తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో జగనన్న ఆణిముత్యాలు పురస్కారాలు అందుకున్న విద్యార్థులతో ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి, ఉపాధ్యాయులు, తదితరులు
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను నియోజకవర్గ స్థాయిలో గురువారం ప్రభుత్వం ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట సత్కరించింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం కన్నులపండువగా సాగింది.
స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, కేజీబీవీ మేనేజ్‌మెంట్ల పరిధిలోని సంస్థల్లో పదో తరగతిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులను సన్మానించారు.
ఇలా నియోజకవర్గ స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులు 678 మందిని, ఇంటర్‌లో వివిధ మేనేజ్‌మెంట్ జూనియర్ కాలేజీల్లో ఆయా గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచిన 662 మంది విద్యార్థులను సన్మానించారు. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ వేడుక నిర్వహిస్తోంది.
విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్, పాఠశాలకు మెమెంటో ఇవ్వడంతోపాటు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా కొనసాగింది. ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా రంగం అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కృషిని సర్వత్రా ప్రశంసించారు. విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలతో విద్యా రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని కొనియాడారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, పల్నాడు జిల్లా నాదెండ్లలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, బాపట్ల జిల్లా వేమూరులో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, గంగాధర నెల్లూరులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, అనకాపల్లి జిల్లా మాడుగులలో డిప్యూటీ సీఎం ముత్యాలునాయుడు, తణుకు మండలం వేల్పూరులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విద్యార్థులను సన్మానించారు.
కూలి పనులకు వెళ్తూనే టాపర్‌గా..
అవనిగడ్డ : కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఇంటర్ హెచ్‌ఈసీలో టాపర్‌గా నిలిచిన పేరుబోయిన హరిత ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కోడూరు మండలం పాలకాయతిప్పకు చెందిన పేరుబోయిన నాగమల్లేశ్వరరావు–వెంకటేశ్వరమ్మ పెద్ద కుమార్తె. కూలి పనులకు వెళ్లడం వల్ల 2019లో పదోతరగతి పరీక్షలకు హాజరు కాలేక పోయింది. ఆ మరుసటి సంవత్సరం కూలి పనులకు వెళుతూనే కష్టపడి చదివి పదో తరగతిలో 520 మార్కులు సాధించింది.
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ హెచ్‌ఈసీలో చేరింది. 1000కి 893 మార్కులు సాధించి నియోజకవర్గంలో టాపర్‌గా నిలిచింది. జగనన్న ఆణిముత్యాల కార్యక్రమం కోసం హరిత కోసం గాలించిన స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దుర్గారమేష్, అధ్యాపకులు తమిళనాడులో కూలి పనులకు వెళ్లిందని తెలుసుకుని అక్కడకు వెళ్లి తీసుకొచ్చారు. సన్మానం అనంతరం హరిత మాట్లాడుతూ.. ‘నాలాంటి పేద కుటుంబాలకు అమ్మఒడి, నగదు ప్రోత్సాహాల ద్వారా జగనన్న ఎంతో అసరాగా నిలిచారు’ అంటూ భావోద్వేగంతో కంట నీరుపెట్టింది.
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం ద్వారా తాను డిగ్రీ చదువుకుని టీచర్ జాబ్ సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. హరితను డీఈవో తెహరా సుల్తానా, శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌బాబు ఓదార్చారు. మీ లాంటి వారు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే సీఎం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment