ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారాన్ని అందిస్తోంది. వారానికి ఐదు రోజులు గుడ్లు, చిక్కీలు పిల్లలకు అందజేస్తోంది. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు రాగిజావను వారానికి మూడుసార్లు అందించడం విశేషం. ఇప్పుడు కొత్తగా ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
దేశంలో కనీవినీ ఎరుగని నిర్ణయం
విద్యపై అత్యధిక ప్రేమ చూపే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తప్ప దేశంలో మరొకరు లేరు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు ఏ రాష్ట్రంలోనూ లేవు. ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట విద్యార్థులను సత్కరించడం గొప్ప విషయం. టాప్ స్కోరర్లలో సమాన మార్కులు ఎంతమంది సాధించినా వారందరినీ ‘జగనన్న ఆణిముత్యాలు’ కింద సత్కరించి, నగదు బహుమతులు అందజేస్తాం.
– బొత్స సత్యనారాయణ,విద్యా శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment