బైడెన్‌ హెచ్చరిక.. ఇజ్రాయెల్‌ కవ్వింపు చర్యలు! | Israel Prepare For Ground War Operation Against Hezbollah | Sakshi
Sakshi News home page

బైడెన్‌ హెచ్చరిక.. ఇజ్రాయెల్‌ కవ్వింపు చర్యలు!

Sep 26 2024 9:14 AM | Updated on Sep 26 2024 11:09 AM

Israel Prepare For Ground War Operation Against Hezbollah

టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌-హిజ్బుల్లా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ అనూహ్య దాడులతో హిజ్బుల్లా సైనిక బలం సగానికి తగ్గింది. ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఆల్‌ అవుట్‌ వార్‌(అంతటా యుద్ధం సాధ్యమే) అంటూ ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి బైడెన్‌ కామెంట్స్‌ చేయడంతో.. కవ్వింపు చర్యలకు దిగిన నెతన్యాహు మరిన్ని దాడులకు సన్నద్ధమవుతున్నారు. 

లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం విధ్వంసం సృష్టిస్తోంది. ప్రస్తుతం హిజ్బుల్లా పరిస్థితి గాజాలోని హమాస్ మాదిరిగానే తయారైంది. కేవలం నాలుగు రోజుల ఆపరేషన్ సమయంలో ఇజ్రాయెల్.. హిజ్బుల్లా 90 శాతం నాయకత్వాన్ని హతమార్చింది. హిజ్బుల్లా సైనిక బలాన్ని సగం నాశనం చేసింది. ఆపరేషన్ నార్తర్న్ యారో కారణంగా.. హిజ్బుల్లా సైనిక మౌలిక సదుపాయాలలో సగం ధ్వంసమైందని ఇజ్రాయెల్, అమెరికా చెబుతున్నాయి.  ఐడీఎఫ్ తన నివేదికలో హిజ్బుల్లా అగ్ర నాయకత్వంలో ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు మాత్రమే మిగిలి ఉన్నారని చెబుతోంది. వీరు చీఫ్ హసన్ నస్రల్లా, హిజ్బుల్లా దక్షిణ ఫ్రంట్ కమాండర్ అలీ కరాకి, బదర్ యూనిట్ హెడ్ అబూ అలీ. వీరికి కూడా త్వరలోని అంతం చేస్తామని తెలిపింది.

ఆర్మీ చీఫ్‌ సూచన..
మరోవైపు ఇజ్రాయెల్‌ లెబనాన్‌లో భూతల దాడులకు సిద్ధవుతోంది. ఇజ్రాయెల్‌ ఆర్మీ చీఫ్‌ ఈ మేరకు సన్నద్ధం కావాలని తమ బలగాలకు సూచించారు. ఇజ్రాయెల్‌ ఉత్తర సరిహద్దులో ప్రాంతాల్లో పర్యటించిన ఇజ్రాయెల్‌ ఆర్మీ చీఫ్‌ సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసి ఐడీఎఫ్ బలగాలు లెబనాన్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తామన్నారు. హిజ్బుల్లా లక్ష్యంగా భూతల దాడులకు సిద్ధంగా ఉండాలని సేనలకు సూచించారు.

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌ తక్షణమే కాల్పులు విరమణ పాటించాలని పలు దేశాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కొన్ని ఇతర భాగస్వామ్య దేశాలు ఇజ్రాయెల్ తక్షణమే 21 రోజుల కాల్పుల విరమణ చేపట్టాలని  పిలుపునిచ్చాయి. ఇక, హిజ్బుల్లాకు ప్రధాన మద్దతు దేశమైన ఇరాన్‌.. ఇజ్రాయెల్ దాడులను ఖండించింది. వెంటనే కాల్పులను ఆపివేయాలని డిమాండ్‌ చేసింది. 

51 మంది మృతి
ఇదిలా ఉండగా బుధవారం లెబనాన్​పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించింది. ఈ ఘనటలో 51 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 223 మందికి తీవ్రంగా గాయాలైనట్లు లెబనాన్​ ఆరోగ్య శాఖ తెలిపింది. గత రెండు రోజులతో కలిపి మొత్తంగా 564 మంది ప్రాణాలు కోల్పోగా, 1800 మందికి గాయాలైనట్లు వెల్లడించింది. మృతుల్లో 150 మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు పేర్కొంది.

భారత్‌ అలర్ట్‌..
ఈ పరిణామాల నేపథ్యంలో లెబనాన్‌లో ఉంటున్న తమ పౌరులను భారత్‌ అప్రమత్తం చేసింది. తక్షణం అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. లెబనాన్‌కు ఇపుడు ఎవరూ రాకూడదని స్పష్టంచేసింది.

 

 

ఇది కూడా చదవండి: న్యూక్లియర్‌ వార్‌కు సిద్ధం.. పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement