సాక్షి ప్రతినిధి, బాపట్ల: రోడ్లపై గుంత కనబడితే చాలు అక్కడకి గద్దల్లా వాలిపోతున్న ఎల్లోమీడియా గ్యాంగ్.. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేకపోతోంది. తమకు రోడ్డు సౌకర్యం కలిగి ప్రజలు, రైతులు ఆనందంగా ఉంటే అక్కసుతో ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది. అబద్ధాల్లో ఆరితేరిన రామోజీరావు అభివృద్ధి పనులకు వక్రభాష్యం చెబుతూ పనిగట్టుకొని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు.
ఈ పరంపరలో ఈనాడు పత్రిక మంగళవారం ‘‘వైవీ సుబ్బారెడ్డి వ్యవసాయక్షేత్రానికి రూ. 30 లక్షలతో రోడ్డు’’ అనే తప్పుడు కథనాన్ని ప్రచురించింది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం అనమనమూరు వద్ద జనావాసాలు లేని, ప్రజలు తిరగని మార్గంలో రోడ్డు వేశారని, అధికారులు పెద్ద మొత్తంలో ధనాన్ని వెచ్చించి స్వామిభక్తి చాటుకున్నారంటూ ఆ కథనాన్ని అచ్చేశారు.
రైతులకు, భక్తులకు సౌకర్యంగా..
వాస్తవానికి మేదరమెట్ల అనమనమూరు రోడ్డులో అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్‌రోడ్డు వరకూ 2.5 కిలో మీటర్ల మేర ఉపాధిహామీ నిధులతో రెండు సంవత్సరాల క్రితం తారురోడ్డు వేశారు. ఈ రహదారి పరిధిలో కొరిశపాడు మండలం అనమనమూరు, అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామాలున్నాయి. మణికేశ్వరం వద్ద దక్షిణకాశీగా పేరుగాంచిన శైవక్షేత్రం ఉంది.
ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఇక మూడు గ్రామాల పరిధిలో సుమారు నాలుగు వందల ఎకరాల పొలాలు ఉన్నాయి. ఈ పొలాల్లో రైతులు వరి, మామిడి, పుచ్చ తదితర పంటలు పండిస్తున్నారు. నిత్యం రైతులు రాకపోకలు సాగిస్తారు. గతంలో ఈ ప్రాంతానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. చిన్నపాటివర్షం కురిసినా రాకపోకలకు వీలుకాని పరిస్థితి.
గతంలో గ్రావెల్ రోడ్డు వేసినప్పుడూ తప్పుడు రాతలే..
వైవీ సుబ్బారెడ్డి మేదరమెట్లకు చెందిన వారు కావడంతో అనమనమూరు, కొంగపాడు, మణికేశ్వరం గ్రామాల రైతులు, ప్రజలు దారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గతంలో వైవీ సుబ్బారెడ్డిని కోరారు. దీంతో 2005లో మేదరమెట్ల నుంచి అనమనమూరు వరకూ తారురోడ్డును మంజూరు చేయించిన సుబ్బారెడ్డి.. అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ వరకూ గ్రావెల్ రోడ్డును సైతం మంజూరు చేయించారు.
రెండు సంవత్సరాల క్రితం అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ వరకూ రెండేళ్ల క్రితం తారురోడ్డు పూర్తికావడంతో మణికేశ్వరం, శైవక్షేత్రంలకు వెళ్లే భక్తులకు నాలుగు కిలోమీటర్ల దూరం తగ్గింది. దూరాభారం తగ్గి, మెరుగైన రోడ్డు రావడంతో స్థానికులు ఆనందంగా ఉండటం.. రామోజీకి కంటగింపుగా మారింది.
వైవీ సుబ్బారెడ్డి కుటుంబీకులకు నలభై ఎకరాలు కూడా లేని చోట.. ఏకంగా వంద ఎకరాలు ఉన్నాయంటూ ఈనాడు వక్రీకరించింది. ఇలాంటి అబద్ధపు రాతలు రాసిన ఈనాడుపై స్థానికులు మండిపడుతున్నారు. గతంలో గ్రావెల్ రోడ్డు వేసినప్పుడూ ఇలాంటి రాతలే రాశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డు వేసింది ప్రజలకోసం
అనమనమూరు గ్రామం నుంచి మణికేశ్వరం క్రాస్ వరకూ రోడ్డు నిర్మించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని చాలా సార్లు వైవీ సుబ్బారెడ్డి గారిని కోరాం. పొలాలకు వెళ్లేందుకు పడుతున్న కష్టాలను ఆయనకు చెప్పాం. దీంతో ఆయన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనమనమూరు నుంచి మణికేశ్వరం క్రాస్ వరకూ తారు రోడ్డు వేయించారు.
గతంలో మేదరమెట్లనుంచి అనమనమూరువరకూ రోడ్డును కూడా సుబ్బారెడ్డి కుటుంబమే వేయించింది. ఈ రోడ్డుతో మా గ్రామాలకు వెళ్లడంతో పాటు పొలాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉంది. ప్రజలకు మంచి జరగడం చూసి ఓర్వలేక ఈనాడు పత్రిక తప్పుడు రాతలు రాసింది.– జంపు హరిబాబు, అనమనమూరు సర్పంచ్
భక్తులకు రోడ్డు సౌకర్యంగా ఉంది
గతంలో మాగ్రామాలకు, పంట పొలాలకు దారిలేక ఇబ్బందులు పడ్డాం. ప్రఖ్యాత మణికేశ్వర ఆలయానికీ సరైన దారిలేక భక్తులు ఇబ్బందులు పడాల్సివచ్చేది. ఈ విషయాన్ని మా గ్రామాల ప్రజలు వైవీ సుబ్బారెడ్డి గారికి చెప్పడంతో వారు రోడ్డు వేయించారు. దీంతో రైతులు, భక్తులకు ఇబ్బందులు తప్పాయి. అది చూడకుండా సుబ్బారెడ్డి పొలాలకు దారి వేసుకున్నారంటూ ఈనాడు తప్పుడు వార్త రాయడం దుర్మార్గం. – మందా నాగయ్య, మణికేశ్వరం సర్పంచ్ భర్త
Comments
Please login to add a commentAdd a comment