ఏపీ బడిబాటలో యూపీ | Uttar Pradesh inspired by Andhra Pradesh educational policies | Sakshi
Sakshi News home page

ఏపీ బడిబాటలో యూపీ

Oct 24 2022 2:09 AM | Updated on Oct 24 2022 2:09 AM

Uttar Pradesh inspired by Andhra Pradesh educational policies - Sakshi

మూడున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో పాఠశాలల అభివృద్ధి కోసం సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టిన విద్యా సంస్కరణలు మంచి ఫలితాలిస్తున్నాయి. ఇందులో భాగంగా వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా విద్యా రంగం నూతన పంథాలో దూసుకుపోతూ దేశానికి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఏపీలో నాడు–నేడు స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం శ్రీ’ స్కూళ్లకు ఇటీవల శ్రీకారం చుట్టింది. దేశంలో అన్ని వసతులతో 14,500కు పైగా స్కూళ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. వసతులు, విద్యార్థుల నైపుణ్యాల పెంపు లక్ష్యంతో ఐదేళ్ల కాల పరిమితితో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని సంకల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఏపీ తరహా మోడల్‌ అమలుకు ఉత్తరప్రదేశ్‌ కూడా అడుగులు ముందుకు వేస్తోంది.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని తమ ప్రాంత స్కూళ్లలో వాటి అమలుకు శ్రీకారం చుడుతున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా ఏపీలో ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నారు. డిజిటల్‌ తరగతులు, ఇంగ్లిష్, సైన్సు ల్యాబ్‌లు ఏర్పాటు చేయిస్తున్నారు. రూ.16 వేల కోట్లతో ప్రభుత్వ విద్యా సంస్థల రూపురేఖలు మారుస్తున్నారు. తొలివిడతలో 15,715 స్కూళ్లను సర్వాంగ సుందరంగా మార్పు చేశారు. రెండో విడత పనులూ ప్రారంభం అయ్యాయి.

సమగ్ర అధ్యయనంతో నివేదిక
ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఏపీ మోడల్‌ను అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 75 జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 15 వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పనితీరును మెరుగు పరిచేందుకు శ్రీకారం చుట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ విజయ్‌ కిరణ్‌ ఆనంద్‌ ఆదేశాల మేరకు యూపీ ఈఎల్టీఐ ప్రిన్సిపల్‌ స్కంద్‌ శుక్లా, ప్రొఫెసర్‌ కులదీప్‌ పాండేతో కూడిన ఇద్దరు విద్యా శాఖ అధికారుల బృందం కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని విజయవాడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పలు పాఠశాలలను సందర్శించింది.

ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌తో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని స్వయంగా పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న విద్యాభివృద్ధి కార్యాక్రమాలను అధ్యయనం చేసి, అక్కడి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ ఆ నివేదికలో పొందుపరిచారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 44,512 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలలు మూడేళ్ల క్రితం ఆంగ్ల మాధ్యమ పాఠశాలలుగా మారడంతో పాటు కార్పొరేట్‌కు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు చేపట్టిన నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్యమం, బైలింగ్యువల్‌ టెక్సŠట్‌ బుక్స్‌ వంటి కార్యక్రమాల గురించి నివేదించారు. పాఠశాలల నిర్వహణ ఎలా ఉందో స్పష్టంగా వివరించారు. కొత్తగా పాఠశాలల్లో ప్రవేశ పెడుతున్న ఫౌండేషనల్‌ స్కూళ్ల విధానం గురించి కూడా పేర్కొన్నారు.

పరీక్షల విధానమూ భేష్‌..
ఏపీలోని పరీక్షల విధానం చాలా బాగుందని కమిటీ పేర్కొంది. విద్యార్థులకు ప్రతి మూడు నెలలకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్, ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ ఉంటుంది. యూపీలో ఆరు నెలలకు ఒకసారి, చివరి పరీక్షల ద్వారా విద్యార్థులను సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే అంచనా వేస్తారు. ఏపీలో ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్టుల వారీగా బోధన ఉండగా, ఇప్పుడు ఫౌండేషనల్‌ విధానంలో 3వ తరగతి నుంచి ఈ బోధన అందుబాటులో ఉంటుంది. 

బదిలీల్లో పారదర్శకత 
ఉపాధ్యాయుల బదిలీలు, పోస్టింగ్‌లు పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉన్నాయని కమిటీ పేర్కొంది. ఎటువంటి మాన్యువల్‌ జోక్యం లేదని, అవినీతికి ఆస్కారం లేదని వివరించింది. 1–5 తరగతుల విద్యార్థుల కోసం డిజిటల్‌ తరగతులకు వీలుగా స్మార్ట్‌ టీవీలు, ఇంటరాక్టివ్‌ ప్యానెల్‌లు ఏర్పాటు చేయిస్తున్నారని, ఆన్‌లైన్‌ బోధనా విధానంలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో బోధనకు ఏర్పాట్లు చేశారని నివేదికలో పేర్కొన్నారు. 

నాడు–నేడు అద్భుతం 
2019–20 నుండి మూడేళ్ల వ్యవధిలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, పాఠశాలలలోని ప్రస్తుత మౌలిక సదుపాయాలను మిషన్‌ మోడ్‌లోకి మార్చడానికి ‘నాడు–నేడు’ మోడల్‌తో అమలు చేస్తున్న కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయని యూపీ బృందం పేర్కొంది. రన్నింగ్‌ వాటర్‌తో టాయిలెట్లు, తాగునీటి సరఫరా.. పెద్ద, చిన్న మరమ్మతులతో పాటు ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు..  సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌బోర్డ్‌లు, పాఠశాల భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు, కాంపౌండ్‌ వాల్స్‌ నిర్మాణం చేపట్టారని.

వివిధ శాఖల సమన్వయం ద్వారా ఈ పనులు చేస్తున్నారని వివరించారు.  రెసిడెన్షియల్‌ పాఠశాలలు, పాఠశాల విద్య, పంచాయితీ రాజ్, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, జువైనల్‌ సంక్షేమం, మత్స్య శాఖలతో సహా వివిధ శాఖల పరిధిలోని మొత్తం 44,512 పాఠశాలలను నాడు–నేడు ప్రాజెక్ట్‌ కవర్‌ చేస్తున్నట్లు నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని పాఠశాలల్లో సంస్కరణలు చేపట్టేందుకు అక్కడి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement