
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టాక దేశంలో పలు ఆంక్షలు అమలవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన విదేశీయులు ఉంటున్న తీరుతెన్నులపై ట్రంప్ సర్కారు దృష్టిసారించింది. ఈ నేపధ్యంలో అమెరికన్ గ్రీన్ కార్టు(American green card) కలిగిన ఒక వ్యక్తి విమానాశ్రయంలో అవమానానికి గురైన ఉదంతం వెలుగు చూసింది.
మార్చి 7న జరిగిన ఈ ఘటనలో అమెరికా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఫాబియన్ స్మిత్‌ను మసాచుసెట్స్(Massachusetts)లోని లోగాన్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్మిత్ తన టీనేజ్ నుంచి యునైటెడ్ స్టేట్స్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం న్యూ హాంప్‌షైర్‌లో ఉంటున్నారు. అతను లక్సెంబర్గ్ పర్యటన అనంతరం తిరిగి వస్తుండగా, ఈ ఉదంతం చోటుచేసుకుంది. న్యూస్‌వీక్ తెలిపిన వివరాల ప్రకారం స్మిత్‌ను అరెస్టు చేసిన తర్వాత అతని దుస్తులను తొలగించి, విచారణకు తీసుకెళ్లారని అతని కుటుంబం ఆరోపిస్తోంది. స్మిత్ నిర్బంధానికి గల కారణాలు తమకు తెలియవని వారు పేర్కొన్నారు.
స్మిత్ గతంలో తన గ్రీన్ కార్డును పునరుద్ధరించుకున్నారు. అతనిపై ఎటువంటి కోర్టు కేసులు పెండింగ్‌లో లేవు. స్మిత్ స్నేహితుడు అతనిని ఆహ్వానించేందుకు విమానాశ్రయానికి వచ్చారు. అయితే అతను ఎంతకీ రాకపోవడంతో అధికారులను సంప్రదించేందుకు నాలుగు గంటలు వేచిచూశారు. స్మిత్ తల్లి ఆస్ట్రిడ్ సీనియర్ మీడియాతో మాట్లాడుతూ తన కుమారుని గ్రీన్ కార్డ్ ఫ్లాగ్ అయ్యిందని ఇమ్మిగ్రేషన్ అధికారులు తనకు చెప్పారన్నారు. అయితే దీని వెనుక గల కారణాలను తెలియజేయలేదన్నారు. 2023లో స్మిత్ గ్రీన్ కార్డ్ చట్టబద్ధంగా తిరిగి జారీ చేశారని ఆమె తెలిపారు. దానికి చెల్లుబాటు ఉన్నప్పటికీ, స్మిత్‌ను అమెరికాలోకి రాకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. కాగా ఎవరైనా చట్టాన్ని లేదా వీసా నిబంధనలను(Visa regulations) ఉల్లంఘిస్తే, వారిని అదుపులోకి తీసుకుని బహిష్కరించవచ్చని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అసిస్టెంట్ కమిషనర్ హిల్టన్ బెక్హాం న్యూస్ వీక్‌కు తెలిపారు. ఇప్పుడు స్మిత్ నిర్బంధం వివాదానికి దారితీసింది. అమెరికా వలస విధానాలపై పలు అనుమానాలను లేవనెత్తుతోంది.
ఇది కూడా చదవండి: అప్పుడే మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
Comments
Please login to add a commentAdd a comment