సీఎం సారూ... ప్రాణాలు పోతున్నాయ్‌..! | Birth child deaths in agency area | Sakshi
Sakshi News home page

సీఎం సారూ... ప్రాణాలు పోతున్నాయ్‌..!

Published Thu, Mar 1 2018 11:24 AM | Last Updated on Thu, Mar 1 2018 11:24 AM

Birth child deaths in agency area - Sakshi

అమ్మ ఒడిలోకి రాకుండానే మృత్యు ఒడిలోకి వెళ్లిపోతున్నారు. పేగు తెంచుకోగానే తనువు చాలిస్తున్నారు. బయట ప్రపంచం చూడకుండానే కన్ను మూస్తున్నారు. గర్భ శోకానికి ప్రభుత్వాసుపత్రులు వేదికగా మారిపోయాయి.కాకినాడ జీజీహెచ్‌లోనైతే శిశు మరణ ఘోష నిత్యం వినిపిస్తూనే ఉంది.శిశు మరణాలు ఏటా పెరిగిపోతున్న తీరుపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇచ్చినాసంబంధితాధికారుల్లో కనీస స్పందన కరువవుతోంది.  జిల్లా పర్యటనలసందర్భంగా స్వయంగా సీఎం ఇచ్చిన హామీలూ ఆచరణకు నోచుకోవడం లేదు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: చిన్నారుల్లో తలెత్తే లోపాలను సత్వరమే గుర్తించి, తగు చికిత్సలు అందించేందుకు ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి అట్టహాసంగా ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఐదేళ్లలోపు పిల్లల్లో సంభవిస్తున్న మరణాలకుకారణమైన రోగాలను గుర్తించి, తగు మందులు వాడేలా ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని తలపెట్టామని చెబుతున్నారు. చిత్తశుద్ధితో అమలు చేస్తే మంచిదే కానీ మాటల్లో ఉన్న చిత్తశుద్ధి ఆచరణల్లో కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుర్తించిన రోగానికి వైద్యం అందించే వైద్యులు, సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. ఈ నేపథ్యంలో గుర్తించిన రోగాలకు వైద్యమెలా అందిస్తారో ప్రశ్నార్థకంగా మారింది. ఎంతసేపూ ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, మెప్మా కార్యకర్తలపై ఆధారపడితే సరిపోదని, వారితో ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమంలో ఆరోగ్య పరిస్థితులను గుర్తించినంత మాత్రాన ప్రయోజనమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గురువారం జిల్లాకు సీఎం చంద్రబాబు వస్తున్న సందర్భంగా ‘సీఎం సారూ... ఓ సారి ఇటు చూడండ’ంటూ జిల్లాలో మాతా, శిశు మరణాల దయనీయ దుస్థితులపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

పురిటినొప్పులు వస్తే భయమే...
పురిటినొప్పులు వస్తే చాలు గర్బిణీలు, వారి కుటుం బీకులు భయాందోళనకు గురవుతున్నారు. కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా వస్తారా లేరా అని భయపడుతున్నారు. సుఖ ప్రసవం సాగేవరకు, ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టేవరకు ఆందోళన వీడటం లేదు. గిరిజనం, మైదానం అనే తేడా లేకుండా కలవరపడుతున్నారు. గత నాలుగేళ్లలో  శిశు మరణాలు ఎక్కువగా సంభవించడమే దీనికి కారణం. శాస్త్ర సాంకేతికత విశ్వం అంచులకు చేరిన కాలంలోనూ...వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాక శిశు మరణాల సంఖ్య పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విచిత్రమేమిటంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక శిశు మరణాలతోపాటు మాతృ మరణాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. పైన పేర్కొన్న పట్టికలో 2014–15 నుంచి అంకెలు చూస్తే పరిస్థితేంటో స్పష్టమవుతోంది. గత నాలుగేళ్ల కాలంలో ఏడాదిలోపు శిశువులు 2,922 మంది చనిపోగా, ఐదేళ్లలోపు చిన్నారులు 261 మంది మరణించారు. ఇక తల్లుల మరణాలైతే ఈ నాలుగేళ్ల కాలంలో 220 వరకూ ఉన్నాయి.

మనకే ఎందుకీ పరిస్థితి...
సహస్రాబ్ది లక్ష్యాల్లో ఒకటిగా ఐక్య రాజ్యసమితి నిర్ణయించిన శిశు మరణాల నియంత్రణ విషయంలో మన దేశం చెప్పుకోదగ్గ విజయం సాధించిందని అంతర్జాతీయ జర్నల్‌ లాన్‌సెట్‌ వెల్లడించిన గణాంకాలు ఊరటనిచ్చాయి. ప్రభుత్వాలు తీసుకున్న వివిధ చర్యల కారణంగా 2000–15 మ«ధ్య పది లక్షల మంది మృత్యుపాశం నుంచి తప్పించుకోగలిగారని ఆ నివేదికలో పేర్కొంది. భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ నిరుడు విడుదల చేసిన నివేదిక కూడా శిశు మరణాల రేటు తగ్గిందని వివరించింది. కానీ ఈ జిల్లాలో నాలుగేళ్లుగా శిశు మరణాలు పెరుగుతూనే ఉన్నాయి.

లోపమెక్కడ...
సాధారణంగా గర్భం దాల్చిన వెంటనే ఆమె పేరు, ఆధార్, రేషన్‌ నెంబర్, చిరునామాలాంటి వివరాల్ని స్థానిక వైద్యాధికారులు నమోదు చేయాలి. గర్భిణీకి హెచ్‌బీ, బీపీ, సుగర్, హెచ్‌బీఎస్‌ఎజీ, హెచ్‌ఐవీ వంటి పరీక్షలు నిర్వహించాలి. వాటిలో ఏ ఒక్క వ్యాధి ఉన్నా వారిని హైరిస్క్‌ గర్భిణిగా గుర్తించి ప్రసవమయ్యే వరకూ నిరంతరం ఏఎన్‌ఎం, వైద్యులు పర్యవేక్షించాలి. గుర్తించిన హైరిస్క్‌ మదర్స్‌ను 9వ నెల వచ్చేలోపు నాలుగుసార్లు పరిశీలించాల్సి ఉంది. ఏ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకోవాలో చెప్పేందుకు బర్త్‌ ప్లానింగ్‌ వేయాలి. జిల్లాలో ఇదేమీ సరిగా జరగగడం లేదు. ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించడం, రక్తహీనత తదితర సమస్యలను గుర్తించి సలహాలివ్వడం, అవసరమైన మందులు సమకూర్చడం వంటివి చేస్తేనే నెలలు నిండని, బలహీన శిశు మరణాలు తగ్గడం సాధ్యమవుతుంది. కానీ జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లా కేంద్రంలో ఉండే కాకినాడ సర్వ జన ప్రభుత్వాసుపత్రికి ప్రసవానికి వచ్చిన తల్లుల్లో మెజార్టీ కేసుల్లో పిల్లలు దక్కని దుస్థితి నెలకొంది.

గిరిజనులకైతే నరకమే...
గిరిజన మహిళలు గర్భం దాలిస్తే చాలు నరకం చూస్తున్నారు. రహదారి సౌకర్యమే లేదంటే మిగతా సౌకర్యాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గిరిజనులను ప్రధానంగా రక్తహీనత పట్టిపీడిస్తోంది. పోషకాహారం అందిస్తేనే రక్త హీనతను నియంత్రించగలం. కానీ, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. గిరిజన గ్రామాల ప్రజలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు సరిగా పనిచేయడం లేదన్న విమర్శలున్నాయి. పౌష్టికాహారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు రికార్డుల్లో కనిపించడమే తప్ప గిరిజనులకు మాత్రం అందడం లేదు.

వైద్యుల కొరత...
ఏజెన్సీలో వైద్యసేవలందించడంలో ప్రధాన భూమిక వహిస్తున్న రంపచోడవరం, చింతూరు ఏరియా ఆసుపత్రుల్లోనే అసౌకర్యాలు వెంటాడుతున్నాయి. చింతూరు ఏరియా ఆసుపత్రికి 31 పోస్టులు మంజూరు చేస్తూ సెప్టెంబర్‌ 9న రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఏజెన్సీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ 24 గంటలూ పని చేయించాలని కేబినెట్‌ నిర్ణయించినా ఆచరణకు నోచుకోవడం లేదు. ఏడాదిన్నర క్రితం అప్‌గ్రేడైన చింతూరు ఆసుపత్రికి వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలకు ప్రతిబంధకంగా మారింది.

కాకినాడ జిల్లా ఆసుపత్రిలోనూ అవస్థలే...
కాకినాడ ప్రభుత్వ బోధనాసుపత్రిలో పెరుగుతున్న ఓపీకి అనుగుణంగా వైద్యుల భర్తీ చేయలేదు. ముఖ్యంగా గైనిక్‌ వార్డులో పూర్తిస్థాయిలో గైనిక్‌ వైద్యులు లేకపోవడంతో ఉన్న వారిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఫలితంగా ప్రాణాంతక సమయంలో సరైన వైద్య చికిత్సలందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి, మాతా, శిశు ప్రసూతి విభాగంలో సుమారు  300 పడకలు ఉన్నాయి. నిత్యం ఇక్కడ చికిత్స పొందేందుకు గర్భిణులు 500 నుంచి 550 వరకు వస్తుంటారు. రోజుకి 50 వరకు ప్రసవాలు జరుగుతుండగా, 20–25 వరకు సీజేరియన్‌ ప్రసవాలు జరుగుతున్నాయి.   తగిన స్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న వైద్యులు, సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో గైనిక్‌ విభాగంలో ఒక ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో 24 మంది వైద్యులు పనిచేయాల్సి ఉంది. ఇక్కడ ఆ స్థాయిలో వైద్యుల్లేరు.

చిన్నారుల మరణాలునియంత్రించేందుకే...
ఐదేళ్లలోపు సంభవిస్తున్న మరణాలు నియంత్రించేందుకు ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మెప్మా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చిన్నారుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటారు. వారిచ్చే నివేదిక ఆధారంగా సదరు చిన్నారులకు వైద్యులు సేవలందిస్తారు. మందులు ఎలా వాడాలో తల్లులకు తెలియజేస్తారు. ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లాలో ‘చిన్నారుల పలకరింపు’ కార్యక్రమం ప్రారంభం కానుంది. – చెంచయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, కాకినాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement