జెరూసలేం: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ముగింపు దశకు చేరుకుంది. అనూహ్యంగా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చాయి. కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందన్నారు. ఈ సమయంలో ఏదైనా జరిగే అవకాశం ఉందన్నారు. మరోవైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే ఇది పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో నిర్బంధించబడిన ఇజ్రాయెల్ బందీల విడుదలకు ఒప్పందం కుదుర్చుకోవడంలో సహాయం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారని ఆయన కార్యాలయం తెలిపింది.
ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి వీలు కలుగుతుంది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది. కొన్నినెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, ఖతార్ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది. ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు.
ఇక, అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలో హమాస్‌కు మద్దతుగా హెజ్‌బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment