సాక్షి, విజయవాడ : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆంగ్లమాధ్యమాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఒక్కసీటూ రాదని ప్రొఫెసర్ కంచ ఐలయ్య బుధవారం వ్యాఖ్యానించారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు జూపూడి ప్రభాకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ప్రశంసించారు. దేశంలో ఇంతవరకు ఎవరూ తీసుకోలేని నిర్ణయాన్ని తీసుకున్నందుకు జగన్‌కు ధన్యవాదాలని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల పేద పిల్లల భవిష్యత్తే మారుతుందని, ఇంగ్లీష్‌లో చదవడం పెద్ద కష్టం కాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టమని అడిగితే ఒప్పుకోలేదని వెల్లడించారు. అమ్మ ఒడి వల్ల పేదల బతుకులు మారుతాయని, దీన్ని వ్యతిరేకిస్తున్నవారిని చీపుర్లతో తరిమికొట్టాలని తల్లులకు పిలుపునిచ్చారు. మరోవైపు ఇంగ్లీష్ మీడియంను కార్పొరేట్ శక్తులే వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.
‘అన్ని పార్టీల నాయకులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు. చంద్రబాబు తన కుమారుడిని, మనవడిని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు. మా పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్‌లో చదవకూడదా? లేక పేదపిల్లలు పెద్దల పిల్లలకు పోటీగా వస్తారని భయపడుతున్నారా’? అంటూ ప్రశ్నించారు. ఇంగ్లీష్ వల్ల తెలుగు భాషకు వచ్చిన ముప్పు ఏమీ లేదని, ఇప్పుడు మొత్తుకుంటున్న మేధావులు ప్రైవేట్ స్కూళ్లలో తెలుగు మీడియం పెట్టమని ఎందుకు అడగడం లేదని నిలదీశారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు ఏమి తెలుసని ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటూ రాదని హెచ్చరించారు. అమ్మ ఒడి పథకానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రజలు క్షమించరని పేర్కొన్నారు. జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల పిల్లల జీవితాలు బాగుపడడం చంద్రబాబు, పవన్‌లకు ఇష్టం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. పేదల బతుకులు మారాలని ముఖ్యమంత్రి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని కుహనా మేధావులే వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment