నాలుగో ఏడాదీ ‘జగనన్న అమ్మ ఒడి’  | Amma Vodi funds will credit today | Sakshi
Sakshi News home page

నాలుగో ఏడాదీ ‘జగనన్న అమ్మ ఒడి’ 

Jun 28 2023 4:54 AM | Updated on Jun 28 2023 8:23 AM

Amma Vodi funds will credit today - Sakshi

సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాదీ 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. పది రోజులపాటు పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించి 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు.

తద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్‌ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి అమ్మ ఒడి నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తాజాగా అందచేసే డబ్బులతో కలిపితే ఇప్పటివరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే రూ. 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు.  

నాలుగేళ్లలో విద్యా రంగానికి రూ.66,722.36 కోట్లు 
విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కీలక సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లలో విద్యా రంగంపై రూ.66,722.36 కోట్లను వెచ్చించారు. జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, విద్యాకానుకతో అడుగడుగునా పిల్లల చదువులకు అండగా నిలుస్తున్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థీ చదువులకు దూరం కారాదనే సంకల్పంతో విద్యారంగంపై పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ అది భావి తరాల ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడిగా భావిస్తున్నారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా మార్చి ప్రైవేట్‌ స్కూళ్లే సర్కారు విద్యాసంస్థలతో పోటీ పడే పరిస్థితిని కల్పించారు.

పేద విద్యార్థులను గ్లోబల్‌ స్టూడెంట్లుగా తీర్చిదిద్దుతూ ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ విధానంలో బోధన నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఇంగ్లీష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేసి బైలింగ్యువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ ఉచితంగా అందిస్తున్నారు. పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చారు. నాడు–నేడు తొలిదశ పనులు పూర్తైన స్కూళ్లలో ఆరు, ఆపై తరగతుల నుంచి డిజిటల్‌ తరగతి గదులను తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేసేలా బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను విద్యార్థులకు అందించి ప్రపంచంతో పోటీ పడేలా వెన్ను తడుతున్నారు.

మన విద్యార్థులు విదేశాల్లో సైతం ఉన్నత చదువులు చదివేలా జగనన్న విదేశీ విద్యా దీవెనతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ఆదుకుంటున్నారు. స్పోకెన్‌ ఇంగ్లీషులో నైపుణ్యాలను సాధించేలా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ‘టోఫెల్‌’ పరీక్షలకు సన్నద్ధం చేసి సర్టిఫికెట్లు అందించేలా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు అమెరికా సంస్థ ఎడ్యుకేషన్‌ టెస్టింగ్‌ సర్వీసెస్‌ (ఈటీఎస్‌)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కాగా విద్యార్థుల చేరికలను ప్రోత్సహిస్తూ జీఈఆర్‌ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు టెన్త్, ఇంటర్‌లో ఉత్తీర్ణులు కాకపోయినా తిరిగి తరగతులకు హాజరైతే వారికి కూడా అమ్మ ఒడిని వర్తింపచేయాలని 
నిర్ణయించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement