పేదరికం, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్కరూ విద్యకు దూరం కాకూడదన్న సంకల్పంతో సంపూర్ణ అక్షరాస్యతను సాధించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూపొందించిన పథకం అమ్మ ఒడి...ఈ పథకం కింద లబ్ధిపొందాలనుకునే వారు పాఠశాలకు, కళాశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలి. 75 శాతం హాజరు ఉంటేనే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. హాజరు శాతాన్ని పెంచే దిశగా తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలు టౌన్: జగనన్న అమ్మ ఒడి పథకం పొందాలంటే విద్యార్థుల హాజరు తప్పనిసరి కానుంది. తాము చదువుకునే పాఠశాలలు, కాలేజీల్లో డిసెంబర్ 31నాటికి 75శాతం హాజరు ఖచ్చితంగా ఉండాలంటూ పాఠశాల విద్యాశాఖ తేల్చి చెప్పింది. హాజరును తప్పనిసరి చేయడం ద్వారా విద్యార్థుల్లో డ్రాప్ అవుట్స్‌ను నివారించేందుకు ఎంతగానో దోహదపడుతోందనేది ప్రభుత్వ వాదన. అమ్మ ఒడి పథకం ద్వారా లబ్ధి పొందేందుకు 75శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు స్వాగతిస్తున్నాయి. అమ్మ ఒడి పథకం కోసమైనా కొంతమంది తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలు, కాలేజీలు మాన్పించకుండా క్రమం తప్పకుండా ప్రతిరోజూ పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. తద్వారా ఆ విద్యార్థి ప్రతిరోజూ తరగతులకు వెళ్లడం ద్వారా చక్కగా చదువుకుని మంచి ఉత్తీర్ణత సాధించేందుకు అవకాశం కలగనుంది. జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 478587మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంటర్ మీడియట్ మొదటి, రెండవ సంవత్సరాలకు సంబంధించి 59058మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరిలో అమ్మ ఒడి పథకానికి అర్హులను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమైనారు.
రంగంలోకి వలంటీర్‌లు
అమ్మ ఒడి పథకానికి గ్రామ, వార్డు, డివిజన్ వలంటీర్‌ల సేవలను వినియోగించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గ్రామ, వార్డు, డివిజన్ల పరిధిలో వలంటీర్లను నియమించడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉన్న జనాభాను ఆధారం చేసుకుని వారికి ఇళ్లు కేటాయించడం జరిగింది. ఇప్పటికే వాలంటీర్లు తమ పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు నివశిస్తున్నాయి, వారిలో ఎంతమంది తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి, ఒక్కో ఇంటిలో ఎంతమంది నివశిస్తున్నారన్న వివరాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న అమ్మ ఒడి పథకానికి సంబంధించిన వివరాల సేకరణ కూడా వలంటీర్ల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. అమ్మ ఒడి వివరాలకు సంబంధించి ఒక్కో వలంటీర్‌కు 50కుటుంబాలకు తగ్గకుండా కేటాయించనున్నారు. తమకు కేటాయించిన 50కుటుంబాల పరిధిలో ఒకటి నుంచి ఇంటర్ మీడియట్ వరకు ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో సమగ్రంగా వివరాలను సేకరించనున్నారు. వలంటీర్లు సేకరించిన వివరాలను మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అందించాల్సి ఉంటుంది. ప్రతి మండల విద్యాశాఖాధికారి పరిధిలో పాఠశాలల వారీగా సమగ్రంగా వివరాలు ఉన్నాయి. తాజాగా వలంటీర్లు సేకరించిన వివరాలను సరి పోల్చుతూ ఏమైనా తప్పులు ఉంటే అక్కడికక్కడే సరిదిద్దే బాధ్యతను వలంటీర్లకు అప్పగించారు. తద్వారా అమ్మ ఒడి పథకం వాస్తవ లబ్ధిదారుల జాబితాలు సిద్ధం కానున్నాయి.
తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్
అమ్మ ఒడి పథకానికి అర్హత సాధించిన విద్యార్థులకు సంబంధించి తొలుత వారి తల్లి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించనున్నారు. ఆ విద్యార్థికి తల్లి లేకుంటే తండ్రి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించనున్నారు. తల్లి తండ్రి ఇద్దరూ లేకుంటే ఎవరి సంరక్షణలో(గార్డియన్) ఉంటున్నారో గుర్తించి ఆ వ్యక్తి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించనున్నారు. జనవరిలో అమ్మ ఒడి పథకానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ బ్యాంకు ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15వేల నగదు జమ చేయనుంది. ఇందుకు సంబంధించి ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కూడా ఆమోదం పొందడం జరిగింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించి అర్హులైన విద్యార్థుల్లో ఏ ఒక్కరికీ నష్టం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందాలంటే ఆ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఒకవేళ తెల్ల రేషన్ కార్డు లేకుంటే వారి ఆర్థిక పరిస్థితులను పూర్తి స్థాయిలో విచారించిన అనంతరం అర్హులుగా భావిస్తే అలాంటి వారికి అమ్మ ఒడి పథకం వర్తిస్తోంది. రేషన్ కార్డుతోపాటు విద్యార్థులకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలను కూడా సేకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment