విద్యా రంగంలో ‘సాల్ట్‌’ అమలు భేష్‌ | World Bank praised education system in Andhra pradesh | Sakshi
Sakshi News home page

విద్యా రంగంలో ‘సాల్ట్‌’ అమలు భేష్‌

Published Mon, Dec 30 2024 4:45 AM | Last Updated on Mon, Dec 30 2024 4:45 AM

World Bank praised education system in Andhra pradesh

గత రెండేళ్లలో గణనీయంగా పెరిగిన విద్యార్థుల ప్రావీణ్యం

ప్రాజెక్టు అమలుపై ప్రపంచ బ్యాంకు సమీక్ష 

అన్ని కార్యకలాపాలు పురోగతి సాధించాయి 

గత వైఎస్‌ జగన్‌ సర్కారు సంస్కరణల ఫలితం

2020 జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయడంలో ముందంజ 

విద్యార్థుల అభ్యాస ఫలితాలూ మెరుగుపడుతున్నాయి 

విజయవంతంగా డిజిటల్‌ లెర్నింగ్‌ అసెస్‌మెంట్‌ అమలు 

బోధనా పద్ధతుల్లోనూ మెరుగుదల

సాక్షి, అమరావతి :  రాష్ట్ర విద్యా రంగంలో సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ (సాల్ట్‌) ప్రాజెక్టు అమలు విజయవంతంగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. విద్యా రంగంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల అమలుకు ప్రపంచ బ్యాంకు ఈ ప్రాజెక్టుకు 250 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం అందించింది. ఇందులో భాగంగా.. దీని పురోగతిపై తాజాగా మధ్యకాల సమీక్ష నిర్వహించి గణనీయమైన పురోగతి సాధించిందని బ్యాంకు వెల్లడించింది. 2020 జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయడంలో రాష్ట్రం ముందంజలో ఉందని కిలారించింది.

పాఠశాలల్లో అభ్యాస వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపింది. ప్రాజెక్టు ముగింపు కాలపరిమితి డిసెంబరు 31, 2026 నాటికల్లా మిగిలిన మైలురాళ్లను చేరుకోవడానికి చేపట్టిన కార్యకలాపాలు చాలావరకు ట్రాక్‌లో ఉన్నాయని వెల్లడించింది. విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరిచేందుకు వీలుగా డిజిటల్‌ లెర్నింగ్‌ అసెస్‌మెంట్‌ వ్యవస్థనూ విజయవంతంగా అమలుచేసిందని బ్యాంకు మెచ్చుకుంది.

మొత్తమ్మీద ఏపీలో విద్యార్థుల అభ్యాస ఫలితాలు మెరుగుపడుతున్నాయని ప్ర­పంచ బ్యాంకు తెలిపింది. ఉదా.. గణితంలో 4వ త­రగతి విద్యార్థుల ప్రావీణ్యం గత రెండేళ్లలో గణనీయంగా మెరుగుపడిందని.. అలాగే, ప్రాథమిక, మా«­ద్యమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల సామర్థ్యా­న్ని పెంచేందుకు టీచ్‌ టూల్‌ను కూడా ఆవిష్కరించారని బ్యాంకు తెలిపింది. అంతేకాక.. రెండేళ్లలో బోధనా పద్ధతులు మెరుగుపరిచారని పేర్కొంది.  

జాతీయ విద్యా విధానం అమలులోనూ భేష్‌..
ఇక జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయడంలో రాష్ట్రం చాలాబాగా అభివృద్ధి చెందినట్లు ప్రపంచ బ్యాంకు ప్రశంసించింది. గ్రేడ్‌–3 ద్వారా పిల్లల పునాది అభ్యాసన కొనసాగుతోందని.. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో ఈ వాతావరణాన్ని, పనితీరును మెరుగుపరిచే చర్యల పురోగతి కూడా కొనసాగుతోందని తెలిపింది. మొత్తం మీద సాల్ట్‌ ప్రాజెక్టు అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించిందని వెల్లడించింది.

తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి ఫీడ్‌బ్యాక్‌కు, ఫిర్యాదులకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ను కూడా అమల్లోకి తీసుకొచ్చారని, విద్యార్థుల లెర్నింగ్‌ లెవెల్స్, టీచర్లకు మెరుగ్గా పాఠ్యప్రణాళిక రూపకల్పన చేసినట్లు బ్యాంకు తెలిపింది. ప్రారంభ బాల్య విద్య, గ్రేడ్‌–1, 2 ఉపాధ్యా­యులు, అంగన్‌వాడీ వర్కర్లకు ముందస్తు శిక్షణ ప్రారంభించారని కూడా పేర్కొంది.

అంతేకాక.. విద్యార్థుల అభ్యాస సమస్యలను పరిష్కరించేందుకు అనుకూల చర్యలూ కొనసాగుతున్నాయని.. 700 రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను మెరుగుపరిచే చర్యలూ తీసుకుంటున్నారని, ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం మౌలిక సదుపాయాల  కార్యకలాపాలను ఖరారుచేశారని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ఇక పాఠశాలల నిర్వహణ, పనితీరుపై నిరంతరం సమాచారం అందించడానికి తల్లిదండ్రుల కమిటీలను మరింత పటి­ష్టం చేసిందని బ్యాంకు ప్రశంసించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement