
31మంది మృతి
వెస్ట్ పామ్ బీచ్ (యూఎస్): అంతర్జాతీయ జలాల్లో రాకపోకలు సాగించే అమెరికా రవాణా నౌకలు, యుద్ధనౌకలే లక్ష్యంగా రాకెట్ దాడులకు తెగబడుతున్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులపై ట్రంప్ సర్కారు విరుచుకుపడింది. శనివారం హౌతీ స్థావరాలపై బాంబులు, రాకెట్లు, క్షిపణి దాడులతో బెంబేలెత్తించింది. ఈ దాడుల్లో ఇప్పటిదాకా 31 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని హౌతీ రెబెల్స్ ఆదివారం ప్రకటించారు. ‘‘మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే. 101 మందికి పైగా గాయపడ్డారు’’ అని హౌతీల ఆధ్వర్యంలో నడిచే ఆరోగ్య శాఖ ఆదివారం పేర్కొంది.
హౌతీలకు ఇక మూడిందని ఈ సందర్భంగా ట్రంప్ ఘాటు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ‘‘ఉగ్రవాదుల స్థావరాలు, వారి నేతలు, క్షిపణి రక్షణ వ్యవస్థలపై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతాయి. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా సముద్రయానం చేయకుండా ఏ ఉగ్ర శక్తీ ఇక అమెరికాను ఆపలేదు. స్వేచ్ఛాయుత సరకు రవాణాయే మా లక్ష్యం’’ అని తన సోషల్ సైట్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. హౌతీలకు ఇకనైనా మద్దతు మానుకోవాలని ఇరాన్‌ను హెచ్చరించారు.
అమెరికా వైమానిక దాడుల వల్ల యెమెన్ రాజధాని సనాతో పాటు ఉత్తర ప్రావిన్స్ సాదలోనూ పేలుళ్లు సంభవించాయి. ఆదివారం తెల్లవారుజామున హొదైదా, బైదా, మరీబ్ ప్రావిన్స్‌ల్లోనూ వైమానిక దాడులు జరిగినట్లు హౌతీలుధ్రువీకరించారు. వైమానిక దాడులు ఇక రోజూ కొనసాగవచ్చని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వీటికి బెదిరేది లేదని హౌతీలన్నారు. ‘‘అమెరికాకు దీటుగా బదులిస్తాం. గాజాకు తోడుగా నిలుస్తాం. ఎలాంటి సవా ళ్లు ఎదురైనాసరే ఒంటరిగా వదిలేయలేం’’ అని హూతీ మీడియా కా ర్యాలయం ఉపసారథి సస్రుద్దీన్ అమీర్ ప్రకటించారు.
రవాణాకు అడ్డంకి
ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పేందుకు ఆ దేశ నౌకలపై మాత్రమే దాడులు చేస్తున్నామని హౌతీలు గతంలో చెప్పారు. కానీ వారి దాడులతో ఎర్ర సముద్రం, గల్ప్ ఆఫ్ ఏడెన్, బాబ్ ఎల్–మ్యాన్‌డేబ్ జలసంధి, అరేబియా సముద్రాల్లో సరుకు రవాణాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అమెరికాతో పాటు పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేయడం తెల్సిందే. వారిప్పటిదాకా 100కుపైగా రవాణా నౌకలపై దాడులకు పాల్పడ్డారు. దాడుల భయంతో నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తుండటంతో సరుకు రవాణా సమయం, వ్యయం భారీగా పెరిగిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment