బీరుట్/ఖాన్ యూనిస్: గాజాతోపాటు లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్‌లోని హస్బయా ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిని బీరుట్ కేంద్రంగా పనిచేసేత అరబ్ టీవీ అల్ మయాదీన్ కెమెరామ్యాన్ ఘస్సన్ నాజర్, టెక్నీషియన్ మహ్మద్ రిడా, హెజ్‌బొల్లా గ్రూపునకు చెందిన అల్ మనార్ టీవీ కెమెరామ్యాన్ విస్సమ్ కస్సిమ్‌గా గుర్తించారు.
ఘటన సమయంలో ఆ భవనంలో ఏడు వేర్వేరు మీడియా సంస్థలకు చెందిన 18 మంది జర్నలిస్టులు ఉన్నారని లెబనాన్ సమాచార మంత్రి జియాద్ మకరీ చెప్పారు. ఇజ్రాయెల్ చర్యను ప్రణాళిక ప్రకారం చేపట్టిన హత్యాకాండగా అభివర్ణించారు. కుప్ప కూలిన భవనం ప్రాంగణంలో ప్రెస్ అనే స్టిక్కర్‌తో ధ్వంసమైన వాహనాలున్న వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసింది.
ఆ సమయంలో తామంతా విశ్రాంతి తీసుకుంటున్నామని దాడి నుంచి సురక్షితంగా బయటపడిన అల్ జజీరా ఇంగ్లిష్ చానెల్ కరస్పాండెంట్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. అయితే, ఉద్దేశపూర్వకంగా తాము దాడి చేయలేదని ఇజ్రాయెల్ మిలటరీ పేర్కొంది. గాజాపై యుద్ధం మొదలయ్యాక 128 మంది జర్నలిస్టులు విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయారని జర్నలిస్టుల రక్షణ కమిటీ తెలిపింది. మరోవైపు 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.
ఒకే కుటుంబంలోని 36 మంది మృతి
గాజాలోని ఖాన్‌యూనిస్ నగరంపై గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో మొత్తం 38 మంది చనిపోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది చిన్నారులు సహా 36 మంది ఉన్నారని పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment