
15 మంది దుర్మరణం
వారిలో ఇద్దరు జర్నలిస్టులు
డెయిర్ అల్–బలాహ్: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం తెల్లవారుజామున ఖాన్ యూనిస్‌లోని నాజర్ ఆసుపత్రి వెలుపల ఉన్న టెంట్లపై జరిపిన దాడిలో పాలస్తీనా టుడే టీవీ స్టేషన్ రిపోర్టర్ యూసుఫ్ అల్ ఫకావితోపాటు మరో రిపోర్టర్ మృతి చెందారు. ఆరుగురు విలేకరులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఒకరికి తీవ్ర కాలిన గాయాలు కాగా, మరొకరికి తలకు తూటా గాయమైనట్టు పాలస్తీనా మీడియా తెలిపింది.
ఖాన్ యూనిస్ లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేసి తొమ్మిది మందిని హతమార్చిన కొన్ని గంటల్లోనే ఈ దాడి జరిగింది. వెస్ట్ బ్యాంక్‌లోని టర్మస్ అయా సమీపంలో రాళ్లు విసిరిన ఉగ్రవాదిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. కానీ బాధితుడు 14 ఏళ్ల పాలస్తీనా–అమెరికన్ అని హమాస్ పేర్కొంది. సోమవారం ఈ ప్రాంతంలో వేర్వేరు దాడుల్లో పదిహేను మంది మృతి చెందగా 9 మందికి పైగా గాయపడ్డట్టు నాజర్ ఆస్పత్రి తెలిపింది.
రాత్రి వరకే ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు సహా మరో 13 మంది మృతదేహాలు వచ్చినట్టు వెల్లడించింది. డెయిర్ అల్–బలాహ్‌లోని అల్–అక్సా అమరవీరుల ఆసుపత్రి అంచున ఉన్న గుడారాలపై ఇజ్రాయెల్ దాడిలో ముగ్గురు గాయపడ్డారని ఆసుపత్రి తెలిపింది. ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఇద్దరు మృతి చెందారని, ముగ్గురు గాయపడ్డారని వెల్లడించింది.
2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో వారానికి సగటున 13 మంది చొప్పున ఇప్పటిదాకా 232 మంది జర్నలిస్టులు మృతి చెందినట్టు అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ నివేదిక వెల్లడించింది. రెండు ప్రపంచ యుద్ధాలు, వియత్నాం యుద్ధం, యుగోస్లేవియా యుద్ధాలు, అఫ్గానిస్తాన్‌లో అమెరికా యుద్ధం కంటే గాజాలోనే ఎక్కువ మంది జర్నలిస్టులు మరణించారు. తాము హమాస్‌పై మిలిటెంట్ల టెంట్‌పైనే దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ‘‘పౌరులకు హాని జరగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ మిలిటెంట్లు నివాస ప్రాంతాల్లో లోతుగా పాతుకుపోయారు. పౌరుల మరణాలకు హమాసే కారణం’’ అని ఆరోపించింది.