Amma Odi program
-
గండి కాదు.. అక్కసు గండం!
సాక్షి, అమరావతి: విద్యా సంస్కరణల ఫలితంగా పేద విద్యార్థులకు పెద్ద చదువులతో ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతుంటే పెత్తందారులు సహించలేకపోతున్నారు. అందినకాడికి రాళ్లు వేయడమే ధ్యేయంగా ఎల్లో మీడియాలో బురద కథనాలను అచ్చేసి కళ్ల మంటను చల్లార్చుకుంటున్నారు. ఇంగ్లీషు మీడియం చదువులు, నాడు–నేడుతో కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా తయారైన ప్రభుత్వ విద్యాసంస్థలపై నిత్యం అక్కసు వెళ్లగక్కుతూ పెత్తందారీ పోకడలను రుజువు చేసుకుంటున్నారు. ట్యాబ్‌లు, సీబీఎస్సీఈ సిలబస్, టోఫెల్ శిక్షణ, ఐబీ.. ఇలా ఏది చూసినా ప్రభుత్వ విద్యారంగం ధీటుగా ఉండటాన్ని చూసి భరించలేక చదువులకు గండి కొట్టే యత్నాలకు తెగబడ్డారు! కత్తిరింపులంటూ తప్పుడు లెక్కలు ప్రభుత్వం అమ్మ ఒడి సాయాన్ని పలు కారణాలతో తగ్గిస్తోందని, మూడేళ్లల్లో 1.86 లక్షల మంది తగ్గిపోయారంటూ ఈనాడు అబద్ధాలు అల్లేసింది. అమ్మ ఒడి మార్గదర్శకాల ప్రకారం ఆరు దశల ధ్రువీకరణ తప్పనిసరి. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి నేరుగా ఖాతాలోనే జమ అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వారికి మాత్రమే నిబంధనల ప్రకారం పథకం వర్తించదు. 2019–20, 2020–21లో కోవిడ్ కారణంగా విద్యార్థులకు 75 శాతం హాజరు నుంచి మినహాయింపునిచ్చారు. 2021–22, 2022–23లో తొలుత నిర్దేశించిన ప్రమాణాలనే అమ్మ ఒడికి పాటిస్తున్నారు. కోవిడ్ రెండో దశలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడం తెలిసిందే. రోత రాతలు కాదా? నిర్వహణ పేరుతో రివర్స్ చెల్లింపులు అంటూ ఈనాడు మరో ఆరోపణ చేసింది. మనబడి నాడు–నేడు ద్వారా కల్పించిన సదుపాయాలను సక్రమంగా వినియోగించుకునేందుకు 2021లో పాఠశాల నిర్వహణ నిధిని, 2022లో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమ్మ ఒడి లబ్ధిదారుల నుంచి మినహాయించిన రూ.2 వేలు స్కూల్/ కాలేజీ కమిటీల ఖాతాలకే జమ అవుతుంది. ఆ మొత్తాన్ని పాఠశాలల్లో తక్షణ మరమ్మతుల కోసం ఖర్చు చేస్తున్నారు. నాడు–నేడుతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రమైన టాయిలెట్లను సమకూర్చడంతో బాలికల డ్రాప్ అవుట్లు తగ్గిపోయాయి. ‘టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్’ ద్వారా రూ.987.20 కోట్ల నిధి జమ అయింది. నిర్వహణ కోసం 46,661 మంది ఆయాలను నియమించి నెలకు రూ.6 వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. గత మూడేళ్లలో ఆయాలకు రూ.882 కోట్లు వేతనాలుగా చెల్లించారు. మరి రివర్స్ చెల్లింపులు అంటూ రామోజీ రాతల్లో ఏమైనా అర్ధం ఉందా? ♦ కుటుంబ ఆదాయం గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు ఉన్నవారికి అమ్మ ఒడి వర్తించదు. పారిశుధ్య కార్మికులకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రస్తుతం రూ.18 వేల చొప్పున వేతనం పొందుతున్నందున నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నారు. ♦ కోవిడ్ సమయంలో ప్రైవేట్ విద్యాసంస్థలు తరగతులు నిర్వహించకున్నా ఫీజులు మాత్రం వసూలు చేశాయి. ప్రభుత్వం పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు పర్యాయాలు అమ్మ ఒడి నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేసింది. ♦ నాడు–నేడు తొలిదశ కింద 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో పనులు చేపట్టి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రెండో విడతలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు చేపట్టగా రూ.3,287 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ♦ మధ్యాహ్న భోజనానికి చంద్రబాబు హయాంలో ఏటా రూ.450 కోట్లు వ్యయం చేయగా ఇప్పుడు గోరుముద్ద ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రభుత్వం రూ.1,800 కోట్లు వెచ్చిస్తోంది. -
నాలుగో ఏడాదీ ‘జగనన్న అమ్మ ఒడి’
సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాదీ 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. పది రోజులపాటు పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించి 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. తద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి అమ్మ ఒడి నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తాజాగా అందచేసే డబ్బులతో కలిపితే ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు. నాలుగేళ్లలో విద్యా రంగానికి రూ.66,722.36 కోట్లు విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కీలక సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.66,722.36 కోట్లను వెచ్చించారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థీ చదువులకు దూరం కారాదనే సంకల్పంతో విద్యారంగంపై పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ అది భావి తరాల ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తున్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా మార్చి ప్రైవేట్ స్కూళ్లే సర్కారు విద్యాసంస్థలతో పోటీ పడే పరిస్థితిని కల్పించారు. పేద విద్యార్థులను గ్లోబల్ స్టూడెంట్లుగా తీర్చిదిద్దుతూ ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ విధానంలో బోధన నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ ఉచితంగా అందిస్తున్నారు. పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చారు. నాడు–నేడు తొలిదశ పనులు పూర్తైన స్కూళ్లలో ఆరు, ఆపై తరగతుల నుంచి డిజిటల్ తరగతి గదులను తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసేలా బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను విద్యార్థులకు అందించి ప్రపంచంతో పోటీ పడేలా వెన్ను తడుతున్నారు. మన విద్యార్థులు విదేశాల్లో సైతం ఉన్నత చదువులు చదివేలా జగనన్న విదేశీ విద్యా దీవెనతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ఆదుకుంటున్నారు. స్పోకెన్ ఇంగ్లీషులో నైపుణ్యాలను సాధించేలా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ‘టోఫెల్’ పరీక్షలకు సన్నద్ధం చేసి సర్టిఫికెట్లు అందించేలా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అమెరికా సంస్థ ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కాగా విద్యార్థుల చేరికలను ప్రోత్సహిస్తూ జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు టెన్త్, ఇంటర్లో ఉత్తీర్ణులు కాకపోయినా తిరిగి తరగతులకు హాజరైతే వారికి కూడా అమ్మ ఒడిని వర్తింపచేయాలని నిర్ణయించారు. -
ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, సచివాలయం: ఏపీలో 6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. అలాగే, నర్సాపురం ఫిషరీస్ కాలేజ్ అండ్ యూనివర్సిటీకి 140 పోస్టులకు, 476 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో నైట్ వాచ్మెన్ పోస్టులకు 10,117 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఇక, సీపీఎస్ విధానం రద్దు చేసి జీపీఎస్‌కు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. కాగా, మంత్రి చెల్లుబోయిన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ ఉభయ ప్రయోజనకరం. హెచ్ఆర్ఏను 12 శాతం నుంచి 16శాతానికి పెంచాం. కొత్త మెడికల్ కాలేజీల్లో 2,118 సహా మరికొన్ని శాఖల్లో పోస్టులు, సీతానగరం పీహెచ్సీ అప్‌గ్రేడ్‌కు 23 పోస్టులకు కేబినెట్ ఆమోదం. ప్రతీ మండలంలో 2 జూనియర్ కాలేజీలకు ఆమోదం. ► కడప మానసిక వైద్యశాలలో 116 పోస్టులకు కేబినెట్ ఆమోదం. 3వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపునకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కో-ఆపరేటివ్ సొసైటీల్లో సూపర్ న్యూమరీ పోస్టుకు ఆమోదం. చిత్తూరు డెయిరీకి 28.35 ఎకరాల భూమికి 99 ఏళ్లకు లీజుకు నిర్ణయం. విశాఖ మానసిక వైద్యశాలలో 11 పోస్టుల మంజూరు. ► ఇక, ఒడిశా మృతులకు కేబినెట్ సంతాపం తెలిపినట్టు వెల్లడించారు. బాధితుల కోసం 50 అంబులెన్స్‌లు పంపించినట్టు తెలిపారు. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియాకు ఆమోదం తెలిపిందన్నారు. ► అనంతపురం, సత్యసాయి జిల్లాలో విండ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. ► ఈనెల 12 నుంచి విద్యాకానుక పంపిణీకి నిర్ణయం. ఈనెల 28 నుంచి అమ్మఒడి పథకం అమలుకు నిర్ణయం. నాడు-నేడు కింద పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నైట్ వాచ్మెన్ పోస్టులకు ఆమోదం. జగనన్న ఆణిముత్యాలు పథకం అమలుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ► రూ. 5లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలను కమిటీలకు అప్పగింత. ఈ ఆలయాల నిర్వహణ బాధ్యత అర్చకులదే. ఐదేళ్ల పాటు ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. ► పాడి రైతులకు సరైన ధర కల్పించాం. ఇవాళ పాల సేకరణ పెరిగింది. పాల ధర పెరిగింది. అమూల్ రావడం వల్ల పాడి రైతులకు మేలు జరిగింది. ► ఉద్యోగులందరికీ ఏరియర్స్‌తో 2.73శాతం డీఏకు ఆమోదం తెలిపినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. -
రేపు అమ్మ ఒడి రెండో ఏడాది చెల్లింపులు
సాక్షి, అమరావతి: నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను అంటూ పాదయాత్రలో చెప్పిన ప్రతిమాటను అక్షరాలా చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా రెండో ఏడాది కూడా విజయవంతగా సంక్షేమపథకాలను అమలు చేస్తున్నారు. మాట ఇచ్చారంటే నెరవేర్చడమే లక్ష్యంగా ప్రతీ అడుగూ ముందుకేస్తున్నారు. అందులో భాగంగానే నవరత్నాల హమీలో అత్యంత కీలకమైన అమ్మఒడికి వరుసగా రెండో ఏడు కూడా శ్రీకారం చుడుతున్నారు. చదువుకు పేదరికం ఎప్పుడూ ఆటంకం కాకూడదన్న గొప్ప ఆలోచనతో వైఎస్ జగన్ ప్రకటించిన అమ్మఒడి కార్యక్రమాన్ని రెండో ఏడు కూడా విజయవంతంగా ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ కార్యక్రమాన్ని రేపు (సోమవారం) నెల్లూరులో సీఎం ప్రారంభించనున్నారు. (చదవండి: ‘రాజకీయ పార్టీలా ఎస్ఈసీ వ్యవహరిస్తోంది’) సీఎం పర్యటన ఇలా.. రేపు ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్న సీఎం వైఎస్ జగన్.. 11.10 గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు.11.30 గంటలకు నెల్లూరు శ్రీవేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో అమ్మ ఒడి పథకం రెండో ఏడాది కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు.అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు. అమ్మఒడి పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి అకౌంట్లో సంవత్సరానికి రూ.15 వేలు ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్ధులకు ప్రవేశపెట్టినా... ఇంటర్ వరకు కూడా వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా గతేడాది దాదాపు 43 లక్షల మంది తల్లుల అకౌంట్లో సుమారు రూ.6336.45 కోట్లు జమ చేశారు.(చదవండి: చంద్రబాబు డైరెక్షన్లో నిమ్మగడ్డ..) ఈ ఏడాది మరింత మందికి ప్రయోజనం కలిగేలా... ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా ఈ యేడాది నిబంధనలు సడలించిన ప్రభుత్వం... కోవిడ్ 19 పరిస్ధితుల్లో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధనను మినహాయింపు నిచ్చింది. కుటుంబ ఆదాయ పరిమితి గతంలో గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.5వేలు, పట్టణాల్లో రూ.6250 ఉంటే, ఈ ఏడు గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు చేశారు. గతంలో రెండున్నర ఎకరాల మాగాణి, మెట్టభూమి 5 ఎకరాలలోపు పరిమితి ఉండగా, ఈ యేడు మగాణి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలుగా మార్పు చేశారు. విద్యుత్ వినియోగానికి సంబంధించి నెలకు గతంలో 200 యూనిట్లలోపు వాళ్లను అర్హులుగా గుర్తిస్తే..ఈ దఫా 300 యూనిట్ల వినియోగమున్నవాళ్లను కూడా అర్హులుగా గుర్తించారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఫెన్షనర్లకు పథకాన్ని వర్తింపజేయలేదు, ఈ దఫా పారిశుద్ధ్య కార్మికులను అందులో నుంచి మినహాయించారు. దీంతో పారిశుద్ధ్య కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఈ యేడు అమ్మఒడి వస్తుంది. గతంలో ఫోర్ వీలర్ ఉన్న కుటుంబాల్లో టాక్సీ కలిగి ఉన్నవారికే మాత్రమే మినహాయింపు నివ్వగా,ఈ దఫా ట్రాక్టర్లు, ఆటోలున్నవారినీ ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు. గతంలో మున్సిపాల్టీలలో 750 చదరపు అడుగుల లోపు స్ధిరాస్ధి ఉన్న వారికి పథంలో అర్హులగా గుర్తించగా, ఈ దఫా 1000 చదరపు అడుగుల స్ధలం ఉన్నవారిని కూడా పథకంలో అర్హులుగా గుర్తిస్తున్నారు. దీంతో ఈ దఫా అమ్మఒడి ద్వారా 44 లక్షల 48 వేల 865 మంది తల్లులకు లబ్ధి చేకూరనుంది కోవిడ్-19 నేపథ్యంలో అమ్మఒడి ప్రయోజనాలు... కోవిడ్ విపత్తు పేద, మత్యతరగతి ప్రజలపై గణనీయమైన ప్రభావం చూపించింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక లక్షలాది మంది కనీస అవసరాలు కూడా తీరలేని పరిస్ధితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 19, 2020 నుంచి అన్ని స్కూళ్లు మూతపడ్డాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమ్మఒడి పేదల పాలిట కవచంలా నిలిచింది. రాష్ట్రంలో సుమారు 43 లక్షల కుటుంబాల్లో ఒక్కొక్కరికి రూ.15వేలు జమ చేయడం ద్వారా ప్రతిఒక్కరిలో అమ్మఒడి వెలుగులు నింపింది. దీనికి తోడు మనబడి నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక పాఠశాల విద్యా వ్యవస్ధలో గొప్ప మార్పును తీసుకొచ్చాయి. దీర్ఘకాలికగా విద్యా వ్యవస్ధకు గొప్ప మేలు చేసే ఈ కార్యక్రమాలు విద్యార్ధుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశాయి. కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత రాష్ట్రంలో నవంబరు 2వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కాగా.. తొలుత 9,10 తరగతులకు నవంబరు 23 నుంచి తరగతులు ప్రారంభం కాగా, 7,8 తరగతులకు డిసెంబరు 14 నుంచి తరగతులు మొదలయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అందరి విద్యార్ధులకు 2020–21 విద్యా సంవత్సరానికి గానూ జగనన్న విద్యా కానుక కిట్స్ అందించటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిర్ధిష్ట విధానంలో పాఠశాలలు నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఆరో తరగతి నుంచి విద్యార్ధులకు ఈ యేడాది జనవరి 18 నుంచి తరగతులు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పటి పరిస్ధితులను బట్టి ఒకటో తరగతి నుంచి 5 వరకు తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. వీటికి అదనంగా ఇప్పటికే విద్యార్ధులకు వివిధ రకాల ఆన్లైన్ ఫ్లాట్‌ఫాంల సహకారంతో పాఠ్యాంశాల బోధనకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మనబడి నాడు–నేడు పాఠశాలల్లో విద్యా వాతావరణాన్ని సమూలంగా మార్పు చేసే చర్యల్లో భాగంగా మనబడి నాడు–నేడుకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇందులో భాగంగా పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వ స్కూళ్లను సమూలంగా మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3287 ప్రభుత్వ హాస్టళ్లు, 55,607 అంగన్వాడీ కేంద్రాల రూపు రేఖలు సమూలంగా మారున్నాయి. ఆధునీకరణలో భాగంగా సుమారు రూ.14 వేల కోట్లు ఖర్చు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు సంబంధించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం. తొలివిడతలో భాగంగా 15,715 స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది 2019 నవంబరు 14న బాలల దినోత్సవం రోజున తొలిదశ నాడు–నేడ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో ప్రభుత్వం. కొన్ని నిర్ధిష్ట ప్రమాణాలు నిర్ధేశించింది. 1.రన్నింగ్ వాటర్ సౌకర్యంతో పరిశుభ్రమైన మరుగుదొడ్లు 2.ట్యూబులైట్లు, ఫ్యాన్లతో విద్యుదీకరణ. 3.మంచినీటి సరఫరా 4.ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్ధులకు ఫర్నిచర్. 5.పాఠశాలకు పూర్తి స్ధాయి పెయింటింగ్. 6.పాఠశాలకు కావాల్సిన అన్ని రకాల మరమ్మతులు 7.గ్రీన్ చాక్ బోర్డ్స్ 8.ఇంగ్లిషు లేబ్ 9.పాఠశాల చుట్టూ ప్రహారీ 10.కిచెన్ షెడ్స్ పాఠశాల విద్యా కమిటీలు ఈ పనులన్నింటికీ స్కూల్ లెవల్లో బాధ్యత పర్యవేక్షించాల్సి ఉంది. ఇంగ్లిషు మీడియం విద్య పేద విద్యార్ధులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో రాణించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాధమిక స్ధాయి నుంచి ఇంగ్లిషుమీడియంలో విద్యా బోధన దిశగా అడుగులు వేసిన ప్రభుత్వం. జగనన్న గోరుముద్ద జగనన్న గోరుమద్ద ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45,484 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో దాదాపు 37 లక్షల మంది విద్యార్ధులకు నాణ్యమైన పౌష్టికాహారం, ప్రతిరోజూ మెనూ మార్చి రుచికరమైన, ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం అందిస్తోంది. కోవిడ్ సమయంలో కూడా వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే డ్రై రేషన్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ఏటా దాదాపు రూ.520 కోట్లు ఖర్చు చేస్తే... వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.1,456 కోట్లు ఖర్చు చేసింది. జగనన్న విద్యా కానుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్ధికి బడులు తెరిచే సమయానికి కుట్టుకూలితో సహా 3 జల యూనిఫారాలు, స్కూల్ బ్యాగ్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, సాక్స్, షూస్ ప్రభుత్వం అందించింది. పాఠశాలల్లో పారిశుద్ధ్యం పాఠశాలల్లో పారిశుద్ధ్య వసతులకు, విద్యార్ధుల్లో ముఖ్యంగా బాలికల్లో డ్రాప్ అవుట్స్ సంఖ్య పెరగడానికి మధ్య ఉన్న విలోమ సంబంధాన్ని గుర్తించిన ప్రభుత్వం, పాఠశాలల్లో పారిశుద్ధ్య పరిస్ధితుల మెరుగుపరచి డ్రాప్ అవుట్లను గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో అమ్మ ఒడి లబ్ధిదారులకు అందించే రూ.15 వేలు నుంచి రూ.1000 జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్‌లో జమ చేస్తుంది. ఈ సామ్ము ఆ పాఠశాలల్లో టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం వాడతారు. వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్‌గా అంగన్వాడీలు.. ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 55,607 అంగన్వాడీల్లో ప్రి–ప్రైమరీ 1, ప్రి– ప్రైమరీ 2, ప్రి ఫస్ట్ క్లాసు తరగతులు ఉంటాయి. ఇంగ్లిషు మీడియంలో బోధనతో పాటు ఆటల ద్వారా పాఠాలు, చదువుతో పాటు 8.5 లక్షల మంది చిన్నారులకు పౌష్టికాహార, పిల్లల మానసిక వికాసానికి గట్టి పునాది వేయనున్నారు. మూడు దశల్లో 2023 జూన్ నాటికి అంగన్ వాడీ బిల్డింగ్‌ల రూపురేఖలు సమూలంగా మారనున్నాయి. జగనన్న విద్యా దీవెన పేద విద్యార్ధుల కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా డిగ్రీ, మెడిసన్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ మరియు పేద విద్యార్ధులకు రూ.4,101 కోట్ల వ్యయంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తోంది. జగనన్న వసతి దీవెన ఏటా రూ.2300 కోట్ల ఖర్చుతో ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ మరియు పేద విద్యార్ధులకు వసతి, భోజన మరియు రవాణా ఖర్చుల కొరకు ప్రతి ఏటా రూ.20 వేలు వరకు రెండు దఫాల్లో చెల్లిస్తోంది. విద్యా రంగంపై వైఎస్. జగన్ గత 12 నెలల్లో చేసిన వ్యయం... ♦జగనన్న అమ్మ ఒడి పథకం ద్వార 44,48,865 మంది లబ్ధిదారులకు గాను రూ,13,023 కోట్ల రూపాయలు అందించింది. ♦జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 18,51,043 లబ్దిదారులకు రూ. 4101 కోట్లు వ్యయం. ♦జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మంది లబ్ధిదారులకు రూ.1220.99 కోట్లు వ్యయం. ♦జగనన్న విద్యా కానుక ద్వారా 42,34,322 మంది లబ్ధిదారులకు రూ.647.85 కోట్లు వ్యయం. ♦జగనన్న గోరుముద్ద ద్వారా 36,88,618 మంది లబ్ధిదారులకు రూ.1456 కోట్లు వ్యయం. ♦పాఠశాలల్లో నాడు–నేడు తొలిదశ కింద ఇప్పటివరకు రూ.2248 కోట్లు వ్యయం చేసింది. ♦వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద 30,16,000 మంది లబ్ధిదారులకు రూ.1863.13 కోట్లు వ్యయం చేసింది. మొత్తమ్మీద 1 కోటి 87 లక్షల 95 వేల 804 మంది లబ్ధిదారులకు గానూ గత 12 నెలల కాలంలో వైయస్.జగన్ ప్రభుత్వం రూ.24,559.97 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అదే గత ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో అరకొరగా ప్రతి యేడూ బకాయిలు పెడుతూ చేసిన వ్యయం కేవలం రూ.3,875.93 కోట్లు మాత్రమే. -
యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు
సాక్షి, అమరావతి: ఈ నెల 10వ తేదీ నుంచి 45 రోజుల పాటు యుద్ధ ప్రాతిపదికన రహదారుల మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రూ.560 కోట్లతో రహదారుల మరమ్మతులకు సంబంధించి ఈ నెల 10వ తేదీలోగా టెండర్లు పూర్తి చేస్తామని, ఈ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం ఆయన స్పందన కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు సంబంధించి తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో చివరి రెండేళ్లు రహదారుల మరమ్మతుల గురించి పట్టించుకోలేదని, మనం అధికారంలోకి వచ్చాక భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బ తిన్నాయని తెలిపారు. ఈ ఏడాది అంతా రోడ్ల మరమ్మతులపైనే దృష్టి పెడుతున్నామని స్పష్టం చేశారు. మరో రూ.2 వేల కోట్లతో కూడా రహదారుల మరమ్మతులపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి రుణం మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమీక్షలో వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. రూ.12 వేల కోట్లతో కొత్త రహదారులు ► ఆర్ అండ్ బీకి సంబంధించి 31 ఎన్‌హెచ్ (నేషనల్ హైవే) ప్రాజెక్టులు ఉన్నాయి. రూ.9,571 కోట్ల ఖర్చుతో 915 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇందుకు సంబంధించి భూ సేకరణ పూర్తి చేయాలి. ► సుమారు రూ.12 వేల కోట్లతో కొత్త రోడ్ల పనులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించి కూడా భూ సేకరణపై దృష్టి పెట్టాలి. నిర్ణయించిన తేదీ నుంచి 270 రోజుల్లోపు భూములను కాంట్రాక్టర్‌కు అప్పగించకపోతే కాంట్రాక్టరు డీస్కోపింగ్ (రేటు పెంచండని)కు అడిగే అవకాశం ఉంటుంది. ప్రాధాన్యతగా ఉపాధి పనులు ► గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ – భారీ పరిమాణంలో పాలను శీతలీకరణలో ఉంచే కేంద్రాలు), అంగన్వాడీ సెంటర్లు, విలేజ్ క్లినిక్స్ పనులను గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రాధాన్యతగా పూర్తి చేయాలి. ► ఒక మనిషికి లేదా ఒక ఏజెన్సీకి ఒక పని మాత్రమే అప్పగించాలి. ఎక్కువ పనులు అప్పగిస్తే ఒక పని అయిపోయే వరకు రెండో పని మొదలు పెట్టడం లేదు. దీనికి అనుగుణంగా వెంటనే మార్పులు చేయాలి. మార్చి 31లోగా అనుకున్న పనులన్నీ పూర్తి చేయాలి. ► ఇందుకు సూక్ష్మ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. గ్రామాల వారీగా ప్లాన్ ఉండాలి. ఈ పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలి. అప్పుడే పూర్తి స్థాయిలో నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. నిర్మాణాల్లో వేగం పెరగాలి ► గ్రామ సచివాలయాల నిర్మాణాలను వేగవంతం చేయాలి. గ్రామాల వారీగా పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని నిర్మాణాల ప్రగతిని సమీక్షించాలి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ప్రణాళిక వేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. విలేజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ► మన బడి నాడు–నేడు కింద స్కూళ్లలో చేపట్టిన మొత్తం పనులన్నీ వచ్చే నెలాఖరు నాటికి పూర్తి కావాలి. ప్రతి బిల్డింగును ఒక యూనిట్‌గా తీసుకుని జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. ► ప్రొక్యూర్‌మెంట్‌కు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఈడబ్ల్యూఐడీసీ)తో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలి. క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి. అంగన్ వాడీ కేంద్రాలు ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్పు ► అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం పెండింగులో ఉన్న వాటికి వెంటనే స్థలాలను సేకరించాలి. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. ఈ కేంద్రాలకు కావాల్సిన స్థలాలను పూర్తి స్థాయిలో గుర్తించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను అభినందిస్తున్నా. ► ఆరేళ్ల లోపు పిల్లల్లో 85 శాతం మెదడు అభివృద్ధి చెంది ఉంటుంది. అందువల్ల వారి పట్ల అత్యంత శ్రద్ధ చూపిస్తున్నాం. మంచి విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దడానికి ఈ పనులన్నీ చేస్తున్నాం. ఇంగ్లిష్ సహా వారికి అన్నీ నేర్పిస్తాం. ఎంపీఎఫ్‌సీల నిర్మాణానికి భూముల గుర్తింపు ► బహుళ ప్రయోజన సౌకర్యాల కేంద్రాల (ఎంపీఎఫ్సీ – మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్) కోసం ఆర్బీకేల సమీపంలో అర ఎకరా నుంచి ఒక ఎకరం వరకు స్థలం కావాలి. గోదాములు, శీతల గిడ్డంగులు, వ్యవసాయ ఉత్పత్తులను ఆరబెట్టడానికి అవసరమైన వేదిక (డ్రైయింగ్ ప్లాట్‌ఫాం), వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు (కలెక్షన్ సెంటర్లు), ప్రాథమికంగా శుద్ధిచేసే పరికరాలు (ప్రైమరీ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్), అసైయింగ్ ఎక్విప్మెంట్ (పరీక్షించే పరికరాలు), సేకరణ పరికరాలు (ప్రొక్యూర్మెంట్ అక్విప్‌మెంట్) తదితర సదుపాయాల కోసం భూములు కావాలి. ► ట్రక్కులు వెళ్లేలా ఈ భూములు ఉండాలి. జనవరి 31 నాటికల్లా ఈ భూముల గుర్తింపు పూర్తి కావాలి. గ్రామాల్లోనే జనతా బజార్ల కోసం 5 సెంట్లు కావాలి. గ్రామం మధ్యలోనే ఉండేలా చూడాలి. వచ్చే ఏడాదిలో గ్రామ స్వరూపంలో పూర్తి మార్పు వస్తుంది. ► ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే, విలేజ్ క్లినిక్, ప్రీప్రైమరీ స్కూల్, జనతాబజార్లతో మొత్తం గ్రామాల స్వరూపం మారుతుంది. ఆర్బీకేల పక్కనే ఎంపీఎఫ్‌సీలు వస్తాయి. దాదాపు రూ.10,235 కోట్ల ఆర్థిక వనరుల సమీకరణకు అనుసంధానం కూడా పూర్తవుతుంది. ► జనవరిలో పంట కోత ప్రయోగాలు (క్రాప్ కటింగ్ ఎక్స్పర్మెంట్స్) పూర్తయితే, ఫిబ్రవరిలో ప్లానింగ్ నివేదిక ఆధారంగా ఏప్రిల్ నాటికి రైతులకు ఇన్సూరెన్స్ అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. జనవరి 11న అమ్మ ఒడి జనవరి 9న రెండో శనివారం, బ్యాంకులకు సెలవు కావడంతో జనవరి 11న అమ్మ ఒడి నిర్వహిస్తున్నాం. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో డిసెంబర్ 21 నుంచి లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాం. జనవరి 7 వరకు ఆ జాబితాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. స్కూళ్లకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఆ రోజు ప్రకటిస్తాం. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ మేరకు ప్రకటిస్తాం. ఇంటింటికీ రేషన్ బియ్యం రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ఈ నెల 20వ తేదీన 9,257 వాహనాలను ప్రారంభిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా అవకాశం ఇస్తూ వారికి వాహనాలు అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. బియ్యం అందించే బ్యాగులను కూడా అదే రోజు ఆవిష్కరిస్తాం. రేషన్ సరఫరాలో భాగంగా స్వర్ణ రకం బియ్యం అందిస్తాం. విజయవాడలో మూడు జిల్లాలకు సంబంధించిన వాహనాలు ప్రారంభిస్తాం. మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని వారి ఇళ్ల వద్దే అందజేస్తాం. -
సీఎం జగన్ సభకు ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, చిత్తూరు : ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. వచ్చే నెల(జనవరి) 9న అమ్మ-ఒడి కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ చిత్తూరు నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా 47 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న అమ్మ ఒడి కార్యక్రమానికి స్థల పరిశీలన చేస్తున్నామని కలెక్టర్ భరత్ గుప్తా పేర్కొన్నారు. సీఎం జగన్ మొదటి సారి జిల్లాకు రానున్న నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తారని, అందుకు తగిన భద్రతతోపాటు చర్యలు తీసకుంటామని ఎస్పీ సెంథిల్ కుమార్ స్పష్టం చేశారు. అమ్మ ఒడి కార్యక్రమాన్ని ద్విగిజయం చేసేందుకు అందరం కలిసి కృషి చేస్తామని చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. -
బాబు, పవన్‌లకు ఎన్నికల్లో ఒక్క సీటూ రాదు : కంచె ఐలయ్య
సాక్షి, విజయవాడ : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆంగ్లమాధ్యమాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటూ రాదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య బుధవారం వ్యాఖ్యానించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు జూపూడి ప్రభాకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ప్రశంసించారు. దేశంలో ఇంతవరకు ఎవరూ తీసుకోలేని నిర్ణయాన్ని తీసుకున్నందుకు జగన్‌కు ధన్యవాదాలని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల పేద పిల్లల భవిష్యత్తే మారుతుందని, ఇంగ్లీష్‌లో చదవడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టమని అడిగితే ఒప్పుకోలేదని వెల్లడించారు. అమ్మ ఒడి వల్ల పేదల బతుకులు మారుతాయని, దీన్ని వ్యతిరేకిస్తున్నవారిని చీపుర్లతో తరిమికొట్టాలని తల్లులకు పిలుపునిచ్చారు. మరోవైపు ఇంగ్లీష్ మీడియంను కార్పొరేట్ శక్తులే వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. ‘అన్ని పార్టీల నాయకులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు. చంద్రబాబు తన కుమారుడిని, మనవడిని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు. మా పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌లో చదవకూడదా? లేక పేదపిల్లలు పెద్దల పిల్లలకు పోటీగా వస్తారని భయపడుతున్నారా’? అంటూ ప్రశ్నించారు. ఇంగ్లీష్ వల్ల తెలుగు భాషకు వచ్చిన ముప్పు ఏమీ లేదని, ఇప్పుడు మొత్తుకుంటున్న మేధావులు ప్రైవేట్ స్కూళ్లలో తెలుగు మీడియం పెట్టమని ఎందుకు అడగడం లేదని నిలదీశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఏమి తెలుసని ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటూ రాదని హెచ్చరించారు. అమ్మ ఒడి పథకానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల పిల్లల జీవితాలు బాగుపడడం చంద్రబాబు, పవన్‌లకు ఇష్టం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. పేదల బతుకులు మారాలని ముఖ్యమంత్రి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని కుహనా మేధావులే వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పకడ్బందీగా ‘అమ్మ ఒడి’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. రాష్ట్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకు ఈ పథకం అమలుకు చేపట్టాల్సిన విధి విధానాలపై డీఈవోలు, ఎంఈవోలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేసింది. ఈ కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో చేపట్టి పూర్తి చేయాలని, సందేహాలను నివృత్తి చేసేందుకు డీఈవో కార్యాలయంలో 24 గంటలూ పనిచేసేలా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. షెడ్యూల్ ఇలా - పాఠశాల చైల్డ్ ఇన్ఫోలో నమోదైన విద్యార్థుల వివరాలను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు క్షుణ్ణంగా పరిశీలించి ఈ నెల 19లోగా ధ్రువీకరించాలి. ఆ జాబితాను గ్రామ సచివాలయంలోని విద్య, సంక్షేమ సహాయకునికి ఈ నెల 24న పంపించాలి. - ఈ జాబితాను 25వ తేదీ నాటికి గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో పెట్టాలి - వీటిపై అభ్యంతరాలుంటే మూడు రోజుల్లో గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకునికి తెలపాలి. - ఆధార్ నంబర్, ఆధార్ ఎన్రోల్మెంట్ లేని విద్యార్థుల వివరాలను గ్రామ వలంటీర్ల ద్వారా నవంబరు 25 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు సేకరించాలి. - ఆ సమాచారాన్ని విద్యా, సంక్షేమ సహాయకుడు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయునికి నేరుగా అందించాలి. - ప్రధానోపాధ్యాయుడు ఆ సమాచారాన్ని ఏపీసీఎఫ్ఎస్ఎస్ పోర్టల్‌లో డిసెంబరు 5 నాటికి అప్డేట్ చేయాలి. - అర్హులైన తల్లుల/సంరక్షకుల ముసాయిదా జాబితాను డిసెంబరు 8 నాటికి రూపొందించి గ్రామ సచివాలయంలోని విద్యా, సంక్షేమ సహాయకునికి ప్రధానోపాధ్యాయులు పంపించాలి. - ముసాయిదా జాబితాను సచివాలయంలో విద్యా, సంక్షేమ సహాయకుడు గ్రామ స్థాయిలో డిసెంబర్ 9న ప్రకటించాలి. - ప్రకటిత సమాచారంపై గ్రామస్తులు లేదా లబ్ధిదారులు అభ్యంతరాలు వ్యక్తం చేయటానికి 3 రోజులు గడువు ఇస్తారు. - ముసాయిదా జాబితాకు డిసెంబర్ 15 నుంచి 18లోగా గ్రామసభ ఆమోదం పొందాలి. - ఆమోద జాబితాను గ్రామ సచివాలయ సహాయకుడు డిసెంబర్ 20 నాటికి అందజేయాలి. - ఆ జాబితాలను ప్రధానోపాధ్యాయుడు ఎంఈవో ద్వారా డీఈవోకు డిసెంబర్ 23లోగా పంపించాలి. డీఈవో డిసెంబర్ 24 నాటికి కలెక్టర్ ఆమోదం కోసం సమర్పించాలి. -
అమ్మఒడి ఒక మార్గదర్శిని
స్వాతంత్య్రానంతరం ఒక రాష్ట్రంలో తొలిసారి అమలుకానున్న విద్యా సంస్కరణగా అమ్మఒడి పథకం గుర్తింపు పొందనుంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యాపరమైన అసమానతలను తుడిచిపెట్టగల శక్తి దీనికి ఉంది. ఈ దేశంలో పుట్టిన పిల్లలందరి భవిష్యత్తును డబ్బు నిర్ణయిస్తున్న స్థితిలో పిల్లల సంక్షేమానికి తల్లుల బ్యాంకు ఖాతాలకు ఏటా రూ. 15 వేలతో ఆర్థిక భరోసాని కల్పించే వినూత్నపథకం ఇది. ఏపీ ప్రభుత్వం ఈ పథకం కోసం కేటాయించనున్న రూ. 6,455 కోట్లతో పేద పిల్లలు చదువుకునే పరిస్థితుల్లో సమూల మార్పు వస్తుంది. తెలుగు సబ్జెక్టును కొనసాగిస్తూనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను తప్పనిసరి చేస్తున్న కొత్త విద్యా పథకం దేశానికే మార్గదర్శకం కానుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, విద్యా, మార్కెట్‌పై అమ్మ ఒడి గణనీయమైన ప్రభావాలను చూపనుంది. ఆర్థిక పరిస్థితులు దుర్భరంగా ఉంటూ కూడా తమ పిల్లలను బడికి పంపుతున్న తల్లులందరి బ్యాంక్ ఖాతాలోకి విద్యా ఖర్చు కింద రూ. 15,000లను బట్వాడా చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగ¯Œ మోహన్‌రెడ్డి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ పథకం పేరు అమ్మఒడి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రమాణాల రీత్యా, దారిద్య్ర రేఖకు దిగువన కనీస మాత్రం ఆదాయ వనరులను కలిగి ఉండి, తమ పిల్లలను 1 నుంచి 12వ తరగతి వరకు స్కూళ్లకు పంపుతున్న తల్లులు ఈ పథకం కింద నగదు సహాయం అందుకోగలరు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల అమలుకు తప్పనిసరైన తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. దీనికోసం ఏపీ ప్రభుత్వం రూ. 6,455 కోట్లను కేటాయించింది. దీనికి ముందుగా సీఎం మరొక కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా కలిగి ఉంటూనే ఇంగ్లిష్ మీడియంలోకి మార్చివేస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. స్వాతంత్య్రానంతరం ఒక రాష్ట్రంలో తొలిసారి అమలుకానున్న విద్యా సంస్కరణగా ఇది గుర్తింపు పొందుతుంది. రాష్ట్రంలో విద్యా పరమైన అసమానతలను తుడిచిపెట్టగల శక్తి దీనికి ఉంది. స్వాతంత్య్రం తర్వాత పాఠశాల విద్యా రంగాన్ని నిర్వహించుకునే అధికారం రాష్ట్రాలకు దఖలు పడినప్పటికీ, కేంద్రప్రభుత్వం దుర్మార్గమైన పాఠశాల విద్యా వ్యవస్థను నిర్వహించడానికి అనుమతించింది. దీని ప్రకారం పేదవారు అరకొర నిధులతో నడిచే ప్రాంతీయ భాషా ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే తమ పిల్లలను పంపించాలి. కానీ, తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్థిక సహాయం లభించదు. మరోవైపున నగర, పట్టణ ప్రాంతాల్లోని సంపన్నులు మెరుగైన మౌలిక వసతులు ఉండే ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూళ్లకు తమ పిల్లలను పంపించగలిగేవారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పిల్లల భవిష్యత్తును డబ్బు నిర్ణయిస్తుందన్నమాట. కుల/వర్గ ప్రమాణాలను బట్టి చూస్తే శ్రామిక ప్రజారాసులతో ఉండే దిగువ కులాలను, ఇన్ని దశాబ్దాలుగా సరైన వసతులు కూడా లేని స్కూల్ విద్య కొనసాగుతున్న ప్రాంతీయ భాషల్లో చదువుకే పరిమితం చేశారు. అగ్రకులాల సంపన్నులు మాత్రం తమ పిల్లలను అంతర్జాతీయ అనుసంధానం ఉన్న ఇంగ్లిష్ మీడియం పాఠశాలలకు పంపిం చేవారు. ఇవి మెరుగైన వసతులతో ఉండేవని చెప్పనవసరం లేదు. ఈ పథకంతోపాటు వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపరుస్తామని వైఎస్ జగన్ వాగ్దానం చేశారు. జగన్ ప్రతిపాదించిన అదనపు చేర్పులేవీ లేకుండానే ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. కమ్యూనిస్టు పార్టీలు, మితవాద జాతీయవాద పార్టీలైన బీజేపీ, శివసేన వంటి అన్ని రాజ కీయ పార్టీలు దేశంలో కాంగ్రెస్ ప్రతిపాదిత స్కూల్ విద్యా సూత్రాన్నే ఆమోదించాయి. ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఒకే రకమైన విద్యావ్యవస్థను కొనసాగిస్తూ వచ్చాయి. చివరకు కపటత్వంతో కూడిన ఉదారవాద మేధావులు సైతం బోధనా మాధ్యమం గురించి, పేద తల్లులకు అత్యవసరమైన ఆర్థిక సహాయం అందించడం గురించి మాట్లాడకుండా నాణ్యమైన పాఠశాల విద్య గురించి లెక్చర్లు దంచుతూ వచ్చారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన అమ్మఒడి తరహా ఆర్థిక సహాయం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అనేవి ఈ మసకను తొలగించేశాయి. దేశంలోనే ఇది మార్గదర్శకం కానుంది. దేశచరిత్రలో తొలిసారిగా అమ్మఒడి తరహా విద్యాపరమైన ఆర్థిక ప్యాకేజీ కింద తండ్రి ఖాతాలోకి కాకుండా తల్లి ఖాతాలోకి నేరుగా నగదు వచ్చి చేరనుంది. ఇది భారతీయ పాఠశాల విద్యావ్యవస్థ ప్రాథమిక నిర్మాణాన్ని దానితోపాటు మార్కెట్‌ని కూడా మార్చివేయనుంది. ఇది దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యుత్తమమైన భవిష్యత్ స్త్రీ–పురుష అధికారిక సంబంధాల వృద్ధి వ్యవస్థగా చెప్పాలి. ఈ తరహా విద్యా నమూనా రాష్ట్రంలోనూ, దేశంలోనూ కలిగించే ప్రభావాలు ఏమిటి? ఈ పథకంలో భాగంగా నాణ్యమైన ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్య మారుమూల పల్లెటూరి చిన్నారిని సైతం జాతీయ, ప్రాంతీయ విజ్ఞాన వ్యవస్థలతోపాటు అంతర్జాతీయ విజ్ఞాన వ్యవస్థలతో కూడా అనుసంధానం చేస్తుంది. కాబట్టి ప్రాంతీయ, ప్రపంచస్థాయి విజ్ఞానం చక్కగా అనుసంధానమవుతాయి. ఉత్పత్తి మూలాలను కలిగిన కుటుంబ నేప«థ్యం గల పిల్ల లకు స్కూలు చుట్టూ ఉన్న ఉత్పత్తి క్షేత్రాలు శ్రమపట్ల గౌరవం ప్రాతిపదికతో ఉండే జీవితంతో, విజ్ఞానంతో పెరిగే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ తరహా ఉత్పత్తి, విజ్ఞాన అనుసంధానంలో పట్టణ పిల్లలు బలహీనులు. పల్లె వాతావరణంలో లభించే ఉత్తమమైన విద్య భాషలను సత్వరం నేర్చుకునేలా పిల్లలను తీర్చిదిద్దుతాయి. తల్లిదండ్రుల కష్టాలు, సంతోషాలతో భాగమైన పిల్లలు హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లలకంటే ఎక్కువ అనుభవజ్ఞులై ఉంటారు. నా దృష్టిలో అమ్మఒడి పథకం ఏపీలో ఒక కొత్త, సానుకూల మార్కెట్ వికాసాన్ని ఆవిర్భవింప చేస్తుంది. తండ్రిలాగా తల్లి తన ఖాతాకు జమ అయిన నగదును లిక్కర్ మార్కెట్‌కు ధారపోయదు. ఆమె దాన్ని మంచి స్కూల్ డ్రెస్, చక్కటి షూలు, నాణ్యమైన తిండిపై వెచ్చిస్తుంది. గ్రామాల్లో, పట్టణాల్లో ఈ తరహా కొత్త కొనుగోలు సామర్థ్యం మార్కెట్ వికాసాన్ని సృష్టిస్తుంది. ప్రభుత్వం అందించనున్న రూ. 6,455 కోట్ల డబ్బు పిల్లల శ్రేయస్సు, విద్యాపరమైన మెరుగుదల అవసరాలను తీర్చే మార్కెట్లలోకి ప్రవహిస్తుంది. ఇది ఒక కొత్త సాంస్కృతిక గ్రామాన్ని రూపొందిస్తుంది. పాఠశాల పిల్లల జీవితాన్ని మారుస్తుంది. పిల్లలు తమ తల్లిదండ్రుల జీవితాల్లో మార్పు తీసుకొస్తారు. నిరుపేద కుటుంబాల్లోని పిల్లల ఆరోగ్యాన్ని అమ్మ ఒడి గణనీయంగా మెరుగుపరుస్తుంది. తల్లి తన పిల్లలలో సంవత్సరానికి రూ. 15,000ను సంపాదించే అర్జనాపరులను చూస్తుంది. కాబట్టి పిల్లల సంరక్షణ అపారంగా పెరుగుతుంది. మంచి పాఠశాల, మంచి ఆహారం, మంచి డ్రెస్, గ్రామీణ వాతావరణంలో సాగే ఆటలు పిల్లల సర్వతోముఖాభివృద్ధిని మెరుగుపరుస్తాయి. ఇది యోగా కాదు.. వ్యవసాయ పనుల్లో పాల్గొంటూనే పరుగెత్తడం, హైజంప్, లాంగ్ జంప్ తీయడం, చెట్లు ఎక్కడం, చెరువులు, కాలువలు, నదుల్లో ఈత వంటి పల్లె ఆటలు పిల్లలను అత్యంత శక్తిమంతులైన భారతీయ పౌరులుగా తీర్చిదిద్దుతాయి. ప్రస్తుతం ఆరెస్సెస్/బీజేపీలు పాఠశాలల్లో ప్రోత్సహించాలనుకుంటున్న యోగా.. చిన్నపిల్లలను బాల్యంలోనే ముసలిపిల్లలుగా మారుస్తుంది. అంటే ఒక స్థలంలో మాత్రమే కొన్ని వ్యాయామాలు చేయగల ముసలి పిల్లలు అన్నమాట. యోగా తరహాలో కూర్చుని చేసే కార్యక్రమం కాకుండా పిల్లల శరీరాలు మరింత చురుకుదనంతో, మరింత చలన స్థితిలో ఉండాలి. అందుకే ప్రభుత్వ పాఠశాలలు యోగాను కాకుండా పై తరహా శారీరక వ్యాయామం గురించి ఆలోచించాలి. యూరోపియన్–అమెరికన్ తరహా స్కూళ్లలాగా పిల్లల ఊహాశక్తిని పెంచగల మంచి పాఠశాలలు పల్లెల్లో ఉంటే, వారిలో విమర్శనాత్మక ఆలోచన చాలావరకు మెరుగుపడుతుంది. ఇంటిలోని ప్రజాస్వామికమైన, శ్రామిక సంస్కృతి వాతావరణం అటు గ్రామంలోనూ, ఇటు స్కూల్లోనూ ఉండే కుల వ్యవస్థను బలహీనపరుస్తుంది. కులపరమైన దొంతరలను, అంటరానితనాన్ని నిర్మూలించడానికి కుటుంబం కంటే పాఠశాల ఉత్తమమైన సంస్థగా ఉంటుంది. దీనికి ఒకే ఒక షరతు ఏమిటంటే, స్కూల్ సిలబస్ శ్రమగౌరవం గురించిన పాఠాలను చక్కగా పొందుపర్చగలగాలి. పవిత్రత, మాలిన్యంకి సంబంధించిన అన్ని సిద్ధాంతాలను స్కూల్ పాఠ్య పుస్తకాల నుంచి తొలగించేయాలి. పాఠ్యపుస్తకాలు చర్మకార పని, బట్టలుతకడం, క్షురక వృత్తి, పొలం దున్నడం, కుండల తయారీ గురించి పిల్లలకు తప్పక చెప్పగలగాలి. స్కూలులో పాఠం చెప్పడం, పూజారి పని చేయడం రెండింటినీ ఒకే గౌరవంతో చూడాలి. అప్పుడే పిల్లల మనస్సుల్లో మానవ సమానత్వానికి సంబంధించిన బీజాలు మొలకెత్తుతాయి. అవే అన్ని సామాజికవర్గాలు, శ్రమ సంస్కృతుల పట్ల పిల్లల ప్రవృత్తిని తీర్చిదిద్దుతాయి. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, విద్యా, మార్కెట్‌పై అమ్మ ఒడి గణనీయమైన ప్రభావాలను చూపనుంది. వచ్చే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక భిన్నమైన రాష్ట్రంగా ఉంటుందని ప్రకటించిన స్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయగలగాలి. రాష్ట్ర స్థాయిలో అమలు చేసే ఈ విద్యా విధానం ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం రూపొం దించిన నూతన విద్యా విధానాన్ని సైతం మార్చివేయవచ్చు. (నేటితో ప్రజాసంకల్పయాత్రకు రెండేళ్లు. అమ్మ ఒడి పథకంఆ సంకల్పయాత్రలో ఇచ్చిన హామీల్లో భాగమే) వ్యాసకర్త: ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్, డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
అందరికీ ‘జగనన్న అమ్మ ఒడి’
సాక్షి, అమరావతి: నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని సమగ్రంగా, సమర్థంగా అమలు చేసేలా విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో 79ను విడుదల చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు ఎయిడెడ్, ప్రయివేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియెట్) వరకు చదువుతున్న విద్యార్ధుల తల్లులకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2019–20) నుంచే ఈ పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు అందించనున్నారు. తల్లి లేకుంటే ఆ పిల్లల అధికారిక సంరక్షకునికి ఈ మొత్తాన్ని ఇస్తారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న పిల్లలకు సైతం ఈ సహాయం అందనుంది. పాఠశాలల్లో చేరికల, హాజరు పెంపు, సమాన విద్యావకాశాల కల్పన, ఉత్తమ బోధనా ప్రమాణాల సాధన లక్ష్యంగా ‘జగనన్న అమ్మ ఒడి పథకాన్ని’ ప్రభుత్వం అమలు చేయనుంది. తద్వారా విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే బలమైన విద్యాపునాదులు ఏర్పడతాయని ప్రభుత్వం అభిలషిస్తోంది. అమ్మఒడి పథకం అర్హతలు - కుటుంబంలోని పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ పథకం వర్తిస్తుంది. - ఆ కుటుంబానికి ప్రభుత్వం జారీ చేసిన తెల్ల రేషన్ కార్డు ఉండాలి. - లబ్ధిదారుడు/తల్లికి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఉండాలి - ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ఆ కుటుంబంలోని పిల్లలకూ ఆధార్ కార్డు ఉండాలి. - రేషన్ కార్డులోని సమాచారాన్ని 6 దశల్లో పరిశీలించి ధ్రువీకరిస్తారు. - స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలల్లో ప్రవేశం పొందిన అనాథలు/వీధి పిల్లలకు ఈ ప్రయోజనాన్ని సంబంధిత శాఖలతో సంప్రదించి అమలుచేస్తారు. - విద్యార్థులు కనీసం 75% హాజరును కలిగి ఉండాలి. - పిల్లలు మధ్యలో తమ చదువును నిలిపివేస్తే ఆ విద్యా సంవత్సరానికి వారు ఈ పథకానికి అనర్హులు. ఆర్థిక సాయాన్ని తిరిగి అందుకోవాలంటే పాఠశాలకు పిల్లలు తిరిగి హాజరు కావాలి. - సమన్వయంతో కూడిన వ్యవస్థ ద్వారా విద్యార్థులు, లబ్ధిదారులను గుర్తిస్తారు. - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగులు, పెన్షన్లు అందుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రిటైర్డు ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కాదు. చెల్లింపు విధానం ఇలా.. - అర్హులైన ప్రతి లబ్ధిదారు జాతీయ బ్యాంకులో లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి. - అర్హులైనవారి అకౌంట్లకు ప్రతి ఏటా జనవరిలో రూ.15వేలు జమ అవుతుంది. - ఈ పథకం కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేస్తారు. దీన్ని కమిషనర్, స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌కు లింకు చేస్తారు. - ఆయా విద్యాసంస్థలు అందించే విద్యార్ధుల డేటాను చైల్డ్ ఇన్ఫో, యూడైస్, సివిల్ సప్లయ్ డేటాలతో సరిపోల్చుతారు. - ఆ డేటాను సంస్థ తరఫున ఉండే తనిఖీ అధికారి ధ్రువీకరించాలి. - అనంతరం డీఈఓ, జిల్లా వృత్తి విద్యాధికారి, ప్రాంతీయ విద్యాధికారుల పరిశీలన అనంతరమే లబ్ధిదారుల ఖాతాలోకి జమచేస్తారు. - గ్రామ వలంటీరు స్కూలు డేటాను క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించాలి. తన పరిధిలో తల్లి, లేదా సంర„ýుకుడిని వలంటీరు గుర్తించాలి. నిర్ణీత ప్రొఫార్మాలో వారి వివరాలు సేకరించి, ఎంఈఓలకు సమర్పించాలి. - డీఈఓ, ప్రాంతీయ విద్యాధికారి, వృత్తి విద్యాధికారి, జిల్లా కలెక్టర్లకు సంబంధిత లబ్ధిదారుల డేటాను సమర్పించాలి. - పథకంలో ఎలాంటి అక్రమాలు జరిగినా సంబంధిత అధికారులు, లబ్ధిదారులే బాధ్యులు. - డేటా విశ్లేషణ, ఇతర కార్యకలాపాలకు ఐటీ, సివిల్ సప్లయిస్, రియల్ టైమ్ గవర్నెన్సు విభాగాలు సాంకేతిక సహకారంతో పనిచేయాలి. - లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్‌కు వీలుగా ప్రదర్శించాలి. -
అమ్మఒడికి హాజరు తప్పనిసరి
పేదరికం, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదన్న సంకల్పంతో సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూపొందించిన పథకం అమ్మ ఒడి...ఈ పథకం కింద లబ్ధిపొందాలనుకునే వారు పాఠశాలకు, కళాశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలి. 75 శాతం హాజరు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. హాజరు శాతాన్ని పెంచే దిశగా తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు టౌన్: జగనన్న అమ్మ ఒడి పథకం పొందాలంటే విద్యార్థుల హాజరు తప్పనిసరి కానుంది. తాము చదువుకునే పాఠశాలలు, కాలేజీల్లో డిసెంబర్ 31నాటికి 75శాతం హాజరు ఖచ్చితంగా ఉండాలంటూ పాఠశాల విద్యాశాఖ తేల్చి చెప్పింది. హాజరును తప్పనిసరి చేయడం ద్వారా విద్యార్థుల్లో డ్రాప్ అవుట్స్‌ను నివారించేందుకు ఎంతగానో దోహదపడుతోందనేది ప్రభుత్వ వాదన. అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి పొందేందుకు 75శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నాయి. అమ్మ ఒడి పథకం కోసమైనా కొంతమంది తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలు, కాలేజీలు మాన్పించకుండా క్రమం తప్పకుండా ప్రతిరోజూ పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. తద్వారా ఆ విద్యార్థి ప్రతిరోజూ తరగతులకు వెళ్లడం ద్వారా చక్కగా చదువుకుని మంచి ఉత్తీర్ణత సాధించేందుకు అవకాశం కలగనుంది. జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 478587మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంటర్ మీడియట్ మొదటి, రెండవ సంవత్సరాలకు సంబంధించి 59058మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరిలో అమ్మ ఒడి పథకానికి అర్హులను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమైనారు. రంగంలోకి వలంటీర్లు అమ్మ ఒడి పథకానికి గ్రామ, వార్డు, డివిజన్ వలంటీర్ల సేవలను వినియోగించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామ, వార్డు, డివిజన్ల పరిధిలో వలంటీర్లను నియమించడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న జనాభాను ఆధారం చేసుకుని వారికి ఇళ్లు కేటాయించడం జరిగింది. ఇప్పటికే వాలంటీర్లు తమ పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు నివశిస్తున్నాయి, వారిలో ఎంతమంది తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, ఒక్కో ఇంటిలో ఎంతమంది నివశిస్తున్నారన్న వివరాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న అమ్మ ఒడి పథకానికి సంబంధించిన వివరాల సేకరణ కూడా వలంటీర్ల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. అమ్మ ఒడి వివరాలకు సంబంధించి ఒక్కో వలంటీర్‌కు 50కుటుంబాలకు తగ్గకుండా కేటాయించనున్నారు. తమకు కేటాయించిన 50కుటుంబాల పరిధిలో ఒకటి నుంచి ఇంటర్ మీడియట్ వరకు ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో సమగ్రంగా వివరాలను సేకరించనున్నారు. వలంటీర్లు సేకరించిన వివరాలను మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందించాల్సి ఉంటుంది. ప్రతి మండల విద్యాశాఖాధికారి పరిధిలో పాఠశాలల వారీగా సమగ్రంగా వివరాలు ఉన్నాయి. తాజాగా వలంటీర్లు సేకరించిన వివరాలను సరి పోల్చుతూ ఏమైనా తప్పులు ఉంటే అక్కడికక్కడే సరిదిద్దే బాధ్యతను వలంటీర్లకు అప్పగించారు. తద్వారా అమ్మ ఒడి పథకం వాస్తవ లబ్ధిదారుల జాబితాలు సిద్ధం కానున్నాయి. తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ అమ్మ ఒడి పథకానికి అర్హత సాధించిన విద్యార్థులకు సంబంధించి తొలుత వారి తల్లి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించనున్నారు. ఆ విద్యార్థికి తల్లి లేకుంటే తండ్రి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించనున్నారు. తల్లి తండ్రి ఇద్దరూ లేకుంటే ఎవరి సంరక్షణలో(గార్డియన్) ఉంటున్నారో గుర్తించి ఆ వ్యక్తి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించనున్నారు. జనవరిలో అమ్మ ఒడి పథకానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ బ్యాంకు ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15వేల నగదు జమ చేయనుంది. ఇందుకు సంబంధించి ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కూడా ఆమోదం పొందడం జరిగింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల్లో ఏ ఒక్కరికీ నష్టం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందాలంటే ఆ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఒకవేళ తెల్ల రేషన్ కార్డు లేకుంటే వారి ఆర్థిక పరిస్థితులను పూర్తి స్థాయిలో విచారించిన అనంతరం అర్హులుగా భావిస్తే అలాంటి వారికి అమ్మ ఒడి పథకం వర్తిస్తోంది. రేషన్ కార్డుతోపాటు విద్యార్థులకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను కూడా సేకరించనున్నారు. -
అమ్మఒడి పథకానికి కేబినెట్ ఆమోదం
-
‘అమ్మఒడి’కి ఆమోదం
సాక్షి, అమరావతి: ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు పేద విద్యార్థులను పాఠశాల, కళాశాలలకు పంపే తల్లులకు జగనన్న అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేయడాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం జగనన్న అమ్మ ఒడితో పాటు సబ్ ప్లాన్ పరిధిలోని 77 గిరిజన మండలాల్లో గర్భవతులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించడం, కృష్ణా–గోదావరి డెల్టా కాల్వల శుద్ధి, కార్పొరేట్ రెస్పాన్స్‌బులిటీ కింద కనెక్ట్ టు ఆంధ్రా పేరిట సంస్థ ఏర్పాటు, వివిధ రంగాల్లో ప్రజా సేవలు అందించిన ప్రతిభావంతులకు వైఎస్సార్ లైఫ్ టైం అవార్డులు, తదితర కీలక నిర్ణయాలు తీసుకుంది. హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు, రోబో ఇసుక యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్, 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు, అభ్యంతరం లేని పట్టణ ప్రాంతాల్లో 100 చదరపు గజాల వరకు రూపాయికే రిజిష్ట్రేషన్ వంటి కీలక నిర్ణయాలకూ ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కేబినెట్ నిర్ణయాల్లో కొన్ని ఇలా.. పథకాలు ఇక చకచకా నవంబర్ 1 నుంచి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లో సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు నవంబర్ 7న అగ్రిగోల్డ్ బాధితులకు రూ.10 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు నవంబర్ 21న వైఎస్సార్ మత్స్యకార నేస్తం కింద వేట విరామంలో ఏటా ఇచ్చే మొత్తం రూ.4,000 నుంచి రూ.10,000కు పెంపు ఇవి రద్దు.. - విశాఖపట్నం బీచ్‌రోడ్డులో లులూ సంస్థకు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత విలువైన 13.83 ఎకరాల కేటాయింపు ఒప్పందం రద్దు. - కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో చంద్రబాబు సమీప బంధువుకు వీబీసీ ఫెర్టిలైజర్స్ పేరుతో ఇచ్చిన 498.93 ఎకరాల భూ కేటాయింపును రద్దు. - పరస్పర అంగీకారంతో స్టార్టప్ ఏరియా ఒప్పందం రద్దు. వేతనం పెంపు - ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,బోధన ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేతనం నెలకు రూ.16,000కు పెంచడానికి గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీ పిల్లలకు అమ్మఒడి జగనన్న అమ్మ ఒడి పథకానికి దారిద్య్రరేఖకు దిగువనున్న ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలందరూ అర్హులు. అర్హులైన పిల్లల తల్లులకు ఏటా జనవరిలో రూ.15 వేలు అందించనున్నారు. తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకులకు వర్తింపజేస్తారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు సహా ప్రభుత్వ, ప్రైయివేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న పిల్లల తల్లులకూ ఈ పథకం వర్తిస్తుంది. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. పేదరికంలో ఉండి తెల్లరేషన్‌కార్డు లేని వారు దరఖాస్తు చేసుకుంటే దానిపై విచారించి, అర్హత ఉంటే పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు చేసుకునేందుకు పాఠశాల విద్య కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేస్తారు. జగనన్న అమ్మ ఒడికి ఈ సంవత్సరంలో రూ.6,455 కోట్లు వ్యయం చేయనున్నారు. రక్తహీనత నివారించేందుకు అదనపు పౌష్టికాహారం పౌష్టికాహార లోపం, రక్తహీనత అధికంగా ఉన్న 8 జిల్లాల్లోని సబ్‌ప్లాన్ ఏరియాల్లో 77 గిరిజన మండలాల్లో గర్భవతులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పైలెట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. రాష్ట్రంలో 7 గిరిజన సమీకృత అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లు.. సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్.పురం, శ్రీశైలం ఐటీడీఏల పరిధిలో తొలి విడతగా అమలవుతుంది. గర్భిణీలు, బాలింతలకు నెలకు రూ.1,062 విలువైన ఆహారం అందిస్తారు. నెలలో 25 రోజుల చొప్పున రోజూ వేడి అన్నం, కోడిగుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, తృణ ధాన్యాలు, మాంసకృత్తులు, ఐరన్‌తో సహా అధిక శక్తినిచ్చే పౌష్టికాహారం రేషన్‌గా ఇంటికి సరఫరా చేస్తారు. ఆరు నెలల నుంచి 3 సంవత్సరాల్లోపు పిల్లలకు నెలకు రూ.600 విలువైన ఆహారం అందిస్తారు. నెలలో 30 రోజుల పాటు రోజూ కోడిగుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, 25 రోజుల పాటు 100 గ్రాముల చొప్పున బాలామృతం ఇస్తారు. 3 నుంచి ఆరు సంవత్సరాల్లోపు పిల్లలకు నెలకు రూ.560 విలువైన ఆహారం అందిస్తారు. 25 రోజుల పాటు రోజూ కోడిగుడ్డు, 200 మిల్లీ లీటర్లు పాలు, పాయసం లేదా లడ్డూ లేదా బిస్కట్ లేదా కేక్ (50 గ్రాముల బరువు.. బాలామృతంతో తయారు చేసింది) అల్పాహారంగా అందిస్తారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డులు వివిధ రంగాల ద్వారా ప్రజా సేవ అందించిన వారికి, ప్రతిభావంతులకు వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డులను అందించేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. విద్య, సామాజిక సేవ, వైద్యం, సైన్స్, ఇంజనీరింగ్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమలు, సాహిత్యం, కళలు సహా క్రీడా రంగాల్లో వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డులు అందజేస్తారు. అవార్డుల కమిటీని ముఖ్యమంత్రి నియమిస్తారు. అవార్డులపై తమ సిఫార్సులను కమిటీ సీఎంకు నివేదించనుంది. ఏటా జనవరి 26న 50 మందికి, ఆగస్టు 15వ తేదీన 50 మంది చొప్పున ప్రతి సంవత్సరం 100 మందికి అవార్డులిస్తారు. జాతీయ స్థాయిలో పద్మశ్రీ అవార్డుల తరహాలో వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డుల ద్వారా ప్రతిభావంతులను గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ రెల్లి, ఇతర కులాల సంక్షేమ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు కోసం జారీ చేసిన జీవోలను కేబినెట్ ఆమోదించింది. - హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130 ఆసుపత్రుల్లో గుర్తించిన సూపర్ స్పెషాల్టీ వైద్య సేవలు నవంబర్ 1 నుంచి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద అమలవుతాయి. - తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్. - తీవ్ర పక్షపాతం, తీవ్రమైన కండరాలు క్షీణత, కదల్లేని స్థితిలో మంచానపడ్డవారికి, బోదకాలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు స్టేజ్ 3, 4, 5లలో ఉన్న వారికి నెలకు రూ.5 వేల పెన్షన్. - ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ అనంతరం రోగులు కోలుకునే వరకు వైద్యుల సూచన మేరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం. నవంబర్ 7న అగ్రిగోల్డ్ బాధితులకు రూ.10 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు. 3,69,655 మందికి సుమారు రూ.264 కోట్లు చెల్లింపు. - గ్రామ, వార్డు సచివాలయాల్లో 397 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి ఆమోదం. హోం శాఖలో అదనంగా పోస్టుల భర్తీ. - రాజ్‌భవన్ సచివాలయంలో తాత్కాలిక పద్ధతిలో 35 మంది అదనపు సిబ్బంది నియామకానికి ఆమోదం. - ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థలకు బ్యాంకుల నుంచి రుణాలు, బాండ్లు జారీకి అనుమతి. - రాష్ట్రంలోని 147 గ్రామీణ నియోజకవర్గాల్లో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆమోదం. 13 జిల్లా కేంద్రాలు, 4 ప్రాంతాల్లో రీజినల్ కోడ్ సెంటర్లు. - నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు రైతులకు అందేలా చూసేందుకు అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు. మార్కెట్‌కు వచ్చేముందు, వెళ్లే ముందు పరీక్షలు నిర్వహిస్తారు. - 9 జిల్లాల్లో 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్స్. - కృష్ణా, గోదావరి డెల్టా కాల్వలను శుద్ధి చేసేందుకు ప్రత్యేకంగా మిషన్ ఏర్పాటు. ఈ మిషన్‌కు చైర్‌పర్సన్‌గా సీఎం, వైస్ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు. కాలుష్యాన్ని నివారించి పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పని చేస్తుంది. మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నవంబర్ 21న మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ మత్స్యకార నేస్తం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వేట నిషేధ సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి ఇప్పుడు ఇస్తున్న రూ.4 వేలను రూ.10 వేలకు పెంచి ఇవ్వనున్నారు. మోటారైజ్డ్, మెకనైజ్డ్ బోట్లతో పాటు తెప్పలతో సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకార కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. డీజిల్ సబ్సిడీని లీటర్‌కు రూ.6.03 నుంచి రూ.9కి పెంచారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ప్రాంతంలో చమురు, సహజ వాయువుల కోసం జరిపిన తవ్వకాల కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు ఓఎన్జీసీ చెల్లించాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు హజ్, జెరూసలేం యాత్రికులకు ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సాయం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వార్షికాదాయం రూ.మూడు లక్షలలోపు ఉన్నవారికి ఇస్తున్న సహాయాన్ని రూ.40 వేల నుంచి రూ.60 వేలకు.. వార్షికాదాయం రూ.మూడు లక్షలకు పైబడి ఉన్నవారికి ఇస్తున్న సహాయాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతారు. ఇందుకోసం బడ్జెట్లో వేర్వేరుగా చెరో రూ.14.22 కోట్లు కేటాయించారు. రోబో ఇసుక యూనిట్లకు పావలా వడ్డీ రుణాలు కంకర నుంచి రోబో శ్యాండ్ (ఇసుక) తయారు చేసే స్టోన్ క్రషర్స్ యూనిట్లను కొత్త యంత్రాలతో అప్‌గ్రేడ్ చేసుకునేవారికి రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకూ పావలా వడ్డీ కింద రుణాలివ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం ఏడాదికి రూ.37.3 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.186.5 కోట్లు కేటాయించారు. ఈ యూనిట్ల మనుగడలో భాగంగా 50 కిలోమీటర్ల పరిధిలో జరిగే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో రోబో శ్యాండ్ను 20 శాతం వాడేలా చర్యలు తీసుకుంటారు. రోబో శ్యాండ్ యూనిట్లుగా అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఆరు నెలలు గడువు ఇచ్చారు. పేదలకు రిజిస్ట్రేషన్ కానుక అభ్యంతరం లేని ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమ ఇళ్ల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 300 చదరపు గజాల వరకూ క్రమబద్ధీకరణ చేస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి వంద చదరపు గజాలలోపు ఉన్న ఇళ్లను క్రమబద్ధీకరించి రూపాయికే రిజిస్ట్రేషన్ చేస్తారు. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు చెందిన వారైతే వంద నుంచి 300 చదరపు గజాల వరకు ఉన్న ఇళ్లను మార్కెట్ విలువ ప్రకారం జిల్లా కలెక్టర్లు నిర్ణయించిన విధానంలో క్రమబద్ధీకరిస్తారు. 300 చదరపు గజాల వరకు ఇలా క్రమబద్ధీకరించుకున్న ఇళ్లను ఐదేళ్ల వరకూ అమ్ముకునే వీలుండదు. పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలను అర్హులైన మరొకరు కొనుక్కుంటే వాటిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. భూ కేటాయింపులు రద్దు విశాఖలో లులూ.. విశాఖపట్నం బీచ్‌రోడ్డులో లులూ సంస్థకు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత విలువైన రూ.13.83 ఎకరాల కేటాయింపు ఒప్పందాన్ని రద్దు చేశాం. ఎకరం రూ.50 కోట్లకుపైగా విలువ చేసే ఈ భూమిని నెలకు రూ.4 లక్షల నామమాత్రపు అద్దెకు కేటాయించడం ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని భావించాం. ఎకరం విలువ రూ.50 కోట్లు అయితే, ఆ సొమ్మును బ్యాంకులో పెడితే వడ్డీనే రూ.2.5 కోట్లు వస్తుంది. అలాంటిది వచ్చే వడ్డీలో కేవలం 20 శాతాన్ని మాత్రమే అద్దె కింద నిర్ణయించడం సబబు కాదు. లులూ కంపెనీకి అప్పనంగా భూమిని కట్టబెట్టడమే కాకుండా, సీఎమ్మార్ సంస్థకు చెందిన మరో 3 ఎకరాల భూమిని కూడా లులూకు ఇవ్వడం కోసం అందుకు ప్రత్యామ్నాయంగా సీఎమ్మార్‌కు అంతకంటే విలువైన భూమిని, అత్యంత విలువైన సిరిపురం ప్రాంతంలో అన్యాయంగా కట్టబెట్టారు. సెంట్రల్ విజిలెన్స్ మార్గదర్శకాల ప్రకారం సింగిల్ టెండర్ దాఖలైతే దాన్ని రద్దు చేయకుండా ఆ సంస్థకే కేటాయించడం వల్ల ప్రజల ఆస్తికి నష్టం జరుగుతున్న దృష్ట్యా ఆ కేటాయింపులను రద్దు చేశాం. జయంతిపురంలో వీబీసీ ఫెర్టిలైజర్స్.. ఇలా ఉండగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 498.93 ఎకరాల కేటాయింపును రద్దు చేశాం. ప్రజలు నవ్విపోతారని కూడా ఆలోచించకుండా, సొంత వియ్యంకుడికి, లోకేష్ తోడల్లుడికు చెందిన వీబీసీ సంస్థకు అంటే ఇటీవలే మరణించిన ఎంవీవీఎస్ మూర్తికి చెందిన సంస్థకు అతితక్కువ ధరకే అప్పనంగా ఈ భూములు కట్టబెట్టారు. 2015 జూలై 15న భూములు కేటాయించి, పట్టుమని రెండు నెలలు తిరగకుండానే అదే ఏడాది సెప్టెంబర్ 22న ఈ భూములను సీఆర్డీఏ పరిధిలోకి చేర్చారు. ఈ కారణంగా ఈ భూముల రేటు అమాంతం వందల రెట్లు పెరిగింది. ఈ రసాయన పరిశ్రమ స్థాపించాక అది వెదజల్లే కాలుష్యం వల్ల ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల వారి ఆరోగ్యాలకు ముప్పు ఏర్పడుతున్నందున రద్దు చేశాం. పరస్పర అంగీకారంతో స్టార్టప్ ఏరియా ఒప్పందం రద్దు.. అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ (ఏడీపీ) లిమిటెడ్‌ను మూసి వేయాలని మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది. భాగస్వాములైన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ లిమిటెడ్ పరస్పర అంగీకారంతో ఏడీపీని మూసివేయాలని బోర్డులో తీర్మానం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఏడీపీని రద్దుచేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో పనులు ప్రారంభం కాలేదని కేబినెట్లో చర్చించారు. అలాగే ఏడీపీకి భూములపై జనరల్ పవర్ అటార్నీ కూడా బదిలీ చేయలేదు. అసెండాస్, సెమ్బ్ బ్రిడ్జి విలీనం అంశం ఆమోదించిన ఒప్పందంలో లేదని సింగపూర్ కన్సార్టియం తెలిపింది. ఈ నేపథ్యంలోనే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుపై ముందుకు వెళ్లరాదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుపై చర్చించి సింగపూర్ కంపెనీల కన్సార్టియంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్ కంపెనీల కన్సార్టియం 58 శాతం వాటాతో రూ.306 కోట్ల మూల ధన పెట్టుబడి, అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ 42 శాతం వాటాతో రూ.222 కోట్ల పెట్టుబడితో చంద్రబాబు సర్కారుకు ఒప్పందం చేసుకుంది. -
బడివడిగా..
రాయవరం (మండపేట): చదువు‘కొనే’ స్థితిలో నేడు పేదలే కాదు.. మధ్య తరగతివారూ లేరు. చదువు ఉంటేనే జ్ఞానం.. విజ్ఞానం. ఆదే క్రమంలో కుటుంబ అభివృద్ధి. చిన్నారులు చదువుకోవాలి. అందుకు పేదరికం కారణం కారాదన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన. ప్రజా సంకల్ప యాత్రలో ఆయన చూసిన ఎన్నో సమస్యల్లో చదువు కొనలేని స్థితిలో ఎందరో ఉన్నారని గుర్తించారు. అక్కడ నుంచే మనసులో ప్రణాళికలు వేసుకున్నారు. ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టాక ప్రాధాన్యాల క్రమంలో విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా వివిధ రంగాల అభివృద్ధికి బాటలు వేశారు. ఈ క్రమంలో విద్యారంగం పటిష్టానికి చర్యలు తీసుకున్నారు. కార్పొరేట్ విద్యకు ఏమాత్రం తీసిపోని రీతిలో సర్కారు విద్యను అందిస్తామని, అందుకు మౌలిక వసతులు కల్పించి విద్యార్థికి ఆ పాఠశాలలో చదవాలనే ఆసక్తి కలిగే వాతావరణం కల్పించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తల్లిదండ్రులకు పేదరికం అడ్డు కాకుండా వారి పిల్లలను పాఠశాలకు పంపిస్తే అమ్మఒడి పథకం కింద తల్లి ఖాతాలో విద్యార్థికి రూ.15 వేలు వేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా బడ్జెట్లో అందుకు నిధులు కేటాయించారు. మొత్తంగా విద్యారంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ముందుకు సాగిపోతున్నారు. పాలకులు నిధులు కేటాయించేశారు. ఇక మిగిలింది తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపడం.. అధికారులు పాఠశాలల అభివృద్ధికి సత్వర చర్యలు తీసుకోవడమే తరవాయి. ఇంటర్మీడియట్ వరకూ అమ్మ ఒడి ఈ పథకం కింద జిల్లాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 5.7 లక్షల మందికి ప్రయోజనం చేకూరనున్నట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 4.1 లక్షల మంది వరకు చదువుతుండగా, ఇంటర్మీడియట్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి 60 వేల మంది ప్రయోజనం పొందనున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన మరో లక్ష మంది వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ మేరకు జిల్లాలో విద్యార్థులకు ఏటా రూ.765 కోట్లు ఈ పథకం కింద ఖర్చుయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర బడ్జెట్లో అమ్మఒడికి రూ.6,455.80 కోట్లు కేటాయించడం విశేషం. జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థికి రూ.20వేలు జగనన్న విద్యాదీవెన పథకం కింద ఉచిత విద్యను అందించేందుకు ఫీజు నూరు శాతం రీయింబర్స్ చేసేలా పథకాన్ని అమలు చేయనున్నారు. దీనితో పాటు వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ఏడాదికి రూ.20వేల వంతున అందజేయనున్నారు. వీటికోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.4,962 కోట్లు కేటాయించారు. మౌలిక సదుపాయాలకు పెద్దపీట పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, రానున్న రెండేళ్లలో వాటి రూపురేఖలు మార్చనున్నట్లు సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించారు. జిల్లాలో 4,416 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అధ్వానంగా, మధ్యస్తంగా ఉన్న పాఠశాలలకు ఈ మేరకు లబ్ధి చేకూరనుంది. ‘గౌరవం’ పెరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వర్కర్లకు గౌరవ వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచారు. దీంతో ఆ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు బడ్జెట్లో రూ.1,077 కోట్లు కేటాయించారు. జిల్లాలో 4,283 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 7,563 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. -
పాలన అప్పుడలా... ఇప్పుడిలా...
సాక్షి, కపిలేశ్వరపురం (తూర్పు గోదావరి): నాయకుడంటే ఇలా ఉండాలిరా అన్న రోజులు మళ్లీ వచ్చాయి. ఎప్పుడో 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనా తీరును చూసి అప్పట్లో ప్రజలు వైఎస్సార్‌ను గొప్ప నాయకుడుగా చెప్పుకున్నారు. నియోజకవర్గంలోని వేలాది మంది ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకున్నారు. పింఛన్లు తీసుకుంటూ ఆసరా పొందారు. ఆయన మరణానంతరం కూడా వైఎస్సార్‌ను ప్రజలు తమ గుండెల్లో దాచుకున్నారంటే పాలకుడిగా ఏ మేరకు పనిచేశారో అర్థమవుతుంది. మళ్లీ అలాంటి పాలన వైఎస్ జగన్మోహన్రెడ్డిలో చూస్తున్నామన్న అభిప్రాయం క్షేత్ర స్థాయిలో ప్రజల్లో వ్యక్తమవుతుంది. తమ మేలు కోరి చేసిన నిర్ణయాలు పట్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేయడం, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం ప్రజల సంతోషానికి ప్రతిబిబంగా నిలుస్తోంది. నియోజకవర్గంలో ఇలా... మండపేట పట్టణంతో పాటు, మండపేట రూరల్, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల పరిధిలో 43 గ్రామాలున్నాయి. గోదావరి తీర ప్రాంతంలో అద్దంకివారిలంక, కేదారలంక గ్రామాలున్నాయి. 4 వేల ఎకరాల్లోని ఉద్యాన పంటలు ఆధారంగా లంక వాసులు జీవనం సాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రజలు 48,500 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు. పట్టణంలోని వ్యాపార సంస్థల్లో నెలసరి పరిమిత జీతాలతో కాలం వెళ్లదీస్తున్నారు. పట్టణంతో పాటు మండపేట రూరల్ గ్రామాల్లో కోళ్ల పరిశ్రమ, కపిలేశ్వరపురం, రాయవరం మండలాల్లో ఇటుక పరిశ్రమల్లో వేలాది మంది శ్రమిస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వలస వచ్చిన వారు నియోజకవర్గంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలుతో వారి జీవితాలు మెరుగుపడనున్నాయి. బెల్టు తీస్తున్న సర్కార్... నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వహణ విచ్చలవిడిగా సాగేది. మద్యం దుకాణాలు తొలగించాలంటూ 2017 జూలై 6న మండపేట గొల్లపుంతలో పలు మార్లు కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు, వెదురుమూడిలలో మహిళలు ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయింది. వైఎ స్జగన్ సీఎం కాగానే దశల వారీ మద్య నిషేదానికి కార్యాచరణను ప్రారంభించారు. గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ మద్యం షాపుల ఎత్తివేతపై వివరణ ఇస్తున్నారు. రామచంద్రపురం ఎక్సైజ్ పరిధిలోని నాలుగు మండలాలకు నలుగురు అధికారులను నియమించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నియోజకవర్గంలో 27 మద్యం దుకాణాలుండగా ఒక్కో షాపు పరిధిలో ఐదు నుంచి పది బెల్ట్ షాపులు నిర్వహణలో ఉన్నాయి. వాటిపై ప్రస్తుత ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఎక్సైజ్ అధికారుల దాడులు చేసి మూయిస్తున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర నియోజకవర్గంలో కొనసాగుతున్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి సీపీఎస్ రద్దుకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు వినతిపత్రాలను అందజేశారు. అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీపీఎస్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేశారు. అందుకోసం కమిటీని నియమించారు. నియోజకవర్గంలో సుమారుగా 710 మంది ఉపాధ్యాయులుండగా వారిలో 550 మందికి సీపీఎస్ వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఇతర ప్రభుత్వం శాఖల్లో 150 మంది ఉద్యోగులకు మేలు చేకూరుతుంది. చిరుద్యోగులు చిరునవ్వుతో ఉండాలని... అంగన్వాడీలకు, ఆశ వర్కర్లకు జీతాలు పెంచడంతో నియోజకవర్గంలోని మండపేట పట్టణంలో సీహెచ్‌సీ, రూరల్ మండలంలో ద్వారపూడి పీహెచ్సీ, రాయవరం మండలంలోని మాచరవరం, రాయవరంలలో పీహెచ్‌సీలు, కపిలేశ్వరపురం మండలంలోని వాకతిప్ప, అంగర, అచ్యుతాపురంలలో పీహెచ్‌సీలు, కపిలేశ్వరపురంలో సీహెచ్‌సీ చిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. రాయవరం మండలంలో 80, మండపేటలో 74, కపిలేశ్వరపురంలో 90 మొత్తం 244 మంది ఆశ వర్కర్లకు జీతాలు పెరిగాయి. నియోజకవర్గంలో సుమారుగా 300 కేంద్రాలుండగా అందులో పనిచేసే 600 మందికి పెరిగిన జీతాలు వర్తించనున్నాయి. మెరుగైన చదువుల కోసం ఎన్నికల హామీలు మేరకు అమ్మ ఒడి పథకానికి సీఎం జగన్ కార్యాచరణ ప్రక్రియను ప్రారంభించారు. పిల్లలను బడికి పంపిన అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయంగా రూ.15 వేలు ఇస్తాన్న మాటకు కట్టుబడ్డారు. మరో అడుగు ముందుకేసి ఇంటర్మీడియట్ చదివిస్తున్న తల్లులకు కూడా అమ్మఒడిని వర్తింపజేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలోని మండపేట అర్భన్, రూరల్, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లో 122 ప్రాథమిక, 15 ప్రాథమికోన్నత, 27 ఉన్నత మొత్తం 164 పాఠశాలలున్నాయి. వీటికితోడు మరిన్ని ప్రైవేటు పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో చదివే సుమారు 16 వేల మంది విద్యార్థుల తల్లులకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తుండటంతో మరో 2 వేల మందికి ప్రయోజనకరంగా అమ్మ ఒడి పథకం ఉంది. టీడీపీ పాలనలో... ఇసుక ర్యాంపుల నిర్వహణ వాటాను అడిగిన మహిళలను కపిలేశ్వరపురం మండలంలోని కోరుమిల్లి ఇసుక ర్యాంపు వద్ద చావ బాదారు. కేసులు సైతం బనాయించింది అప్పటి సర్కారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని మహిళా సంఘాలను అప్పుల ఊబిలోకి నెట్టింది. పైగా ఎన్నికల చివర పసుపుకుంకుమ అనే పవిత్ర పదాన్ని ప్రచారం చేస్తూ మహిళలకు రూ. పదివేలు ఇచ్చి మళ్ళీ గెలిచేందుకు ప్రయత్నం చేశారు నాటి పాలకులు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణం చేయగానే డ్వాక్రా రుణాలను తనదైన శైలిలో మాఫీ చేసే దిశగా కార్యాచరణను ప్రారంభించారు. ఆశ, అంగన్వాడీ, మ«ధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఇలా మహిళలకు వేతనాలు పెంచి వారి ఆర్థిక ప్రగతికి అనుకూల నిర్ణయాలను తీసుకున్నారు. శ్రమను గౌరవిస్తున్న సీఎం వైఎస్ జగన్... పారిశుద్ధ్యాన్ని ప్రైవేటు పరం చేస్తూ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జీఓ 279ను జారీ చేసింది. దానికి వ్యతిరేకంగా మండపేటలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కపిలేశ్వరపురం, రాయవరంలలో పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు పెంపుకై అనేకసార్లు ఉద్యమాలు చేసినా చంద్రబాబు సర్కారు కరుణించలేదు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే మున్సిపాలిటీల్లోని పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను రూ.18 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల మండపేట మున్సిపాలిటీలోని సుమారు 85 మంది పారిశుద్ధ కార్మికులకు ప్రయోజనం. మరెన్నో ప్రయోజనాలు ► అగ్రిగోల్డ్ బాధితులకు జగన్మోహన్రెడ్డి రూ.20వేలు లోపు వారికి నగదు చెల్లించేందుకు అందజేయన్నునట్టు ప్రకటించారు. కాగా రాయవరం మండలంలో 521 మంది బాధితులకు న్యాయం చేకూరనున్నట్టు సమాచారం. ► నియోజకవర్గంలో 32,200 మందికి పైగా రైతులు, కౌలు రైతులున్నారు. మార్కెట్ స్థిరీకరణ కోసం రూ.3 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ► అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో రైతుకు రూ.12,500 ఆర్థిక సాయం అందనున్నది. ► పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలుతో రాయవరం, మండపేట, రూరల్, పట్టణం, కపిలేశ్వరపురం మండలం అంగర పోలీస్ స్టేషన్లలోని సిబ్బందికి సెలవు వర్తించనున్నది. -
సీఎం గొప్ప బహుమతిచ్చారు
సాక్షి, యర్రగొండపాలెం (ప్రకాశం): గతంలో ప్రజల వైపు కన్నెత్తి చూడని పాలకులను చూశాం.. గెలిచి పార్టీ ఫిరాయించిన నాయకులను చూశాం... ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేసే ప్రజా పాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు చూడబోతున్నారు అని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు. బుధవారం యర్రగొండపాలెం మండలం సర్వాయపాలెంలో చర్చి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు గతంలో ఎన్నడు లేని విధంగా గొప్ప తీర్పు ఇచ్చారని, ప్రజలు మహత్తర ఆలోచన చేసి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారని అన్నారు. పూర్తిగా వెనకబడిన ప్రాంతాలు అన్ని రంగాల్లో పురోగతి సాధించాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంతానికి మంత్రి పదవిని ఇచ్చారని పేర్కొన్నారు. అది తన వ్యక్తిగతం చూసికాదని ప్రజలు గుర్తించాలని, వెనుకబడిన యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేకు విద్యాశాఖ మంత్రిగా ఇవ్వడం ఈ ప్రాంత ప్రజలకు జగన్ ఇచ్చిన గొప్ప బహుమతి అని ఆయన అన్నారు. గత ఐదేళ్ల కాలంలో ఏకపక్ష పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని, చంద్రబాబునాయుడు లాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడు చూడలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీరాదు, ఆ పార్టీ గెలిచేది లేదని టీడీపీ వర్గీయులు ప్రగల్బాలు పలికారని, కానీ దేవుని కృపతో అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర ప్రజలు తమ పార్టీని ఆశీర్వదించారని మంత్రి చెప్పారు. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు వినమ్రతతో శిరస్సు వంచి సేవలు అందిస్తామన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డికి రాష్ట్రాభివృద్ధి చేయాలన్న తపన ఉందని, ఈ పాటికే ప్రజలు ఆయన తపనను గుర్తించారని చెప్పారు. ఆయన నాయకత్వంలో వెలిగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వ కాలంలో వెలిగొండ ప్రాజెక్టు సాధన కోసం ప్రజలు అనేక విన్నపాలు చేసినప్పటికీ పట్టించుకోలేదని, ఆ ప్రాజెక్టు పూర్తయితేనే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యాభివృద్ధే ప్రధాన ధ్యేయం... రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సర్వాయపాలేనికి వెళ్తున్న ఆయనకు మార్గమధ్యంలోని బోయలపల్లె ఉన్నత పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి కాసేపు మాట్లాడుతూ పేద పిల్లలు బడికి వెళ్లి చదువుకోవాలని, వారు మహోన్నత శిఖరాలు అధిష్టించి దేశ, రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15 వేలు అందిస్తామని, ఇది పేదల కుటుంబాలకు ఆర్థిక వెసలుబాటు కల్పిస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం విద్యాభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుందని, ఈ మేరకు పాఠశాలలను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లి అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో ఉందని ఆయన అన్నారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడానికి కార్యచరణ రూపొందిస్తున్నామని, నీటి వసతి, అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రహరీలు లాంటివి అభివృది చేస్తామని మంత్రి చెప్పారు. పిల్లలు ఇంటి వద్ద ఉన్న తోటి పిల్లలను బడికి పిలుచుకుని రావాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంఈఓ పి.ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇందిరా ప్రసాద్‌లు మంత్రికి శాలువాకప్పి సన్మానించారు. -
చదువుల విప్లవాన్ని తెస్తాం
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్ది రాష్ట్రంలో చదువుల విప్లవం తెస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేస్తామని చెప్పారు. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘రాజన్న బడిబాట’లో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యాశాఖ చేపట్టిన సామూహిక అక్షరాభ్యాసం సందర్భంగా చిన్నారుల చేత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్షరాలు దిద్దించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పిల్లలను బడికి పంపించే తల్లులకు ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందజేస్తామని ప్రకటించారు. పాదయాత్రలో తాను ప్రతి తల్లికి, చెల్లికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ‘ప్రతి తల్లికి అన్నగా తోడుంటా. మీ పిల్లలను బడికి పంపిస్తే చాలు. ఆ చిన్నారులకు మామగా నేను అండగా ఉంటా’ అని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడే ఆరాటం చూశా.. ‘నా మనసుకు నచ్చిన కార్యక్రమం చేస్తున్నా కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నా ఆశ, కోరిక ఒక్కటే. బడి ఈడు పిల్లలు అందరూ బడికి వెళ్లాలి. బడుల నుంచి కాలేజీలకు వెళ్లాలి. ఉన్నత విద్యావంతులు కావాలి. డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి. అయితే ఆ చదువుల కోసం ఏ తల్లితండ్రీ అప్పులు పాలు కాకూడదన్నదే నా ఉద్దేశం. 3,648 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా పేదల కష్టాలను స్వయంగా చూశా. వారు పడుతున్న బాధలు విన్నా. బిడ్డలను చదివించాలనే ఆరాటం ఉన్నా చదివించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూశా. చదువుల ఖర్చు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని చూశా. ఈ విద్యా వ్యవస్థలో సంపూర్ణమైన మార్పులు తెస్తామని అప్పుడు ప్రతి తల్లికి, చెల్లికి మాట ఇచ్చా. మీ పిల్లల చదువు బాధ్యతను ఇకపై నేను తీసుకుంటానని మాటిచ్చా. ఆ మాట నిలబెట్టుకునే రోజు ఇవాళ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ప్రతి తల్లికి, చెల్లికి, ఒకే మాట చెబుతున్నా. మీ పిల్లలను బడులకు పంపించండి. మీరు చేయాల్సిందల్లా కేవలం బడులకు పంపించడమే. అలా పంపించిన తల్లిదండ్రులకు జనవరి 26వతేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ రోజులా నిర్వహిస్తాం. ఏ తల్లి అయితే తమ పిల్లలను బడులకు పంపిస్తుందో వాళ్లకు ఆ రోజు రూ.15 వేలు చేతిలో పెడతాం. ఏ తల్లి కూడా తన పిల్లలను చదివించడానికి అవస్థ పడకూడదనే ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ వ్యవస్థను మార్చేస్తా దేశవ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం చదువురాని వారు సగటున 26 శాతం ఉంటే మన రాష్ట్రంలో 33 శాతం ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఎందుకున్నామని నా పాదయాత్రలో పరిశీలిస్తే.. పిల్లలకు సకాలంలో పుస్తకాలు అందడం లేదు. ఏప్రిల్, మే లోపు పుస్తకాలు పాఠశాలలకు చేరాలి. స్కూల్ తెరిచిన వెంటనే పుస్తకాలు, మూడు జతల యూనిఫాం అందజేయాలి. అయితే పిల్లలకు సెప్టెంబర్ దాటినా కూడా పుస్తకాలు అందలేదు. యూనిఫాం కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితిలో రాష్ట్రంలో చదువులు కొనసాగుతున్నాయి. టీచర్ల కొరత ఉన్నా నియామకాలు చేపట్టడం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మరుగుదొడ్లు ఉండవు, నీళ్లు రావు, ఫ్యాన్లు లేవు, కనీసం కాంపౌండు వాల్ కూడా ఉండదు. ప్రభుత్వ స్కూళ్లలో చదివించాలంటే ఏ తల్లి అయినా భయపడాల్సిందే. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లను నీరుగార్చి కార్పొరేట్ స్కూళ్లను ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. ఇక ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు తల్లిదండ్రులు భరించలేని పరిస్థితిలో ఉన్నాయి. నారాయణ, శ్రీచైతన్య లాంటి స్కూళ్లు గ్రామస్థాయికి కూడా వెళ్లాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ పాఠశాలల్లో ఎల్కేజీకి కూడా రూ.20 వేలు పైచిలుకు ఫీజులు వసూలు చేస్తున్నారు. రూ.40 వేలు అడిగిన పరిస్థితిని కూడా చూశా. ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో పిల్లలను చదివించాలంటే తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. ఇవన్నీ కూడా మార్చేస్తానని మాటిస్తున్నా. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించిన సీఎం వైఎస్ జగన్.. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ తొలుత సరస్వతి దేవి చిత్రపటానికి నమస్కరించారు. అనంతరం పలువురు చిన్నారులను తన ఒడిలో కూర్చోపెట్టుకుని అక్షరాభ్యాసం చేయించి దీవించారు. మొత్తం 2 వేల మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ రూపొందించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు (10/10 గ్రేడు) సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందచేసి అభినందించారు. రాజన్న బడిబాట కార్యక్రమానికి హాజరైన ఓ చిన్నారి ముఖ్యమంత్రికి రూ.1.50 లక్షల చెక్కును అందజేసింది. చదువుతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమన్న అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం రోజు ‘రాజన్న బడిబాట’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ప్రారంభించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పుష్పశ్రీవాణి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఏఎస్ రామకృష్ణ ఎమ్మెల్యేలు ముస్తఫా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కాసు వెంకట మహేశ్వరరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కిలారి రోశయ్య, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు. మీ పిల్లలకు మామగా నేనున్నా.. ‘ఈ కార్యక్రమానికి ముందుగా విద్యాశాఖతో సమీక్ష నిర్వహించా. రాష్ట్రంలో 40 వేల స్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ స్కూళ్ల పరిస్థితి ఎలా ఉందో ఫొటోలు తీయమని చెప్పా. రెండేళ్లలో అభివృద్ధి ఎలా జరిగిందో మళ్లీ ఆ స్కూళ్ల ఫొటోలు తీసి చూపిస్తాం. పాఠశాలలకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తాం. ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని మాట ఇస్తున్నా. ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం. ప్రతి స్కూల్లోనూ తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేస్తాం. మన పిల్లలు దేశంలో ఎవరితో అయినా పోటీ పడేలా ఉండాలి. చదువుల విప్లవాన్ని తెచ్చి సర్కారు స్కూళ్లను మంచి పాఠశాలలుగా తీర్చిదిద్దుతాం. మీ పిల్లలను ప్రభుత్వ బడికి పంపించండి. ప్రతి తల్లికి, అన్నగా తోడుంటా. మీ పిల్లలకు మామగా నేనున్నా. పిల్లల అభివృద్ధికి బాటలు ఈ స్కూళ్ల నుంచే మొదలవ్వాలి. ప్రతి పిల్లాడు పాఠశాల బాట పట్టాలి’ ‘రాజన్న బడిబాట’కు రూ.1,51,151 విరాళం తాడేపల్లి రూరల్ (మంగళగిరి): రాజధాని ప్రాంతంలోని పెనుమాక గ్రామానికి చెందిన కుర్రె విజయభాస్కరరెడ్డి, పద్మావతి దంపతుల ఏకైక కుమార్తె కీర్తిరెడ్డి ‘రాజన్న బడి బాట’ కార్యక్రమానికి తమ వంతు సహాయంగా రూ.1,51,151 విరాళాన్ని అందచేసింది. శుక్రవారం పెనుమాకలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజన్న బడి బాట కార్యక్రమంలో ఈమేరకు చెక్కును అందచేసిన కీర్తిరెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. అకడమిక్ క్యాలెండర్ విడుదల పాఠశాల విద్యా శాఖ; రాష్ట్ర విద్యా, పరిశోధన, శిక్షణా సంస్థ రూపొందించిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యా విషయక క్యాలెండర్‌ను శుక్రవారం గుంటూరు జిల్లా పెనుమాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి, ఎస్ఎస్ఏ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆనంద వేదిక 2019 – 20 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే వినూత్న పద్ధతిలో ఆనంద వేదిక (హ్యాపీనెస్ కరిక్యులం) కార్యక్రమం అమలు చేస్తారు. రోజూ పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్‌లో 30 నిమిషాల పాటు ఆనంద వేదిక (హ్యాపీనెస్ కరిక్యులం)కు కేటాయించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు, ఉన్నత పాఠశాలలను ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నిర్వహిస్తారు. ఒంటిపూట బడులు ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకు ఉంటాయి. తరగతికి నిర్ధారించిన ప్రమాణాలు సాధించలేకపోవడంలో సిలబస్ ఒక ముఖ్య కారణమని భావించి సరైన ప్రమాణాలు సాధించడం కోసం సిలబస్‌ను తగ్గించారు. పాఠశాల పనిదినాలు 220 అయినప్పటికీ 160 పనిదినాలకనుగుణంగా సిలబస్‌ను తగ్గించారు. ఈ విద్యా సంవత్సరంలో ఆనంద వేదికతోపాటు ‘శనివారం సందడి’, ‘రోజూ సవరణాత్మక బోధన’ అనే ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రతి నెలలో మొదటి, మూడో శనివారాల్లో ‘శనివారం సందడి’ పేరుతో ‘నో స్కూల్ బ్యాగ్ డే’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యా, పరిశోధన, శిక్షణా సంస్థ డైరెక్టర్ దుక్కిపాటి మధుసూదనరావు తెలిపారు. -
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
సాక్షి, అమరావతి: మళ్లీ బడి గంటలు మోగడానికి వేళైంది. రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం నేటి నుంచి పున:ప్రారంభం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నాలుగు రోజుల పాటు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. దీన్ని పాఠశాల విద్యా శాఖ ఈసారి ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా, పాఠశాలలను రోజంతా కాకుండా ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి 15 వరకు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నందున రెండు పూటల కార్యక్రమాలను ఒక్కపూటకే సర్దుబాటు చేయాలని సూచించింది. పాఠశాలలకు సకాలంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 16 ఆదివారం కావడంతో తిరిగి పాఠశాలలు 17 నుంచి యధావిధిగా పూర్తిస్థాయిలో కొనసాగుతాయి. అమ్మఒడితో లక్షలాది మందికి మేలు కాగా.. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా శాఖకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తెల్లరేషన్ కార్డు ఉండి, తమ పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చేసిన ఎన్నికల హామీని అమల్లోకి తేవడానికి కార్యాచరణను కూడా నిర్దేశించారు. జనవరి 26 నుంచి అందించే అమ్మఒడి పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు మేలు చేకూరనుంది. రాష్ట్రంలో 630 ప్రభుత్వ స్కూళ్లు, 38,589 జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్లు, 34 రెసిడెన్షియల్ స్కూళ్లు, 164 మోడల్ స్కూళ్లు, 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, 2,110 మున్సిపల్ స్కూళ్లు, ఇతర ప్రభుత్వ యాజమాన్య, ఆర్థిక సహకార స్కూళ్లు 3,163 ఉండగా, ప్రైవేటు యాజమాన్యంలో 17,021 స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లలో మొత్తం 70,37,478 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు 55 శాతం మంది ఉండగా తక్కిన వారంతా ప్రైవేటు స్కూళ్ల విద్యార్ధులే. అమ్మఒడి పథకంతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరికలు మరింత పెరిగనున్నాయి. అదే సమయంలో డ్రాపౌట్లు, బడి బయటి పిల్లల సంఖ్య కూడా తగ్గనుంది. ప్రతి తల్లి తన పిల్లలను చదివించుకోవడానికి అమ్మఒడి పథకం ఎంతో ఆసరాగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలను చదివించుకునే స్థోమత లేని తల్లిదండ్రులకు ఇది చేయూతగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, మౌలిక సదుపాయాల అనంతరం పరిస్థితిని ఫొటోలు తీసి ప్రజలకు ముంగిటకు తీసుకురానున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులతోపాటు అకడమిక్ వ్యవహారాలపై నియంత్రణకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో లక్షల్లో ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్న లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది. అలాగే జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం.. ప్రతి ప్రైవేటు స్కూలులో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అపోహలు సరికాదు: వైఎస్సార్‌టీఎఫ్ అమ్మఒడి పథకంపై కొందరు అనవసర అపోహలు లేవనెత్తుతున్నారని, ఇది సరికాదని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు వి.రెడ్డి శేఖరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద తల్లులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమమని అన్నారు. కాగా, ప్రస్తుతం సాధారణ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తేలకపో వడంతో ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించడంపై సందిగ్ధంలో ఉన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో బదిలీ అయితే మళ్లీ కొత్త ప్రాంతంలో పిల్లలను చేర్పించడం ఇబ్బందిగా మారుతుందని వారంటున్నారు. తొలి రోజు స్వాగత సంబరం నేటి నుంచి రాష్ట్రంలో రాజన్న బడిబాట కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తొలి రోజు ‘స్వాగత సంబరం’ పేరిట కార్యక్రమాలుంటాయి. పాఠశాలలో పండుగ వాతావరణాన్ని కల్పించడం, పాఠశాలలో చేరిన విద్యార్థులను ఆత్మీయంగా ఆహ్వానించడం, బొమ్మలు గీయించడం, రంగు కాగితాలు కత్తిరించడం, వివిధ ఆకృతులను తయారుచేసి ప్రదర్శించడం చేయాలి. రెండో రోజు విద్యార్థులతో మొక్కలు నాటించడం, వాటిని దత్తత ఇవ్వడం, అభినయ గేయాలు, కథలు, పాటలతో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాలి. మూడో రోజు ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, దాతల సమక్షంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలి. నాలుగో రోజు ప్రముఖులతో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు, బాలికల విద్యాభివృద్ధికి సూచనలు, సలహాలు, తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణ, ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానం, సహపంక్తి భోజనాలు చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాఠశాల శాఖ అధికారులతో సమీక్ష చేయడంతోపాటు మంగళవారం అన్ని జిల్లాల విద్యాధికారులు, సర్వశిక్ష అభియాన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ఉత్తమ విద్యా ప్రమాణాలు నెలకొల్పడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివరించారు. వైఎస్సార్ అక్షయపాత్ర ద్వారా పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించాలని అధికారులను ఆదేశించారు. అమ్మఒడి పథకం.. పాఠశాలలకు సంబంధించిన కార్యక్రమం కాదని, పేద తల్లుల గౌరవానికి ముఖ్యమంత్రి ప్రకటించిన పథకమని తెలిపారు. ఈ కార్యక్రమం జనవరి 26 నుంచి అమలవుతుందని ప్రకటించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే రూపొందించనున్నామని చెప్పారు. -
అమ్మ ఒడి అద్భుతం
సాక్షి, వెంకటగిరి (నెల్లూరు): ప్రాథమిక విద్య అనంతరం ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులు విద్యార్థులను ఎన్నో ఆశలతో బడికి పంపిస్తుంటారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో తగిన వసతులు లేకపోవడం, కార్పొరేట్ పాఠశాలల్లో చదివించుకునే స్తోమత లేకపోవడంతో విద్యార్థులను చదువు మధ్యలో బడి వేయాల్సిన పరిస్థితి దాపరిస్తోంది. దీంతో విద్యార్థులు బడికి పోవాల్సిన వయసులో బాల కార్మికులుగా మారుతున్నారు. దీంతో వారి జీవితాలు బాల్యంలోనే కుంటుపడుతున్నాయి. ఇలాంటి సంఘటనలు ప్రత్యక్షంగా పాదయాత్రలో చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం అమ్మఒడి పథకాన్ని ప్రకటించారు. ఈ పథకాన్ని నవరత్నాల్లో భాగం చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఏ ఒక్క పేద విద్యార్థి బడి మానేయకూడదని బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో సంవత్సరానికి రూ. 15వేలు జమ చేసే విధంగా జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. విద్యార్థుల చదువులకు భరోసా కల్పించే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటనలు చేయడంతో పలవురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో సుమారు 50 వేలకుపైగా విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందనున్నారు. ఈ పథకం ప్రయోజనాన్ని తెలుసుకున్న పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా పేద విద్యార్థులకు ప్రయోజనం ఇలా.. ♦ ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.500.. ఇద్దరు ఉంటే రూ.1000 అందుతుంది ♦ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.750.. ఇద్దరుంటే రూ.1500 చెల్లిస్తారు ♦ ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికీ ప్రతి నెలా రూ.1,000.. ఇద్దరుంటే రూ.2,000 అందుతుంది ♦ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువులకు ఫీజురీయింబర్స్‌మెంట్ అమలు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు (సుమారు) మండలం విద్యార్థుల సంఖ్య వెంకటగిరి,రూరల్ 5250 కలువాయి 3150 సైదాపురం 3100 బాలాయపల్లి 4100 డక్కిలి 4050 రాపూరు 4150 పేద విద్యార్థులకు వరం ఆర్థిక స్థోమత లేక చాలా మంది విద్యార్థులు మధ్యలోనే బడి మానేస్తున్నారు. పేదరికం వారి చదువులకు ఆటంకంగా మారుతోంది. జగనన్న ప్రకటించిన ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా ప్రతి విద్యార్థికీ ఆర్థిక తోడ్పాటు అందుతుంది. ఇక తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించేందుకు వెనకడుగు వేయరు. ఈ పథకం పేద విద్యార్థులకు వరం. – ఎం.బాలాజీ, 9వ తరగతి విద్యార్థి, బంగారుపేట, వెంకటగిరి తల్లిదండ్రులకు భరోసానిస్తుంది జగనన్న ప్రకటించిన ‘అమ్మ ఒడి’ పథకం పేద విద్యార్థులకు భరోసానిస్తుంది. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.500, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రతి నెలా రూ.750 అందుతుంది. దీంతో పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుంది. – జి.మల్లెమ్మ, విద్యార్థి తల్లి, వెంకటగిరి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం అమ్మఒడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల శాతం పెరుగుతుంది. అలాగే ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాలో రూ. 15వేలు జమచేస్తే అందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే పంపేందుకు ఇష్టపడతారు. దీంతో రాష్ట్రంలో నిరక్షరాస్యత శాతం తగ్గి అక్షరాస్యత శాతం పెరుగుతుంది. – రంగినేని రాజా, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, డక్కిలి -
అందనంత దూరం అక్షర జ్ఞానం
సాక్షి, ఒంగోలు టౌన్: ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా 1973 నుంచి 1982 వరకు పనిచేసిన గోపాల్ రెడ్డి.. 1982–2006 వరకు వయోజన విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2003లో సత్యమత్ర మెమోరియల్ లిటరసీ అవార్డును అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ రామకృష్ణతో కలిసి కేంద్ర ప్రభుత్వం నుంచి గోపాల్‌రెడ్డి అందుకున్నారు. విద్యా రంగంలో విశేష అనుభవం కలిగిన ఆయన చంద్రబాబు ప్రభుత్వ హయంలో ప్రభుత్వ విద్య ఏవిధంగా నిర్వీర్యమైంది, జగన్ ప్రకటించిన నవరత్నాల్లోని అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా డ్రాపవుట్స్ సంఖ్య ఎలా నిర్మూలన అవుతుందో ‘సాక్షి’కి వివరించారు. క్వాలిటీ విద్యకు కేరాఫ్ ‘గతంలో క్వాలిటీ విద్యకు ప్రభుత్వ పాఠశాలలు కేరాఫ్‌గా నిలిచేవి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో పరిశోధన చక్కగా నిర్వహించేవారు. విద్యార్థులకు సబ్జెక్టు పరంగా మంచి పట్టు వచ్చేది. టీచింగ్ నోట్స్ రాసుకుని విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధించేవారని’ గోపాల్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘ప్రస్తుతం అలాంటి పరిస్థితులు చూద్దామన్నా కనిపించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ అజమాయిషీ తగ్గిపోయింది. దాంతో అనేక మంది ఉపాధ్యాయులు విద్యేతర అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. చివరకు ప్రాథమిక పాఠశాలలు మూతపడే స్థితికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చింద’ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌కు పెద్దపీట! ‘సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ప్రైవేట్ విద్యకు చంద్రబాబు పునాదిరాయి వేశారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వ విద్యను చిన్నచూపు చూస్తూ వచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ విద్యను పరుగెత్తించారు. ఒక విద్యా సంస్థల అధినేతను తన క్యాబినెట్లో మంత్రిగా చేర్చుకున్నారంటే ప్రైవేట్ విద్యపట్ల చంద్రబాబుకు ఎంత మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చని’ తాటిపర్తి వ్యాఖ్యానించారు. రాష్ట్ర మునిసిపల్ శాఖామంత్రిగా నారాయణ, ఆయన బంధువైన గంటా శ్రీనివాసరావు మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రిగా వ్యవహరించిన సమయంలో ప్రభుత్వ విద్యను కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రాథమిక పాఠశాలల్లో విద్యపై ప్రభుత్వ పర్యవేక్షణ లోపించింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలు అవసాన దశకు చేరుకున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే ఉన్నత పాఠశాలలకు కూడా ఈ దుస్థితి పట్టే ప్రమాదం ఉంద’ని అన్నారు. వయోజన విద్యకు గండి ‘జిల్లాలో అక్షరాస్యత శాతం ఏటా పెరుగుతోందని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటోంది. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వయోజనుల్లో అక్షరాస్యత శాతం క్రమేణా పడిపోతోంది. రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 74 శాతం చూపించగా, ప్రకాశం జిల్లాలో 63 శాతంగా ప్రకటించారు. వయోజన విద్యను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం దానిని కూకటివేళ్లతో పెకలించేసింది. రాష్ట్రంలో వయోజన విద్యకు సంబం«ధించి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నియమితులైన 23 వేల మందిని చంద్రబాబు ప్రభుత్వం తొలగిండడం దారుణమైన చర్య. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దిన తరువాత వారు నేర్చుకున్న చదువు మర్చిపోకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన సాక్షర భారత్ కేంద్రాలు కనుమరుగైపోయాయి. ‘అమ్మ ఒడి’ కొండంత అండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అమ్మ ఒడి పేదలకు అండగా ఉంటోంది. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా పేద విద్యార్థుల చదువుకు భరోసా కలగనుంది. అమ్మ ఒడి ద్వారా తల్లిదండ్రులకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం మంచి పరిణామమ’ని గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అమలుచేసే కార్యక్రమాల్లో అమ్మ ఒడిని ఇతర రాష్ట్రాలు కూడా ఆచరణలోకి తీసుకువచ్చేందుకు ముందుకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మాతాశిశువులకు భరోసా !
పాలమూరు : మాతా, శిశువుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘102’ వాహనాలకు ఏడాది పూర్తయింది. గత ఏడాది జనవరిలో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనాల ద్వారా జిల్లాలో వేలాది మందికి సేవలందాయి. గ్రామీణ ప్రాంతాల గర్భిణులు, బాలింతలు ప్రసవం, పరీక్షల కోసం ప్రభుత్వం ఆస్పత్రికి వచ్చే క్రమంలో ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులను ఆశ్రయించేవారు. తద్వారా నిర్ణీత పాయింట్లలో దిగి మళ్లీ ఆస్పత్రికి ఆటోల్లో రావాల్సిన పరిస్థితి ఉండేది. కానీ 102 వాహనాల ద్వారా నేరుగా ఇంటి నుంచి ఆస్పత్రికి, మళ్లీ ఇంటికి చేర్చే వెసలుబాటు అందుబాటులోకి రావడంతో గ్రామీణుల కష్టాలు తీరినట్లయింది. ‘అమ్మ ఒడి’లో భాగంగా... అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం 2018 జనవరిలో ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే 102 అంబులెన్స్ వాహనాలను జిల్లాలో ప్రారంభించారు. అప్పట్లో 18 వాహనాలను అందుబాటులో తీసుకువచ్చారు. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి ఏ ఇబ్బందులు ఎదురైనా ఆస్పత్రికి తీసుకెళ్లడం.. అవసరమైన పరీక్షలు, చికిత్స చేయించుకున్నాక ఇంటికి తిరిగి చేర్చడానికి ఈ వాహనాలు పనిచేస్తున్నారు. ప్రసవం కోసం కూడా ఆస్పత్రికి తీసుకెళ్లి, ప్రసవం అయ్యాక మళ్లీ ఈ వాహనంలోనే బాలింత ఇంటి వరకు చేరుకోవచ్చు. ఈ సేవలన్నీ ఉచితంగానే అందుబాటులోకి రావడంతో గ్రామీణులను చక్కగా వినియోగించుకుంటున్నారు. 102 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చాలు.. వారు సూచించిన ప్రాంతానికి వాహనాలు వస్తున్నాయి. ఇక ప్రసవం తర్వాత పరీక్షలు, పిల్లలకు 9 నెలల వయస్సు వరకు ఈ వాహనాల సేవలను ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా నిరుపేదలకు మేలు జరుగుతుండగా.. ఇంటి ప్రసవాలు తగ్గి సురక్షితమైన కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వాహనం అవసరమైతే.. వాహనం అసరమైనప్పుడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు 102 కు డయల్ చేయాల్సి ఉంటుంది. ఇలా 12గంటల పాటు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. రాత్రి 8 అనంతరం ఉదయం 8గంటల వరకు ఈ వాహనం అవసరమైతే 108కి కాల్ చేయాలి. సేవలిలా అందుతాయి గర్భం దాల్చిన మహిళలు వైద్య పరీక్షల కోసం అమ్మ ఒడిని సద్వినియోగం చేసుకోవాలంటే 102 నంబర్‌కు ఫోన్ చేస్తే సరిపోతుంది. గర్భం దాల్చిన ప్రతీ మహిళా తన పేరును ఆశ కార్యకర్త వద్ద నమోదు చేసుకుని 9నెలల వరకు ప్ర తినెల యాంటినెంటల్ చెకప్(ఏఎంసీ) కోసం ఇం టి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లడానికి ఈ వాహన సేవలను ఉపయోగించుకోవచ్చు. వైద్య పరీక్షల తర్వాత అదే వాహనంలో ఇంటి వద్ద దిగబెడతారు. ఆల్ట్రా స్కానింగ్, రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలకు రెఫర్ చేసిన గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి సీహెచ్‌సీకి లేదా ఏరియా, జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్తారు. నెలవారీగా చేయించుకునే వైద్య పరీక్షల కోసం గర్భిణులులు, బాలింతలు ఈ వాహన సేవలు వాడుకోవచ్చు. గర్భిణులకు మధ్యలో ఎప్పుడైనా ఏదైనా వైద్య పరీక్ష అవసరమని గుర్తిస్తే 102 నంబర్‌కు ఫోన్‌చేస్తే ఇంటికి వచ్చి ఆస్పత్రికి తీసుకువెళ్లి, వైద్య సేవల అనంతరం ఇంటి వద్ద దించుతారు. గర్భం దాల్చినప్పటి నుంచి మహిళలు విధిగా వైద్యుల సూచనలు పాటించాల్సి ఉంది. మూడు, ఆరు తొమ్మిది నెలల్లో వైద్యులను సంప్రదించి అవసరమైన సలహాలు తీసుకోవడానికి, పరీక్షలు చేసుకోవడానికి ఆస్పత్రికి తీసుకువెళ్లడం, మళ్లీ ఇంటిదగ్గర దిగబెట్టడం ఈ వాహనం ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం. సౌకర్యంగా ఉంది మా బాబుకు చికిత్స కోసం వచ్చాం. 102 వాహనం కోసం ఫోన్ చేయగానే వచ్చారు. ఇందులో ఆస్పత్రికి రావడం నాకు, బాబుకు చాలా సౌకర్యంగా ఉంది. ఆస్పత్రి వచ్చి వెళ్లడానికి డబ్బులు లేక ఇబ్బందిగా ఉన్న సమయంలో 102లో రావడం కలిసివచ్చింది. – చంద్రకళ, రామచంద్రాపూర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో 102 సేవలు ఉపయోగించుకునే వారి సంఖ్య ఇంకా పెరగాలి. దీనికోసం ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తల సాయంతో పల్లెలో అవగహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రస్తుతం 102 సేవలు బాగా నడుస్తున్నా.. మరింత పెంచడా నికి కృషి చేస్తాం. గర్భిణులు, బాలింతలు వీటిని అధికంగా ఉపయోగించుకునేలా వారిలో చైతన్యం రావాలి. మూడు నెలల గర్భిణి నుంచి 9నెలల శిశువు ఉన్న బాలింత వరకు ప్రతీ ఒక్కరు సేవలు ఉపయోగించుకోవచ్చు. – నసీరుద్దీన్, 102 ప్రోగ్రాం అధికారి, మహబూబ్‌నగర్ -
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
ఖమ్మం వైద్యవిభాగం: మారుమూల ప్రాంతాల్లో గర్భిణులు అవస్థలు పడొద్దని.. సుఖ ప్రసవం జరగాలని.. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2017, జూన్ 2న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచేలా కార్యాచరణ రూపొందించి.. అమలు చేస్తోంది. కేసీఆర్ కిట్ అందజేయడంతోపాటు ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేల చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 15 నెలల కాలంలోనే రెట్టింపు అయింది. పథకానికి ముందు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏడాదికి 22వేలకు పైగా ప్రసవాలు జరగగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాటి సంఖ్య 5వేలకు మించని పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నా.. పీహెచ్సీలలో ఆశించిన మేర జరగకపోవడంతో పథకం లక్ష్యం నెరవేరకుండా పోతోంది. పీహెచ్‌సీల్లో 8 శాతం మాత్రమే.. జిల్లాలో 22 పీహెచ్‌సీలు ఉండగా.. పథకం ప్రారంభమైన 15 నెలల కాలంలో కేవలం 8 శాతం మాత్రమే ప్రసవాలు జరగడం గమనార్హం. కల్లూరు పీహెచ్సీలో మాత్రమే 182 ప్రసవాలు జరిగాయి. వైరా 101, బోనకల్ 98 ప్రసవాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొన్ని పీహెచ్సీలలో రెండు అంకెలు కూడా దాటకపోవడం శోచనీయం. మంచుకొండ 2, సుబ్లేడు 3, కూసుమంచి 5, పెద్దగోపతి 6, కామేపల్లి పీహెచ్సీలలో 9 డెలివరీలు మాత్రమే చేయడంతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 12,606 ప్రసవాలు చేయగా.. పీహెచ్సీలలో 1,019 మాత్రమే చేశారు. ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పీహెచ్‌సీల్లో మాత్రం 8 శాతం మాత్రమే కావడం వల్ల ఆ శాఖ పనితీరు అర్థమవుతోంది. 92 శాతం వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లోనే.. జిల్లాలోని పెద్దాస్పత్రితోపాటు సత్తుపల్లి, పెనుబల్లి, మధిరలో వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులున్నాయి. అయితే పీహెచ్సీలకన్నా వీటిలోనే అధికంగా ప్రసవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు కావడంతో ఎక్కువ మంది గర్భిణులు ఆయా ప్రాంతాల్లో ప్రసవాలు చేయించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడైతే మంచి సౌకర్యాలు ఉంటాయనే ఉద్దేశంతో వ్యయ ప్రయాసలకోర్చి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. 15 నెలల కాలంలో 92 శాతం డెలివరీలు ఈ ఆస్పత్రుల్లోనే జరిగాయి. పెద్దాస్పత్రిలో రికార్డు స్థాయిలో.. రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రసవాలు హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 15 నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా 12,606 ప్రసవాలు జరగగా.. ఒక్క పెద్దాస్పత్రిలోనే 10,082 ప్రసవాలు జరగడం గమనార్హం. ముఖ్యంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇక్కడ ప్రసవాలు చేయించుకునేందుకు గర్భిణులు ఆసక్తి చూపుతున్నారు. పెద్దాస్పత్రిలో ప్రతి రోజు 20 నుంచి 30 వరకు ప్రసవాలు చేస్తున్నారు. 90 శాతం వరకు ఇక్కడే ప్రసవాలు జరుగుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ లెక్కలు చెపుతున్నాయి. అయితే ఎక్కువ సంఖ్యలో గర్భిణులు పెద్దాస్పత్రికి వస్తుండడంతో ఇక్కడి వైద్యులపై మరింత భారం పడుతోంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యధికంగా ప్రసవాలు జరుగుతుండగా.. పీహెచ్‌సీల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పీహెచ్‌సీల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, మారుమూల ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం వంటి కారణాల వల్ల అక్కడ ప్రసవాలు చేయించుకునేందుకు గర్భిణులు ఇష్టపడట్లేదని తెలుస్తోంది. సబ్‌సెంటర్ స్థాయిలో అవగాహన పెంచాలి.. పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను సబ్‌సెంటర్ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తే మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. పీహెచ్‌సీల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, ఆర్థికంగా వచ్చే ప్రయోజనం ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల ద్వారా గర్భిణులకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ కిట్ల పథకం వచ్చాక ఎక్కువ మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేసీఆర్ కిట్‌తోపాటు ప్రోత్సాహకం కూడా ఇస్తుండడంతో గర్భం దాల్చిన వెంటనే పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 12,606 ప్రసవాలు జరగగా.. 11,225 మందికి కేసీఆర్ కిట్లు అందించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పీహెచ్‌సీలకు వచ్చేందుకు మాత్రం గర్భిణులు ఇష్టపడటం లేదు. ఆ విధానం మారాలంటే వైద్య, ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతపై వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పీహెచ్‌సీల్లో పెంచేందుకు ప్రణాళికలు పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. సబ్‌సెంటర్లలోని ఆశ, ఏఎన్ఎం, సూపర్వైజర్ల ద్వారా గర్భిణులను గుర్తించి.. వారికి అవగాహన కల్పిస్తున్నాం. దగ్గర్లోని పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరిస్తున్నాం. అలాగే తొలిసారి సాధారణ కాన్పు చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. - కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
తల్లీబిడ్డలకు వరం అమ్మఒడి
ప్రభుత్వం ప్రారంభించిన ‘అమ్మఒడి 102’ అంబులెన్స్ వాహనాలు గర్భిణులు, బాలింతలతో పాటు పుట్టిన పసిబిడ్డలకు వరంగా మారాయి. ప్రసవానికి ముందు వైద్య పరీక్షలకు తీసుకెళ్లడంతో పాటు ప్రసవం తర్వాత సురక్షితంగా ఇళ్లు చేరేందుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తున్నాయి. ఈ సేవలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. జిల్లాలోని 18 మండలాల్లో అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 7 వాహనాలు సర్వీసులు అందిస్తున్నాయి. తల్లీబిడ్డలకు సకాలంలో, సురక్షితమైన వైద్య సేవలు అందడంలో కీలకంగా పని చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 27వ తేదీన 200 వాహనాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. తాండూరు : జిల్లాలోని 18 మండలాలకు కేటాయించిన 102 అంబులెన్స్ వాహనాల ద్వారా ఇప్పటి వరకు 878 కేసులను అటెండ్ చేసి తల్లీబిడ్డలను సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. తల్లీబిడ్డలతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ వాహనంలో ఇంటికి చేరుకుంటున్నారు. తాండూరు నుంచి 138 మంది, బషీరాబాద్ 160, వికారాబాద్ 130, పరిగి 101, కొడంగల్ 124, కుల్కచర్ల 129, మోమిన్‌పేట్ 96 మంది బాలింతలకు సేవలు అందించారు. ప్రతీవారం గర్భిణులకు నెలవారీ పరీక్షల కోసం స్థానిక ఆస్పత్రులకు వెళ్లేందుకు సైతం ఈ వాహనాలను వినియోగిస్తున్నారు. అమ్మలకు అండగా... అమ్మలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. మహిళలు గర్భం దాల్చిన రోజు నుంచి 16 నెలల పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు పొందేందుకు అమ్మఒడి పథకం ద్వారా రవాణా భరోసా కల్పిస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఒక్కో బాలింతకు రూ.13 వేల వరకు నగదు ప్రోత్సాహం అందిస్తున్నారు. కేసీఆర్ కిట్ ద్వారా తల్లీబిడ్డకు కావాల్సిన వస్తువులు అందజేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయిం చుకున్న వారికి కేసీఆర్ కిట్ అందుతోంది. సుఖప్రసవం తో పాటు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలుసుకున్నాకే 102 వాహనంలో ఇంటికి తీసుకెళ్లి దిగబెడుతున్నారు. దీనిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సేవలు బాగున్నాయి ఆస్పత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నా 102 వాహనంలోకి ఎక్కగానే ఎంతో ఆనందం అనిపించింది. కేసీఆర్ కిట్‌ను తీసుకొని రూపాయి ఖర్చు లేకుండా 102లో బిడ్డతో సహా ఇంటికి చేరుకున్నాం. ఈ సేవలు అమ్మలకు ఎంతో అండగా నిలుస్తున్నాయి. పట్టణ ప్రాంతాలకన్నా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సేవలు అత్యవరసం. – రాణి, అయ్యప్పనగర్, తాండూరు -
సీఎం సారూ... ప్రాణాలు పోతున్నాయ్..!
అమ్మ ఒడిలోకి రాకుండానే మృత్యు ఒడిలోకి వెళ్లిపోతున్నారు. పేగు తెంచుకోగానే తనువు చాలిస్తున్నారు. బయట ప్రపంచం చూడకుండానే కన్ను మూస్తున్నారు. గర్భ శోకానికి ప్రభుత్వాసుపత్రులు వేదికగా మారిపోయాయి.కాకినాడ జీజీహెచ్‌లోనైతే శిశు మరణ ఘోష నిత్యం వినిపిస్తూనే ఉంది.శిశు మరణాలు ఏటా పెరిగిపోతున్న తీరుపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇచ్చినాసంబంధితాధికారుల్లో కనీస స్పందన కరువవుతోంది. జిల్లా పర్యటనలసందర్భంగా స్వయంగా సీఎం ఇచ్చిన హామీలూ ఆచరణకు నోచుకోవడం లేదు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: చిన్నారుల్లో తలెత్తే లోపాలను సత్వరమే గుర్తించి, తగు చికిత్సలు అందించేందుకు ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఐదేళ్లలోపు పిల్లల్లో సంభవిస్తున్న మరణాలకుకారణమైన రోగాలను గుర్తించి, తగు మందులు వాడేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని చెబుతున్నారు. చిత్తశుద్ధితో అమలు చేస్తే మంచిదే కానీ మాటల్లో ఉన్న చిత్తశుద్ధి ఆచరణల్లో కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుర్తించిన రోగానికి వైద్యం అందించే వైద్యులు, సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో గుర్తించిన రోగాలకు వైద్యమెలా అందిస్తారో ప్రశ్నార్థకంగా మారింది. ఎంతసేపూ ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మెప్మా కార్యకర్తలపై ఆధారపడితే సరిపోదని, వారితో ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమంలో ఆరోగ్య పరిస్థితులను గుర్తించినంత మాత్రాన ప్రయోజనమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గురువారం జిల్లాకు సీఎం చంద్రబాబు వస్తున్న సందర్భంగా ‘సీఎం సారూ... ఓ సారి ఇటు చూడండ’ంటూ జిల్లాలో మాతా, శిశు మరణాల దయనీయ దుస్థితులపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. పురిటినొప్పులు వస్తే భయమే... పురిటినొప్పులు వస్తే చాలు గర్బిణీలు, వారి కుటుం బీకులు భయాందోళనకు గురవుతున్నారు. కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా వస్తారా లేరా అని భయపడుతున్నారు. సుఖ ప్రసవం సాగేవరకు, ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టేవరకు ఆందోళన వీడటం లేదు. గిరిజనం, మైదానం అనే తేడా లేకుండా కలవరపడుతున్నారు. గత నాలుగేళ్లలో శిశు మరణాలు ఎక్కువగా సంభవించడమే దీనికి కారణం. శాస్త్ర సాంకేతికత విశ్వం అంచులకు చేరిన కాలంలోనూ...వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాక శిశు మరణాల సంఖ్య పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విచిత్రమేమిటంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక శిశు మరణాలతోపాటు మాతృ మరణాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. పైన పేర్కొన్న పట్టికలో 2014–15 నుంచి అంకెలు చూస్తే పరిస్థితేంటో స్పష్టమవుతోంది. గత నాలుగేళ్ల కాలంలో ఏడాదిలోపు శిశువులు 2,922 మంది చనిపోగా, ఐదేళ్లలోపు చిన్నారులు 261 మంది మరణించారు. ఇక తల్లుల మరణాలైతే ఈ నాలుగేళ్ల కాలంలో 220 వరకూ ఉన్నాయి. మనకే ఎందుకీ పరిస్థితి... సహస్రాబ్ది లక్ష్యాల్లో ఒకటిగా ఐక్య రాజ్యసమితి నిర్ణయించిన శిశు మరణాల నియంత్రణ విషయంలో మన దేశం చెప్పుకోదగ్గ విజయం సాధించిందని అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ వెల్లడించిన గణాంకాలు ఊరటనిచ్చాయి. ప్రభుత్వాలు తీసుకున్న వివిధ చర్యల కారణంగా 2000–15 మ«ధ్య పది లక్షల మంది మృత్యుపాశం నుంచి తప్పించుకోగలిగారని ఆ నివేదికలో పేర్కొంది. భారత రిజిస్ట్రార్ జనరల్ నిరుడు విడుదల చేసిన నివేదిక కూడా శిశు మరణాల రేటు తగ్గిందని వివరించింది. కానీ ఈ జిల్లాలో నాలుగేళ్లుగా శిశు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. లోపమెక్కడ... సాధారణంగా గర్భం దాల్చిన వెంటనే ఆమె పేరు, ఆధార్, రేషన్ నెంబర్, చిరునామాలాంటి వివరాల్ని స్థానిక వైద్యాధికారులు నమోదు చేయాలి. గర్భిణీకి హెచ్‌బీ, బీపీ, సుగర్, హెచ్‌బీఎస్‌ఎజీ, హెచ్ఐవీ వంటి పరీక్షలు నిర్వహించాలి. వాటిలో ఏ ఒక్క వ్యాధి ఉన్నా వారిని హైరిస్క్ గర్భిణిగా గుర్తించి ప్రసవమయ్యే వరకూ నిరంతరం ఏఎన్ఎం, వైద్యులు పర్యవేక్షించాలి. గుర్తించిన హైరిస్క్ మదర్స్‌ను 9వ నెల వచ్చేలోపు నాలుగుసార్లు పరిశీలించాల్సి ఉంది. ఏ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకోవాలో చెప్పేందుకు బర్త్ ప్లానింగ్ వేయాలి. జిల్లాలో ఇదేమీ సరిగా జరగగడం లేదు. ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం, రక్తహీనత తదితర సమస్యలను గుర్తించి సలహాలివ్వడం, అవసరమైన మందులు సమకూర్చడం వంటివి చేస్తేనే నెలలు నిండని, బలహీన శిశు మరణాలు తగ్గడం సాధ్యమవుతుంది. కానీ జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా కేంద్రంలో ఉండే కాకినాడ సర్వ జన ప్రభుత్వాసుపత్రికి ప్రసవానికి వచ్చిన తల్లుల్లో మెజార్టీ కేసుల్లో పిల్లలు దక్కని దుస్థితి నెలకొంది. గిరిజనులకైతే నరకమే... గిరిజన మహిళలు గర్భం దాలిస్తే చాలు నరకం చూస్తున్నారు. రహదారి సౌకర్యమే లేదంటే మిగతా సౌకర్యాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గిరిజనులను ప్రధానంగా రక్తహీనత పట్టిపీడిస్తోంది. పోషకాహారం అందిస్తేనే రక్త హీనతను నియంత్రించగలం. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. గిరిజన గ్రామాల ప్రజలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ కేంద్రాలు సరిగా పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి. పౌష్టికాహారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు రికార్డుల్లో కనిపించడమే తప్ప గిరిజనులకు మాత్రం అందడం లేదు. వైద్యుల కొరత... ఏజెన్సీలో వైద్యసేవలందించడంలో ప్రధాన భూమిక వహిస్తున్న రంపచోడవరం, చింతూరు ఏరియా ఆసుపత్రుల్లోనే అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. చింతూరు ఏరియా ఆసుపత్రికి 31 పోస్టులు మంజూరు చేస్తూ సెప్టెంబర్ 9న రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ 24 గంటలూ పని చేయించాలని కేబినెట్ నిర్ణయించినా ఆచరణకు నోచుకోవడం లేదు. ఏడాదిన్నర క్రితం అప్‌గ్రేడైన చింతూరు ఆసుపత్రికి వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలకు ప్రతిబంధకంగా మారింది. కాకినాడ జిల్లా ఆసుపత్రిలోనూ అవస్థలే... కాకినాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో పెరుగుతున్న ఓపీకి అనుగుణంగా వైద్యుల భర్తీ చేయలేదు. ముఖ్యంగా గైనిక్ వార్డులో పూర్తిస్థాయిలో గైనిక్ వైద్యులు లేకపోవడంతో ఉన్న వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఫలితంగా ప్రాణాంతక సమయంలో సరైన వైద్య చికిత్సలందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి, మాతా, శిశు ప్రసూతి విభాగంలో సుమారు 300 పడకలు ఉన్నాయి. నిత్యం ఇక్కడ చికిత్స పొందేందుకు గర్భిణులు 500 నుంచి 550 వరకు వస్తుంటారు. రోజుకి 50 వరకు ప్రసవాలు జరుగుతుండగా, 20–25 వరకు సీజేరియన్ ప్రసవాలు జరుగుతున్నాయి. తగిన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న వైద్యులు, సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో గైనిక్ విభాగంలో ఒక ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో 24 మంది వైద్యులు పనిచేయాల్సి ఉంది. ఇక్కడ ఆ స్థాయిలో వైద్యుల్లేరు. చిన్నారుల మరణాలునియంత్రించేందుకే... ఐదేళ్లలోపు సంభవిస్తున్న మరణాలు నియంత్రించేందుకు ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మెప్మా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటారు. వారిచ్చే నివేదిక ఆధారంగా సదరు చిన్నారులకు వైద్యులు సేవలందిస్తారు. మందులు ఎలా వాడాలో తల్లులకు తెలియజేస్తారు. ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లాలో ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమం ప్రారంభం కానుంది. – చెంచయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, కాకినాడ -
జూన్ మూడు నుంచి అమ్మఒడి
నల్లగొండ టౌన్ : మాతాశిశు మరణాల సంఖ్యను తగ్గించడంతో పాటు తల్లీబిడ్డ సంపూర్ణ ఆరోగ్యం కోసం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్యను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి కార్యక్రమం జూన్ మూడో తేదీ నుంచి జిల్లాలో అమలు కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు పౌష్టికాహారం అందిండం, చిన్నారులకు అన్ని రకాల వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయించడం వంటివి చేపట్టనున్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు పది వేల మంది గర్భిణులు తమ పేర్లను రిజిష్ట్రేషన్ చేయించుకున్నారు. జిల్లాలోని 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ ఏరియా ఆస్పత్రులు, నకిరేకల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు అయిన వారికి ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. ఆర్థిక సాయాన్ని నాలుగు విడతల్లో అందిస్తారు. మొదటి విడతలో గర్భవతిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేరును రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే అందజేస్తారు. రెండో విడతలో ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు కాగానే ఆడపిల్ల పుడితే రూ.5 వేలు, మగబిడ్డ పుడితే రూ.4 వేలు అందజేస్తారు. మూడో విడతలో చిన్నారికి టీకాలు, పెంటావాలెంట్ టీకాలు వేయించిన తర్వాత మూడున్నర నెలలకు రూ.2వేలు ఇస్తారు. నాలుగో విడతలో చిన్నారికి తొమ్మిది నెలలకు ఇప్పించే టీకాలు పూర్తయిన తర్వాత రూ.3 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. ఆర్థిక సాయాన్ని నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమజేస్తారు. అదేవిధంగా ఆస్పత్రిలో కాన్పు కాగానే తల్లికి కేసీఆర్ కిట్‌ను అందజేస్తారు. ఇప్పటికే జిల్లాకు మూడొందల కేసీఆర్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. కేసీఆర్ కిట్‌లో ఏముంటాయంటే.. బిడ్డకు బేబి బెడ్(మస్కిటో ప్రొటెక్టింగ్ నెట్‌తో పాటు), బేబి డ్రస్సెస్ 2, బేబి టవల్స్ 2, బేబి నాపి (వాషబుల్ 6), జాన్సన్స్ బేబి పౌడర్ (200 గ్రా), జాన్సన్స్ బేబి షాంపూ(100మిల్లీ లీ.), జాన్సన్స్ బేబి అయిల్(200మిల్లీ లీ., జాన్సన్స్ బేబి సోప్ 2, బేబి సోప్ బాక్స్ 1, బేబి రాటిల్ టాయ్ 1, బాలింతకు మదర్ సోప్ (మైసూర్ శాండల్,), చీరలు 2, కిట్ బ్యాగ్ 1, ప్లాస్టిక్ బాస్కెట్ 1.