
క్వెట్టా: పాకిస్తాన్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. జమీయత్ ఉలేమా ఈ ఇస్లాం(జేయూఐ)(Jamiat Ulema-e-Islam) సీనియర్ నేత ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన క్వెట్టాలోని ఎయిర్‌పోర్ట్ రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
దుండగులు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్(Mufti Abdul Baqi Noorzai)పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడిలో ముఫ్తీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తీవ్రగాయాల కారణంగా ముఫ్తీ మరణించారని తెలిపారు. పాక్ భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించాయి. దాడి చేసిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇటీవలి కాలంలో పాక్‌లో ఉగ్ర దాడులు మరింతగా పెరిగాయి.
ఆదివారం క్వెట్టా నుండి టఫ్తాన్ వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్(Army convoy)పై జరిగిన ఉగ్ర దాడిలో ఏడుగురు సైనికులు మరణించగా, 21 మంది గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఒక ప్రకటన చేసింది. ఇదేవిధంగా మార్చి 11న క్వెట్టా నుండి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను బీఎల్‌ఏ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. బోలాన్‌లోని మష్ఫాక్ టన్నెల్ వద్ద ఈ ఘటన జరిగింది. తాజాగా జరిగిన దాడి క్వెట్టాలో వరుసగా మూడవది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న అస్థిరత, ఉగ్రవాద కార్యకలాపాలకు తార్కాణంగా ఇది నిలిచింది. ముఫ్తీ అబ్దుల్ బాఖీ నూర్జాయ్ హత్య వెనుక గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: త్వరలో ట్రంప్-పుతిన్ చర్చలు.. కాల్పుల విరమణపై నిర్ణయం?