సాక్షి, అమరావతి: విద్యా సంస్కరణల ఫలితంగా పేద విద్యార్థులకు పెద్ద చదువులతో ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతుంటే పెత్తందారులు సహించలేకపోతున్నారు. అందినకాడికి రాళ్లు వేయడమే ధ్యేయంగా ఎల్లో మీడియాలో బురద కథనాలను అచ్చేసి కళ్ల మంటను చల్లార్చుకుంటున్నారు.
ఇంగ్లీషు మీడియం చదువులు, నాడు–నేడుతో కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా తయారైన ప్రభుత్వ విద్యాసంస్థలపై నిత్యం అక్కసు వెళ్లగక్కుతూ పెత్తందారీ పోకడలను రుజువు చేసుకుంటున్నారు. ట్యాబ్‌లు, సీబీఎస్సీఈ సిలబస్, టోఫెల్ శిక్షణ, ఐబీ.. ఇలా ఏది చూసినా ప్రభుత్వ విద్యారంగం ధీటుగా ఉండటాన్ని చూసి భరించలేక చదువులకు గండి కొట్టే యత్నాలకు తెగబడ్డారు!
కత్తిరింపులంటూ తప్పుడు లెక్కలు
ప్రభుత్వం అమ్మ ఒడి సాయాన్ని పలు కారణాలతో తగ్గిస్తోందని, మూడేళ్లల్లో 1.86 లక్షల మంది తగ్గిపోయారంటూ ఈనాడు అబద్ధాలు అల్లేసింది. అమ్మ ఒడి మార్గదర్శకాల ప్రకారం ఆరు దశల ధ్రువీకరణ తప్పనిసరి. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి నేరుగా ఖాతాలోనే జమ అవుతుంది.
ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వారికి మాత్రమే నిబంధనల ప్రకారం పథకం వర్తించదు. 2019–20, 2020–21లో కోవిడ్ కారణంగా విద్యార్థులకు 75 శాతం హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. 2021–22, 2022–23లో తొలుత నిర్దేశించిన ప్రమాణాలనే అమ్మ ఒడికి పాటిస్తున్నారు. కోవిడ్ రెండో దశలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడం తెలిసిందే.
రోత రాతలు కాదా?
నిర్వహణ పేరుతో రివర్స్ చెల్లింపులు అంటూ ఈనాడు మరో ఆరోపణ చేసింది. మనబడి నాడు–నేడు ద్వారా కల్పించిన సదుపాయాలను సక్రమంగా వినియోగించుకునేందుకు 2021లో పాఠశాల నిర్వహణ నిధిని, 2022లో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమ్మ ఒడి లబ్ధిదారుల నుంచి మినహాయించిన రూ.2 వేలు స్కూల్/ కాలేజీ కమిటీల ఖాతాలకే జమ అవుతుంది. ఆ మొత్తాన్ని పాఠశాలల్లో తక్షణ మరమ్మతుల కోసం ఖర్చు చేస్తున్నారు.
నాడు–నేడుతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రమైన టాయిలెట్లను సమకూర్చడంతో బాలికల డ్రాప్ అవుట్లు తగ్గిపోయాయి. ‘టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్’ ద్వారా రూ.987.20 కోట్ల నిధి జమ అయింది. నిర్వహణ కోసం 46,661 మంది ఆయాలను నియమించి నెలకు రూ.6 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. గత మూడేళ్లలో ఆయాలకు రూ.882 కోట్లు వేతనాలుగా చెల్లించారు. మరి రివర్స్ చెల్లింపులు అంటూ రామోజీ రాతల్లో ఏమైనా అర్ధం ఉందా?
♦ కుటుంబ ఆదాయం గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు ఉన్నవారికి అమ్మ ఒడి వర్తించదు. పారిశుధ్య కార్మికులకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రస్తుతం రూ.18 వేల చొప్పున వేతనం పొందుతున్నందున నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నారు.
♦ కోవిడ్ సమయంలో ప్రైవేట్ విద్యాసంస్థలు తరగతులు నిర్వహించకున్నా ఫీజులు మాత్రం వసూలు చేశాయి. ప్రభుత్వం పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు పర్యాయాలు అమ్మ ఒడి నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేసింది.
♦ నాడు–నేడు తొలిదశ కింద 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో పనులు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రెండో విడతలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టగా రూ.3,287 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి.
♦ మధ్యాహ్న భోజనానికి చంద్రబాబు హయాంలో ఏటా రూ.450 కోట్లు వ్యయం చేయగా ఇప్పుడు గోరుముద్ద ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment