గాజాగాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న వేళ ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ అయ్యారు. నెతన్యాహు తప్పు చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వైఖరి మారకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
గాజాలో గత వారం జరిగిన డ్రోన్ దాడిలో వరల్డ్ కిచెన్ సెంటర్ (డబ్ల్యూకేసీ) స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు మరణించారు. ఈ ఘటనపై అగ్రరాజ్యం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన నేపథ్యంలోనే బైడెన్ స్పందించారు. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ.. గాజాలో నెతన్యాహు తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని అంగీకరించను. ఆరు లేదా ఎనిమిది వారాలపాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెల్ సైన్యాన్ని కోరుతున్నాను. ఈ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయవచ్చు అని అన్నారు.
ఇదే సమయంలో బైడెన్.. జోర్డాన్, సౌదీ, ఈజిప్ట్ దేశాలు కూడా సహాయం, ఆహారం పంపేలా నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. వారు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గాజాలోని ప్రజలకు ఔషధాలు, ఆహార సరఫరాలో ఎటువంటి రాజీ ఉండదని చెప్పారు. మరోవైపు శ్వేతసౌధం స్పందిస్తూ సంధి కోసం ఇజ్రాయెల్ కొన్ని చర్యలు తీసుకొందని వెల్లడించింది. కానీ, హమాస్ వైపు స్పందన మాత్రం అంత ప్రోత్సాహకరంగా లేదని పేర్కొంది.
ఇక, ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ అమెరికా, ఐరాస డిమాండ్ చేసిన విధంగానే గాజాలోకి సరఫరాలను పెంచామని వివరించింది. తాము వీటికి ఎటువంటి ఆటంకాలను సృష్టించడం లేదని తెలిపింది. సోమవారం 468 ట్రక్కులు, మంగళవారం 419 ట్రక్కుల సామగ్రిని తరలించినట్లు చెప్పింది. యుద్ధం మొదలైన నాటికి ఇదే అత్యధికమని వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో ప్రాణ నష్టం భారీగా జరిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ ముఖ్యనేత ఇస్మాయిల్ హనియేహ్ కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఖతర్ వంటి దేశాలు సంధి ప్రయత్నాలు చేస్తున్న వేళ హమాస్ కీలక నేత కుమారులు మరణించడంతో సయోధ్యపై మరోమారు నీలినీడలు కమ్ముకున్నాయి. ‘జెరూసలేం, అల్–అఖ్సా మసీదుకు విముక్తి కల్పించే పోరాటంలో నా కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు’ అని ఇస్మాయిల్ వెల్లడించారు. ఇస్మాయిల్ ప్రస్తుతం ఖతార్‌లో ప్రవాసజీవితం గడుపుతున్నారు. కుమారులు మాత్రం గాజాలోని శరణార్థి శిబిరంలో ఉంటున్నారు. షాటీ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలోనే ఆయన కుమారులు హజీమ్, అమీర్, మొహమ్మద్‌లు మరణించారని అల్–అఖ్సా టీవీ ప్రకటించింది. ముగ్గురూ తమ కుటుంబసభ్యులతో కలిసి ఒకే వాహనంలో వెళ్తుండగా ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురితోపాటు హజీమ్ కుమారులు, కుమార్తె, అమీర్ కుమార్తె సైతం ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment